ఇజ్రాయెల్-గాజా హింస: హమాస్ ముఖ్య నేత ఇంటిపై వైమానిక దాడి.. బాంబుల వర్షం

వైమానిక దాడుల తరువాత గాజాలో శిథిలాలు తొలగిస్తున్న పొక్లెయిన్‌లు

ఫొటో సోర్స్, Reuters

గాజా స్ట్రిప్‌లో హమాస్ ముఖ్య నేత ఇంటిపై వైమానిక దాడి చేసి బాంబుల వర్షం కురిపించినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.

దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేసింది.

హమాస్ నేత యహియా సిన్వార్ ఇల్లుగా చెబుతున్న ఒక భవనంపై బాంబు పడి మంటలు చెలరేగడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

తాజా ఘర్షణలు మొదలైన తరువాత ఏడో రోజైన ఆదివారం నాడు గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 26 మంది మరణించారని స్థానిక అధికారులు చెప్పారు.

హమాస్ కూడా తన రాకెట్ దాడులను కొనసాగిస్తోంది.

హమాస్ నేత యహియా సిన్వర్ (పాత ఫొటో)

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హమాస్ నేత యహియా సిన్వర్ (పాత ఫొటో)

దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసిన నెతన్యాహు

గాజాపై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు అన్నారు.

ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో ముగ్గురు పాలస్తీనీలు మరణించారు.

మరోవైపు పాలస్తీనీ మిలిటెంట్లు టెల్ అవీవ్‌పై రాకెట్లు ప్రయోగించడంతో అక్కడి ప్రజలు బాంబ్ షెల్టర్లలో తలదాచుకున్నారు.

ఈ సంక్షోభానికి ముగింపు పలకాలంటూ అంతర్జాతీయ సమాజం రెండు వర్గాలనూ కోరుతోంది.

శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

సోమవారం నుంచి మొదలైన ఈ దాడుల్లో 148 మంది పాలస్తీనీలు, 10 మంది ఇజ్రాయెలీలు మరణించారు.

ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది

ఫొటో సోర్స్, REUTERS/Ashraf Abu Amrah

గాజాలో అసోసియేటెడ్ ప్రెస్, అల్ జజీరా వార్తా సంస్థల కార్యాలయాలు ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో కుప్పకూలింది.

ఇజ్రాయెల్ నుంచి ఆ భవనం యజమానికి ముందస్తు హెచ్చరిక రావడంతో భవనాన్ని ఖాళీ చేయించారని, ఆ తర్వాత ఈ వైమానిక దాడి జరిగిందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ భవనంలో పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్‌కు చెందిన మిలిటరీ సామాగ్రి ఉందని ఇజ్రాయెల్ ఒక ప్రకటనలో తెలిపింది.

వీడియో క్యాప్షన్, సెకన్లలో భవనం కూలిపోయింది

ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారి తనకు ఫోన్ చేసి గంటలో భవనం ఖాళీ చేయాలని హెచ్చరించారని భవనం యజమాని జావాద్ మెహదీ చెప్పినట్టు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.

'రెండు సెకన్లలోనే 12 అంతస్తుల భవనం కూలిపోయింది' అని అల్ జజీరా రిపోర్టర్ చెప్పారు.

gaza

ఫొటో సోర్స్, SAID KHATIB

చర్చల కోసం టెల్ అవీవ్ చేరుకున్న అమెరికా రాయబారి

ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో చర్చల కోసం అమెరికా రాయబారి ఒకరు టెల్ అవీవ్ చేరుకున్నారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా, ఐరాస అధికారుల మధ్య జరిగే చర్చలలో అమెరికా రాయబారి హాడీ అమర్ మధ్యవర్తిత్వం వహించనున్నారు.

కాల్పుల విరమణ లక్ష్యంగా ఈ చర్చలు జరగనున్నాయి.

ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య 'శాశ్వత శాంతి' అవసరం ఉందని అమెరికన్ దౌత్యవేత్తలు అంటున్నారు.

అదే సమయంలో, ఈజిప్టు అధికారులు హమాస్‌తో చర్చలు జరుపుతున్నారు. ఐక్యరాజ్యసమితి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇరుపక్షాల మధ్య శాంతి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.

ఇటీవలి కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా గత అయిదు రోజులుగా తీవ్రమైన హింస చోటుచేసుకుంది.

