కరోనావైరస్: కోవిడ్ రోగుల కోసం రూ. 50 వేలకే వెంటిలేటర్ చేయడం సాధ్యమేనా... భారత యువ ఇంజనీర్ల కృషి ఫలిస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరెస్పాండెంట్
పుణెలోని ఒక కర్మాగారంలో కొందరు యువ ఇంజనీర్లు కాలంతో పోటీ పడుతున్నారు. తక్కువ ధరకు లభించే వెంటిలేటర్ (కృత్రిమ శ్వాసను అందించే పరికరం)ను తయారు చేయటంలో వారు నిమగ్నమయ్యారు.
దేశంలో కరోనావైరస్ విజృంభిస్తుండటంతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. రోగులను కాపాడటానికి వెంటిలేటర్లు చాలా పెద్ద సంఖ్యలో అవసరమవుతాయి.
నిండా రెండేళ్లు లేని నొక్కా రోబోటిక్స్ అనే స్టార్టప్ సంస్థ సౌర విద్యుత్ ప్లాంట్లను శుభ్రం చేసే జలరహిత రోబోలను తయారు చేస్తోంది. ఈ సంస్థ గత ఏడాది టర్నోవర్ 27 లక్షల రూపాయలు. ఇందులో పనిచేసే మెకానికల్, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్ ఇంజనీర్లు దేశంలోని ప్రతిష్ఠాత్మక కాలేజీల్లో చదువుకున్నారు. వీరి సగటు వయసు 26 ఏళ్ళు.
ప్రస్తుతం దేశంలో కేవలం 48,000 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయనది అంచనా. వీటిలో ఎన్ని పని చేస్తున్నాయో ఎవరికీ తెలియదు. అయితే, ఈ యూనిట్లు అన్నింటినీ ఇప్పటికే రకరకాల వ్యాధులతో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్న రోగులకు ఉపయోగిస్తున్నారు.
కోవిడ్-19 వ్యాధి సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు తీవ్రంగా జబ్బుపడుతున్నారు. వారికి ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా మారవచ్చు. ఇతర దేశాల్లో కనిపిస్తున్న తరహాలోనే ఈ రోగులతో దేశంలో ఆస్పత్రులు నిండిపోవటం మొదలైంది. కొన్ని దేశాల్లో ఎవరిని కాపాడాలో డాక్టర్లు ఎంచుకోక తప్పని సరిస్థితి తలెత్తింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం దేశంలో రెండు భారతీయ కంపెనీలు, అవసరమైన విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వెంటిలేటర్లు తయారు చేస్తున్నాయి. ఒక్కో దాని ధర దాదాపు రూ. 1.50 లక్షల వరకూ ఉంటుంది.
అగ్వా హెల్త్‌కేర్ అనే సంస్థ నెల రోజుల్లో 20,000 వెంటిలేటర్లు తయారు చేయటానికి ఏర్పాట్లు చేసుకుంది. భారత ప్రభుత్వం చైనా నుంచి 10,000 వెంటిలేటర్లు తెప్పిస్తోంది. కానీ, పెరుగుతున్న రోగులకు అవి ఏ మూలకూ సరిపోవు.
నొక్కా రోబోటిక్స్ ఇంజనీర్లు తయారు చేస్తున్న వెంటిలేటర్ల ధర ఒక్కోటి రూ. 50,000 వరకూ ఉంటుంది. ఏడుగురు ఇంజనీర్ల బృందం పని మొదలు పెట్టిన ఐదు రోజుల్లోనే మూడు పోర్టబుల్ మెషీన్ల నమూనాలు సిద్ధం చేసింది.
వాటిని రక్తానికి ఆక్సిజన్ అందించి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించే కృత్రిమ ఊపిరితిత్తులకు అమర్చి పరీక్షిస్తున్నారు. రోగుల మీద పరీక్షించగల యంత్రాలను ఏప్రిల్ ఏడో తేదీ కల్లా తయారు చేయాలన్నది వారి ప్రణాళిక.
‘‘వీరు సాధించగలరు’’ అంటున్నారు డాక్టర్ దీపక్ పద్మనాభన్. బెంగళూరులోని జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్క్యులార్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న పద్మనాభన్ ఈ ప్రాజెక్టుకు కీలక సలహాదారుగా ఉన్నారు.
