పాలస్తీనియన్లకు మద్దతుగా కశ్మీర్‌లో ప్రదర్శనలు, 21 మంది అరెస్ట్

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA/GETTY

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, ఆమిర్ పీర్జాదా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కశ్మీర్‌లో పాలస్తీనియన్లకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించిన 21 మందిని జమ్ము-కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

"కశ్మీర్‌లో 21 మందిని అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసిన వారిలో పాలస్తీనియన్లకు మద్దతుగా గోడలపై చిత్రాలు వేలిన ఒక కళాకారుడు కూడా ఉన్నారు" అని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ బీబీసీకి చెప్పారు.

27 ఏళ్ల ముదసిర్ గుల్‌ను పోలీసులు శుక్రవారం శ్రీనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. గోడపై చిత్రం వేసినందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ చిత్రంలో ఆయన "మేమంతా పాలస్తీనియన్లం" అని రాశారు.

"పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నప్పుడు, ఆ వంతెన మీద ఎక్కమని చెప్పారు. తర్వాత ఆ చిత్రానికి నల్ల పెయింటు పూసేశారు" అని ముదసిర్ సోదరుడు బదరుల్ ఇస్లాం చెప్పారు.

ముదసిర్‌ను ఒక రోజు ముందు అదుపులోకి తీసుకున్నారు. కానీ, ఆయనపై ఏయే అభియోగాలు నమోదు చేశారో కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు.

కశ్మీర్‌లో పోలీసు పహారా

ఫొటో సోర్స్, NURPHOTO/GETTY

"కశ్మీర్ రోడ్లపై హింస, గందరగోళం, అల్లర్లను ప్రేరేపించడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి ఎవరినీ అనుమతించేది లేదు" అని శనివారం జారీ చేసిన ఒక ప్రకటనలో జమ్ము-కశ్మీర్ పోలీసులు చెప్పారు.

"అల్లరి మూకలపై నిశితంగా నిఘా పెడుతున్నాం. కశ్మీర్ లోయలో శాంతి భద్రతలకు భంగం కలిగించడానికి పాలస్తీనియన్ల దుర్భర పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మేం ఒక ప్రొఫెషనల్ దళం. ప్రజల కష్టాలను అర్థం చేసుకోగలం" అని వారు ఆ ప్రకటనలో తెలిపారు.

శనివారం నాడే 22 ఏళ్ల మొహమ్మద్ ఇర్ఫాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మొహమ్మద్ ఇర్ఫాన్‌ను ఆయన కుటుంబమే పోలీసులకు అప్పగించింది. ఇర్ఫాన్ 17 ఏళ్ల తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో, అతడిని విడిపించేందుకు కుటుంబం మొహమ్మద్ ఇర్ఫాన్‌ను పోలీసులకు అప్పగించింది.

కశ్మీర్‌లో పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసనలు

ఫొటో సోర్స్, SOPA IMAGES/GETTY

"రాత్రి సుమారు ఒంటి గంటకు సాయుధ పోలీసులు తలుపు తట్టి, లోపలికొచ్చారు. వాళ్లు నా కొడుకు ఇర్ఫాన్ కోసం వెతికారు. తను దొరక్కపోవడంతో నా చిన్న కొడుకును తమతో తీసుకెళ్లారు. తర్వాత రోజు ఇర్ఫాన్‌ను స్టేషన్‌కు తీసుకొస్తే, నా చిన్న కొడుకును వదులుతామని చెప్పారు" అని మొహమ్మద్ ఇర్ఫాన్‌ తల్లి గుల్షన్ బీబీసీకి చెప్పారు.

మొహమ్మద్ ఇర్ఫాన్‌ శుక్రవారం పాలస్తీనియన్లకు మద్దతుగా శ్రీనగర్‌లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య ఉద్రిక్తతలు, హింస పెరిగిన తర్వాత ఈ వారం కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో పాలస్తీనియన్లకు మద్దతుగా ఆందోళనలు నిర్వహించారు.

"ఈ నిరసన ప్రదర్శనలు కశ్మీర్ కోసం కాదు. ఇవి పాలస్తీనియన్ల కోసం చేశారు. అందులో తప్పేముంది. వాళ్లు నా కొడుకును జైల్లో పెట్టారు. అతడిని వాళ్లు ఎప్పుడు వదిలిపెడతారో కూడా మాకు తెలీడం లేదు" అంటున్నారు గుల్షన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)