బెంజమిన్ నెతన్యాహు: అవినీతి కేసులో కోర్టు విచారణకు హాజరైన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి

బెంజమిన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అధికారంలో ఉండగా విచారణను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ తొలి ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు

మరోసారి అధికారం చేపట్టిన కొద్దిరోజులకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు అవినీతిపై జెరూసలేం కోర్టులో విచారణ మొదలైంది.

అవినీతి ఆరోపణలపై అధికారంలో ఉండగా విచారణ ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ తొలి ప్రధానిగా నెతన్యాహు చరిత్రకెక్కారు.

అయితే తనపై వచ్చిన అవినీతి, లంచగొండి, నమ్మకద్రోహం ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదంటున్నారు 70 ఏళ్ల నెతన్యాహు.

''నన్ను అధికార పీఠం నుంచి ఎలాగైనా దించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవి '' అని కోర్టులో విచారణకు హాజరైన తర్వాత నెతన్యాహు వ్యాఖ్యానించారు. వారంరోజుల కిందటే ఆయన మరోసారి దేశప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా ఆ దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.

ఏడాది కాలంలో మూడుసార్లు ఎన్నికలు జరిగిన తర్వాత, నెతన్యాహుతో అధికారం పంచుకునేందుకు ఆయన రాజకీయ ప్రత్యర్ధి బెన్నీ గాంట్జ్‌ అంగీకరించారు.

అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటున్నందున పదవి నుంచి దిగిపోవాలంటూ ఆయన ప్రత్యర్ధులు చేస్తున్న డిమాండ్‌లను నెతన్యాహు తోసిపుచ్చారు.

లికుడ్‌ పార్టీకి చెందిన నెతన్యాహు, ఇజ్రాయెల్‌కు అత్యధికకాలం పని చేసిన ప్రధానిగా రికార్డు సృష్టించారు. 2009 నుంచి ఇప్పటి వరకు ప్రైమ్‌ మినిస్టర్‌గా కొనసాగుతున్న ఆయన 1996-1999 మధ్యకాలంలో కూడా ఒకసారి ప్రధానిగా పని చేశారు.

నెతన్యాహు ఫొటోతో బ్యానర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తనపై చేసిన ఆరోపణలన్నీ కుట్రగా అభివర్ణిస్తున్నారు నెతన్యాహు

కోర్టు దగ్గర ఏం జరిగింది?

ఆదివారంనాడు జెరూసలేంలోని డిస్ట్రిక్ట్‌ కోర్టుకు చేరుకున్ననెతన్యాహు '' నేను తల ఎత్తుకుని సగర్వంగా ఇక్కడ నిలబడ్డా'' అని వ్యాఖ్యానించారు.

''రైట్‌వింగ్‌ నుంచి అత్యంత పవర్‌ఫుల్‌ ప్రైమ్‌మినిస్టర్‌గా ఉన్న నన్ను పదవి నుంచి దించితే ఏదైనా సాధ్యమే'' అన్నారు నెతన్యాహు.

''నాపై వచ్చిన నేరారోపణలన్నీ విన్నాను, అర్ధం చేసుకున్నాను'' అని గంటపాటు సాగిన విచారణ సందర్భంగా నెతన్యాహు న్యాయమూర్తితో అన్నారు.

ముఖానికి మాస్క్‌ వేసుకున్న నెతన్యాహు విలేకరులు కోర్టు నుంచి బైటికి వెళ్లే వరకు నేరస్తులు కూర్చునే బెంచ్‌ మీద కూర్చోడానికి నిరాకరించారని స్థానిక మీడియా వెల్లడించింది.

ప్రత్యర్ధులు చేసిన ఆరోపణలకు సమాధానాలు సిద్ధం చేయడానికి తమకు కొన్నినెలల సమయం పడుతుందని నెతన్యాహు లాయర్లు కోర్టుకు తెలిపారు. అయితే తదుపరి విచారణ జులై 19న ఉంటుందని కోర్టు తెలిపింది.

బెంజమిన్‌ నెతన్యాహుపై వచ్చిన నేరారోపణలేంటి?

నెతన్యాహుపై మూడు రకాల ఆరోపణలున్నాయి. వీటిని ఇజ్రాయెల్ న్యాయ పరిభాషలో 1,000, 2,000, 4,000 కేసులుగా పిలుస్తారు:

