ప్రిన్సెస్ డయానా - మార్టిన్ బషీర్ ఇంటర్వ్యూ విషయంలో బీబీసీ తన తప్పులను కప్పిపుచ్చుకుందన్న లార్డ్ డైసన్ నివేదిక

ఫొటో సోర్స్, BBC/Reuters
వేల్స్ యువరాణి డయానాను ఇంటర్వ్యూ చేసేందుకు మార్టిన్ బషీర్ అనే జర్నలిస్టు అనుసరించిన మోసపూరిత విధానాలను బీబీసీ కప్పి పుచ్చిందని డయానా ఇంటర్వ్యూ వివాదంపై చేసిన విచారణ అభిప్రాయపడింది.
ఈ ఇంటర్వ్యూను సంపాదించిన విధానం గురించిన నివేదికను ప్రచురించింది. ఈ విచారణను మాజీ న్యాయమూర్తి లార్డ్ డైసన్ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ బీబీసీకున్న అత్యున్నత విలువలను, ప్రమాణాలను, పారదర్శకతను దిగజార్చిందని ఆ నివేదిక పేర్కొంది.
లార్డ్ డైసన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైరయ్యారు.
ఆ నివేదిక బీబీసీ వైఫల్యాలను చూపించిందని అంగీకరిస్తూ, బీబీసీ క్షమాపణలు కోరింది.
డయానా సోదరుడు ఎర్ల్ స్పెన్సర్‌కు మార్టిన్ బషీర్ నకిలీ పత్రాలను చూపించి ఇంటర్వ్యూను సంపాదించినట్లు ఆ నివేదిక తేల్చింది. అయితే, గతంలో బీబీసీ చేసిన విచారణలో ఆయన నకిలీ పత్రాలను చూపించినట్లు చెప్పలేదని, అబద్ధం చెప్పారని బీబీసీ చెప్పింది. బషీర్ 1995లో చేసిన విచారణలో అబద్ధాలు చెప్పినట్లు తెలిపింది.
ఈ పత్రాలను నకిలీవిగా మార్చినట్లు చెబుతూ బషీర్ క్షమాపణలు కోరారు. అయితే, ఆ ఇంటర్వ్యూ గురించి మాత్రం ఆయన చాలా గర్వంగా భావిస్తున్నట్లు ఓ ప్రకటనలో చెప్పారు.
"డయానా ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి బ్యాంకు స్టేట్‌మెంట్లతో సంబంధం లేదని, ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం ఆమె వ్యక్తిగత ఇష్టం" అని ఆయన అన్నారు. డయానా స్వదస్తూరితో ఇచ్చిన ఆధారాలతో పాటు ఇతర బలమైన ఆధారాలు దీనిని ధృవీకరిస్తాయని చెప్పారు.
"వేల్స్ యువరాణి డయానా బీబీసీకి ఇష్టపూర్వకంగానే ఇంటర్వ్యూ ఇచ్చినప్పటికీ, ఈ ఇంటర్వ్యూను సంపాదించిన తీరు ప్రేక్షకులు ఆశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేదు. దీనిపై మేం చింతిస్తున్నాం. వైఫల్యాలను లార్డ్ డైసన్ స్పష్టంగా చూపించారు" అని బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ వ్యాఖ్యానించారు.
"బీబీసీలో ప్రస్తుతం మెరుగైన విధానాలు అమల్లో ఉన్నాయి. అప్పటి విధానాల ప్రకారం ఇంటర్వ్యూ అలా జరిగి ఉండకుండా చూడాల్సింది" అని అన్నారు.
అప్పుడేం జరిగిందో లోతైన విచారణ చేపట్టి మరింత పారదర్శకంగా ఉండి ఉండాల్సిందని అన్నారు.
"అయితే, ఇప్పుడు 20 ఏళ్లు వెనక్కి వెళ్లలేకపోయినప్పటికీ దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ, బేషరతుగా క్షమాపణలు మాత్రం చెప్పగలం. ఈ రోజు బీబీసీ అదే చేయగలదు" అని టిమ్ అన్నారు.
