ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది, పాలస్తీనా రెండు భూభాగాలుగా ఎందుకుంది... వందేళ్ల ఈ సంక్షోభానికి ముగింపు లేదా?

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ, అప్పటికే రెండు వైపులా తీవ్ర నష్టం వాటిల్లింది.
టెల్ అవీవ్, మోడిన్, బీర్షెబా వంటి ఇజ్రాయెల్ నగరాలను పాలస్తీనా లక్ష్యాలుగా చేసుకుని హమాస్ మిలిటెంట్లు రాకెట్లు, మోర్టార్లు ప్రయోగించగా.. గాజా, వెస్ట్‌బ్యాంకులపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
జెరూసలెంలో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనా నిరసనకారుల మధ్య వారాల తరబడి సాగిన ఘర్షణలు ఈ సాయుధ పోరాటానికి దారి తీశాయి.
ప్రపంచవ్యాప్తంగా యూదులకు, ముస్లింలకు కూడా జెరూసలెం పవిత్ర స్థలం.
మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.
ప్రస్తుత పరిస్థితులను చారిత్రక కోణం నుంచి అర్థం చేసుకోవడం అవసరం. ఈ రెండు ప్రాంతాల మధ్య వివాదం ఎప్పుడు మొదలైంది, ఎందుకంత క్లిష్టంగా మారింది? ఈ వివాదం విషయంలో ప్రపంచం ఎందుకు రెండుగా విడిపోయింది?
ఈ అంశాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రశ్నలు, జవాబుల రూపంలో మీకు అందిస్తున్నాం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వివాదం ఎప్పుడు మొదలైంది?
ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో ఐరోపాలో యూదులను లక్ష్యంగా చేసుకుని హింస ప్రజ్వరిల్లింది.
ఆ పరిస్థితుల్లో యూదులకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ ఊపందుకుంది.
మధ్యధరా సముద్రం, జోర్డాన్ నదికి మధ్య ఉన్న పాలస్తీనా ప్రాంతాన్ని యూదులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా పవిత్ర స్థలంగా భావిస్తారు.
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఈ ప్రాంతాన్ని ఆట్టొమన్ సామ్రాజ్యం పరిపాలించేది. ఈ ప్రాంతం చాలావరకు ముస్లింలు, అరబ్బుల స్వాధీనంలో ఉండేది.
ఐరోపాలో తమపై జరుగుతున్న దాడిని తప్పించుకునేందుకు అనేకమంది యూదులు ప్రాణాలు చేతబట్టుకుని పాలస్తీనా ప్రాంతానికి తరలివచ్చారు. క్రమేపీ ఈ ప్రాంతానికి వచ్చే యూదుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
దాంతో, స్థానిక అరబ్బులు, యూదులకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఆట్టొమన్ సామాజ్యం విచ్ఛిన్నం కావడంతో, ఆ ప్రాంతాన్ని తమ అధికారం కిందకు తెచ్చుకునేందుకు బ్రిటన్, లీగ్ ఆఫ్ నేషన్స్ నుంచి అనుమతి పొందింది.
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, జరుగుతున్న సమయంలో కూడా ఆంగ్లేయులు యూదులకు, అరబ్బులకు అనేక వాగ్దానాలు చేశారు. వాటిలో కొన్నిటిని బ్రిటన్ నెరవేర్చలేకపోయింది. అంతే కాకుండా, మధ్యప్రాచ్యాన్ని ఫ్రాన్స్‌తో ముందే పంచేసుకుంది.
ఈ పరిస్థితులన్నీ యూదులు, అరబ్బుల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. రెండు పక్షాల సాయుధ దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
నాజీల చేతిలో యూదుల ఊచకోత, రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూదులకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ మరింత పెరిగింది.
1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలెంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి సిఫారసు చేసింది. కానీ అరబ్బులు అందుకు సమ్మతించలేదు. ఈ వివాదాన్ని బ్రిటిష్‌వారు పరిష్కరించలేకపోయారు.
1948లో బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాతాన్ని విడిచివెళ్లిపోయిన తరువాత యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
1948, మే 14న ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. దాంతో, స్థానిక ఉద్రిక్తతలు ప్రాంతీయ విభేదాలుగా మారిపోయాయి.
మరుసటి రోజే ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్‌లు ఈ ప్రాంతంపై దాడి చేశాయి. ఇదే మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం. దీన్నే యూదుల స్వాతంత్ర్య సంగ్రామం అని కూడా పిలుస్తారు.
ఈ పోరాటం ముగిసిన తరువాత ఐక్యరాజ్యసమితి అరబ్ రాజ్యానికి సగం భూమిని కేటాయించింది. అప్పటి నుంచే పాలస్తీనియన్లకు కష్టకాలం ప్రారంభమైంది.
ఏడున్నర లక్షల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు చేతబట్టి పొరుగు దేశాలకు పారిపోయారు. కొందరిని ఇజ్రాయెల్ దళాలు బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు తరిమికొట్టాయి.
