ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సీన్ పెద్ద వయసు వారిలో మెరుగైన ప్రభావం చూపిస్తోంది...

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ తీసుకున్న వలంటీర్లలో ఒకరైన ఎలీసా గ్రనాటో
ఫొటో క్యాప్షన్, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ తీసుకున్న వలంటీర్లలో ఒకరైన ఎలీసా గ్రనాటో

ఆక్స్‌ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సీన్‌తో 60, 70లలో ఉన్న వృద్ధుల్లో బలమైన రోగనిరోదక స్పందనలు చూపించినట్లు తేలింది.

వైరస్ ప్రమాదం ఎక్కువగా ఉన్న వృద్ధులను ఈ వ్యాక్సీన్ కాపాడగలదని ఆశిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న 560 మంది వృద్ధులపై జరిగిన లాన్సెట్ రెండో దశ పరీక్షల ఆధారంగా పరిశోధకులు ఈ విషయం చెప్పారు.

ప్రజల్లో కోవిడ్-19 ఎక్కువగా పెరగకుండా కూడా వ్యాక్సీన్ అడ్డుకోగలదా అనేది కూడా మూడో దశ పరీక్షల్లో పరిశీలించారు.

కీలకమైన ఈ దశకు సంబంధించిన ప్రాథమిక ఫలితాలు మరికొన్ని వారాల్లో వస్తాయని భావిస్తున్నారు.

పైజర్-బయోఎన్‌టెక్, స్పుత్నిక్, మోడర్నా పేరుతో వస్తున్న మూడు వ్యాక్సీన్లు మూడో దశల పరీక్షలకు సంబంధించి ఇప్పటికే మంచి ప్రాథమిక గణాంకాలను అందించాయి.

వీటిలో ఒక వ్యాక్సీన్ 65 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్-19 నుంచి 94 శాతం రక్షణను అందించగలదని చెప్పారు. బ్రిటన్ ఆస్ట్రాజెనెకా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సీన్ కోటి డోసులు, ఫైజర్ బయోఎన్‌టెక్ వ్యాక్సీన్ 4 కోట్ల డోసులు, మోడెర్నా 50 లక్షల డోసులకు ఆర్డర్ ఇచ్చింది.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Oxford University

సంతోషకరమైన విషయం

ఫలితాలు సంతోషకరంగా ఉన్నాయిని, 70 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో కూడా బలమైన రోగనిరోధక స్పందనలు కనిపిస్తున్నాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ ఆండ్రూ పొల్లార్డ్ బీబీసీకి చెప్పారు.

ఈ వ్యాక్సీన్ కోవిడ్-19 నుంచి ప్రజలను కాపాడగలదా అనే ప్రశ్నకు ఆయన "అప్పుడే చెప్పలేం, కానీ, క్రిస్మస్ లోపు దానికి సంబంధించిన గణాంకాలు రావచ్చు" అన్నారు.

"మిగతా వ్యాక్సీన్లతో మాకు పోటీ లేదు. ఇంకా విజయవంతం కావాల్సిన ఎన్నో టీకాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందరినీ కాపాడ్డానికి మనకు అవన్నీ కావాలి" అన్నారు.

వైరస్‌తో పోరాడగలిగేలా అన్ని వయసుల వారి శరీరాలనూ ప్రేరేపించడానికి ఒక కోవిడ్ వ్యాక్సీన్ తయారు చేయడం కంపెనీలకు సవాలుగా నిలిచింది.

వృద్ధుల రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందుకే, యువకుల్లో వ్యాక్సీన్లు పనిచేసినంత సమర్థంగా అవి వారికి పనిచేయవు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన పరీక్షా ఫలితాలను లాన్సెట్ సమీక్షించింది. దీనివల్ల సమస్యలు ఉండవని భావిస్తున్నారు.

56 నుంచి 70 ఏళ్లకు పైగా వయసున్న వారిలో రోగనిరోధక స్పందనలు 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వారిలో ఉన్నట్లే కనిపించాయని ఈ పరీక్షల్లో తేలింది.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

బలహీనత లేకుండా రక్షణ

"ఈ వ్యాక్సీన్‌ను వృద్ధులు సమర్థంగా తట్టుకోవడమేకాదు, వారిలో యువ వలంటీర్లలో ఉన్న రోగనిరోధక స్పందనలు కూడా కనిపించడం మాకు సంతోషం కలిగించింది. ఇది వారికి ఈ వ్యాధి నుంచి రక్షణ అందిస్తుందా అనేది మేం తర్వాత దశలో చూడాల్సి ఉంటుంద"ని ఆక్స్ ఫర్డ్ వ్యాక్సీన్ గ్రూప్ పరిశోధకులు డాక్టర్ మహేషీ రామసామి అన్నారు.

