ఇజ్రాయెల్: లక్షలాది యూదులను చంపిన నాజీ అధికారి ఐష్‌మన్‌ను ఎలా పట్టుకుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హిట్లర్ కాకుండా, ఐరోపాలో యూదులు అందరినీ చంపేయాలన్నంత కసి లెఫ్టినెంట్ కల్నల్ అడాల్ఫ్ ఐష్‌మన్‌కు మాత్రమే ఉందని చెప్పవచ్చు.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అర్జెంటీనాలో తలదాచుకున్న ఐష్‌మన్, డచ్ జర్నలిస్ట్ నాజీ విల్లెం సాస్సెన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
"నిజం చెప్పాలంటే, యూరప్‌లో నివసిస్తున్న కోటీ ముప్ఫై లక్షల మంది యూదులను చంపేస్తే నా లక్ష్యం నెరవేరినట్టేనని భావిస్తాను. అలా జరగలేదు కాబట్టి, భవిష్యత్తు తరాలు ఎదుర్కోబోయే కష్టాలకు నేనే బాధ్యుణ్ని. మేం తక్కువమంది ఉన్నాం కాబట్టి మా లక్ష్యాన్ని సాధించలేకపోయాం. కానీ, మేం ఎంత చెయ్యగలమో అంత చేశాం" అని అన్నారు.
రెండో ప్రపంచ యుద్ధం చివర్లో ఐష్‌మన్ ఎలాగోలా తప్పించుకుని అర్జెంటీనా పారిపోయారు.
ఐష్‌మన్ అర్జెంటీనాలో మారు పేరుతో జీవిస్తున్నారని 1957లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్‌కు తమ జర్మన్ వర్గాల నుంచి సమాచారం అందింది.

ఫొటో సోర్స్, Getty Images
అన్ని ఆధారాలను ధృవీకరించుకున్న తరువాత మొసాద్ డైరెక్టర్ ఇసెర్ హారెల్, ప్రధాన మంత్రి డేవిడ్ బెన్ గురియో నివాసానికి వెళ్లి ఐష్‌మన్ అర్జెంటీనాలో ఉన్నారని చెప్పారు.
అది విన్న తరువాత గురియో "ఐష్‌మన్ ప్రాణాలతో ఉన్నా లేకున్నా మాకు కావాలి" అని చెప్పారు.
మళ్లీ ఓ క్షణం ఆలోచించి.. "ఆయన్ను ప్రాణాలతోనే పట్టుకుని ఇక్కడకు తీసుకురండి. మన దేశ యువతకు ఇది చాలా అవసరం" అని అన్నారు.
ఇంటెలిజెన్స్ అధికారి రఫీ ఎయితాన్‌ను ఈ ఆపరేషన్‌కు కమాండర్‌గా నియమించారు.

ఫొటో సోర్స్, Getty Images
అర్జెంటీనా చేరుకున్న మొసాద్ గూఢచారుల బృందం
1960 ఏప్రిల్ చివరికి మొసాద్‌కు చెందిన నాలుగు బృందాలు వేరు వేరు దిశల నుంచి అర్జెంటీనాకు చేరుకున్నాయి.
వాళ్లు బ్యూనస్ ఎయిర్స్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. దానికి 'కాసిల్' అని పేరు (కోడ్‌వర్డ్) పెట్టారు.
ఈలోగా, మే 20న అర్జెంటీనాలో 150వ స్వాతంత్ర్య దినోత్సవాలు జరగనున్నాయని ఇసెర్‌కు తెలిసింది.
అందులో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ విద్యా శాఖ మంత్రి అబ్బా ఇబాన్ నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందాన్ని అర్జెంటీనాకు పంపించాలని నిర్ణయించారు.
వీరిని అర్జెంటీనా తీసుకెళ్లేందుకు ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్ ఈల్ ఏల్‌కు చెందిన ప్రత్యేక విమానం 'విష్పరింగ్ జెయింట్'ను ఏర్పాటు చేశారు.
