లైలా ఖాలిద్: ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేసిన పాలస్తీనా మహిళ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1969వ సంవత్సరం. ఆగస్ట్ 29న రోమ్ విమానాశ్రయంలో ఓ పాతికేళ్ల మహిళ టీడబ్య్లూఏ-840 విమానం కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె తెల్లని సూటు ధరించారు. ఎండ తగలకుండా టోపీ, నల్ల కళ్లద్దాలు పెట్టుకున్నారు.
ఆమె చూడ్డానికి హాలీవుడ్ నటి ఆడ్రే హెప్‌బర్న్‌లా ఉన్నారు. బయటకు గంభీరంగా కనిపిస్తున్నా లోపల కంగారు పడుతున్నారు.
విమానాశ్రయ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆమె ఓ పిస్టల్, రెండు హ్యాండ్ గ్రెనేడ్లను లోపలికి తీసుకువెళ్లగలిగారు.
వెయిటింగ్ లాంజ్‌లో మరో వ్యక్తి కుర్చుని ఉన్నారు. వీరిద్దరూ ఒకరికి ఒకరు తెలిసినా, తెలియనట్లు నటిస్తున్నారు.
తెల్లని సూటులో ఉన్న ఆమె లైలా ఖాలిద్. లాంజ్‌లో ఉన్న వ్యక్తి సలీం ఇసావి.
లైలా ఖాలిద్, పాపులర్ ఫ్రంట్ ఫర్ లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా (పీఎఫ్‌ఎల్‌పీ)కు చెందిన చే గువేరా కమాండో యూనిట్‌లో ముఖ్య సభ్యురాలు.
బేరూట్ నుంచి ఆమె ఒంటరిగా ప్రయాణం చేసి రోమ్ చేరుకున్నారు.
విమానం కాక్‌పిట్‌కు దగ్గరగా ఉండడం కోసం కావాలనే లైలా, సలీం మొదటి తరగతిలోని సీట్లు బుక్ చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
లైలా, సలీం కాక్‌పిట్‌లోకి వెళ్లారు
లైలా, సలీం దగ్గర దగ్గర సీట్లలోనే కూర్చున్నారు. ఎయిర్ హోస్టెస్ దగ్గరకు వచ్చినప్పుడు, తనకు బాగా చలిగా ఉందని, కడుపులో నొప్పిగా ఉందని చెప్పి అదనంగా మరో దుప్పటి ఇవ్వమని లైలా ఆమెను అడిగారు.
దుప్పటి అందుకున్న తరువాత తన దగ్గరున్న పిస్టల్, గ్రెనేడ్లను బయటకి తీసి దుప్పటి కింద దాచారు.
'షూట్ ది వుమన్ ఫస్ట్' రచయిత ఎలీన్ మెక్‌డోనాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లైలా చెప్పిన వివరాల ప్రకారం..
"విమాన సిబ్బంది ప్రయాణికులకు భోజనం అందించడం మొదలుపెట్టగానే సలీం ముందుకు దూకి కాక్‌పిట్ చేరుకున్నారు. అతడి వెనుకే నేను కూడా గ్రెనేడ్ పట్టుకుని పరిగెత్తాను. ఈ తొందరలో ఎయిర్ హోస్టెస్ చేతిలోని పళ్లెం కింద పడిపోయింది. ఆమె బిగ్గరగా అరిచారు. నేను నడుం దగ్గర పెట్టుకున్న పిస్టల్ జారి కింద పడిపోయింది. ఫస్ట్ క్లాస్‌లో ఉన్న వాళ్లంతా ఎకానమీ క్లాసుకు వెళిపోవాలని నేను, సలీం బిగ్గరగా అరుస్తూ చెప్పాం."
ఈ హైజాకింగ్ ప్లాన్‌లో లైలా పైలట్‌తో మాట్లాడుతూ విమానాన్ని అదుపులోకి తీసుకోవాలని ముందే నిర్ణయించుకున్నారు.