ఈ వివాదం అంతటితో ఆగిపోలేదు.
మళ్లీ 1956లో సూయజ్ కాలువ విషయంలో వివాదం ఏర్పడింది. మరోసారి ఇజ్రాయెల్, ఈజిప్ట్ ఒకదానికొకటి ఎదురు నిలిచాయి. అయితే, ఈ వివాదం యుద్ధ భూమికి ఆవలే పరిష్కారమైపోయింది.
1967లో మరోసారి అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య ఘర్షణలు చెలరేగి భారీ యుద్ధానికి దారి తీశాయి. ఆ ఏడాది జూన్ 5 నుంచి 10 వరకు జరిగిన సంఘటనల దీర్ఘకాలిక ప్రభావాలు అనేక స్థాయిలలో కనిపించాయి.
ఈ యుద్ధంలో అరబ్ దేశాల కూటమిపై ఇజ్రాయెల్ విజయం సాధించింది. గాజా స్ట్రిప్, ఈజిప్ట్‌లోని సినాయ్ ద్వీపకల్పం, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెం, గోలన్ హైట్స్ ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చాయి. ఐదు లక్షల మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు.
1973లో అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య 'యోం-కిప్పుర్' యుద్ధం జరిగింది. ఈజిప్ట్, సిరియా కలిసి ఇజ్రాయెల్‌పై దండెత్తి వచ్చాయి. ఈ యుద్ధంలో ఈజిప్ట్ సినాయ్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుంది.
1982లో ఇజ్రాయెల్ సినాయ్ ప్రాంతం నుంచి వైదొలగింది. కానీ, గాజా ప్రాంతపై పట్టు వదల్లేదు.
ఆరు సంవత్సరాల తరువాత ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్‌తో సమస్యలను పరిష్కరించుకున్న తొలి అరబ్ దేశం ఇదే.
తరువాత, జోర్డాన్ కూడా ఈజిప్ట్ బాటలో నడిచింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ స్థాపన ఎందుకు జరిగింది?
ప్రస్తుతం ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతాన్నే దేవుడు తమ పూర్వీకుడైన అబ్రహంకు, ఆయన వారసులకు ఇస్తానని వాగ్దానం చేసినట్లు యూదులు విశ్వసిస్తారు.
పూర్వం ఈ ప్రాంతంపై అసిరియన్లు (ప్రస్తుత ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియాలలో నివసిస్తున్న గిరిజనులు), బాబిలోనియన్లు, పర్షియన్లు, మాసిడోనియన్లు, రోమన్లు దాడి చేశారు.
రోమన్ పాలనలోనే ఈ ప్రాంతానికి పాలస్తీనా అనే పేరు వచ్చింది.
క్రీస్తు శకంలో ఏడు దశాబ్దాల తరువాత ఈ ప్రాంతం నుంచి యూదు ప్రజలను బహిష్కరించారు.
ఇస్లాం పెరుగుదలతో ఏడో శతాబ్దంలో పాలస్తీనా అరబ్బుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత యూరోపియన్లు దీన్ని జయించారు.
1516లో పాలస్తీనా టర్కీ ఆధీనంలోకి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్ ఆధీనంలో వెళ్లింది.
1947 సెప్టెంబర్ 3న ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ పాలస్తీనాపై తన నివేదికను జనరల్ అసెంబ్లీకి సమర్పించింది.
ఈ నివేదికలో మధ్యప్రాచ్యంలో యూదుల ప్రత్యేక రాజ్యం స్థాపించడానికి మతపరమైన, చారిత్రక కారణాలను కమిటీ అంగీకరించింది.
1917లో 'బాల్‌ఫోర్ డిక్లరేషన్'లో పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ డిక్లరేషన్‌లో పాలస్తీనాకు, యూదులకు ఉన్న చారిత్రక సంబంధాన్ని అంగీకరించారు. దాంతో, ఇక్కడ యూదుల ప్రత్యేక రాజ్యం ఏర్పాటుకు పునాది పడింది.
అయితే, అరబ్బులు, యూదుల మధ్య వివాదాలను బ్రిటన్ పరిష్కరించలేకపోవడంతో ఈ సమస్యను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది.
1947, నవంబర్ 29న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పాలస్తీనా విభజన ప్రణాళికను ఆమోదించింది. జెరూసలెంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని సిఫారసు చేసింది.
దీనికి యూదు నాయకులు సమ్మతి తెలిపినప్పటికీ, అరబ్బులు అంగీకరించలేదు కాబట్టి ఈ ప్రణాళిక ఎప్పుడూ అమలులోకి రాలేదు.
1948లో బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లిపోయిన తరువాత ఇజ్రాయెల్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది.
మరుసటి రోజే ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. ఒక సంవత్సరం తరువాత అది ఆమోదం పొందింది.
ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలలో 83 శాతం దేశాలు ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాయి. 2019 డిసెంబర్ నాటికి 193 దేశాలలో 162 ఇజ్రాయెల్‌ను గుర్తించాయి.