అయితే, ఈ ప్రయాణం ముఖ్య ఉద్దేశం 'ఆపరేషన్ ఐష్‌మన్' అని ఇబాన్‌కు తెలియనివ్వలేదు.
మే 11న ఈల్ ఏల్-601 అర్జెంటీనాకు బయలుదేరుతుందని నిశ్చయించారు.
విమాన సిబ్బందిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు. తనతో పాటు ఓ మెకానిక్‌ను కూడా తీసుకుని వెళ్లమని పైలట్ జ్వీ తోహార్‌తో చెప్పారు. ఎందుకంటే, ఒకవేళ అర్జెంటీనా గ్రౌండ్ స్టాఫ్ అవసరం లేకుండా విమానం ఎగరవలసి వస్తే ఏ ఇబ్బందీ లేకుండా ఉంటుందని.

ఫొటో సోర్స్, Getty Images
ఐష్‌మన్‌ను పట్టుకోవడాన్ని ఒకరోజు వాయిదా వేశారు
మే 10న ఐష్‌మన్‌ను ఆయన ఇంటి దగ్గరే పట్టుకోవాలని నిర్ణయించారు. మే 11న ఇజ్రాయెల్ విమానం అక్కడకు చేరుకుంటుంది. మే 12న ఐష్‌మన్‌తో సహా వెనక్కి వస్తారని ప్లాన్ వేశారు.
అయితే, చివరి క్షణంలో ఈ ప్రణాళిక అంతా గందరగోళంలో పడింది.
అర్జెంటీనా వేడుకలకు విచ్చేసే అతిథుల జాబితా పెరిగిపోవడంతో ఇజ్రాయెల్ ప్రతినిధుల బృందం రాకను మే 19కి వాయిదా వేయాలని అర్జెంటీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రోటోకాల్ విభాగం అభ్యర్థించింది.
'ది గ్రేటెస్ట్ మిషన్ ఆఫ్ ది ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్ మొసాద్' పుస్తక రచయితలు మైఖేల్ బార్-జోహార్, నిస్సిం మిషల్ ఈ ఆపరేషన్ గురించి వివరంగా రాశారు.

ఫొటో సోర్స్, Michael Bar-Zohar and Nissim Mishal
"అర్జెంటీనా అభ్యర్థనను అనుసరించి, ఐష్‌మన్‌ను పట్టుకోవడం మే 19కి వాయిదా వేయాలి లేదా అనుకున్న ప్రకారమే మే 10న పట్టుకుని పది రోజులు ఎక్కడైనా దాచాలని ఇసెర్ ఆలోచించారు.
ఇలా చేస్తే పెద్ద ప్రమాదంలో పడవచ్చు. ఐష్‌మాన్ కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే, ఆయన్ను వెతికే ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు. అయినప్పటికీ, మొదట అనుకున్న ప్లాన్ ప్రకారమే ముందుకు సాగాలని ఇసెర్ నిర్ణయించుకున్నారు.
కానీ, ప్లాన్‌ను ఒకే ఒక్కరోజు వాయిదా వేశారు. మే 11న సాయంత్రం ఏడు గంటల నలభై నిముషాలకు ఐష్‌మన్‌ను ఆయన ఇంటి వద్దే పట్టుకోవాలని నిశ్చయించారు" అని ఆ పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
బస్సు నంబర్ 203 నుంచి ఐష్‌మన్ దిగలేదు
ఐష్‌మన్ ప్రతిరోజూ బస్సు నంబర్ 203లో వచ్చి తన ఇంటి దగ్గర బస్టాప్‌లో దిగుతారు.
దిగిన తరువాత తన ఇంటికి చేరుకోవడానికి కొంత దూరం నడవాల్సి ఉంటుంది.