అనుకున్నట్లుగానే ఆమె కాక్‌పిట్ లోనికి ప్రవేశించి, విమానాన్ని మొదట ఇజ్రాయెల్‌లోని లాడ్ విమానాశ్రయానికి తీసుకు వెళ్లమని పైలట్‌ను బెదిరించారు. దీన్నే ఇప్పుడు 'డేవిడ్ బెన్ గురియో' విమానాశ్రయం అని పిలుస్తున్నారు.
విమానం ఇజ్రాయెల్‌లో ప్రవేశించగానే మూడు ఇజ్రాయెల్ మిరాజ్ విమానాలు దీన్ని చుట్టుముట్టాయి. అది చూసి ప్రయాణికులు భయంతో గడగడలాడిపోయారు. ఇజ్రాయెల్ విమానాలు తమ విమానాన్ని పేల్చేస్తాయేమోనని జడిసిపోయారు.
లైలా, లాడ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో మాట్లాడుతూ.. ఇప్పుడు మీరు ఈ విమానాన్ని టీడబ్ల్యూ ఏ-840 కాకుండా 'పీఎఫ్ఎల్‌పీ ఫ్రీ అరబ్ పాలస్తీనా' అని సంబోధించాలి అని చెప్పారు.
మొదట పైలట్ లైలాను ఎదురించారు. కానీ, ఆమె తన హ్యాండ్ గ్రెనేడ్ చూపించడంతో వేరే దారి లేక ఆమె ఆదేశాలను అనుసరించారు.

ఫొటో సోర్స్, Random House
విమానాన్ని డమాస్కస్ వైపు మళ్లించారు
ఇజ్రాయెలీలను బెదిరించడానికే విమానాన్ని లాడ్‌కు తీసుకెళ్లమని చెప్పారు కానీ విమానం లాడ్‌లో ఆగలేదు. లాడ్ మీంచి ఎగురుకుంటూ విమానం వెళిపోయింది. కింద ఇజ్రాయెల్ సైనికులు ట్యాంకులతో సహా సిద్ధంగా నిల్చుని ఉన్నారు.
అప్పుడే, విమానాన్ని డమాస్కస్ వైపు మరలించమని లైలా ఆజ్ఞాపించారు. దారిలో తన సొంతూరు హైఫా మీంచి విమానం ఎగరాలని లైలా సూచించారు.
"పై నుంచి పాలస్తీనాను చూస్తున్నపుడు ఒక్క నిముషం పాటు నేనొక మిషన్‌లో భాగంగా ఉన్నానన్న సంగతి మర్చిపోయాను. నేను ఇంటికి తిరిగి వస్తున్నానని మా నానమ్మ, అత్తయ్యలు అందరికీ గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. హైఫా మీంచి వెళుతున్నప్పుడు నా ముఖంలో భావాలు మారుతుండడం తాను గమనించానని ఆ పైలట్ తరువాత నాతో చెప్పారు" అని లైలా తన ఆత్మకథలో రాసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విమానం ముందు భాగాన్ని పేల్చేశారు
డమాస్కస్ విమానాశ్రయంలో దిగిన తరువాత, సలీం కాక్‌పిట్‌లో పేలుడు పదార్థాలు ఉంచారు. అందరూ దిగిపోయాక విమానం ముందు భాగాన్ని పేల్చేశారు.
ప్రపంచం దృష్టిని పాలస్తీనా వైపు తిప్పడానికి ఇదొక్కటే మార్గం అని వారు భావించారు.
లైలా ఖాలిద్‌ను మొదటి మహిళా హైజాకర్‌గా చెప్పుకుంటారు. కానీ, అంతకుముందే 1966లో ఓ విమానాన్ని హైజాక్ చేసి ఫాక్లాండ్ దీవులకు మళ్లించిన కాండోర్స్ ఆర్గనైజేషన్ హైజాకర్ కూడా ఒక మహిళ అనే విషయం చాలా కొద్దిమందికే తెలుసు.
