18 ఏళ్లు నిండిన అందరికీ టీకా: రాష్ట్రాలు ఎంత వరకు సిద్ధంగా ఉన్నాయి.. వ్యాక్సీన్ సరిపడా ఉందా

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి టీకా
    • రచయిత, గుర్‌ప్రీత్ కౌర్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సీన్ ఇవ్వబోతున్నారు. కరోనా వ్యాక్సీన్ మూడో ఫేజ్‌లో ఈ వయో విభాగాన్ని చేర్చారు. దీని కోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 28 నుంచి మొదలవుతుంది.

కానీ రాష్ట్రాలు ఈ టీకా కార్యక్రమానికి ఎంత వరకు సన్నద్ధంగా ఉన్నాయి?

రాష్ట్రాలన్నింటికీ ఇవ్వగలిగే స్థాయిలో టీకా అందుబాటులో ఉందా ? వంటి ప్రశ్నలు చాలామంది నుంచి వినిపిస్తున్నాయి.

టీకా ఖరీదు ఎంత?

మూడో దశ వ్యాక్సినేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు, వ్యాక్సినేషన్ సెంటర్లు వ్యాక్సీన్ తయారీ సంస్థల నుంచి నేరుగా టీకాను కొనుక్కోగలుగుతాయి.

తయారీ సంస్థలు తమ వద్ద ఉన్న స్టాక్‌లో 50శాతాన్ని కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రైవేటు సంస్థలకు అమ్ముతాయి.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కు సిద్ధంగా ఉన్నాయా ?

కోవిషీల్డ్

కోవిషీల్డ్ వ్యాక్సీన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసును రూ.400కు, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.600 విక్రయిస్తామని తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది.

కోవిషీల్డ్‌కు కేంద్ర ప్రభుత్వం ఒక్కో డోసుకు రూ. 150 ఇస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనవాలా గతంలో చెప్పారు.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఉత్తర్వుల కారణంగా కోవిషీల్డ్‌ను కేంద్ర ప్రభుత్వానికి ఒక్కో డోసును రూ. 400 ధరకు ఇస్తామని ఆయన తాజాగా వెల్లడించారు.

కోవిషీల్డ్ బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి రావడానికి 4 నుంచి 5 నెలలు పడుతుందని సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్ని రాష్ట్రాలకు తమకు టీకా రావడం ఆలస్యమవుతుందని చెప్పాయి.

కోవాక్సిన్

ఇక భారత్ బయోటెక్‌ తమ కోవాక్సిన్ ఒక్కో డోసును ప్రభుత్వానికి రూ. 600కు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 1200కు ఇస్తామని వెల్లడించింది.

ప్రైవేట్ ఆస్పత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి పొందుతున్న మొత్తానికి 8 రెట్లు ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉండగా, రాష్ట్రాలు 4 రెట్లు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ప్రైవేటు ఆసుపత్రులు కోవిషీల్డ్ కంటే రెండు రెట్లు ఎక్కువ ధర చెల్లించి కోవాక్సిన్‌ను కొనాల్సి ఉంటుంది.

అయితే, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఇస్తున్నట్లే రూ.150కి వ్యాక్సీన్ అందిస్తామని భారత్ బయోటెక్ వెల్లడించింది.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

కంపెనీలు రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్మిన ధరకే ప్రజలు టీకాలు కొనాలా ?

వ్యాక్సీన్‌ను నేరుగా తయారీదారుల నుంచి కొనుగోలు చేసి, పౌరులకు ఎలా ఇవ్వాలో రాష్ట్రం నిర్ణయిస్తుంది. అంటే, జనాభాలో ఏ వర్గాలకు ఉచితంగా ఇవ్వాలి, ఎవరికి ఖరీదుకు ఇవ్వాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

ఉత్తర్‌ప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్ సహా కనీసం 17 రాష్ట్రాలు 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాయి.

ఇక ప్రైవేటు ఆసుపత్రులు కోవిషీల్డ్‌ను రూ.600కు, కోవాక్సిన్‌ను రూ.1200కు కొంటాయి కాబట్టి, వాటికి కొంత లాభాన్ని జోడించి అమ్ముకునే అవకాశం ఉంటుంది.

మొదటి దశలో ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల నుంచి నిర్ణీత ధరకంటే ఎక్కువ వసూలు చేయరాదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ ప్రైవేటు సంస్థలు బహిరంగ మార్కెట్ నుంచి వ్యాక్సీన్ డోసులను కొనుగోలు చేసే విషయంలో కేంద్రం అలాంటి పరిమితిని నిర్ణయించలేదు.

ప్రైవేటు ఆసుపత్రులు టీకా ధరను ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది.

అయితే ఇందులో రాష్ట్రాలు జోక్యం చేసుకుంటాయా, లేక నేరుగా కొనుగోలు చేసే వ్యాక్సీన్‌పై పరిమితులు విధిస్తాయా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

ఏ ఆసుపత్రిలో ఎంత ధరకు టీకా దొరుకుతుందో ఎలా తెలుస్తుంది ?

ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రి తమ వద్ద కోవిడ్ టీకా ఎంత ఉంది, ఎంతకు అమ్ముతున్నారు అన్న విషయాలను కోవిన్ పోర్టల్‌లో ప్రకటించాల్సి ఉంది.

అంటే, ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ యాప్ ఓపెన్ చేసినప్పుడు, ఏ ప్రైవేట్ కేంద్రంలో ఎంత వ్యాక్సీన్ అందుబాటులో ఉందో, ఎంత ధరో తెలుస్తుంది. దాని ప్రకారం టీకాను ఎంచుకోవచ్చు.

టీకా తీసుకోవాలనుకునే వారు కోవిన్ లేదా, ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. నేరుగా ఆసుపత్రికి వెళ్లి టీకా తీసుకోవడం కుదరదు.

ఇక ఇప్పటికే టీకాల మొదటి, రెండో దశలు కొనసాగుతుండగా, మూడో దశ కూడా వీటికి సమాంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. 45 ఏళ్లు పైబడిన వారు నేరుగా ఆసుపత్రులకు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మూడో దశతోపాటు మొదటి రెండు దశల టీకా కార్యక్రమం కొనసాగుతుంది.

45 ఏళ్లు దాటిన వారికి పాత ధరలతోనే టీకా లభిస్తుందా?

కేంద్ర ప్రభుత్వానికి చెందిన టీకా కేంద్రాల్లో 45 ఏళ్లు పైబడిన ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ ఉద్యోగులు, ముందుగా నిర్ణయించిన వర్గాలకు ఉచిత వ్యాక్సినేషన్ కొనసాగుతుంది.

అలాగే, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న లబ్ధిదారులకు ఎప్పటిలాగే టీకా కార్యక్రమంలో ప్రాధాన్యం ఇస్తారు.

ప్రైవేటు ఆసుపత్రులలో టీకాలు తీసుకోవాలనుకునే వారు పెరిగిన ధరల ప్రకారం ఒక్కో డోసుకు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే, ప్రైవేటు సంస్థలు నేరుగా తయారీ సంస్థల నుంచి వ్యాక్సీన్‌ను కొనుగోలు చేస్తాయి.

మూడో దశ వ్యాక్సినేషన్‌కు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయా ?

కొత్త దశ వ్యాక్సినేషన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆసుపత్రులలో సౌకర్యాల పెంపు, కోవిన్ యాప్‌లో స్టాక్, ధరల ప్రకటనతోపాటు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఇందులో ప్రకటించింది.

అయితే బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న నాలుగు రాష్ట్రాలు మాత్రం మే 1 నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించలేమని, తమ వద్ద తగినంత టీకా లేదని చెప్పాయి.

మే 15 తర్వాతే తమకు టీకా అందుతుందని తయారీ సంస్థలు చెప్పినట్లు ఆ రాష్ట్రాలు వెల్లడించాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో మూడింటిలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, ఝార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది.

ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సూచనల మేరకు 18-45 సంవత్సరాల వయస్సు గలవారికి 30 లక్షల కోవిషీల్డ్ డోసు ఇవ్వాల్సిందిగా ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు పంజాబ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇటు టీకా ధరలపై దిల్లీ ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సీన్ ధర కేంద్రానికి, రాష్ట్రాలకు ఒకేలా ఉండాలని అన్నారు.

మరోవైపు రాబోయే నెలల్లో టీకా ఉత్పత్తిని పెంచుతామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది.

కోవిషీల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ మే నాలుగో వారంలో మాత్రమే లభిస్తాయని ఆ సంస్థ సీఈఓ అదార్ పూనావాలా సీఎన్‌బీసీ టీవీ-18 కి చెప్పారు.

ముందుగా కేంద్రం నుంచి వచ్చిన ఆర్డర్‌లను సరఫరా చేయాల్సి ఉందని సీరం ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.

సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.4500 కోట్ల గ్రాంట్‌ను ప్రకటించింది.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఉత్పత్తి సంస్థల నుంచి 50శాతం వ్యాక్సీన్ ను కేంద్రం తీసుకుంటుంది.

ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ?

ముందుగా cowin.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. వన్‌టైమ్ పాస్‌వర్డ్ రాగానే వెబ్‌సైట్‌లో ఉన్న OTP బాక్స్‌లో రాసి ఓకే చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ పేజీ వస్తుంది.

అందులో మీ సమాచారం, ఫొటో ఐడీని ఇవ్వాల్సి ఉంటుంది. షుగర్, బీపీ, ఆస్తమాలాంటి వ్యాధులు ఉంటే వాటిని వివరంగా రాయాలి.

సమాచారం అంతా ఇచ్చాక రిజిస్టర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే మీ ఎకౌంట్ వివరాలన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)