గూఢచారులు రెండు కార్లలో కాపు కాస్తారు. ఒక కారులో ఐష్‌మన్‌ను పట్టుకునే ఏజెంట్ కూర్చుంటారని ప్లాన్ వేశారు. రెండో కారు వారి భద్రత కోసం పక్కనే ఉంటుంది.
మే 11 రాత్రి 7.35 గంటలకు రెండు కార్లూ బస్టాప్ దగ్గర కాచుకుని ఉన్నాయి.
అందులో ముందున్నది నలుపు రంగు షెవర్లె కారు. అందులోంచి ఇద్దరు కిందకు దిగి కారు చెడిపోయినట్టు నటిస్తూ, కారును పరిశీలించడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
జ్వీ అహారోనీ డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నారు. నాలుగో ఏజెంట్ వెనక సీటులో కూర్చున్నారు.
రెండోది నలుపు రంగు బ్యూక్ కార్, ఆ మార్గం చివర్న ఆపి ఉంచారు.
ఐష్‌మన్ ఆ దారిలో రాగానే కారు లైట్లు ఆయన మొహం మీద కొట్టి కళ్లు కనబడకుండా చేయాలనేది ప్లాన్.
"రాత్రి 7.40 గంటలకు బస్సు వచ్చి బస్టాప్‌లో ఆగింది. కానీ, అందులోంచి ఐష్‌మన్ దిగలేదు. తరువాత 7.50 గంటల లోపు మరో రెండు బస్సులు వచ్చాయిగాని అందులోనూ ఐష్‌మన్ లేరు.
గూఢచారులకు అనుమానాలు పెరగసాగాయి. ఐష్‌మాన్ అకస్మాత్తుగా తన అలవాటును మార్చుకున్నారా? లేక ఈ ప్లాన్ గురించి ఆయనకు తెలిసిందా? రాత్రి 8 గంటల లోపు మిషన్ పూర్తవ్వకపోతే, ఆపరేషన్‌ను అక్కడే వదిలేసి ఏజెంట్లు వెనక్కి తిరిగి రావాలని ఇసెర్ ముందే సూచనలు ఇచ్చారు.
అయితే, 8.30 గంటల వరకు వేచి చూడాలని రఫీ ఎయితాన్ నిర్ణయించుకున్నారు" అని మైఖేల్ బార్-జోహార్, నిస్సిం మిషల్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐష్‌మన్‌ను బంధించి కారులోకి బలవంతంగా లాక్కెళ్లారు
రాత్రి 8.05 గంటలకు మరో బస్సు వచ్చింది. అందులోంచి ఐష్‌మన్ దిగినట్టు రెండో కార్‌లో ఉన్న అవ్రూమ్ షాలోం గమనించారు.
వెంటనే కార్ హెడ్ లైట్లు వేసి ఐష్‌మన్‌కు కళ్లు కనిపించకుండా చేశారు.
షెవర్లె కారు నుంచి ఏజెంట్ జ్వి మల్కిన్ దిగి ఐష్‌మన్ దగ్గరకు వెళ్లి స్పానిష్‌లో "ఒక్క నిముషం" అని అడిగారు.
ఐష్‌మన్ తన జేబులో చెయ్యి పెట్టి ఫ్లాష్‌లైట్ వెతికేందుకు ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, Ronen Bergman
"జేబులోంచి తుపాకీ బయటకు తీస్తారేమోనని జ్వి మల్కిన్ భయపడ్డారు. వెంటనే, ఐష్‌మన్‌ను ఒక్క గుద్దు గుద్ది కింద పడేసి, ఆయన గుండెల మీద ఎక్కి కూర్చున్నారు. ఐష్‌మన్ గట్టిగా అరిచారు. కానీ అక్కడ ఆయన ఘోష వినిపించుకునేవారు ఎవ్వరూ లేరు" అని 'రైజ్ అండ్ కిల్ ఫస్ట్' పుస్తకంలో రోనెన్ బెర్గ్‌మాన్ వివరించారు.