"లైలా ఖాలిద్ చేసిన హైజాకింగ్ వలనల పీఎఫ్ఎల్‌పీకి పెద్ద పేరు రావడంతో ఆ సంస్థ చాలా సంతోషించింది. తమ స్టార్ కామ్రేడ్ లైలాను అరబ్ దేశాల టూర్‌కు పంపించింది. లైలాను పట్టుకోవడానికి ఇజ్రాయెల్ పొంచి ఉంటుందని తెలిసినా, ఆమెను అరబ్ దేశాల యాత్రకు పంపించారు. కానీ, చుట్టూ బలమైన అంగరక్షకులను ఏర్పాటు చేశారు. లైలా ఖాలిద్ అరబ్ ప్రపంచంలో పెద్ద హీరోయిన్ అయిపోయారు" అని ఎలీన్ మెక్‌డోనాల్డ్ తన పుస్తకంలో రాశారు.
దీని తరువాత లైలా ఖాలిద్ ముక్కు, బుగ్గలు, కళ్లతో సహా ముఖంలో మరో ఆరు చోట్ల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.
దీనివల్ల ఆమె ముఖకవళికలు మారి, మరో హైజాకింగ్‌కు తయారు కావొచ్చని ఆమె ఆలోచన.

ఫొటో సోర్స్, Getty Images
మరో హైజాకింగ్
1970 సెప్టెంబర్‌లో లైలా లెబనాన్ నుంచి యూరోప్ వెళ్లారు. సెప్టెంబర్ 4న స్టుట్‌గార్ట్‌లో ఆమె తన తరువాతి హైజాకింగ్ ప్రణాళికలో భాగం పంచుకోబోతున్న పాట్రిక్ ఆర్గ్యేలోను కలిశారు. అంతకుముందు వారిద్దరికీ పరిచయం లేదు.
సెప్టెంబర్ 6న వాళ్లిద్దరూ న్యూయార్క్‌కు టికెట్ తీసుకుని స్టుట్‌గార్ట్ నుంచి ఆంస్టర్డాంకు ప్రయాణించారు.
ఆర్గ్యేలో అమెరికాలో జన్మించిన నికరాగ్వన్.
ఆంస్టర్డాంలో ఇద్దరూ న్యూయార్క్‌కు వెళ్లే ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్ ఈఎల్ఏఐ 219కు చెందిన బోయింగ్ 707 ఎక్కారు.
సారా ఐర్వింగ్ రాసిన 'లైలా ఖాలిద్ - ఐకాన్ ఆఫ్ పాలస్తీనియన్ లిబరేషన్' పుస్తకంలో ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
"విమానం ఎక్కేటప్పుడు వారికి తెలియని విషయం ఒకటి ఉంది. ఈ హైజాకింగ్‌లో తమకు తోడ్పడే మరొక ఇద్దరికి ఈఎల్ఏఐ ఎయిర్‌లైన్స్ సిబ్బంది సీట్లు ఇవ్వడానికి నిరాకరించారు.
ఈఎల్ఏఐ విమానాలను హైజాక్ చేయడానికి ఇద్దరు కన్నా ఎక్కువమంది కావాలని ముందే వారు ప్లాన్ వేసుకున్నారు. ఎందుకంటే విమానంలో సాయుధ భద్రతా సిబ్బంది ఉంటారు. ప్రయాణికులకు మూడు సార్లు సెక్యూరిటీ చెక్ చేస్తారు."
ఈసారి లైలా, ఆర్గ్యేలో ఎకానమీ క్లాస్‌లో కూర్చున్నారు.
ఈ హైజాకింగ్ గురించి లైలా ఖాలిద్ బీబీసీతో మాట్లాడుతూ.. "మేమేం చేయాలో మా ఇద్దరికీ స్పష్టంగా తెలుసు. మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. నా దగ్గర రెండు హ్యాండ్ గ్రెనేడ్లు ఉన్నాయి. పాట్రిక్ దగ్గర ఒకటి ఉంది. నేనొక చిన్న స్కర్ట్ వేసుకున్నాను. నా ఆయుధాలను స్కర్ట్ కింద దాచాను" అని చెప్పారు.
లైలా పరిగెత్తుకుని కాక్‌పిట్ వద్దకు వెళ్లేసరికే పైలట్ లోపలినుంచి తలుపు తాళం వేసుకుని ఉన్నారు.
