ఇజ్రాయెల్- గాజా హింస: అసలు వివాదం ఏంటి? ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరువైపులా ప్రాణ నష్టం భారీగానే ఉన్నట్లు తాజాగా వస్తున్న రిపోర్టులనుబట్టి తెలుస్తోంది.
శనివారం ఉదయం నుంచి హమాస్ సంస్థ చేస్తున్న దాడులతో ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఎందుకు, ఏమిటి, ఎలా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వివాదం ఎలా మొదలైంది?
ఇది వందేళ్ల నాటి చరిత్ర.
యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకే హక్కు ఉందని దశాబ్దాల తరబడి వాదిస్తున్నారు.
మరోవైపు, పాలస్తీనియన్ అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అంటూ, యూదుల ఆక్రమణను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో, మధ్య ప్రాచ్యంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమన్ సామ్రాజ్యం ఓటమిని చవి చూసిన తరువాత ఆ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది.
ఆ ప్రాంతంలో అరబ్బులు అధిక శాతంలోనూ, యూదులు కొద్దిమంది ఉండేవారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పాలస్తీనాలో యూదులకు 'ప్రత్యేక రాజ్యం' ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్‌కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.
1920 - 1940 మధ్య కాలంలో అక్కడకు వచ్చి చేరిన యూదుల సంఖ్య క్రమంగా పెరిగింది.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఐరోపాలో యూదులపై జరిగిన మారణహోమాన్ని తప్పించుకోడానికి అనేకమంది అక్కడి నుంచి పారిపోయి పాలస్తీనా చేరుకున్నారు.
క్రమేపి యూదులు, అరబ్బుల మధ్య హింస, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం పెరుగుతూ వచ్చాయి.
1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలెంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి సిఫారసు చేసింది.
దీనికి యూదు నాయకులు సమ్మతి తెలిపినప్పటికీ, అరబ్బులు అంగీకరించలేదు కాబట్టి ఈ ప్రణాళిక ఎప్పుడూ అమలులోకి రాలేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇజ్రాయెల్ ఆవిర్భావం - కమ్ముకొచ్చిన యుద్ధం
ఈ వివాదాన్ని పరిష్కరించలేక ఆంగ్లేయులు చేతులెత్తేశారు.
1948లో బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లిపోయిన తరువాత యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయాన్ని అనేకమంది పాలస్తీనియన్లు తిరస్కరించడంతో యుద్ధం అనివార్యమైంది.
చుట్టుపక్కల అరబ్ దేశాల నుంచి సైనిక దళాలు దాడి చేశాయి.
లక్షల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. కొందరిని బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు తరిమికొట్టారు.
దీన్నే 'అల్ నక్బా' లేదా 'ఘోర విపత్తు' అని అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
మరుసటి సంవత్సరం యుద్ధం ముగిసే సమయానికి ఇజ్రాయెల్ చాలామటుకు అక్కడి భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది.
వెస్ట్ బ్యాంక్ అని పిలిచే ప్రాతాన్ని జోర్డాన్, గాజా ప్రాంతాన్ని ఈజిప్ట్ ఆక్రమించుకున్నాయి.
జెరూసలెంను రెండుగా విభజించి పశ్చిమం వైపు ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు పంచుకున్నాయి.

అక్కడ ఎప్పుడూ శాంతి ఒప్పందం కుదరలేదు. ఇరు వర్గాల వారు ఒకరిని ఒకరు నిందించుకుంటూనే ఉన్నారు. తరువాతి దశాబ్దాలలో మరిన్ని యుద్ధాలు, మరిన్ని పోరాటాలు, మరిన్ని వివాదాలు నెలకొన్నాయి.
1967లో జరిగిన మరొక యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంను కూడా ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది.
అంతే కాకుండా, సిరియన్ గోలన్ హైట్స్, గాజా, ఈజిప్షియన్ సినాయ్ ద్వీపకల్పాన్ని కూడా స్వాధీనం చేసుకుంది.
గాజా, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్, సిరియా, లెబనాన్‌లలో పాలస్తీనియన్ శరణార్థులు, వారి వారసులు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు.
వీరంతా తమ మాతృదేశానికి తిరిగి వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతించట్లేదు.
వీళ్లు స్వదేశానికి చేరుకుంటే అక్కడ వీరి సంఖ్య పెరిగిపోయి, యూదు రాజ్యంగా ఉన్న తమ దేశ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
వెస్ట్ బ్యాంక్ ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది.