సోమవారం ప్రారంభమైన ఘర్షణలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గాజా నుంచి వైదొలగాలని హెచ్చరిస్తూ ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న మిలిటెంట్ ఇస్లామిస్ట్ గ్రూపు హమాస్ ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులకు పాల్పడగా.. ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది.

యుద్ధం మొదలైనప్పటి నుంచి గాజాలో 139 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇజ్రాయెల్‌లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

దాడుల్లో శిథిలమైన భవనాలు

ఫొటో సోర్స్, Getty Images

వెస్ట్‌బ్యాంక్‌కి పాకిన హింస

శుక్రవారం ఘర్షణలు వెస్ట్‌బ్యాంక్‌కి పాకాయి. అక్కడ 10 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు.

పాలస్తీనీలు పెట్రోలు బాంబులు వేయగా ఇజ్రాయెల్ బలగాలు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో పాటు తూటాలూ కాల్చారు.

గురువారం ఇజ్రాయెల్ మిలటరీ 7 వేల మంది రిజర్వ్ బలగాలను గాజా సరిహద్దుకు తరలించింది.

మరోవైపు సోమవారం నుంచి 10 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ఇళ్లు వదిలి తరలిపోయారని ఐరాస వెల్లడించింది.

ఇజ్రాయెల్ బాంబు దాడులతో విధ్వంసం అవుతున్న గాజాలో ఓ మహిళ ఆక్రందనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ బాంబు దాడులతో విధ్వంసం అవుతున్న గాజాలో ఓ మహిళ ఆక్రందనం

ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: అయిదో రోజూ ఆగని హింస, విధ్వంసం

మరో వైపు శుక్రవారం జరిగిన దాడుల్లో వైమానిక, గ్రౌండ్ దళాలు పాల్గొన్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. అయితే,సేనలు గాజాలో ప్రవేశించలేదని చెప్పింది.

గాజా నగరం నుంచి విడుదలైన వీడియోలో ఇజ్రాయెల్ ఆయుధాలు, గన్ బోట్లు, వైమానిక దాడుల్లో జరిగిన పేలుళ్లతో నిండిన ఆకాశం కనిపిస్తోంది.

సోమవారం ఈ దాడులు మొదలైనప్పటి నుంచి గాజాలో సుమారు 119 మంది మరణించగా, ఇజ్రాయెల్ లో 8 మంది మరణించారు.

మరో వైపు, ఇజ్రాయెల్ అధ్యక్షుడిని సివిల్ వార్ గురించి హెచ్చరించేందుకు ప్రేరేపిస్తూ యూదులు, ఇజ్రాయెల్ లో ఉన్న అరబ్ మూకలు ఘర్షణలకు దిగుతున్నాయి.

ఈ అంతర్యుద్ధాన్ని అణిచివేసేందుకు భారీగా భద్రతా దళాలను మోహరించాలని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి బెన్నీ గాంట్జ్ ఆదేశించారు. దేశంలో 400 మందిని అరెస్టు చేశారు.

గాజాలో చాలా భవనాలు కుప్పుకూలిపోయాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాజాలో చాలా భవనాలు కుప్పుకూలిపోయాయి

ఇజ్రాయెల్‌లో ఉన్న అరబ్బులే అంతర్గత పోరాటాలకు బాధ్యులని పోలీసులు చెబుతున్నారు. అరబ్ కుటుంబీకుల గృహాలను లక్ష్యంగా చేసుకున్న యూదు యువతను పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలను ఖండించారు.

ఈ వారంలో గాజాలో, ఇజ్రాయెల్ లో చోటు చేసుకున్న హింస 2014 తర్వాత అత్యంత దారుణమైనది. తూర్పు జెరూసలేంలో ఉన్న ఉద్రిక్తతలు పెరిగి పెరిగి ముస్లింలు, యూదులకు పవిత్ర స్థలం దగ్గర ఘర్షణలకు దారి తీశాయి. గాజాను పాలిస్తున్న మిలిటెంట్ సంస్థ హమాస్, ఇజ్రాయెల్ ను ఆ ప్రాంతం నుంచి వైదొలగమని హెచ్చరిక చేసి రాకెట్లను పేల్చడం మొదలు పెట్టింది. అది ప్రతి దాడులకు దారి తీసింది.