"లైలా ప్రత్యేకంగా తయారు చేయించుకున్న బ్రా నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్లను బయటకి తీశారు. అది చూసిన మరుక్షణమే అక్కడే ఉన్న మార్షల్స్ కాల్పులు ప్రారంభించారు. ఇటువైపు నుంచి ఆర్గ్యేలో కూడా కాల్పులు మొదలుపెట్టారు. ఒక తుపాకీ గుండు మార్షన్ ష్లోమో వైడర్ పాదంలోకి దూసుకుపోయింది. ఆర్గ్యేలోకు కూడా ఒక గుండు తగిలింది. ఇద్దరు గార్డులు, ప్రయాణికులు లైలాపై దాడి చేసి, కొట్టడం ప్రారంభించారు. ఆ దాడిలో ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి" అని డేవిడ్ రాబ్ అతన పుస్తకం 'టెర్రర్ ఇన్ బ్లాక్ సెప్టెంబర్'లో రాశారు.
ఇంతలో పైలట్ తెలివిగా విమానాన్ని ఒక్కసారిగా కిందకు దించారు. దాంతో పట్టు కోల్పోయిన లైలా కింద పడిపోయారు. మిగతా ప్రయాణికులు సీట్‌బెల్ట్ పెట్టుకుని ఉండడంతో వారికి ఏమీ కాలేదు.
విమానం బాగా కిందకు దిగిపోయింది కాబట్టి గ్రెనేడ్ పేలినా విమానంలో డీప్రెజరైజేషన్ జరగదు. చాలా తక్కువ నష్టంతో బయటపడుతుంది.
"ఒక అరగంట తరువాత మేం మళ్లీ లేచి నిలబడగలిగాం. నా చేతిలో ఉన్న గ్రెనేడ్ పిన్నును నోటితో లాగడానికి ప్రయత్నించాను. మేం లేచి నిలబడి అరవడం మొదలుపెట్టగానే భద్రతా సిబ్బంది వెనున నుంచి కాల్పులు ప్రారంభించారు. కాక్‌పిట్ మ్యాజిక్ ఐ నుంచి మమ్మల్ని ఎవరో చూస్తున్నారని గమనించాను. నేను మూడు అంకెలు లెక్కబెడతానని, ఈలోపల కాక్‌పిట్ తలుపు తెరవకపోతే విమానాన్ని పేల్చేస్తానని వారిని హెచ్చరించాను. నిజానికి విమానాన్ని పేల్చాలన్న ఆలోచన నాకు లేదు. వాళ్లు తలుపులు తీయలేదు. కొన్ని క్షణాల తరువాత ఎవరో వెనక నుంచి నా తలపై మోదారు. దాంతో నేను స్పృహ తప్పి పడిపోయాను" అని లైలా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
లండన్‌లో అత్యవసర ల్యాండింగ్
"రక్తమోడుతున్న ఆర్గ్యేలో నడుం మీద నిల్చున్న ఒక మార్షల్ తన వీపులోకి నాలుగు బుల్లెట్లు కాల్చడం నేను చూశాను" అని లైలా తన ఆత్మకథలో రాశారు.
బుల్లెట్ తగిలిన మార్షల్ షోమో వైడర్ పరిస్థితి గురించి ఆందోళన చెందిన పైలట్ విమానాన్ని లండన్‌లో అత్యవసరంగా కిందకు దించారు.
అప్పటికి మరికొద్ది క్షణాల్లో లండన్‌లోని హీత్రో విమానాశ్రయం నుంచి మరో ఈఎల్ఏఐ విమానం బయరుదేరబోతోంది.
"ఆర్గ్యేలోను కాల్చిన మార్షల్ బార్ లెవావ్‌ను విమానం హ్యాచ్ నుంచి దింపి ఆ రెండో ఈఎల్ఏఐ విమానం ఎక్కించారు. తద్వారా ఆయన బ్రిటిష్ అధికార పరిధి నుంచి బయటపడగలుగుతారు. ఆర్గ్యేలోను చంపిన నేరం ఆయన మీదకు రాకుండా తప్పించుకోగలరు. ఇంతలో ప్రయాణికులు లైలాను కింద పడేసి ఆమె కాళ్లు, చేతులు కట్టేశారు. లైలా అదృష్టం బావుండి ఇజ్రాయెల్ భద్రతా దళాలు ఆమెను బంధించి తీసుకెళ్లలేదు. బ్రిటిష్ పోలీసు అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు" అని డేవిడ్ రాబ్ రాశారు.