కదలడానికి ప్రయత్నిస్తే కాల్చి పారేస్తాం అని ఐష్‌మన్‌తో జ్వి అహారోనీ 'జర్మన్‌లో చెప్పారు.
ఐష్‌మన్‌ను బంధించి కారు వెనుక సీటులో కూలదోశారు. తరువాత, రెండు కార్లూ వేగంగా అక్కడినుంచి వెళ్లిపోయాయి.
ఐష్‌మన్ చేతులు, కాళ్లు తాళ్లతో కట్టి, నోట్లో గుడ్డలు కుక్కారు.
"తాము పట్టుకున్నది ఐష్‌మన్‌నే అని మరోసారి నిర్ధరించుకోవడం కోసం రఫీ ఎయితాన్ బంధించిన వ్యక్తి శరీరంపై గుర్తుల కోసం వెతకడం ప్రారంభించారు. ఆయన భుజానికి కింద ఉన్న ఎస్ఎస్ (సెక్యూరిటీ సర్వీసెస్) పచ్చబొట్టును గుర్తించారు. ఐష్‌మన్‌కు అపెండిక్స్ ఆపరేషన్ అయ్యిందని ఎస్ఎస్ ఫైళ్లలో రాశారు. ఆ గుర్తుల కోసం వెతికారు. పొట్టపై ఆ గుర్తులు కనిపించగానే 'ఇది ఆయనే ఇది ఆయనే' అని హీబ్రూలో గట్టిగా అరిచారు" అని రోనెన్ బెర్గ్‌మాన్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
చివరికి ఐష్‌మన్ తన అసలు పేరు చెప్పారు
రాత్రి 8.55 గంటలకు మొసాద్ గూఢచారులు ఉంటున్న ఇంటి దగ్గరకు రెండు కార్లూ చేరుకున్నాయి. ఐష్‌మన్‌ను ఇంటి లోపలికి తీసుకెళ్లారు.
ఆయన ఒంటి మీంచి బట్టలు లాగేస్తుంటే ఐష్‌మన్ ప్రతిఘటించలేదు. నోరు తెరవమని ఆయనకు జర్మన్‌లో చెప్పారు. ఐష్‌మన్ నోట్లో జహరీసా క్యాప్సూల్ పెట్టుకున్నారేమోనని వారికి అనుమానం వచ్చింది.
'మీ బూట్లు, టోపీ సైజులు ఏమిటి? ఎక్కడ పుట్టారు? తల్లిదండ్రుల పేర్లేమిటి?' అని ఐష్‌మన్‌ను ప్రశ్నించారు.
అన్ని ప్రశ్నలకు ఐష్‌మన్ ఒక రోబోలా సమాధానమిచ్చారు.
'మీ నాజీ పార్టీ కార్డ్ నంబర్ ఎంత? ఎస్ఎస్ నంబర్ ఎంత?' అని అడిగారు.
ఐష్‌మన్ ఆ నంబర్లు '45326, 63752' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'చివరిగా మీ పేరేమిటి?' అని అడిగారు.
తన పేరు 'రికార్డో క్లెమెంట్' అని ఐష్‌మన్ చెప్పారు.
మీ అసలు పేరేమిటో చెప్పండి? అంటూ ఏజెంట్ గద్దించారు.
అప్పుడు వణుకుతున్న గొంతుతో 'ఓటో హెనింగర్' అని చెప్పారు.
మూడోసారి మరింత గట్టిగా 'మీ అసలు పేరు చెప్పండి?' అని అడిగారు.
అప్పుడు తన అసలు పేరు 'అడాల్ఫ్ ఐష్‌మన్' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐష్‌మన్‌కు మత్తు మందు ఇచ్చి విమానం ఎక్కించారు
మే 20 రాత్రి 9.00 గంటలకు ఐష్‌మన్‌కు స్నానం చేయించి, ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్ యూనిఫాం వేసి, 'జీవ్ జిక్రోనీ' పేరుతో ఉన్న నకిలీ గుర్తింపు కార్డు జేబులో ఉంచారు.
