ఇజ్రాయెల్, గాజా పరస్పర దాడుల్లో బలైపోయిన బాల్యం

భవనాలు కూలిన రద్దులో నడుస్తున్న బాలుడు

ఫొటో సోర్స్, Anadolu Agency

ఫొటో క్యాప్షన్, గాజాకు, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో కొన్ని డజన్ల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు
    • రచయిత, జాక్ హంటర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య పోరులో గాజాలో మరణించిన వారిలో 63 మంది పిల్లలు ఉన్నారని మిలిటెంట్ల అధీనంలో ఉన్న గాజా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇజ్రాయెల్‌లో మరణించిన 10 మందిలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఆ దేశ వైద్య శాఖ చెబుతోంది.

తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరడంతో హింసకు తాత్కాలికంగా ముగింపు పలికినా ఇప్పటికే పెద్ద సంఖ్యలో చిన్నారులు నష్టపోయారు.

9 సంవత్సరాల యారా, 5 సంవత్సరాల రూలా

ఫొటో సోర్స్, Al-Kawlak family/DCIP/NRC

ఫొటో క్యాప్షన్, 9 సంవత్సరాల యారా, 5 సంవత్సరాల రూలా

అల్ కవాలెక్ కుటుంబంలోని పిల్లలు, 5 - 17 సంవత్సరాలు

ఆదివారం ఉదయం గాజా నగరంలో అల్ విహదా వీధిలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో అల్ కవాలెక్ కుటుంబానికి చెందిన 13 మంది మరణించినట్లు భావిస్తున్నారు. వారి ఇల్లు కూలిపోగా ఆ శిథిలా కింద నలిగిపోయారు వాళ్లంతా.

ప్రాణాలు కోల్పోయినవారిలో చాలా మంది పిల్లలున్నారు. అందులో ఆరు నెలల పసికందు కూడా ఉన్నట్లు చెబుతున్నారు."మాకు పొగ తప్ప మరేదీ కనిపించలేదు" అని ఆ కుటుంబంలో ప్రాణాలతో బయటపడిన సనా అల్ కవాలెక్ ఫెలిస్టీన్ చెప్పారు.

"నా పక్కనే ఉన్న కొడుకును నేను గట్టిగా హత్తుకున్నాను. నాకేమీ కనిపించలేదు" అని చెప్పారు. పౌరులు లక్ష్యంగా తాము దాడులు చేయలేదని ఇజ్రాయెల్ బలగాలు చెబుతున్నాయి.

"వైమానిక దాడుల్లో ఒక సొరంగం పేలడంతో సమీపంలోని ఇళ్లు కూలిపోయాయి" అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. ఈ దాడుల్లో 9 ఏళ్ల యారా, 5 ఏళ్ల రూలా మరణించారు.

వీరిద్దరూ నార్వీజియన్ రెఫ్యూజీ కౌన్సిల్‌లో వేదన నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకునేవారు.

"వీరంతా చాలా మర్యాదగా ప్రవర్తించే పిల్లలు. వారి పనులను, హోమ్ వర్క్ ను సమయానికి పూర్తి చేస్తారు" అని ఆ పిల్లల టీచర్ ఒకరు బీబీసీకి చెప్పారు. ఆ కుటుంబంలో తల్లి శవం దగ్గర కూర్చుని ఉన్న 10 సంవత్సరాల అజీజ్ అల్ కవాలెక్ ఫోటో ఆన్‌లైన్‌లో షేర్ అవుతోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఐడో అవిగల్, 5 సంవత్సరాలు

ఐదేళ్ల ఐడో అవిగల్ హమాస్ రాకెట్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, ఐదేళ్ల ఐడో అవిగల్ హమాస్ రాకెట్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు

అయిదేళ్ల ఐడో అవిగల్ ఇజ్రాయెల్‌లో మరణించిన వారిలో అతి చిన్న వయస్కుడు. ఇజ్రాయెల్ దక్షిణ పట్టణం డేరాట్‌లో బుధవారం జరిగిన దాడుల్లో ఈ బాలుడు మరణించాడు. కోటలా బంధించి ఉన్న గదిలో ఉండగా ఐడో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా జరగడం చాలా అరుదు అని ఇజ్రాయెల్ మిలిటరీ అంటోంది. రాకెట్ సైరెన్ల శబ్దం వినపడగానే ఆ బాలుని తల్లి ఆ బాబును లాక్కుని వెళ్లి కోటలా ఉన్న గదిలో దాచేశారు అని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనం తెలిపింది.ఆ గది కిటికీకి మూసి ఉన్న లోహపు ప్లేట్లను రాకెట్ శకలం చీల్చుకుని వెళ్లి ఆ తల్లిని, ఏడేళ్ల సోదరిని కూడా గాయపరిచింది. ఆ బాలుడు మాత్రం గాయాలైన కొన్ని గంటల్లోనే మరణించాడు. "రాకెట్లో ఒక భాగం వేగంగా వచ్చిపడడంతో ఇది జరిగింది" అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రతినిధి హిడై జిల్బర్‌మాన్ చెప్పారు. "ఇంట్లోనే ఉండటంతో పిల్లలు బోర్ కొడుతోందన్నారు. దాంతో నా భార్య షాని రెండిళ్ల అవతల ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లింది" అని ఐడో తండ్రి అసఫ్ అవిగల్ ఛానల్ 13కు చెప్పారు. "నన్ను క్షమించు. నీకు గుచ్చుకున్న ఆ సూదైన మొనను తొలగించలేకపోయాను" అని కొడుకు దహన సంస్కారాల సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

"మనం బయట ఉన్నప్పుడు సైరెన్ మోగితే ఏమవుతుంది అని నన్నడిగావు. నాతో నువ్వు ఉన్నంతవరకు నిన్ను రక్షిస్తాను అని అన్నాను. నేనబద్ధం చెప్పాను" అని అన్నారు. "కొన్ని నెలల క్రితమే నేను నా భార్య మాట్లాడుకుంటూ ఐడో ఎంత తెలివైన వాడో మాట్లాడుకున్నాం. ఐదేళ్ల పిల్లాడిలో 50 ఏళ్ల వాళ్లకు ఉండాల్సిన తెలివితేటలు ఉన్నాయని అనుకున్నాం" అని చెప్పారు. ఆ బాబు ఎప్పుడూ వాళ్ళ నాన్నను కంప్యూటర్ వదిలి పెట్టి తనతో ఎక్కువ సేపు ఉండమని అడిగేవాడని చెప్పారు. . "స్క్రీన్‌లతో ఉన్నది చాలు, నాతో ఉండు అని అడిగేవాడు" అని చెప్పారు. ఐడో తల్లి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

నదీన్ అవాద్, 16 సంవత్సరాలు

నదీన్ అవాద్ 16 సంవత్సరాల అరబ్బు అమ్మాయి. ఆమె గత బుధవారం 52 సంవత్సరాల తన తండ్రితో కలిసి ఉన్నారు.