విమానాన్ని కిందకు దించిన వెంటనే పాట్రిక్ ఆర్గ్యేలో మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించారు.
"నా చేతులకు కట్లు విప్పమని భద్రతా సిబ్బందిని అభ్యర్థించాను. పాట్రిక్ మృతదేహం పక్కనే నిల్చుని తన చేయి పట్టుకున్నాను. తన గాయాలను తడుముతూ స్నేహ భావంతో పెదవులను ముద్దాడాను. బిగ్గరగా ఏడ్చాను. ఇది నాకు చాలా దుఃఖాన్ని కలిగించింది. తన బదులు నేను చావాల్సింది. ఇది మా పోరాటం. ఆయన నాకు సహాయంగా వచ్చారు" అని లైలా తన ఆత్మకథలో రాసుకున్నారు.

ఫొటో సోర్స్, PLUTO PRESS
జైలు జీవితం
లైలాను లండన్‌లోని ఈలింగ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ కొన్ని రోజులు విచారణ జరిపారు. జైల్లో లైలాతో బాగానే వ్యవహరించారు. కొందరు మహిళా పోలీసులు ఆమెతో టేబుల్ టెన్నిస్ ఆడారు.
చదవడానికి, రాయడానికి కొంత సామాగ్రి కావాలని లైలా అడిగారు. జైలు అధికారులు కొన్ని వార్తాపత్రికలు అందించారు. ఆమెకు శుభమైన బట్టలు ఇచ్చి స్నానానికి బాత్రూం కూడా ఏర్పాటు చేశారు.
జైల్లో ఆమె గదిలో ఒక మహిళా పోలీసును కాపాలా ఉంచేందుకు ప్రయత్నించగా లైలా కోపగించుకుని "నేను ఆత్మహత్య చేసుకోను. నేను చెయ్యవలసిన పోరాటాలు ఇంకా చాలా ఉన్నాయి" అని చెప్పారు.
చల్లగాలి పీల్చుకోవాలని ఉంది అని లైలా అడిగితే ఆమెను పై అంతస్థుకు తీసుకెళ్లి కిటికీ తలుపులు తెరిచేవారు. రోజూ ఆరు సిగరెట్లు తాగడానికి ఆమెకు అనుమతిచ్చారు. ఒక్కోసారి ఆరు కన్నా ఎక్కువే కాల్చడానికి పోలీసులు సహకరించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
లైలాను విడిపించడం కోసం బ్రిటిష్ విమానాన్ని హైజాక్ చేశారు
ఈఎల్ఏఐ విమానాలే కాకుండా స్విస్ ఎయిర్, టీడబ్ల్యూఏ, పీఏఎన్ఏఎం, బ్రిటిష్ ఎయిర్ విమానాలను కూడా హైజాక్ చేశారని లైలా ఖాలిద్‌ను విచారిస్తున్న సందర్భంలో బ్రిటిష్ అధికారి డేవిడ్ ప్రీయూ సమాచారం అందించారు.
అది విన్న లైలా, బ్రిటిష్ ఎయిర్ విమానాలను హైజాక్ చేసే ఆలోచన లేదని చెప్పారు.
అయితే, సెప్టెంబర్ 9న బహ్రైన్ నుంచి లండన్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసి జోర్డాన్‌లోని డాసన్ ఫీల్డ్‌కు తీసుకెళ్లారని ప్రీయూ చెప్పారు.
వాళ్ల డిమాండ్ ఏంటని లైలా అడిగారు.
మిమ్మల్ని విడుదల చేయడమే వాళ్ల డిమాండ్ అని ప్రీయూ జవాబిచ్చారు.
సెప్టెంబర్ 28న ఈజిప్ట్ అధ్యక్షుడు జమాల్ అబ్దుల్ నాజర్ మరణవార్త తెలిసిన తరువాత లైలా ఏడవడం జైల్లో పోలీసు అధికారులు గమనించారు.

