ఇజ్రాయల్ గూఢచర్య సంస్థ 'మొసాద్' గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు... ఎందుకో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ మరాఠీ ప్రతినిధి
‘‘వారికి నిజాయితీగా పనిచేసే నేరస్థులు కావాలి. అందుకే నాలాంటి వారిని ఎంచుకుంటారు. నేను నేరస్థున్ని కాదు. కేవలం నిజాయితీతో పనిచేసే ఇజ్రాయెల్ పౌరుణ్ణి. దొంగతనం ఎలా చేయాలి? మనుషుల్ని ఎలా చంపాలి లాంటి అంశాలను వారు నేర్పిస్తారు. ఇవన్నీ నేరస్థులు మాత్రమే చేయగలరు. సాధారణ పౌరులు ఇలాంటి పనులు చేయరు’’అని 2010లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొసాద్ మాజీ ఏజెంట్ గాడ్ షిమ్రాన్ చెప్పారు.
ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. వీటిలో కొన్ని కథలు ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి.
హీబ్రూ భాషలో మొసాద్ అంటే ‘‘సంస్థ’’అని అర్థం. ప్రపంచంలోని శక్తిమంతమైన గూఢచర్య సంస్థల్లో మొసాద్ కూడా ఒకటి.
ఒక చిన్న దేశ గూఢచర్య సంస్థ ఇంత శక్తిమంతంగా ఎలా మారింది? చాలా దేశాలు దీని పేరు వింటేనే ఎందుకు భయపడుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
గూఢచారులకు చట్టాలు వర్తించవా?
దుబయిలోని ఓ హోటల్‌లో ఓ మృతదేహం బెడ్‌పై పడివుంది. రూమ్ లోపల నుంచి లాక్‌చేశారు. అక్కడ మరణించిన వ్యక్తి పేరు మహమ్మద్ అల్ మభువా. ఆయన పాలస్తీనా అతివాద సంస్థ హమాస్ సీనియర్ నాయకుడు.
హోటల్ గదికి వెలుపల ‘‘డోంట్ డిస్టర్బ్’’ బోర్డు పెట్టి ఉంది. ఆయనది సహజ మరణమేనని అందరూ భావించారు.
ఎందుకంటే ఆయన గదిలోకి ఎవరూ వచ్చినట్లు కనిపించలేదు. రూమ్ కూడా లోపల నుంచి లాక్‌చేసి ఉంది. ఇంతకీ ఆయన ఎలా మరణించారు?
ఆయన మరణం వెనుక మొసాద్ పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ విషయాన్ని మొసాద్ బహిరంగంగా ఎప్పుడూ ఒప్పుకోలేదు.
అయితే, మొసాద్ చేపట్టిన ఈ ఆపరేషన్ ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.
ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు వెళ్లే వరకు మహమూద్‌ను ఎవరోఒకరు వెంబడిస్తూనే ఉన్నారు.
ఆయన హోటల్ లిఫ్ట్‌లోకి వెళ్లినప్పుడు, ఆయన పక్కన సూట్లు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆయనతో ఫోన్లో మాట్లాడేందుకు ఆయన భార్య చాలా ప్రయత్నించారు. ఎంతకీ ఫోన్ కలవకపోవడంతో, ఆమె హోటల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆయనకు పోలీసుల ఎదుటే శవపరీక్ష నిర్వహించారు. దీంతో ఇది హత్యేనని తేలింది. గది లోపల నుంచి లాక్‌చేసి ఉన్నప్పటికీ, గోడలపై రక్తం మరకలు కనిపించాయి. ఆయన ఒంటిపై కూడా గాయాలు ఉన్నాయి. అంటే చనిపోయే ముందు ఆయన్ను ఎవరో కొట్టారు’’అని దుబయి పోలీసు విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ సయీద్ హమీరీ బీబీసీకి చెప్పారు.
మహమ్మద్‌ను వెంబడించిన ఆ ఇద్దరు వ్యక్తుల పాస్‌పోర్టులను అధికారులు పరిశీలించారు. ఈ హత్య వెనుక మొసాద్ ఉందని దుబయి పోలీసులు గట్టిగా నమ్మారు.