కాగా, 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పటికీ, ఐక్యరాజ్యసమితి ఆ భూమిని ఇప్పటికీ ఆక్రమిత భూభాగంగానే పరిగణిస్తోంది.
జెరూసలెం మొత్తాన్ని తమ రాజధానిగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంది.
కాగా, పాలస్తీనియన్లు తూర్పు జెరూసలెంను భవిష్యత్తు పాలస్తీనా రాజ్యానికి రాజధానిగా పేర్కొన్నారు.
గత 50 ఏళ్లల్లో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాల్లో అనేక నివాసాలను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ 6,00,000 మందికి పైగా యూదులు నివసిస్తున్నారు.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవన్నీ అక్రమంగా కట్టినవని, శాంతికి భంగం కలిగిస్తున్నాయని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు.
అయితే, ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
తూర్పు జెరూసెలం, గాజా, వెస్ట్ బ్యాంకులలో నివసిస్తున్న పాలస్తీనియన్లకు, ఇజ్రాయెల్‌కు మధ్య తరచూ వివాదాలు చెలరేగుతుంటాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి.
గాజా, పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ 'హమాస్' పాలనలో ఉంది. ఈ సంస్థ ఇజ్రాయెల్‌తో అనేకమార్లు పోరాడింది.
ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలు హమాస్‌కు ఆయుధాలు చేరకుండా గాజా సరిహద్దుల్లో గట్టిగా కాపలా కాస్తుంటాయి.
ఇజ్రాయెల్ చర్యలు, ఆంక్షల కారణంగా తాము కష్టాల పాలు అవుతున్నామని గాజా, వెస్ట్ బ్యాంక్‌ల్లో ఉన్న పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు.
అయితే, పాలస్తీనియన్లు సృష్టిస్తున్న హింస నుంచి తమని తాము రక్షించుకోవడానికి మాత్రమే ప్రతిఘటిస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన సమస్యలు ఏమిటి?
అనేక అంశాల్లో ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య అంగీకారం కుదరడం లేదు.
పాలస్తీనియన్ శరణార్థుల భవిష్యత్తు ఏమిటి? వెస్ట్ బ్యాంక్‌లో యూదల నివాసాలను ఉంచాలా లేక తొలగించాలా? జెరూసలెంను ఇరు వర్గాలు పంచుకోవాలా, వద్దా? ముఖ్యంగా, ఇజ్రాయెల్‌తో పాటూ పాలస్తీనా రాజ్యం కూడా ఏర్పడాలా, వద్దా?.. ఇలా పలు అంశాల్లో ఇరు వర్గాలకు రాజీ కుదరడం లేదు.
గత 25 ఏళ్లల్లో అనేకమార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ, వివాదాలు పరిష్కారం కాలేదు.
భవిషత్తు ఏమిటి?
సూటిగా చెప్పాలంటే, ఇప్పుడప్పుడే ఈ వివాదం పరిష్కారమయేలా కనిపించడం లేదు.
ఇటీవలే, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా ఒక శాంతి ఒప్పందాన్ని రూపొందించింది.
దాన్ని "ఈ శతాబ్దపు ఒప్పందం"గా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అభివర్ణించారు.
కాగా, ఈ ఒప్పందం ఏకపక్షంగా ఉందంటూ పాలస్తీనియన్లు కొట్టిపారేశారు. అంతే కాకుండా, తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు.
ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరితే తప్ప ఈ క్లిష్ట సమస్యలు పరిష్కారం కావు. అది జరిగే వరకూ ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్, పాలస్తీనా: భారత్ ఎటు వైపు, ప్రధాని మోదీ ఈ హింసపై ఎందుకు మాట్లాడడం లేదు
- జెరూసలెం.. ఎందుకంత పవిత్రం? ఎందుకంత వివాదాస్పదం?
- ఇజ్రాయెల్-గాజా: ఐరన్ డోమ్ అంటే ఏమిటి.. ఇది ఉంటే శత్రు దాడుల నుంచి ప్రజల ప్రాణాలను 100 శాతం కాపాడొచ్చా
- జెరూసలెంలో భారత సంతతి సంగతేంటి?
- అజర్బైజాన్, అర్మేనియాల మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది? చరిత్రలో అసలేం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








