ఇజ్రాయెల్-పాలస్తీనా: యూదులను క్రైస్తవులు అంటరానివారిగా చూస్తారా.. గాంధీ చెప్పిందే నిజమైందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కుమార్ ప్రశాంత్
- హోదా, బీబీసీ కోసం
ఇటీవల ఇజ్రాయెల్-గాజాల మధ్య తీవ్ర ఘర్షణలు కాల్పుల విరమణతో కాస్త సద్దు మణిగాయి. శాంతి కొనసాగించేందుకు రెండు వర్గాలతో రాయబారులు చర్చలు జరిపే పనిలో ఉన్నారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి దశాబ్దాల చరిత్ర ఉంది. దీనిని తమ దృక్కోణంలో పరిశీలించి వ్యాఖ్యానించిన వారిలో మహాత్మాగాంధీ కూడా ఒకరు.
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని గాంధీ యూదుల కోణం నుంచి పరిశీలించారు. యూరప్‌లో యూదుల వ్యవహారం ఆయన్ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
1938లో యూరప్ సరిహద్దు ప్రాంతాల పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత, యూదులను 'క్రైస్తవ మతంలోని అంటరాని వారు'' గా పేర్కొంటూ గాంధీ తన మొదటి సంపాదకీయం రాశారు.
''నా మనసంతా యూదులతోనే ఉంది. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటి నుంచి వారి గురించి నాకు తెలుసు. నాకు చాలా మంది యూదు మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ల ద్వారా నేను అనేక విషయాలను లోతుగా పరిశీలించాను. క్రైస్తవులలో వీరు అంటరాని వారు. హిందువులలో అంటరాని వారిని ఎలా చూస్తారో, క్రైస్తవులు కూడా వారిని అలాగే చూస్తారు'' అని పేర్కొన్నారు.
''అలాగని వారితో స్నేహం ఉన్నంత మాత్రాన అన్యాయాన్ని న్యాయమని, తప్పును ఒప్పు అని అనలేను. వాళ్లు ప్రత్యేక దేశం కావాలంటూ డిమాండ్ చేయడం నాకు నచ్చలేదు. ప్రపంచంలోని మిగతా ప్రజలందరిలాగే ఎవరు ఎక్కడ పుట్టారో, ఎక్కడ జీవనోపాధి పొందుతున్నారో అదే తమ దేశంగా వారు కూడా పరిగణించాల్సి ఉంది'' అన్నారు గాంధీ.

ఫొటో సోర్స్, Reuters
‘యూదులు తప్పు చేస్తున్నారు’
''పాలస్తీన ప్రాంతం అరబ్బులదే. అలాగే, అక్కడే పుట్టి, అక్కడే నివసిస్తున్న యూదులను కూడా పాలస్తీనియులు సమాన గౌరవంతో చూడాలి. ఒకవేళ యూదులు పాలస్తీనా ప్రాంతం మాకు కావాల్సిందేనని పట్టుబడితే, ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా తమ దేశంలోని యూదులను బలవంతంగా బయటకు పంపిస్తామంటారు. దానికి యూదులు అంగీకరిస్తారా? తమకు ప్రత్యేక దేశం కావాలని వారు కోరుకోబట్టే జర్మనీ నుంచి యూదులను బలవంతంగా తరిమివేయడాన్ని కొందరు సమర్థించే పరిస్థితి ఏర్పడింది'' అని గాంధీ అభిప్రాయపడ్డారు.
''జర్మనీలోని యూదుల పట్ల ఎంత హింస జరిగిందో అందరికీ తెలుసు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. హిట్లర్ దానిని ఒక స్థాయికి తీసుకెళ్లారు. పైగా ఆయన తన మత పిచ్చితో ఈ పనులన్నీ చేశాడు. స్వచ్ఛమైన మతం, జాతీయత పేరుతో అమానవీయమైన పనులను కూడా మానవీయమైనవిగా ప్రకటించారు. ఒక ధర్మం పేరుతో ఆయన జర్మనీ మొత్తాన్ని తీవ్రమైన ఉద్రేక స్థాయికి తీసుకెళ్లారు. మానవత కోసం, ఒక జాతి మొత్తాన్ని రక్షించడం కోసం, జర్మనీ మీద ఎవరైనా యుద్ధానికి దిగితే అది కచ్చితంగా న్యాయబద్దమైన యుద్ధం అవుతుంది. కానీ, నేను యుద్ధాన్ని నమ్మను. యుద్ధానికి సమర్థనలు, కారణాలు, మంచి, చెడుల బేరీజులకు నా మనసులో స్థానం లేదు. '' అన్నారు గాంధీ
''ఈ వ్యవస్థీకృత అణచివేతకు వ్యతిరేకంగా యూదులు పోరాడగలరా? వారు నిస్సహాయులుగా మారకుండా, వారి ఆత్మగౌరవం దెబ్బతినకుండా కాపాడటానికి మార్గం ఏదైనా ఉందా అంటే నేను ఉందనే అంటాను. ఎవరు దేవుడిని నమ్ముకుంటారో, ఎవరు నిజమైన భక్తితో ఉంటారో వారు నిస్సహాయులు ఎప్పుడూ కాలేరు'' అన్నారు గాంధీ.