అయితే, ఆ ఇద్దరి పాస్‌పోర్టులు వేరే దేశాలకు చెందినవి. ఆ దేశాలు తమ పాస్‌పోర్టులను ఎవరో ఉపయోగించుకున్నారని చెప్పాయి. హత్య ఆరోపణలను ఖండించాయి.
ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఇజ్రాయెల్ మాజీ దౌత్యవేత్త అని డాక్టర్ సయీద్ వివరించారు.
గూఢచారులు చట్టాలను అతిక్రమించడం సర్వసాధారణం. కానీ ఇజ్రాయెల్ గూఢచారుల ఉల్లంఘనలు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి.
‘‘ఇక్కడ చాలా పనులు చట్టవ్యతిరేకమైనవే ఉంటాయి. కానీ మేం చేయమని సూచించే నేరాల విషయంలో ఎవరూ మమ్మల్ని ప్రశ్నించరు. వారు ఏం చేస్తున్నారో వారికి బాగా తెలుసు. గూఢచారులకు ఎలాంటి చట్టాలు ఉండవు’’అని మొసాద్ మాజీ అధిపతి హెలెవీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
మొసాద్ ఎలా ఏర్పడింది?
‘‘వారు ఎలాంటి రిస్క్‌లనైనా తీసుకునేందుకు వెనుకాడరు’’అని మొసాద్ వ్యవహారాలపై ఏళ్లుగా వార్తలు రాస్తున్న బీబీసీ ప్రతినిధి గార్డన్ కొరేరా వ్యాఖ్యానించారు.
ప్రాణాలకు తెగించి పోరాడటమనేది మొసాద్‌కు కొత్తేమీ కాదు. అన్ని వైపులా శత్రుదేశాలు ఉండటం, అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంతో ఇలాంటి విధానాలను మొదట్నుంచీ మొసాద్ అనుసరిస్తోంది.
అరబ్ దేశాలతో యుద్ధాలు చేయడం, కల్లోలిత పరిస్థితులను ఎదుర్కోవడం ఇజ్రాయెల్‌కు కొత్తేమీకాదు. నేడు ఇజ్రాయెల్ ఒక సూపర్ పవర్. అయితే, ఇప్పటికీ మొసాద్ ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది.
మొసాద్ ఎలా పురుడు పోసుకుంది? ఎలాంటి ఆపరేషన్లు ఏపట్టింది? లాంటి అంశాలపై ‘‘టెర్రర్ థ్రూ టైమ్’’ పేరుతో బీబీసీ ప్రతినిధి ఫెర్జెట్ కేన్ ఓ సిరీస్ రూపొందించారు.
ఇజ్రాయెల్ ఆవిర్భవించిన ఏడాది తర్వాత 1949లో మొసాద్ ఏర్పాటైంది. ఇజ్రాయెల్ యూదుల దేశం. దీని చుట్టూ ఐదు అరబ్ దేశాలున్నాయి. దీంతో సరిహద్దుల వెంబడి శత్రువులపై నిరంతరం నిఘా పెట్టేందుకు మొసాద్ లాంటి సంస్థ ఇజ్రాయెల్‌కు అవసరమైంది.

ఫొటో సోర్స్, Getty Images
1960ల్లో నిర్వహించిన ఓ ఆపరేషన్‌తో అంతర్జాతీయ దృష్టి మొసాద్‌పై పడింది. మాజీ నాజీ అధికారి అడాల్ఫ్ ఈచ్‌మన్‌ను ప్రాణాలతో పట్టుకునేందుకు మొసాద్ ఈ ఆపరేషన్ చేపట్టింది. అర్జెంటీనాలో అతణ్ని పట్టుకొని ప్రాణాలతో ఇజ్రాయెల్ తీసుకొని వచ్చారు.
పేరు మార్చుకొని అర్జెంటీనాలో ఈచ్‌మన్ తిరుగుతున్నట్లు 1959లో మొసాద్‌కు తెలిసింది. 1960లో నాలుగు వేర్వేరు మార్గాల్లో నలుగురు మొసాద్ గూఢచారులు అర్జెంటీనా చేరుకున్నారు. వీరు బ్యూనోస్ ఏరీస్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈ ఇంటికి ‘‘కేజిల్’’గా కోడ్ పేరు పెట్టారు. అయితే, ప్లాన్‌లో కొంచెం గందరగోళం ఏర్పడింది. అనుకున్న దానికంటే ఒకరోజు ముందే ఈచ్‌మన్‌ను గూఢచారులు పట్టుకున్నారు. పది రోజుల పాటు ఆ ఇంటిలోనే ఆయన్ను బందీగా ఉంచారు. మూడో దేశంలో ఒక వ్యక్తిని అపహరించి, పది రోజులు బందీగా ఉంచుకోవడం అంత తేలికకాదు.
