కోవిడ్: ప్రోనింగ్ అంటే ఏమిటి.. కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఈ పద్ధతితో ప్రాణాలు కాపాడవచ్చా

- రచయిత, ఫెర్నాండా పాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోవిడ్ రోగులకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే బోర్లా పడుకుని ఊపిరి తీసుకోమని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వివిధ దేశాల నుంచి కోవిడ్ బాధితుల ఫొటోలు మీడియాలో కనిపిస్తున్నాయి.
కొందరు ఐసీయూలో వెంటిలేటర్లపై ఉన్నారు. కొందరు, ఆక్సిజన్ పెట్టుకుని కనిపిస్తున్నారు.
వీటన్నిట్లో ఒక ప్రత్యేక విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
చాలామంది రోగులు బోర్లా పడుకుని కనిపిస్తున్నారు.
ఊపిరి సరిగా అందనప్పుడు ఇలా పడుకోవడం చాలా పాత పద్ధతి. చాలాకాలం నుంచి వాడుకలో ఉంది. వైద్య భాషలో దీన్ని 'ప్రోనింగ్' అంటారు.
ఇలా పొత్తి కడుపుపై ఒత్తిడి పెడుతూ బోర్లా పడుకోవడం వల్ల శ్వాస బాగా అందుతుంది.
అయితే ఈ పద్ధతితో కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి.

ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది
ఎక్కువసేపు బోర్లా పడుకుంటే ఊపిరితిత్తుల్లో ఉన్న ద్రవాలు కదులుతాయి. శ్వాస తీసుకోవడం సులభమవుతుంది.
ఐసీయూలో కోవిడ్ 19 రోగులకు ఈ పద్ధతి వాడడం గణనీయంగా పెరిగింది.
"కోవిడ్ సోకితే ఇన్‌ఫెక్షన్ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. అందుకే కోవిడ్ రోగులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. తగినంత ఊపిరి అందకపోతే ప్రమాదం కూడా. ఒక్కోసారి ఆక్సిజన్ ఇచ్చినా వారికి సరిపోదు. అలాంటప్పుడు బోర్లా పడుకోమని చెప్తాం" అని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్, శ్వాసకోశ నిపుణులు పనాగిస్ గాలియాట్స్టోస్ తెలిపారు.
"మానవశరీరంలో ఊపిరితిత్తుల్లో ఎక్కువ భాగం వెనుకవైపే ఉంటుంది. వెల్లకిలా మొహం పైకి చూస్తున్నట్లు పడుకుంటే ఊపిరి సరిగా అందకపోవచ్చు. బోర్లా పడుకుంటే ఊపిరితిత్తుల్లో అన్ని విభాగాలు సక్రమంగా పని చేస్తాయి. దీన్ని ప్రోనింగ్ అంటారు. ఈ పద్ధతిలో రోగులు ప్రయోజనం పొందడం చాలాసార్లు చూశాం" అని ఆయన అన్నారు.
అక్యూట్ రిసెప్టివ్ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్‌డీఎస్) ఉన్న కోవిడ్ 19 రోగులను 12 నుంచి 16 గంటలపాటూ ప్రోనింగ్ స్థితిలో ఉంచాలని మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది.
‘ది అమెరికన్ థొరాసిస్ సొసైటీ’ ఫిబ్రవరిలో చైనాలో వూహాన్ నగరంలోని జియాంటన్ ఆస్పత్రిలో ఉన్న 12 మంది ఏఆర్‌డీఎస్ రోగులపై అధ్యయనం చేసింది.
బోర్లా పడుకున్న రోగుల్లో ఊపిరితిత్తుల పనితీరు బాగా పెరిగిందని ఈ అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రోనింగ్ పద్ధతితో అపాయాలు
ప్రోనింగ్ పద్ధతితో కొన్ని అపాయాలు సంభవించవచ్చు. రోగులు బోర్లా పడుకోవడానికి కష్టపడతారు. ఇది చేస్తున్నప్పుడు నిపుణులు పక్కనే ఉండాలి.