రెండో మోతాదు ఇచ్చిన రెండు వారాల తర్వాత 99 శాతానికి పైగా వలంటీర్లలో యాంటీబాడీస్ ప్రతిస్పందనలు లేకుండా చేసింది. ఇది అన్ని వయసుల వారిలో కనిపించింది.

వైరస్‌కు రోగనిరోధక శక్తి ఎంత సమర్థంగా స్పందిస్తుందో చూడ్డానికి టీ-స్పెల్ స్పందనను మరో కొలమానంగా భావిస్తారు. మొదటి డోస్ ఇచ్చిన తర్వాత వయసుతో సంబంధం లేకుండా ఇది రెండు వారాల్లో అత్యధిక స్థాయికి చేరింది.

వృద్ధుల్లో బలమైన యాంటీబాడీస్, టీ-సెల్ స్పందన ప్రోత్సాహకరంగా ఉందన మా అధ్యయనంలో తేలిందని డాక్టర్ రామసామి చెప్పారు.

కోవిడ్-19 ముప్పు తీవ్రంగా ఉన్నవారిలో ఇప్పటికే వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ఉన్నారు.

"అంటే, మా వ్యాక్సీన్ సమాజంలో అత్యంత దుర్బలంగా ఉన్న కొందరిని కాపాడ్డానికి సాయం చేయగలదని మేం ఆశిస్తున్నాం. కానీ, అది కచ్చితంగా తెలుసుకునే ముందు దీనిపై మరింత పరిశోధన అవసరం" అని ఆయన చెప్పారు.

ఈ వ్యాక్సీన్ వల్ల వృద్ధులు దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. అవి చెప్పాలంటే స్వల్పంగా ఉంటాయి.

ChAdOx1 nCov-2019 అనే ఈ వ్యాక్సీన్‌కు సంబంధించి తీవ్ర భద్రతా సమస్యలు కూడా లేవు.

మూడో దశ పరీక్షల్లో వలంటీర్లను వివిధ గ్రూపులుగా చేశారు. వారికి ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సీన్ లేదంటే డమ్మీ టీకాలు ఇస్తున్నారు.

టీకా వేసిన రోజు, ఒకరోజు తర్వాత, రెండు రోజులు, నాలుగు రోజుల తర్వాత వలంటీర్లలో రోగనిరోధక వ్యవస్థ స్పందనలు పరీక్షిస్తున్నారు.

చింపాజీలకు వచ్చే సాధారణ జలుబు వైరస్(అడెనో వైరస్) బలహీన వర్షన్ నుంచి ఆక్స్ ఫర్డ్ వ్యాక్సీన్‌ను తయారు చేశారు.

ఈ వ్యాక్సీన్ పనులు జనవరిలో మొదలయ్యాయి. దీనిని మూడు నెలల్లోపే తయారు చేశారు. మొదట యూరప్‌లో, ఏప్రిల్లో ఆక్స్ ఫర్డ్ లో వీటిని మనుషులపై పరీక్షించడం ప్రారంభించారు.

మూడో దశ పరీక్షల్లో వ్యాక్సీన్ కోవిడ్-19 నుంచి ప్రజలను ఎంత సమర్థవంతంగా రక్షించగలదు అనేది చూస్తారు.

ఆగస్టు చివర్లో మొదలైన ఈ పరీక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ దశ గణాంకాలను సంబంధిత అధికారులకు పంపిస్తారు. తర్వాత వారు వాటిని పరిశీలించి దానిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై ఉపయోగించడానికి ఆమోదముద్ర వేస్తారు.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Sean Elias - Oxford Vaccine trial

ఫొటో క్యాప్షన్, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ పరిశోధనలు జనవరిలో మొదలయ్యాయి.

క్రిస్మస్ సమయంలో తమ కుటుంబాలను కలుసుకోవడం గురించి అందరూ చర్చించుకుంటున్న సమయంలో ఈ వ్యాక్సీన్ విషయం బయటికి వచ్చింది.

"క్రిస్మస్ సమయంలో కుటుంబాలు ఒకేచోట గుమిగూడడం వల్ల ముప్పు గణనీయంగా ఉంటుందని యూసీఎల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ హెల్త్ కేర్ డైరెక్టర్, ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీస్ సభ్యులు ప్రొఫెసర్ ఆండ్రూ హేవార్డ్ బీబీసీతో అన్నారు.

"వ్యాక్సినేషన్ ద్వారా మనం ప్రేమించే మన పెద్ద వాళ్లను రక్షించుకోగలిగే దశలో ఉన్నాం. సెలవు రోజుల్లో మళ్లీ అందరూ కలవడం ద్వారా అలాంటి అవకాశాన్ని చేజార్చుకోవడం విషాదకరమే అవుతుంది. కానీ, మనం మన మామూలు క్రిస్మస్ జరుపుకోడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని నా వ్యక్తిగత అభిప్రాయం" అని ఆయన రేడియో 4లో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)