చిన్న తప్పు జరిగినా, వెంటనే గూఢచారుల్ని అరెస్టు చేస్తారు. ఆ దేశాలపై అంతర్జాతీయ ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది.
పదో రోజు ఒక ప్రభుత్వ కార్యక్రమం కోసం ఇజ్రాయెల్ మంత్రి విమానంలో అర్జెంటీనా రాజధానికి వచ్చారు. అదే విమానంలో ఈచ్‌మన్‌ను ఎక్కించి ఇజ్రాయెల్‌కు తీసుకెళ్లిపోయారు. ఇది మొసాద్ చేపట్టిన భారీ ఆపరేషన్.
విదేశీ గడ్డపై ఆపరేషన్లు చేపట్టడానికి మొసాద్ ఎప్పుడూ వెనుకాడదు. తమ గూఢచర్య సంస్థ శక్తి, సామర్థ్యాలతో ప్రపంచ దేశాలను ఇజ్రాయెల్ ఆశ్చర్య పరుస్తూ వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
విదేశాల్లో మరిన్ని ఆపరేషన్లు
ఆ తర్వాతి దశాబ్దంలో పాలస్తీనా రెబల్స్‌పై ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్లతో ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకున్నాయి.
ఈ ఆపరేషన్లపై ‘‘న్యూ హిస్టరీ ఆఫ్ మొసాద్’’ పేరుతో ఇజ్రాయెల్‌కు చెందిన జర్నలిస్టు రోనెన్ బెర్జ్‌మన్ ఓ పుస్తకం రాశారు. ‘‘మొదటి రోజు నుంచీ ఎవరినైనా హత్య చేయడానికి మొసాద్ ఎప్పుడూ వెనుకాడలేదు. బహుశా చిన్న దేశం కావడం వల్లేనేమో.. ఇతర దేశాల సార్వభౌమత్వం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించే సమయంలో మొసాద్ దేన్నీ పట్టించుకోదు. ఒక్కోసారి అవసరమైన దానికంటే ఎక్కువ బలానే ఉపయోగిస్తుంటుంది. తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు చాలా క్రూరమైన విధానాలను అనుసరిస్తుంటుంది’’అని రోనెన్ అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో తొలి ఆపరేషన్ విజయవంతమైన అనంతరం, విదేశాల్లో మొసాద్ మరిన్ని ఆపరేషన్లు చేపట్టింది. తమ ఏజెంట్లలో ఒకరైన ఎలియాహు కోహెన్‌ను వారు సిరియా రాజధాని డమాస్కస్‌కు పంపారు. ఆయన చాలా నిఘా సమాచారాన్ని మొసాద్‌కు పంపించారు. అయితే, దొరికిపోవడంతో ఆయనను హత్య చేశారు.
1960ల్లో రష్యా విమానం మిగ్‌ను మొసాద్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈజిప్టులో పనిచేస్తున్న జర్మనీ శాస్త్రవేత్తలను బెదిరించింది.
మొదట్లో ఏ గూఢచర్య సంస్థలూ తీసుకోనన్ని రిస్క్‌లు మొసాద్ తీసుకుంది. మిగతా దేశాలు తమ గురించి ఏం అనుకుంటున్నాయన్నది అసలు పట్టించుకోలేదు.
మొసాద్ చరిత్ర, ఆపరేషన్లపై ‘‘హిస్టరీ ఆఫ్ మొసాద్’’ పేరుతో ఇజ్రాయెల్ డిఫెన్స్ జర్నలిస్టు యోసి మెల్మన్ ఓ పుస్తకం రాశారు.