ఫొటో సోర్స్, St. Martin's Press
లైలా ఖాలిద్ విడుదల
చివరకు, హైజాక్‌లో బందీలుగా చిక్కుకున్న తమ 114 మంది యాత్రికులను రక్షించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం లైలాను విడుదల చేసింది.
24 రోజులు బ్రిటిష్ జైల్లో గడిపిన తరువాత, 1970 అక్టోబర్ 1న లైలా ఖాలిద్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో కైరో చేరుకున్నారు.
అంతకుముందు, సెప్టెంబర్ 12న హైజాక్ చేసిన అన్ని విమానాలను డాసన్ ఫీల్డ్‌లో పేల్చేశారు.
ఈ సంఘటన జరిగినా చాలా రోజుల తరువాత బీబీసీ, లైలాను ఇంటర్వ్యూ చేసినప్పుడు "మీరు చేసిన పనికి బాధపడుతున్నారా?" అని అడిగితే "అసలు లేదు" అని ఆమె జవాబిచ్చారు.
"మీ వలన యాత్రికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వారికి మానసికంగా విఘాతం కలిగింది. విమాన సిబ్బంది కూడా గాయపడ్డారు కదా?" అని ప్రశ్నించారు.
"వాళ్లకు విఘాతం కలిగినందుకు నేను క్షమాపణలు చెప్పగలను. కానీ వాళ్లు లోపల సురక్షితంగానే ఉన్నారు. మా చర్యల ఉద్దేశం వాళ్లకు ఇబ్బంది కలిగించడం కాదు. అయితే, మీరు మానవతా దృక్పథంతో ఇది కూడా అర్థం చేసుకోవాలి.. మా హక్కులన్నిటినీ కాలరాశారు" అని లైలా జవాబిచ్చారు.
77 ఏళ్ల లైలా ప్రస్తుతం జోర్డాన్ రాజధాని అమాన్‌లో నివసిస్తున్నారు. ఆమె డాక్టర్ ఫయాజ్ రషీద్ హిలాల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి బదర్, బషర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆమెను ఇప్పుడు చూస్తే.. ఒకప్పుడు ఏకే 47 చేతబట్టి పాలస్తీనా పోరాటంలో ఓ వెలుగు వెలిగిన పోస్టర్‌గర్ల్ లైలా అని ఎవరూ గుర్తించలేరు.
ఇవి కూడా చదవండి:
- మొసాద్: ఈ ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ ఎలాంటి రిస్కులు తీసుకుందంటే...
- రాజీవ్ గాంధీ చివరి రోజు : ‘‘నా కళ్ల ముందే బాంబు పేలింది‘‘
- ప్రిన్సెస్ డయానా - మార్టిన్ బషీర్ ఇంటర్వ్యూ విషయంలో బీబీసీ తన తప్పులను కప్పిపుచ్చుకుందన్న లార్డ్ డైసన్ నివేదిక
- సింగపూర్ వేరియెంట్: పిల్లలకు ముప్పు అంటున్న కేజ్రీవాల్, అలాంటిదేం లేదంటున్న సింగపూర్
- ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: గూగుల్ మ్యాప్‌లో గాజా మసగ్గా ఎందుకు కనిపిస్తోంది? - BBC RealityCheck
- గాజాలో జీవితం: ఎటు నుంచి ఏ తూటా వచ్చి ప్రాణం తీస్తుందో...
- ఇజ్రాయెల్ - గాజా: ఈ యుద్ధంపై అంతర్జాతీయ చట్టాలు ఏమంటున్నాయి
- బెంజమిన్ నెతన్యాహు: అవినీతి కేసులో కోర్టు విచారణకు హాజరైన ప్రధాన మంత్రి
- గాజా: అక్కడ బతుకు నిత్య నరకం
- 'జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా ఒప్పుకునేదే లేదు'
- జెరూసలెం: మూడు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది?
- పాలస్తీనియన్లకు మద్దతుగా కశ్మీర్లో ప్రదర్శనలు, 21 మంది అరెస్ట్
- ఇజ్రాయెల్, పాలస్తీనా: భారత్ ఎటు వైపు, ప్రధాని మోదీ ఈ హింసపై ఎందుకు మాట్లాడడం లేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