ఫొటో సోర్స్, Getty Images
తాను యూదుడైతే గాంధీ ఏం చేసేవారు?
''నేను యూదుడినై, జర్మనీలో పుట్టి, ఇక్కడే జీవనోపాధి పొందుతున్నట్లయితే జర్మనీయే నా ఇల్లు అంటాను. మీరు నన్ను హింసించండి, కాల్చండి, నేలమాళిగల్లో బంధించండి. కానీ, నన్ను ఈ దేశం నుంచి బయటకు పంపడాన్ని, నా పట్ల వివక్ష చూపడాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడానికి సిద్ధంగా ఉండను'' అని గాంధీ పేర్కొన్నారు.
''దక్షిణాఫ్రికాలో భారతీయులను అక్కడి క్రైస్తవులు యూదులను చూసినట్లుగానే వివక్షతో చూస్తారు. అక్కడ కూడా అణచివేతకు మతం రంగు పులిమారు. తెల్లరంగు క్రైస్తవులు దేవుడి సంతానమని, మిగిలిన వారు కల్తీ యోని నుంచి పుట్టారని అధ్యక్షుడు క్రూయిజర్ అనేవారు. శ్వేత జాతీయులకు సేవ చేయడానికే నల్ల జాతీయులు పుట్టారని వారి నమ్మకం. అక్కడి రాజ్యాంగంలో శ్వేతజాతీయులు, నల్లరంగు, ఆసియన్ జాతీయులకు మధ్య సమానత్వం ఉండదు'' అని చెప్పారు గాంధీ.
''కానీ జర్మనీలోని యూదులు దక్షిణాఫ్రికాలోని భారతీయుల కంటే చాలా మంచి స్థితిలో ఉన్నారు. యూదులు జర్మనీలో ఒక వ్యవస్థీకృత సమూహం. వారు దక్షిణాఫ్రికా భారతీయుల కంటే ఎక్కువ నైపుణ్యం ఉన్నవారు'' అన్నారాయన.
''పాలస్తీనా భూభాగంలో నివసిస్తున్న యూదులు తప్పుడు మార్గంలో వెళుతున్నారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. బైబిల్‌లో ప్రస్తావించిన పాలస్తీనా ఒక భౌగోళిక ఆకారం కాదు. అరబ్బుల మంచితనం వల్లే యూదులు ఇక్కడ స్థిరపడ్డారు. అరబ్బుల హృదయాలను గెలవడానికి వాళ్లు ప్రయత్నించాలి. యూదుల హృదయాలలో నివసించే అదే దేవుడు అరబ్బులలోనూ ఉన్నారు. వారు అరబ్బుల ముందు సత్యాగ్రహం చేయాలి తప్ప వారిపై యుద్ధానికి దిగరాదు'' అన్నారు గాంధీ.
''నేను అరబ్బుల అత్యుత్సాహపు చర్యలను కూడా సమర్థించను. కానీ వారు తమ దేశంలో ఇతరుల అన్యాయమైన జోక్యాన్ని న్యాయబద్ధంగా వ్యతిరేకిస్తున్నారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. వారు కూడా అహింసాయుతంగా పోరాడాలని కోరుకుంటున్నాను'' అంటారు గాంధీ.

ఫొటో సోర్స్, KEYSTONE-FRANCE/GAMMA-KEYSTONE VIA GETTY IMAGES
గాంధీ వ్యాసంపై జర్మనీలో వ్యతిరేకత
యూదుల పట్ల జర్మనీ వైఖరిని తప్పుబడుతూ గాంధీ తన వ్యాసంలో వ్యాఖ్యలు చేయడంపై జర్మనీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ''జర్మనీలో యూదుల స్థితిగతుల గురించి నేను రాసిన వ్యాసంపై ఆగ్రహం వ్యక్తమవుతోందని నాకు తెలిసింది. ఐరోపా రాజకీయాల గురించి నా అజ్ఞానాన్ని నేను ఇప్పటికే అంగీకరించాను'' అన్నారు గాంధీ.
అయితే, జర్మనేతరులు ఎవరూ జర్మనీని విమర్శించడానికి వీల్లేదన్న ఓ రచయిత వ్యాఖ్యలను గాంధీ ఖండించారు.
'' జర్మనీకి చెందని వారెవరూ, స్నేహపూర్వకంగా కూడా ఆ దేశాన్ని విమర్శించ రాదని ఓ బెర్లిన్ రచయిత కొత్త సిద్ధాంతం చేశారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. జర్మనీయే కాదు, ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నవారైనా భారత్‌పై విమర్శలు చేయవచ్చు. నేను దాన్ని స్వాగతిస్తాను'' అని గాంధీ స్పష్టం చేశారు.
గాంధీ ఆందోళన
మే 5, 1947న రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ కరస్పాండెంట్ డాన్ కాంప్‌బెల్ పాలస్తీనా సమస్యను గాంధీ ముందు ప్రస్తావించారు. ఈ వివాదానికి మీరు ఏం పరిష్కారం చూపిస్తారని క్యాంప్‌బెల్ గాంధీని అడిగారు.
''ఇది పరిష్కారం లేని సమస్య'' అన్నారు గాంధీ.
ఇజ్రాయెల్ ఏర్పడటానికి మూడు నెలల ముందు గాంధీ హత్యకు గురయ్యారు. అప్పట్లో గాంధీ భయపడినట్లే ఈ సమస్యకు ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. 75 సంవత్సరాలుగా ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు యుద్ధం మధ్య నలుగుతూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