‘‘వారికి ధైర్యం ఎక్కువ. విజయవంతంగా ఆపరేషన్లు చేపట్టడమే వారికి తెలుసు. ల్యాండ్‌మైన్లపై కాలు పెట్టడం, శత్రు దేశాలను కవ్వించడం, విదేశాల్లో నేరాలు చేయడం, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం ఇలా ఎలాంటి ఆపరేషన్లకు అయినా మొసాద్ వెనుకాడదు’’అని బీబీసీకి చెందిన ఫెర్జెల్ కేన్ చెప్పారు.
‘‘ఏ పనిచేసినా, తమకు నష్టం కలగకుండా వారు చూసుకుంటారు. యూదుల ఊచకోతకు కొన్నేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ఏర్పాటైంది. దీంతో అందరూ వారిపైపు సంఘీభావంతో చూసేవారు. ఇవన్నీ మొసాద్‌కు కలిసి వచ్చాయి’’.

ఫొటో సోర్స్, Alamy
నానాటికీ మరింత ప్రమాదకరంగా...
1970ల్లో పాలస్తీనా ఉద్యమ నాయకుల్లో బస్సాం అబూ షరీఫ్ ప్రధానమైనవారు. పాలస్తీనా అతివాదులు నడిపే ఓ పత్రికకు అబూ ఎడిటర్ కూడా. ఆయనను మొసాద్ లక్ష్యంగా చేసుకుంది.
‘‘ఓ పుస్తకం నా దృష్టిని ఆకర్షించింది. అది చాలా పెద్ద పుస్తకం. చెగువేరాపై అంతపెద్ద పుస్తకాన్ని నేను చూడటం అదే తొలిసారి. మీకు పుస్తకాలంటే ఇష్టముంటే ఏం చేస్తారు. వెంటనే ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటారు. నేను అదే చేశాను’’అని అబూ రాసుకొచ్చారు.
‘‘అయితే, పుస్తకం మొదటి పేజీకి రెండు వైర్లు అతికించి ఉన్నాయి. నేను పుస్తకం తెరవగానే దానిలోని పేలుడు పదార్థాలు ఒక్కసారి పేలిపోయాయి. దీంతో నా కన్ను ఒకటి బయటకు వచ్చేసింది. నాకు ఏం జరిగిందో తెలియలేదు. నా మెడపై పెద్ద గాయమైంది. దీన్ని మీరు ఏమంటారు? హీరోయిజమా? లేక టెర్రరిజమా?’’అని ఆయన ప్రశ్నించారు.
హత్యలు చేయడంపై మొసాద్ ప్రధానంగా దృష్టి సారించేది. అలానే ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అబూపై దాడి దీనికి ఉదాహరణ మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
అలా మారింది...
1972లో మ్యూనిక్ ఆపరేషన్ అనంతరం, ఈ హత్యలు మరింత పెరిగాయి. ఆనాడు మ్యూనిక్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వెళ్లిన 11 మంది ఇజ్రాయెల్ క్రీడాకారులను పాలస్తీనా అతివాదులు హత్య చేశారు. దీన్ని బ్లాక్ సెప్టెంబర్‌గా పిలుస్తుంటారు.
‘‘ఇది 11 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని కాల్చడం మాత్రమే కాదు. ఆనాడు జర్మనీ చూసీచూడనట్లు ఊరుకుంది. ఇజ్రాయెల్ బలగాలు చర్యలు తీసుకోకుండా అడ్డుకుంది. దీంతో ఐరోపా దేశాల సార్వభౌమత్వాన్ని పట్టించుకోకూడదని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది’’అని రోనెన్ చెప్పారు.
ఈ హత్యలకు చాలా ఏళ్ల తర్వాత కూడా వీటి బాధ్యుల్ని మొసాద్ లక్ష్యంగా చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో మొరాకోకు చెందిన ఓ అమాయక పౌరుణ్ని నార్వేలో మొసాద్ హత్య చేసింది. ఆ సమయంలో మొసాద్ చాలా ఆగ్రహంతో ఉండేది. బ్లాక్ సెప్టెంబరుతో సంబంధంలేని చాలా మందిని కూడా లక్ష్యంగా చేసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
శిక్షణ ఇలా...
మొసాద్ డీఎన్‌ఏలోనే దేశభక్తి పతాక స్థాయిలో ఉంటుంది.
