ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: గూగుల్ మ్యాప్‌లో గాజా మసగ్గా ఎందుకు కనిపిస్తోంది? - BBC RealityCheck

ఫొటో సోర్స్, Google
- రచయిత, క్రిస్టోఫర్ గిల్స్, జాక్ గుడ్మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ప్రపంచంలో అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో గాజా ఒకటి. అంత జనాభా ఉన్న ఈ ప్రాంతం గూగుల్ మ్యాపుల్లో అస్పష్టంగా ఎందుకు కనిపిస్తోంది?
తాజా ఘర్షణల్లో దాడులను, విధ్వంసాన్ని గుర్తించేందుకు ఓపెన్ సోర్స్ అంటే పబ్లిక్‌కు అందుబాటులో ఉండే సమాచారాన్ని ఉపయోగిస్తున్న పరిశోధకులకు ఈ అనుమానం వచ్చింది.
"ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాల హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు లభించవు అనే వాస్తవం మమ్మల్ని నిరాశపరిచింది" అని ఓపెన్ సోర్స్ పరిశోధకుడు సమీర్ అన్నారు.
వాస్తవానికి, శాటిలైట్ సంస్థల నుంచి అధిక రిజల్యూషన్‌తో కూడిన చిత్రాలు లభ్యమైనా, గూగుల్ ఎర్త్‌లో మాత్రం ఇజ్రాయెల్, పాలస్తీనియన్ భూభాగాలు తక్కువ రిజల్యూషన్‌తోనే కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతమంతా అస్పష్టంగా కనిపిస్తోంది.
గాజా నగరంలో కార్లు సైతం సరిగా కనిపించవు.
అదే ఉత్తర కొరియా రహస్య రాజధాని పాంగ్యాంగ్‌తో పోల్చి చూస్తే అక్కడి ఉపగ్రహ చిత్రాల్లో కార్లు బాగా కనిపిస్తాయి. మనుషులు కూడా స్పష్టంగా కనిపిస్తారు.

ఫొటో సోర్స్, Google and Maxar
ఉపగ్రహ చిత్రాలు ఎందుకంత ముఖ్యం?
ఎక్కడైనా ఘర్షణలు జరిగినప్పుడు ఆ సమాచారం అందించడంలో ఉపగ్రహ చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే, వివరణాత్మక చిత్రాలు అక్కడి సైనిక భద్రతకు భంగకరం కావొచ్చు.
ప్రస్తుత ఇజ్రాయెల్-గాజా వివాదంలో రెండు ప్రాంతాల్లోనూ క్షిపణి ప్రయోగాలు, లక్ష్యాలుగా చేసుకున్న భవనాలను ఉపగ్రహ చిత్రాల ద్వారా ధ్రువపరుచుకునేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.
కానీ, గూగుల్ ఎర్త్‌లో గాజా ఉపగ్రహ చిత్రాలు తక్కువ రిజల్యూషన్‌తో అస్పష్టంగా కనిపిస్తున్నాయి.
"ఈ మధ్య కాలంలో తీసిన గూగుల్ ఎర్త్ చిత్రం అంటే 2016లోనిదే. కానీ, అదెందుకూ పనికిరాదు. సిరియాలో కొన్ని గ్రామీణ ప్రాతాలను జూం చేసి చూశాను. హై రెజల్యూషన్‌వి సుమారు 20 చిత్రాలు కనిపించాయి. ఇవి 2016 తరువాత తీసినవే" అని బెల్లింగ్‌కాట్‌కు చెందిన జర్నలిస్ట్ అరిక్ టోలర్ ట్వీట్ చేశారు.
"అధిక జనసాంద్రత కలిగిన ప్రదేశాల చిత్రాలను తరచూ అప్డేట్ చేస్తూ ఉండడమే లక్ష్యమని" గూగుల్ చెబుతోంది. కానీ, గాజా విషయంలో అలా జరగట్లేదు.
అసలు హై రిజల్యూషన్ చిత్రాలు లభ్యమవుతున్నాయా?
గత ఏడాది వరకూ, అమెరికా సంస్థలు వాణిజ్య ప్రాతిపదికన అందించే ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాల ఉపగ్రహ చిత్రాల నాణ్యతపై అమెరికా ప్రభుత్వం పరిమితి విధించింది.
ఇజ్రాయెల్‌కు మద్దతుగా, ఆ దేశ భద్రతా సమస్యల దృష్ట్యా అమెరికా ప్రభుత్వం 1997లో కైల్-బింగామన్ అమెండ్మెంట్ (కేబీఏ) చట్టం కింద ఈ పరిమితిని విధించింది.
"ఎప్పుడూ తక్కువ రిజల్యూషన్ చిత్రాల్లో కనిపించడమే మాకిష్టం. స్పష్టంగా కనిపించడం కన్నా బ్లరీగా కనిపించడమే మంచిది" అని ఇజ్రాయెల్ రక్షణ శాఖలో స్పేస్ ప్రోగ్రాం హెడ్ అమ్నోన్ హరారీ కిందటేడాది చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది.
కేబీఏ కింద అమెరికా సంస్థలు కనీసం 2 మీ (6 ఆడుగుల 6 ఇంచీలు) పిక్సెల్ సైజ్ ఉన్న తక్కువ రిజల్యూషన్ చిత్రాలను అందించేందుకు మాత్రమే అనుమతి ఉంది.
అయితే, మిలటరీ స్థావరాలలాంటి స్థలాలను బ్లర్ చేయడం కూడా సాధారణంగా జరుగుతుంటుంది.
కాగా, ఒక దేశం మొత్తం ఇటువంటి పరిమితికి లోబడి ఉండే చట్టం కేబీఏ మాత్రమే.
ఈ చట్టం ఇజ్రాయెల్ గురించి మాత్రమే ప్రస్తావిస్తుంది. కానీ, దీన్ని పాలస్తీనా భూభాగాలకు కూడా వర్తింపజేశారు.
అయితే, ఎయిర్‌బస్‌లాంటి ఫ్రెంచ్ కంపెనీలు మార్కెట్లోకి వచ్చి హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలను అందించడం ప్రారంభించాక ఈ చట్టాన్ని, పరిమితులను ఎత్తివేయాలనే ఒత్తిడి అమెరికాపై పెరిగింది.
2020 జూలైలో కేబీఏను రద్దు చేశారు. ఆ తరువాత అమెరికా సంస్థలు కూడా హై రిజల్యూషన్ చిత్రాలను అందించడం మొదలుపెట్టాయి.