"ఇది అంత సులభం కాదు. దీన్ని సమర్థవంతంగా చేయడానికి నలుగురు లేదా ఐదుగురు నిపుణులు అవసరం" అని ప్రొఫెసర్ పనాగిస్ తెలిపారు.
అయితే, ఆస్పత్రుల్లో ప్రోనింగ్ చేయించడం కష్టమవుతోంది. ఎందుకంటే కోవిడ్ రోగులు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. అంతమంది సిబ్బంది ఉండరు.
జాన్ హాప్కిన్స్ ఆస్పత్రిలో దీని కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారని పనాగిస్ తెలిపారు.
అయితే దీంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
"ఊబకాయం ఉన్నవారిని బోర్లా పడుకోబెట్టడం కష్టం. ఛాతీకి గాయమైనవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వెంటిలేషన్‌పై ఉన్నవారితోనూ, కాథెటర్ ట్యూబ్ పెట్టినవారితోనూ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రోనింగ్ వలన హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి బోర్లా పడుకోబెడితే ఊపిరి సరిగా అందకపోవచ్చు" అని పనాగిస్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
చాలాకాలం నుంచి ప్రోనింగ్ పద్ధతి వాడుతున్నారు
ప్రోనింగ్ పద్ధతి ప్రయోజనాలను తొలుత 1970లలో గుర్తించారు. 1986 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఈ విధానాన్ని విరివిగా వాడుతున్నారు.
తొలి రోజుల్లో ఈ పద్ధతిపై అధ్యయనం చేసిన వారిలో లూసియానో గాటినోని ఒకరు.
లూసియానో ప్రోనింగ్ పద్ధతిని తన రోగులపై అనేకమార్లు ప్రయోగించి విజయవంతమయ్యారు.
లూసియానో గాటినోని అనస్థీషియాలజీ నిపుణులు. మిలన్ స్టేట్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా ఉన్నారు.
"మొదట్లో వైద్య సమాజం నుంచి ప్రోనింగ్ పద్ధతికి వ్యతిరేకత వచ్చింది. కానీ మెల్లమెల్లగా ఈ పద్ధతి ప్రాముఖ్యం సంతరించుకుంది. దీని వలన శ్వాస పెరగడంతో పాటూ ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.
బోర్లా పడుకుంటే ఊపిరితిత్తుల్లోని అన్ని భాగాలపై సమానంగా ఒత్తిడి పడుతుంది. ఊపిరితిత్తుల మెకానిజం చూస్తే అవి నిరంతరం పని చేస్తూ ఉండాలి. అన్ని భాగాలపై సమాన ఒత్తిడి పడితే వాటి పనితీరు మెరుగవుతుంది" అని ప్రొఫెసర్ లూసియానో వివరించారు.
ఫ్రాన్స్‌లో 2000లో జరిపిన ఒక అధ్యయనంలో ప్రోనింగ్ పద్ధతి వలన అనేక ప్రయోజనాలున్నాయని తేలింది.
ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలుతున్న సమయంలో ప్రోనింగ్ పద్ధతి ద్వారా ప్రయోజనాలు పొంచవచ్చు.
"సరైన చికిత్స లభించేవరకు ప్రోనింగ్ పద్ధతిని ఉపయోగించవచ్చు" అని పనాగిస్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- 18 ఏళ్లు నిండిన అందరికీ టీకా: రాష్ట్రాలు ఎంత వరకు సిద్ధంగా ఉన్నాయి.. వ్యాక్సీన్ సరిపడా ఉందా?
- గాంధీ హాస్పిటల్‌కు చేతులెత్తి దండం పెట్టిన ఓ మహిళ... ఆ వైరల్ ఫోటో వెనుక అసలు కథ
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
- కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయా?వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