"వారి ఇంటి పై, కారుపై జరిగిన రాకెట్ దాడిలో వారిద్దరూ చనిపోయారు. కారులో ఉన్న వాళ్ళ అమ్మకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి" అని వైద్యులు చెప్పారు. లాడ్ నగరంలో ఉన్న ఇంటి లోపల నుంచి రాకెట్ దాడి జరిగినట్లు శబ్దం వచ్చిందని నదీన్ కజిన్ అహ్మద్ ఇస్మాయిల్ చెప్పారు. ఇక్కడ అరబ్బులు, యూదులు కలిసి నివసిస్తారు. "ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది" అని ఆయన కాన్ అనే పబ్లిక్ బ్రాడ్ కాస్టర్‌కు చెప్పారు. "ఎక్కడికైనా పారిపోదామని అనిపించినా మాకు సురక్షితమైన గది లేదు" అని అన్నారు. "నదీన్ చాలా ప్రత్యేకమైన అమ్మాయి. ఆమె హై స్కూల్‌లో మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆమె డాక్టర్ కావాలని కలలు కన్నారు" అని ఆమెకు తెలిసిన వారు చెప్పారు. "ఆమె ప్రపంచాన్ని మార్చాలనే కలలు కనేది" అని ఆ పాప స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు. "ఆ అమ్మాయి చాలా ప్రత్యేకమైన అమ్మాయి. ఆ అమ్మాయికి ప్రపంచాన్ని గెలవాలని ఉండేది" అని షిరిన్ నాతుర్ హఫీ స్థానిక రేడియోకు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. ఆ ప్రాంతంలో ఉన్న యూదు పాఠశాలల్లో ఆమె అనేక సైన్సు, సోషల్ ప్రాజెక్టులలో చురుకుగా పాల్గొనేవారు. ఆమె బయో మెడికల్ స్టడీస్ ప్రోగ్రాంలో చేరేందుకు కూడా ప్రణాళిక చేసుకున్నట్లు హఫీ చెప్పారు.

దాడిలో ఒక్క 5 నెలల పిల్లాడు మాత్రమే బ్రతికాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దాడిలో ఒక్క 5 నెలల పిల్లాడు మాత్రమే బ్రతికాడు

అల్ హదీది కుటుంబం, 6 - 13 సంవత్సరాలు

ముహమ్మద్ అల్ హదీది నలుగురు పిల్లలు. 13 ఏళ్ల సుహాయిబ్ , 11 ఏళ్ల యహ్యా , ఎనిమిదేళ్ల అబ్దేర్ రహ్మాన్ , ఆరేళ్ళ ఒసామా శుక్రవారం మంచి దుస్తులు ధరించి రంజాన్ పండుగ జరుపుకోవడానికి గాజా నగరం అవతల ఉన్న షతి శరణార్థ శిబిరం దగ్గర ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. "ఆ పిల్లలంతా కొత్త బట్టలు ధరించి పండగ జరుపుకోవడానికి వెళ్లారు" అని ఆ పిల్లల 37 ఏళ్ల తండ్రి విలేఖరులకు చెప్పారు. "వాళ్ళు సాయంత్రం ఫోను చేసి ఆ రాత్రికి ఉండిపోతామని బతిమాలారు. నేను సరేనన్నాను" అని చెప్పారు. ఆ మరుసటి రోజే వారుంటున్న భవంతి పై దాడి జరిగింది. ఈ దాడిలో ఒక్క 5 నెలల పిల్లాడు మాత్రమే బతికాడు. ఆ బిడ్డ కూడా ఆ కూలిన భవంతి శకలాల్లో తల్లి శవం పక్కన పడి కనిపించాడు.

"వారింట్లో వారున్నారు. వారి దగ్గర ఆయుధాలు లేవు. వారు రాకెట్లను పేల్చలేదు" అని హదీది పిల్లల గురించి అన్నారు. "ఇలా జరగడానికి వారేమి చేశారు?" అని ప్రశ్నించారు. ఆ తుక్కులో పిల్లల బొమ్మలు, మోనోపలీ బోర్డు గేమ్, సగం తినేసి వదిలేసిన కంచాలు కనిపించాయి. "నాకిప్పుడు వారి జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి" అని హదీది లండన్‌లోని టైమ్స్ పత్రికకు చెప్పారు.

ఇబ్రహీం అల్ మశ్రీ - 14 సంవత్సరాలు

ఇబ్రహీం అల్ మశ్రీ గత వారం గాజా ఉత్తర ప్రాంతంలో ఇంటి ముందున్న ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటుండగా దాడి జరిగింది. ఆ దాడిలో ఇబ్రహీంతో పాటు అతని సోదరుడు, మరి కొంత మంది బంధువులు మరణించారు.