ఫొటో సోర్స్, 2019 Maxar Technologies
ఈ అమెండ్మెంట్‌ను ఎత్తివేయాలని ప్రచారం చేసినవారిలో ప్రముఖులు మైఖేల్ ఫ్రాడ్లే. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్కియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు.
"కేబీఏను రద్దు చేయాలని కోరడానికి శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. మా ప్రోజెక్ట్ కోసం మాకు స్థిరమైన డాటా సోర్స్ కావాలి. ఆక్రమిత పాలస్తీనా భూభాగాన్ని మిగతా ప్రాంతాలతో పోల్చి చూడడానికి ఆ భూభాగానికి సంబంధించిన హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు మాకు కావాలి" అని ఫ్రాడ్లే వివరించారు.
అయితే ఇప్పటికీ గాజా ఎందుకు అస్పష్టంగా కనిపిస్తోంది?
ఈ విషయమై గూగుల్, యాపిల్ సంస్థలతో బీబీసీ మాట్లాడింది.
తమ మ్యాప్‌లను త్వరలో 40 సెం.మీ అధిక రిజల్యూషన్‌కు అప్‌డేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు యాపిల్ తెలిపింది.
కాగా, గూగుల్‌కు చిత్రాలు అనేక సోర్సుల నుంచి వస్తాయని, "హై రిజల్యూషన్ చిత్రాలు అందుబాటులోకి వచ్చినప్పుడు, వాటిని అప్డేట్ చేసే అవకాశాలను పరిగణిస్తామని" గూగుల్ తెలిపింది.
అయితే, "ప్రస్తుతం హై రిజల్యూషన్ చిత్రాలను పంచుకునే ఆలోచన లేదని" గూగుల్ స్పష్టం చేసింది.
"ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే, ఈ భూభాగాల చిత్రాలను ఇంకా అస్పష్టంగా ఉంచాలనుకోవడంలో నాకు ఎలాంటి కారణాలు కనిపించట్లేదు" అని బెల్లింగ్‌కాట్‌ను చెందిన ఓపెన్ సోర్స్ పరిశోధకులు నిక్ వాటర్స్ ట్వీట్ చేశారు.
ఇంతకూ ఉపగ్రహ చిత్రాలను ఎవరు తీస్తారు?
గూగుల్ ఎర్త్, యాపిల్ మ్యాప్స్‌లాంటి పబ్లిక్ మ్యాపింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉపగ్రహ చిత్రాలు సరఫరా చేసే శాటిలైట్ సంస్థలపై ఆధారపడతాయి.
ప్రస్తుతం, అతి పెద్ద కంపెనీలైన మ్యాక్సర్, ప్లానెట్ ల్యాబ్స్ సంస్థలు ఇజ్రాయెల్, గాజాల హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలను అందిస్తున్నాయి.
"అమెరికా నిబంధనల్లో ఇటీవల వచ్చిన మార్పుల కారణంగా ఇజ్రాయెల్, గాజా భూభాగాల చిత్రాలను 0.4 మీ రిజల్యూషన్‌తో అందించగలుగుతున్నాం" అని మ్యాక్సర్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్లానెట్ ల్యాబ్స్ 50 సెం.మీ రిజల్యూషన్‌తో చిత్రాలను సరఫారా చేస్తోందని బీబీసీకి చెప్పింది.
అయితే, ఓపెన్ సోర్స్ సహాయంతో పరిశోధనలు చేసేవారు ఎక్కువగా ఉచితంగా లభించే చిత్రాలపైనే ఆధారపడతారు. వారికి ఈ హై రిజల్యూషన్ చిత్రాలు దొరకడం కష్టమే.

