తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం

హరీశ్ రావు

ఫొటో సోర్స్, finance.telangana.gov.in

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ (2021-22)ను ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

2021-22 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ విలువ రూ.2,30,825.96 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు కాగా ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లు అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

పెట్టుబడి వ్యయం రూ. 29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ. 6,743.5 కోట్లుగా అంచనా వేశారు.

వెయ్యి కోట్ల నిధుల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్‌ను మంత్రి ప్రకటించారు.

బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత చెబుతూ ఆయన తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన ఉర్దూ కవి గాలిబ్ గజళ్లకు తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్య అనువాదమైన ‘ప్రతిదీ సులభంగా సాధ్యపడదులెమ్ము’ అనే కవితను ప్రస్తావిస్తూ తన ప్రసంగం ప్రారంభించారు.

ఏడేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం ఏడు పదుల వయసున్న ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ అభివృద్ధిలో పరుగులు తీస్తోందని హరీశ్‌రావు అన్నారు.

ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తాము సాగిస్తున్న పాలనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు.

హరీశ్ రావు

ఫొటో సోర్స్, facebook/trsparty

కేటాయింపులు ఇలా..

ఇప్పటివరకు 52,456 డబుల్ బెడ్‌రూం ఇళ్లు పూర్తయ్యాయని, ఈ ఏడాది ఈ పథకం కోసం రూ. 11 వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.

* ఎంబీసీ కార్పొరేష‌న్ కు రూ.1,000 కోట్లు

* బీసీ సంక్షేమ శాఖ‌కు రూ.5,522 కోట్లు

* మైనార్టీ సంక్షేమ శాఖ‌కు రూ.1,606 కోట్లు

* మ‌హిళ‌ల‌కు వ‌డ్డీలేని రుణాల కోసం రూ.3,000 కోట్లు

* మ‌హిళ‌, శిశు సంక్షేమ శాఖ‌కు రూ.1,702 కోట్లు

* రైతు బంధుకు రూ.14,800 కోట్లు

* రైతుల రుణ‌మాఫీకి రూ.5,225 కోట్లు

* వ్య‌వ‌సాయ శాఖ‌కు రూ.25 వేల కోట్లు

* ప‌శు సంవ‌ర్థ‌క శాఖ‌కు రూ.1,730 కోట్లు

* నీటి పారుద‌ల శాఖ‌కు రూ.16,931 కోట్లు

* స‌మ‌గ్ర భూస‌ర్వేకు రూ.400 కోట్లు

* ఆస‌రా పింఛ‌న్ల‌కు రూ.11,728 కోట్లు

* క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్‌కు రూ.2,750 కోట్లు

* ఎస్సీ ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ.21,306.85 కోట్లు

* ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ.12,304.23 కోట్లు

* ఎస్టీ గృహాల‌కు రాయితీపై విద్యుత్ కు రూ.18 కోట్లు

* మూడు ల‌క్ష‌ల గొర్రెల యూనిట్ల కోసం రూ.3,000 కోట్లు

* బీసీల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మికి అద‌నంగా రూ.500 కోట్లు

* రైతుల సంక్షేమం కోసం రూ.338 కోట్లు

* కొత్త స‌చివాల‌య నిర్మాణానికి రూ.610 కోట్లు

* దేవాదాయ శాఖ‌కు రూ.720 కోట్లు

* అట‌వీ శాఖ‌కు రూ.1,276 కోట్లు

* ఆర్టీసీకి రూ.1,500 కోట్లు

* మెట్రో రైలుకు రూ.1,000 కోట్లు

* ఓఆర్ఆర్ లోప‌ల కొత్త కాల‌నీల్లో తాగునీరు కోసం రూ.250 కోట్లు

* వరంగ‌ల్ కార్పొరేష‌న్‌కు రూ.250 కోట్లు

* ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రూ.150 కోట్లు

జూబ్లీహిల్స్‌లో పూజలు

బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆయన జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునేలా బడ్జెట్ రూపొందించామని చెప్పారు.

కాగా శాసనసభలో హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టగా శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)