"రంజాన్ మాసంలో ప్రతి రోజూ ఇఫ్తార్ విందుకు ముందు అలా ఆడుకుంటూ ఉంటారు" అని ఆ పిల్లల తండ్రి యూసఫ్ అల్ మశ్రీ ‘ది ఇండిపెండెంట్’కు చెప్పారు. "ఆ దాడి జరుగుతున్నట్లు మేం చూడలేదు. మేం రెండు పెద్ద పేలుళ్ల శబ్దాలు విన్నాం. అందరూ వీధుల్లో పరుగుపెట్టడం మొదలు పెట్టారు. పిల్లలకు రక్తం కారుతోంది. తల్లులు ఏడుస్తున్నారు. ఎక్కడ చూసినా రక్తమే" అని చెప్పారు. ఆయన సోదరుడు ఇబ్రహీం మార్కెట్‌లో అమ్మడానికి గడ్డిని సంచుల్లోకి పేరుస్తున్నట్లు చెప్పారు. "మేం ఆ సమయంలో నవ్వుకుంటున్నాం. అదే సమయంలో మా పై బాంబు దాడి జరిగింది. మా చుట్టూ అగ్ని రాజుకుంది" అని ఆయన ఏఎఫ్‌పి వార్తా సంస్థకు చెప్పారు. "నా కళ్ళ ముందే నా సోదరులు ముక్కలు ముక్కలవ్వడం చూశాను" అని చెప్పారు.

హంజా నాసర్ 12 సంవత్సరాలు

హంజా నాసర్ గత బుధవారం కాయగూరలు కొనడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కానీ, అలా వెళ్లిన ఆ అబ్బాయి తిరిగి రాలేదు. హంజా చాలా మంచి బాలుడు, విద్యార్థి అని ఆ బాలుడి తండ్రి అల్ జజీరా ఛానెల్‌కు చెప్పారు.

తాలా అబు అల్ ఔఫ్

ఫొటో సోర్స్, Abu al-Auf family/DCIP/NRC

ఫొటో క్యాప్షన్, తాలా అబు అల్ ఔఫ్

తాలా అబుఅల్ ఔఫ్ , 13 సంవత్సరాలు

అల్ కవాలెక్ కుటుంబాన్ని హతమార్చిన దాడిలోనే 13 ఏళ్ల తాలా అబు అల్‌ఔఫ్, అతని సోదరుడు తాఫీక్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ పిల్లల తండ్రి డాక్టర్ అయమన్ కూడా ఆ దాడిలో మరణించారు. ఆయన గాజా నగరంలో ఉన్న అల్‌షిఫా ఆసుపత్రిలో ఇంటర్నల్ మెడిసిన్ విభాగానికి చీఫ్. "ఈ దాడికి ముందు కూడా ఆయన కోవిడ్ రోగులను చూసుకునేందుకు ఎక్కువ సేపు పని చేస్తూ ఉండేవారు" అని ఆయన స్నేహితులు బీబీసీకి చెప్పారు. తాలా చాలా మంచి విద్యార్థి అని ఆమె టీచర్ చెప్పారు. తాలాకు ఆధ్యాత్మిక పాఠాలంటే చాలా ఇష్టపడేది, ఖురాన్ చదివి గుర్తు పెట్టుకోవడానికి ఇష్టపడేదని చెప్పారు.ఆమె ఎప్పుడూ పరీక్షలు రాయడానికి సంసిద్ధంగా ఉండేదని చెప్పారు. వేదన నుంచి బయటకు వచ్చేందుకు పిల్లలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొంటున్నట్లు చెప్పారు. "వారంతా ఇప్పటికే చాలా వేదనకు గురయ్యారు"అని రెఫ్యూజీ కౌన్సిల్ ఏరియా ఫీల్డ్ మేనేజర్ హోజాయిఫా యాజి బీబీసీకి చెప్పారు. "ఈ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలంటే ఈ పిచ్చితనం ఇక ఆగాలి. ఈ హింస అంతం కావాలి" అని అన్నారు.(అదనపు రిపోర్టింగ్: అలెగ్జాన్డ్రా ఫోచ్ , అంగీ ఘన్నాం, అహ్మద్ నూర్, తాలా హలావా, డానా డౌలాహ్, జోవానా సాబా)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)