"ఐష్‌మన్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆయనకు పూర్తిగా నిద్ర రాలేదుగానీ మత్తుగా ఉండి.. అన్నీ చూడగలుగుతూ, నడవగలుగుతూ ఉన్నారు కానీ మాట్లాడలేకపోయారు.
కారు వెనుక సీటులో ఐష్‌మన్‌ను కూర్చోపెట్టారు. మరో రెండు కార్లు కూడా రక్షణగా బయలుదేరాయి.
రాత్రి 11.00 గంటలకు అన్ని కార్లూ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడ గార్డులు వీళ్లని ఆపి తనిఖీచేశారు. కారులోకి తొంగి చూశారు. ఏజెంట్లు అందరూ ఎయిర్‌లైన్స్ దుస్తుల్లో ఉన్నారు. అంతా మామూలుగా ఉందని చూపించడానికి కొందరు పాటలు పాడుతూ, గట్టిగా నవ్వుతూ కనిపించారు. అది చూసి భద్రతా సిబ్బంది గేట్లు ఎత్తివేసి వీరికి తోవ ఇచ్చారు" అని మైఖేల్ బార్-జోహార్, నిస్సిం మిషల్ రాశారు.
విమానం దగ్గరగా కార్లు ఆపి ఐష్‌మన్‌ను పట్టుకుని విమానం ఎక్కించారు.
రాత్రి 11.15 గంటలకు విమానం ఇజ్రాయెల్‌కు తిరుగు ప్రయాణం కట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
డేవిడ్ బెన్ గురియో నెసెట్‌లో చేసిన ప్రకటన
ఈ విమానం 1960 మే 22 ఉదయం ఇజ్రాయెల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
9.50 గంటలకు మొసాద్ డైరెక్టర్ ఇసెర్ హారెల్ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకుని డేవిడ్ బెన్ గురియోను కలిశారు.
ఇసెర్‌ను చూసి గురియో ఆశర్యపోతూ "మీరెప్పుడొచ్చారు?" అని అడిగారు.
"మేం వచ్చి రెండు గంటలైంది. ఐష్‌మన్ మాతో పాటే ఉన్నారు, మీరు అనుమతిస్తే వెంటనే ఆయన్ను పోలీసులకు అప్పగిస్తాం" అని ఇసెర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సాయంత్రం నాలుగు గంటలకు ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్‌లో ప్రధాని గురియో ఓ ప్రకటన చేశారు.
"యూరప్‌లో అరవై లక్షల మంది యూదులను ఊచకోత కోసిన క్రిమినల్ అడాల్ఫ్ ఐష్‌మన్‌ను ఇజ్రాయెల్ భద్రతా దళాలు బంధించాయని నెసెట్‌కు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఐష్‌మన్ జైల్లో ఉన్నారు. త్వరలో ఇజ్రాయెల్ చట్టం ఆయన చేసిన నేరాలకు తగిన శిక్ష విధిస్తుంది" అని చెప్పారు.
ఆ ప్రకటన విన్న వెంటనే ఇజ్రాయెల్ పార్లమెంట్ చప్పట్లతో దద్దరిల్లిపోయింది.
1961 డిసెంబర్ 16న ఐష్‌మన్‌కు మరణశిక్ష విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
1962 మే 31న ఆయన్ను ఉరి తీశారు.
ఐష్‌మన్ చివరి మాటలు.. "మనం మళ్లీ కలుసుకుందాం. నేను జీవితాంతం భగవంతుడిని నమ్మాను. యుద్ధ నియమాలను పాటించాను. నా జెండాకు ఎల్లప్పుడూ విధేయుడిగా మెలిగాను."
ఇజ్రాయెల్ చరిత్రలో అమలు చేసిన మొదటి, చివరి ఉరిశిక్ష ఇదే.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏమిటి
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








