ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైన ప్రధాని నెతన్యాహు.. ఇజ్రాయెల్ పార్లమెంటుకు మళ్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Reuters
ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో ఇజ్రాయెల్ ఎంపీలు పార్లమెంటును రద్దు చేసే తీర్మానానికి అనూకూలంగా ఓట్లు వేశారు.
దీంతో ఇజ్రాయెల్‌లో సెప్టంబర్ 17న మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
నెతన్యాహు గత నెలలో జరిగిన ఎన్నికల తర్వాత కొత్త రైట్ వింగ్ కూటమి ఏర్పాటుకు చేయడానికి ఒప్పందం చేసుకోవడంలో విఫలం అయ్యారు.
అల్ట్రా-ఆర్థడాక్స్ యూదు సంస్థల విద్యార్థులకు నిర్బంధ సైనిక సేవల నుంచి మినహాయింపులు ఇచ్చే బిల్లు ఇప్పుడు ప్రతిష్టంభనలో పడింది. దీనిని రివ్యూ చేయాలనే డిమాండ్ వస్తోంది.
ఇజ్రాయెల్ చరిత్రలో ఒక ప్రధాన మంత్రి ఇలా కూటమి ఏర్పాటు చేయడంలో విఫలం కావడం మొదటిసారి జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిష్టంభనకు కారణం ఏంటి
కూటమి ఏర్పాటుకు బుధవారం అర్థరాత్రి వరకూ ఇచ్చిన గడువు ముగియడంతో పార్లమెంటును రద్దు చేయాలనే తీర్మానంపై ఓటింగ్ జరిగింది. దీనికి అనుకూలంగా 74 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 45 మంది ఎంపీలు ఓట్లు వేశారు.
ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 120 స్థానాల్లో నెతన్యాహు లికుడ్ పార్టీ 35 స్థానాల్లో విజయం సాధించింది.
నెతన్యాహు ఐదో సారి ప్రధాన మంత్రిగా తన పదవీకాలం పూర్తి చేస్తారని అందరూ భావించారు. కానీ మాజీ రక్షణ మంత్రి ఎవిగ్దోర్ లిబర్మన్‌తో ఆయన ఒప్పందం చేసుకోలేకపోయారు. ఆయన మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం.

ఫొటో సోర్స్, Reuters
జాతీయ పార్టీ 'ఇజ్రాయెల్ బెతెన్యు పార్టీ'కి సంబందించిన లిబర్మన్, అల్ట్రా-ఆర్థడాక్స్ యూదు పార్టీల మద్దతు కావాలంటే ఆ సంస్థల విద్యార్థులను నిర్బంధ సైనిక సేవల నుంచి మినహాయించాలని, డ్రాఫ్టులో మార్పులు చేయాలని షరతు పెట్టారు.
నెతన్యాహు పార్టీతో కూటమిలో ప్రస్తుతం ఉన్న అల్ట్రా ఆర్థడాక్స్ యూదు పార్టీలు మాత్రం నిర్బంధ సైనిక సేవల్లో లభించే మినహాయింపుల్లో మార్పుల వల్ల తాము ఆధునిక ప్రపంచానికి దూరం అవుతామని, వాటిని వ్యతిరేకిస్తున్నాయి. కానీ లిబర్మన్ మాత్రం దాన్ని రివ్యూ చేయాలని కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
నెతన్యాహు ఏమంటున్నారు
ఇజ్రాయెల్ అధ్యక్షుడు పార్లమెంటులో ఇతర పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే లోపే నెతన్యాహు మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా పార్లమెంటును రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు.
పార్లమెంటులో జరిగిన ఓటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన నెతన్యాహు "నేను ఒక స్పష్టమైన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను, అది మాకు గెలుపు సాధించిపెడుతుంది. మేం గెలుస్తాం. మేం గెలవడంతోపాటు ప్రజలు కూడా గెలుస్తారు" అన్నారు.
ప్రధాన మంత్రి, మోసం, లంచం ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన కేసుల నుంచి తనను కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
నెతన్యాహు ఒక అమెరికా వ్యాపారి నుంచి బహుమతులు అందుకున్నారని, మీడియాలో సానుకూల కవరేజి కోసం లభ్ది చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. నెతన్యాహు మాత్రం తను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- కండలు పెంచే ప్రయత్నంలో సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోతున్నారు
- గూగుల్ యాప్స్ లేని మొబైల్ ఫోన్ల భవిష్యత్ ఎలా ఉంటుంది?
- జనసేన పార్టీ వైఫల్యానికి, పవన్ కల్యాణ్ ఓటమికి కారణాలేంటి?
- ఉత్తరాంధ్ర: బీటలువారిన రాజ వంశీయుల కంచుకోటలు
- తెలుగుదేశం పార్టీ: గత వైభవాన్ని తీసుకురాగల నాయకుడెవరు
- కందుకూరి వీరేశలింగం: సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు చేసిన సంస్కర్త
- ‘అమరావతి ఒక సంచలన కుంభకోణం.. భూముల కొనుగోళ్లపై విచారణ జరుపుతాం’
- వారణాసిలో ముస్లింల ఇళ్లు కూల్చేస్తే.. హిందూ ఆలయాలు బయటపడ్డాయా
- 'నా దేశభక్తిని బలవంతంగా పరీక్షించకండి'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