గాజా నుంచి వస్తున్న రాకెట్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగిస్తోంది

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, గాజా నుంచి వస్తున్న రాకెట్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగిస్తోంది

ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి చొరబడుతుందనే భయంతో అక్కడి పాలస్తీనీయులు శివారు ప్రాంతాలకు పారిపోతున్నారు. గాజాలో ఉన్న ఇళ్ల మీద బాంబు శకలాలు పడుతున్నాయని గాజాలో షెజయాను వదిలి వెళ్లిపోతున్న వారు చెబుతున్నారు.

"ఏదో హారర్ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తోంది" అని ససల్వా అల్ అత్తర్ అనే స్థానికుడు చెప్పారు. ఆయన కుటుంబంతో కలిసి ఊరు నుంచి తప్పించుకున్నారు.

"మా తలల పైనే యుద్ధ విమానాలు ఎగిరాయి. సైన్యం ట్యాంకులతో బాంబులు పేల్చింది. ఆకాశం నుంచి బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మేం కదలలేకపోయాం. పిల్లలు, మహిళలు, పురుషులు హాహాకారాలు చేశారు" అని చెప్పారు.

హమాస్ సొరంగాలను నాశనం చేయడానికి "ది మెట్రో" పేరుతో రాత్రికి రాత్రి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది. అయితే, ఇజ్రాయెల్ సేనలు గాజాలో ప్రవేశించలేదని తెలిపింది.

ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు

దక్షిణ ఇజ్రాయెల్ లో ఒక 87 సంవత్సరాల మహిళ బాంబుల నుంచి రక్షించుకునేందుకు ఆష్దోద్ దగ్గర ఉన్న శిబిరంలో తల దాచుకునేందుకు వెళుతుండగా మార్గ మధ్యంలో మరణించారు. ఆష్ కెలోన్, బీర్షాబా, యవనే ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి మరణించినవారిలో 27 మంది పిల్లలు ఉన్నట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా మంది పౌరులు కూడా ఈ ఘర్షణల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారని చెప్పింది. మరో 600 మంది గాయాల పాలయ్యారు. అయితే, ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలా మంది మిలిటెంట్లు ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజా నుంచి పేల్చిన రాకెట్లు మిస్ ఫైర్ అవ్వడంతో కొన్ని మరణాలు సంభవించాయని చెబుతోంది.ఇజ్రాయెల్ చేపట్టిన ఈ సైనిక చర్యలు అవసరమైనంత వరకు కొనసాగుతాయని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన మిలిటెంట్ సంస్థలలాగే హమాస్ కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

గాజాను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజాను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు

ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగం పైకి అడుగు పెడితే వారి సైన్యానికి కఠినమైన పాఠాలు నేర్పడానికి హమాస్ సిద్ధంగా ఉందని హమాస్ మిలిటరీ ప్రతినిధి హెచ్చరించారు. అయితే, పాలస్తీనా భూభాగం పై అడుగు పెట్టే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అయిదవ రోజుకు చేరడంతో, గాజాలో ఇజ్రాయెల్ లో చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలకు అంతం పలికి సైన్యం తక్షణమే వైదొలగాలని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు.

ఇదే అభ్యర్ధనను ఇజ్రాయెల్ మిత్ర దేశం అమెరికాతో సహా పలువురు దౌత్యవేత్తలు కూడా చేశారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం చేసేందుకు చేసిన అభ్యర్ధనలన్నీ విఫలమయ్యాయి. జెరూసలేంలో ఉన్న అల్ అక్సా మసీదు దగ్గర ఇజ్రాయెల్ సైనిక చర్యలను ఆపేందుకు అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేగల్గితే తాము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని ఒక సీనియర్ హమాస్ అధికారి చెప్పారు. "మాకు కూడా ఈ ఉద్రిక్తతలు వద్దు. ఇక ఈ ఘర్షణలు మొదలయ్యాయి కాబట్టి ఇక కొంత కాలం పాటు నిశ్శబ్దంగా ఉండేలా ముగియాలి. హమాస్ మిలిటరీ వ్యవస్థను, వారి నియంత్రణ, అధికారాన్ని పూర్తిగా నిర్మూలిస్తేనే అది సాధ్యమవుతుంది" అని నెతన్యాహు సీనియర్ సలహాదారు మార్క్ రెజెవ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)