‘‘కృత్రిమ ఊపిరితిత్తుల మీద పరీక్షించినపుడు ఇవి బాగా పనిచేస్తున్నట్లు కనిపించాయి’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
స్ఫూర్తిదాయకం
ఈ తక్కవ ధర, స్వదేశీ ఇన్వేజివ్ వెంటిలేటర్‌ను తయారు చేయటానికి కాలంతో పోటీపడుతున్న ఈ ఇంజనీర్ల కృషి.. స్ఫూర్తిదాయకం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇంత వేగంగా రంగంలోకి దిగి సమన్వయంతో పనిచేయటం భారత దేశంలో సాధారణంగా కనిపించదు.
‘‘ఈ మహమ్మారి మనందరినీ ఎన్నడూ ఊహించని రీతిలో కలుపుతోంది’’ అని అమితాబ బంధోపాధ్యయ పేర్కొన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బయొలాజికల్ సైన్సెస్ అండ్ బయోఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన ఆయన ఈ ప్రాజెక్టులో కీలక భూమిక పోషిస్తున్నారు.
ఈ వెంటిలేటర్లను తయారు చేయటం ఎలా అనే అంశం గురించి ఈ యువ ఇంజనీర్లు ఇంటర్నెట్‌లో ఓపెన్ సోర్స్ మెడికల్ సప్లైస్ గ్రూపుల్లో పరిశోధించారు. అనుమతులు పొందిన తర్వాత కేవలం ఎనిమిది గంటల్లోనే మొదటి నమూనాను తయారు చేశారు.
ఎంఐటీ ఇంజనీర్లు ఇచ్చిన కొన్ని డిజైన్లు చాలా ఉపయోగపడ్డాయని డాక్టర్లు చెప్తున్నారు. అవసరమైన విడిభాగాలు గల సంస్థలను తెరచి వాటిని సరఫరా చేయటానికి స్థానిక అధికారులు సాయం చేశారు. ఒక్కో యంత్రం తయారీకి దాదాపు 200 విడిభాగాలు అవసరం.
ఈ యంత్రాలను తయారు చేయటానికి తమ ఫ్యాక్టరీలను ఉపయోగించుకోవచ్చునని.. ఒక పెద్ద వైద్య పరికరాల తయారీ సంస్థ సహా కొందరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. మే మధ్య కాలాని కల్లా 30,000 వెంటిలేటర్లు తయారు చేయాలన్నది ప్రణాళిక. అంటే రోజుకు 150 నుంచి 200 యూనిట్లు తయారు చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కృషిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా తమ వంతు సాయం చేశారు. ఐఐటీ మాజీ విద్యార్థి, లిథియం తయారీదారుడు రాహుల్ రాజ్.. కేరింగ్ ఇండియన్స్ అనే గ్రూపును ఏర్పాటు చేశారు. కేవలం 24 గంటల్లో 1,000 మంది అందులో చేరారు.
అదే ఐఐటీలో చదివిన గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్ వంటి మాజీ విద్యార్థులు ఈ ఇంజనీర్లతో జూమ్ మీటింగ్‌లు నిర్వహించి వివరాలను తెలుసుకోవటంతో పాటు సలహాలు కూడా ఇచ్చారు.
ప్రతి దశనూ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వైద్యుల బృందం పరిశీలించి, కఠినమైన ప్రశ్నలు అడిగి ఆమోదించింది. భారతీయ పరిస్థితులకు సరిపోయే ఎటువంటి సమస్యలూ లేని శ్వాస యంత్రాలను అందించాలన్నది లక్ష్యమని వారు చెప్తున్నారు.
‘‘మాకు అనుభవం లేదు. కానీ, ఉత్పత్తులను సులభంగా తయారు చేయటంలో మంచి నేర్పు ఉంది. మేం తయారు చేసే రోబోలు చాలా సంక్లిష్టమైనవి. ఇది ప్రాణాలను రక్షించే యంత్రం. ఇందులో రిస్క్ ఉంటుంది. కాబట్టి మేం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని నొక్కా రోబోటిక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నిఖిల్ కురేల్ పేర్కొన్నారు.
ఈ అసాధారణ సవాలును స్వీకరించడంలో భారతదేశం గెలిచిందా అనేది వారం రోజుల్లో తెలుస్తుంది.


కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