  • కేస్‌ 1,000-మోసం, నమ్మక ద్రోహం: వ్యాపారవేత్తలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రతిఫలంగా ఆయన వారి నుంచి ఖరీదైన సిగరెట్లు, మద్యం సీసాలను బహుమతులుగా స్వీకరించారని ఆరోపణలు చేశారు.
  • కేస్‌ 2,000: మోసం, నమ్మక ద్రోహం: తనకు అనుకూలమైన కథనాలు రాసినందుకు ''యెదియట్ అహర్‌నాట్‌'' అనే పత్రిక సర్క్యులేషన్‌ పెంచుకోడానికి సహకరించారని ఆరోపణల్లో పేర్కొన్నారు.
  • కేస్ ‌4,000: లంచాలు తీసుకోవడం, మోసం, నమ్మకద్రోహం: తాను ప్రధానిగా, టెలీకమ్యూనికేషన్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్‌లో ప్రముఖ టెలీకాం సంస్థ బెజెక్‌లో షేర్‌ హోల్డర్‌ అయిన వ్యాపారవేత్త షాల్‌ఎలోవిచ్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని, తద్వారా ఆయన కంపెనీపై పట్టుసాధించేందుకు సహకరించారని, ప్రతిఫలంగా ఎలోవిచ్‌కు చెందిన వెబ్‌సైట్‌లో తనకు అనుకూలంగా కథనాలు రాయించుకున్నారన్నది ఆరోపణ.

తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నింటినీ నెతన్యాహు ఖండించారు. ఇవన్నీ రాజకీయ ప్రత్యర్ధులు తనపై కక్ష సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలనీ, వీటి నుంచి తాను క్లీన్‌గా బయటకు వస్తానని నెతన్యాహు అన్నారు.

ప్రధానిగా ఉంటూనే విచారణ ఎదుర్కోవడం సాధ్యమేనా?

ఇజ్రాయెలీ చట్టాల ప్రకారం విచారణను ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పరిణామం జరగలేదు.

గతంలో ఎహుద్‌ ఓల్మర్ట్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తనపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా చేసినా, 2008లో ఎన్నికలు జరిగే వరకు ఆయన సాంకేతికంగా ప్రధానిగానే కొనసాగారు. ఈ ఎన్నికల తర్వాత బెంజమిన్‌ నెతన్యాహు అధికారంలోకి వచ్చారు.

బెన్నీగాంట్జ్‌తో అధికారాన్ని పంచుకోవడం కోసం దేశంలో తాజాగా ప్రత్యామ్నాయ ప్రధాని అనే పదవిని సృష్టించారు. దీని ప్రకారం ఇరువురు నేతలు చెరి 18నెలలపాటు అధికారాన్ని అనుభవిస్తారు. 18 నెలల తర్వాత కూడా నెతన్యాహు అధికారంలోనే కొనసాగుతారు. కాబోయే ప్రధాని గ్రాంట్జ్‌కు ఆయన డిప్యూటీగా ఉంటారు.

యూదు శిబిరాలను అనుసంధానించాలన్న నెతన్యాహు ప్రణాళికలపై విచారణ ప్రభావం ఉండకపోవచ్చు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, యూదు శిబిరాలను అనుసంధానించాలన్న నెతన్యాహు ప్రణాళికలపై విచారణ ప్రభావం ఉండకపోవచ్చు

విచారణపై ఇజ్రాయెల్‌లో ఏమనుకుంటున్నారు?

ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, విచారణలో జైలు శిక్ష నుంచి తప్పించుకోడానికి తనవంతు ప్రయత్నాలు చేయడం సహజమే. ''ప్రభుత్వ విధానాల మీద ప్రభావం చూపకపోయినా ఇదొక ఇబ్బందికరమైన పరిణామం. జాతీయ స్ఫూర్తికి విఘాతం'' అని ప్రతిపక్ష పార్టీ నేత యాయిర్‌ లాపిడ్‌ అన్నారు.

ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జోర్డాన్‌ వ్యాలీలో యూదు శిబిరాలను అనుసంధానించే విషయంలో నెతన్యాహు తన ప్రణాళికల ప్రకారం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో పాలస్తీనియన్లకు కోపం తెప్పించే అవకాశం ఉంది.

అవినీతి ఆరోపణలున్న నెతన్యాహు ప్రధానమంత్రిగా కొనసాగాలా వద్దా అనే విషయంలో ఇజ్రాయెలీలలో భిన్నాభిప్రాయాలున్నాయి. విచారణ కారణంగా నెతన్యాహు ప్రధాని బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించలేరని విమర్శకులు అభిప్రాయపడుతుండగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వ్యక్తిని పదవికి దూరం చేయడం సరికాదని ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

ఒకవేళ ఇప్పటికిప్పుడు నెతన్యాహు దోషిగా నిర్ధారణ అయినా ఆయన వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. తనపై వచ్చిన నేరారోరపణలకు సంబంధించి నెతన్యాహు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. ఇది నెలలు పట్టొచ్చు. సంవత్సరాలు కూడా పట్టొచ్చు.

ఎహుద్ ఓల్మర్ట్‌ కేసునే ఉదాహరణగా తీసుకుంటే, ఆయనపై 2009లో కేసు నమోదైంది. ఆయన అప్పీలుకు వెళ్లి వాటిపైనా విచారణలు జరిగి నేరం నిర్ధారణ అయ్యాక ఆయనకు శిక్ష అమలు 2016లో మొదలైంది. అంత సుదీర్ఘంగా కొనసాగుతుంది న్యాయప్రక్రియ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)