లార్డ్ డైసన్ నివేదికను బీబీసీ బోర్డు స్వాగతించింది. "ఇందులో ఆమోదయోగ్యం కాని వైఫల్యాలు ఉన్నాయి. ఇవి గతంలో జరిగినవని చెప్పి మేం తప్పించుకోలేం" అని బోర్డు వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రిన్సెస్ డయానా ఎవరు?
ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీలకు తల్లి డయానా. బ్రిటన్ రాజసింహాసనానికి వారసుడైన వేల్స్ యువరాజును 1981లో డయానా వివాహం చేసుకున్నారు. వారి వివాహం లండన్‌లోని సెయింట్ పాల్ క్యాథెడ్రల్‌లో జరిగింది. కానీ, ఈ దంపతులు 1992లో విడిపోయి, 1996లో విడాకులు తీసుకున్నారు.
డయానా ఎలా మరణించారు?
డయానా 1997లో ప్యారిస్‌లోని పాంట్ డి ఐ అల్మా టన్నెల్ దగ్గర జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. ఆమె సహచరుడు దోడి అల్ ఫాయెద్‌తో పాటు కారు నడుపుతున్న హెన్రీ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. అల్ ఫాయెద్ బాడీ గార్డ్ ట్రెవర్ రీస్-జోన్స్ మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారు నడుపుతున్న పాల్ రక్తంలో ప్రతి 100 మిల్లీలీటర్లకు 175 మిల్లీగ్రాముల ఆల్కహాల్ ఉందని వెల్లడైంది. ఫ్రెంచ్ చట్టం ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్లకు 50 మిల్లీగ్రాముల ఆల్కహాల్ ఉంటే ఒక వైన్ బాటిల్ కన్నా ఎక్కువగా తాగినట్లే.
వారు ప్రయాణిస్తున్న కారును ఫొటోగ్రాఫర్లు అనుసరిస్తుండటంతో... వారి నుంచి తప్పించుకోవడానికి వేగంగా కారును నడిపారు. దీంతో అదుపు తప్పి, ఓ కాంక్రీట్ స్థంభాన్ని ఢీకొట్టారు.
పనోరమా ఇంటర్వ్యూలో డయానా ఏం చెప్పారు?
డయానా ఇచ్చిన ఇంటర్వ్యూ 1995లో ప్రసారమైంది.
గతంలో రాజకుటుంబానికి చెందిన వారెవరూ రాజ కుటుంబం గురించి, ఇతర కుటుంబ సభ్యుల గురించి అంత బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు ఎప్పుడూ లేవు.

ఫొటో సోర్స్, AFP
ఈ ఇంటర్వ్యూలో డయానా...
- తనకు మరొకరితో సంబంధం ఉందని అంగీకరించారు.
- రాకుమారుడు చార్లెస్‌కు కేమిలా పార్కర్ - బౌల్స్‌తో సంబంధం ఉన్నట్లు చెప్పారు (ఆమె ఇప్పుడు చార్లెస్ భార్య, డచెస్ ఆఫ్ కార్న్‌వాల్). వీరి సంబంధం తన విలువను తగ్గిస్తోందని చెప్పారు. తాము ముగ్గురూ వివాహ బంధంలో ఉన్నామని చెప్పారు.
- ఆమెకు బులీమియా ఉందని, ఆమె తనకు తానే హాని చేసుకుంటూ ఉంటారని చెప్పారు.
- రాజుగా ఉండేలా ఛార్లెస్ తనను తాను మార్చుకోలేరని అన్నారు.
- ఆమెకు వ్యతిరేకంగా ఛార్లెస్ సిబ్బంది ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు.
ఇంటర్వ్యూను 2 కోట్ల మందికి పైగా చూశారు. ఇది ప్రసారం కాగానే అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత కొన్ని రోజులకు ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ డయానాలు విడాకులు తీసుకోవాలని సూచిస్తూ బ్రిటన్ రాణి వారిద్దరికీ లేఖ రాశారు.
మార్టిన్ బషీర్ ఎవరు?