‘‘మొసాద్‌లో ప్రతి ఒక్కరి ప్రతి చర్యా దేశభక్తితో నిండి ఉంటుంది’’అని రోనెన్ అన్నారు.
‘‘మొసాద్‌లో చేరడం అంత తేలికకాదు. శారీరక పరీక్షలతోపాటు మానసిక పరీక్షలు కూడా నిర్వహిస్తారు. భాషా నైపుణ్యాలను కూడా పరీక్షిస్తారు’’అని 1980ల్లో మొసాద్‌తో కలిసి పనిచేసిన మిష్కా బెన్ డేవిడ్ చేప్పారు.
‘‘ఏడాదిపాటు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. అది చాలా కఠినమైన ట్రైనింగ్. ఆ తర్వత కొన్ని టెస్టులు, టాస్క్‌లు ఇచ్చారు. ఉదాహరణకు మా ట్రైనర్, నేను ఒక వీధిలో వాకింగ్‌కు వెళ్లాం. ఆ వీధిలోని ఒక బిల్డింగ్ బాల్కనీ చూపించి, ఐదు నిమిషాల్లో నువ్వు బాల్కనీలో మాట్లాడుతూ కనిపించాలి అన్నారు’’.
‘‘నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు అలానే నిలబడి ఉండిపోయాను. అయితే, నీకు ఇక నాలుగున్నర నిమిషాలే ఉన్నాయని నా ట్రైనర్ నాకు చెప్పాడు. వెంటనే బాల్కనీకి ఇటీవల మరమ్మతులు చేసినట్లు గమనించాను. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఈలోగా ఇక నాలుగు నిమిషాలే మిగిలాయని నా ట్రైనర్ చెప్పాడు. వెంటనే మెట్లు ఎక్కి, తలుపు కొట్టాను. ఒక వృద్ధ జంట లోపల ఉన్నారు. వారు తలుపు తెరవడానికి సుముఖంగా లేరు’’.
‘‘మీరు తలుపు తీయకపోవడం దురదృష్టకరం, నేను మున్సిపల్ కార్యాలయం నుంచి వచ్చానని చెప్పాను. మీ బాల్కనీ మరమ్మతుల కోసం మేం కొన్ని నిధులు కేటాయించాం, మిగతా ఇళ్లలోని బాల్కనీల పనులు పూర్తయ్యాయని వివరించాను. దీంతో వారు దాదాపు ఐదు నిమిషాలు మాట్లాడారు’’.
అనుకోకుండా ఎదురయ్యే పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకే ఆ పరీక్షని డేవిడ్ చెప్పారు.
ఇలా కఠినమైన శిక్షణ పూర్తిచేసుకున్న సిబ్బంది మొసాద్‌లో ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత పరిస్థితి ఇలా...
కొన్నిసార్లు మొసాద్ ఒంటరిగానే పనిచేస్తుంది. కొన్నిసార్లు ఇతర దేశాల గూఢచర్య సంస్థలతో కలిసి ఆపరేషన్లు నిర్వహిస్తుంటుంది. తమ దేశానికి ఇది అవసరం అని భావిస్తే, మొసాద్ వెంటనే చేస్తుంది.
2001 సెప్టెంబరు 11న అమెరికాలో ట్విన్ టవర్స్‌పై దాడి అనంతరం, పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఉగ్రవాదంపై ఒకటి లేదా రెండు దేశాలు పోరాడలేవని.. అన్ని దేశాలూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని అమెరికా ప్రకటించింది. టెర్రరిజం ప్రపంచ సమస్య కాబట్టి, అండర్ కవర్ ఆపరేషన్లు అవసరం తగ్గింది.
ట్విన్ టవర్లు కూలినప్పుడు అమెరికా సమాచారం కోసం మొదట చూసింది మొసాద్ వైపే. మొసాద్ ఆపరేషన్ల నుంచి చాలా ఉగ్రవాద వ్యతిరేక ప్రణాళికలను అమెరికా అనుసరించింది.
‘‘మా ఇమేజే మా బలం’’అని మొసాద్ మాజీ అధిపతి షాబ్తాయ్ షావిత్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేసిన పాలస్తీనా మహిళ లైలా ఖాలిద్
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