ఫొటో సోర్స్, Google Earth
హై రిజల్యూషన్ చిత్రాలు ఇంకేం చెప్తాయి?
ఎక్కువ రిజల్యూషన్ ఉన్న చిత్రాలను అనేక సందర్భాల్లో వాడతారు.
అటవీ నిర్మూలన, కార్చిచ్చులను పసిగట్టడం, మానవ హక్కుల ఉల్లంఘనలను పరిశోధించడం మొదలైన ఎన్నో విషయాలకు హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలను ఉపయోగిస్తారు.
2017లో 'హ్యూమన్ రైట్స్ వాచ్'కు చెందిన పరిశోధకులు ప్లానెట్ ల్యాబ్స్‌తో కలిసి మియన్మార్ సైన్యం రోహింజ్యా గ్రామాలను ఎలా ధ్వంసం చేసిందో ఉపగ్రహ చిత్రాల ద్వారా చూపించారు.
ధ్వంసానికి ముందు, తరువాత తీసిన ఉపగ్రహ చిత్రాలను పోల్చి చూడడం ద్వారా 200లకు పైగా గ్రామాలు విధ్వంసానికి గురయ్యాయని నిరూపించారు.
వీరు సేకరించిన ఆధారాలకు, మియన్మార్ మిలటరీ అకృత్యాలను భరించలేక బంగ్లాదేశ్ పారిపోయిన రోహింజ్యాలు చెప్పిన వివరాలకు పొంతన కుదిరినట్లు తెలుస్తోంది.
చైనాలో జింజియాంగ్ ప్రాంతలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి కూడా ఉపగ్రహ చిత్రాలు ఎంతో సహకరిస్తున్నాయి. అక్కడ వీగర్ ముస్లింలకు రీ ఎడ్యుకేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారన్న విషయం ఉపగ్రహ చిత్రాల ద్వారానే తెలిసింది.
హై రిజల్యూషన్ చిత్రాల వలన ఈ సెంటర్ల పరిమాణం, లక్షణాలను కూడా తెలుసుకోగలిగారు.

ఇవి కూడా చదవండి:
- జెరూసలెంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- పాలస్తీనియన్లకు మద్దతుగా కశ్మీర్లో ప్రదర్శనలు, 21 మంది అరెస్ట్
- ఉపగ్రహ చిత్రాలు: భారత్‌లో గాలి ఎందుకిలా మారింది?
- వెస్ట్ బ్యాంక్ చరిత్రేమిటి.. ఇజ్రాయెల్ దాన్ని ఎందుకు ఆక్రమించాలనుకుంటోంది
- జైషే మహమ్మద్ క్యాంప్‌పై దాడి శాటిలైట్ చిత్రాల్లో వాస్తవం ఎంత: Fact Check
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- ఇజ్రాయెల్-గాజా: ఐరన్ డోమ్ అంటే ఏమిటి.. ఇది ఉంటే శత్రు దాడుల నుంచి ప్రజల ప్రాణాలను 100 శాతం కాపాడొచ్చా
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- జిహాద్: దేశాన్ని డైలమాలో పడేసిన చిన్నారి
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్: ప్రోనింగ్ అంటే ఏమిటి.. కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఈ పద్ధతితో ప్రాణాలు కాపాడవచ్చా
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- ఇమామ్‌లను బంధిస్తున్న చైనా అధికారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