రాజ కుటుంబీకులతో పెద్దగా పరిచయాలేవీ లేని మార్టిన్ బషీర్ లాంటి బీబీసీ జూనియర్ రిపోర్టర్‌కు డయానా ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
కానీ, ఆ ఇంటర్వ్యూలో బయటపడిన విషయాలు ఆయనకు ఇంటర్వ్యూ చేసే అవకాశం ఎలా వచ్చిందనే ప్రశ్నలను మరుగునపడేలా చేశాయి.
కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఐటీవీ టునైట్ కార్యక్రమానికి, అనేక అమెరికా టెలివిజన్ సంస్థలకు పని చేశారు. ఆయన 2016లో బ్రిటన్‌కు తిరిగి వచ్చి బీబీసీలో రిలిజియన్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, అనారోగ్య కారణాలతో మే నెల మధ్యలో ఆయన రాజీనామా చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆయన పైనున్న ఆరోపణలు ఏంటి?
డయానా ఇంటర్వ్యూను సంపాదించడానికి బషీర్ అబద్దాలు చెప్పారని డయానా సోదరుడు ఎర్ల్ స్పెన్సర్ ఆరోపించారు. కొన్ని నకిలీ బ్యాంక్ స్టేట్‌మెంట్లను చూపించారని, వాటిని చూపించి, తనను నమ్మించి, ప్రిన్సెస్ డయానా ఇంటర్వ్యూ సంపాదించేందుకు ప్రయత్నించారన్నారు. బీబీసీలో పని చేసే ఓ గ్రాఫిక్ ఆర్టిస్ట్ ఆ బ్యాంకు స్టేట్‌మెంట్‌లను మార్ఫింగ్ చేసినట్లు బషీర్ అంగీకరించారు. డయానాతో ఆమెకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలపై వరుస కథనాలు ప్రసారం చేస్తామని బషీర్ అబద్దం చెప్పారు. ఎలాగైనా డయానాను ఇంటర్వ్యూకు ఒప్పించడమే ఈ అసత్యాల లక్ష్యమని స్పెన్సర్ అన్నారు.
బీబీసీపై ఆరోపణలేంటి?
1996లో నకిలీ బ్యాంక్ స్టేట్‌మెంట్లను డైలీ మెయిల్ బయటపెట్టడంతో బీబీసీ అంతర్గత విచారణ నిర్వహించింది. దీనిలో బషీర్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. అప్పట్లో డైరెక్టర్ ఆఫ్ న్యూస్‌గా ఉన్న టోనీ హాల్ ఈ విచారణ నిర్వహించారు. ఆ తర్వాత కాలంలో ఆయన బీబీసీ డైరెక్టర్ జనరల్ అయ్యారు. 2019లో పదవీ విరమణ చేశారు.
విమర్శకుల ప్రశ్నలు
- అయితే, ఎర్ల్ స్పెన్సర్‌తో మాట్లాడకుండా అంత వేగంగా బషీర్ తప్పేమీ లేదని ఎలా నిర్థరిస్తారు?
- అంతటి ముఖ్యమైన ఇంటర్వ్యూ సాధించడం ద్వారా దాన్ని సాధించేందుకు అనుసరించిన తప్పుడు పద్ధతిని దాచిపెట్టి, సరైన విచారణను అడ్డుకున్నారా?
ఎర్ల్ స్పెన్సర్ తన అనుమానాలు, ఆరోపణలను బహిరంగంగా చెప్పడంతో గత సంవత్సరం బీబీసీ ఓ స్వతంత్ర విచారణకు ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విచారణకు బషీర్ పూర్తిగా సహకరించారు. ఈ విచారణ జరుగుతున్న సమయంలో ఈ విషయం గురించి మాట్లాడమని బీబీసీ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- ఆక్స్ఫర్డ్ కరోనా వ్యాక్సీన్ పెద్ద వయసు వారిలో మెరుగైన ప్రభావం చూపిస్తోంది...
- కరోనావైరస్: వచ్చే చలికాలానికి అంతా నార్మల్ అవుతుందంటున్న వ్యాక్సీన్ రూపకర్తలు
- కోవిడ్-19 వ్యాక్సీన్‌తో మన డీఎన్ఏ దెబ్బతింటుందా
- ఇలా మొదలైంది ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ల లవ్ స్టోరీ!
- ఏడు దశాబ్దాల బంధం
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