రెండు పాలస్తీనా భూభాగాలు ఎందుకున్నాయి?
పాలస్తీనాపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ 1947లో జనరల్ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వెస్ట్రన్ గ్యాలీ (సమారియా, జుడియా పర్వత ప్రాంతం)ను అరబ్ దేశంలో చేర్చాలని, జెరూసలెం, ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న ఇస్దుద్ తీర ప్రాంతాన్ని బయట ఉంచాలని సిఫారసు చేసింది.
అయితే 1949లో ఏర్పడిన 'అర్మిస్టైస్ రేఖ' ద్వారా పాలస్తీనా విభజన జరిగింది.
ఇజ్రాయెల్ ఏర్పడిన అనంతరం, మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తరువాత ఈ రేఖ ఏర్పడింది.
పాలస్తీనాలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ఒకదానికొకటి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ వైశాల్యం 5,970 చదరపు కిలోమీటర్లు కాగా, గాజా స్ట్రిప్ వైశాల్యం 365 చదరపు కిలోమీటర్లు.
వెస్ట్ బ్యాంక్ జెరూసలెంకు, జోర్డాన్‌కు తూర్పు భాగంలో ఉంది.
పాలస్తీనా, ఇజ్రాయెల్ కూడా జెరూసలెంను తమ రాజధానిగా ప్రకటించుకున్నాయి.
గాజా స్ట్రిప్ 41 కిలోమీటర్ల పొడవు.. 6 నుంచి 12 కిమీ వెడల్పు ఉంటుంది.
గాజా సరిహద్దు, ఇజ్రాయెల్ వెంబడి 51 కిలోమీటర్లు, ఈజిప్టు వెంబడి ఏడు కిలోమీటర్లు, మధ్యధరా తీరం వెంబడి 40 కిలోమీటర్లు ఉంటుంది.
గాజా స్ట్రిప్‌ను 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పటికీ, ఐక్యరాజ్యసమితి ఆ భూమిని ఇప్పటికీ ఆక్రమిత భూభాగంగానే పరిగణిస్తోంది. ఇక్కడి ప్రజలు, వస్తువులు, సేవలు, గాలి, నీరు, సముద్రంపై ఇంకా ఇజ్రాయెల్ నియంత్రణ ఉంది.
ప్రస్తుతం గాజా, పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ 'హమాస్' పాలనలో ఉంది. ఈ సంస్థ ఇజ్రాయెల్‌తో అనేకమార్లు పోరాడింది.
వెస్ట్ బ్యాంక్, పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ నియంత్రణలో ఉంది.
పాలస్తీనియన్ నేషనల్ అథారిటీని అంతర్జాతీయ సమాజం పాలస్తీనా ప్రభుత్వంగా గుర్తిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఎప్పుడైనా ఒప్పందం కుదిరిందా?
ఇజ్రాయెల్ ఏర్పడిన తరువాత, పాలస్తీనియన్లను అక్కడ నుంచి పంపించేసిన తరువాత గాజా, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్, సిరియా, లెబనాన్‌లలో పాలస్తీనా శరణార్థులు పెరగసాగారు.
అరబ్ దేశాలలో శరణార్థుల శిబిరాలలో పాలస్తీనా ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమానికి ఈజిప్ట్, జోర్డాన్‌ల మద్దతు లభించింది.
1967లో జరిగిన యుద్ధం తరువాత యాసర్ అరాఫత్ నేతృత్వంలోని 'ఫతా' వంటి సంస్థలు కలిసి 'పాలస్తీనా విముక్తి సంస్థ' (పీఎల్ఓ)ను ఏర్పాటు చేశాయి.
పీఎల్ఓ మొదట జోర్డాన్ నుంచి, తరువాత లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా దాడులు జరిపింది.
ఈ దాడుల్లో ఇజ్రాయెల్ లోపల, వెలుపల ఉన్న అన్ని ప్రాంతాలనూ లక్ష్యాలుగా చేసుకుంది. రాయబార కార్యాలయాలు, విమానాలు, ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంది.
ఇజ్రాయెల్‌పై పీఎల్ఓ దాడులు అనేక సంవత్సరాలపాటూ కొనసాగాయి.
చివరకు, 1993లో ఓస్లో శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, పీఎల్ఓ సంతకాలు చేశాయి.
పాలస్తీనా విముక్తి సంస్థ ఉగ్రవాదాన్ని, హింసను విడిచిపెడతామని హామీ ఇచ్చింది. ఇజ్రాయెల్ శాంతి, భద్రతల హక్కును అంగీకరించింది.
కానీ, హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు.
ఓస్లో ఒప్పందం తరువాత పాలస్తీనా నేషనల్ అథారిటీ ఏర్పడింది. ఈ అథారిటీకి అంతర్జాతీయ స్థాయిలో పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే హక్కు లభించింది.
దీనికి అధ్యక్షుడిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. అలా ఎన్నుకోబడిన అధ్యక్షుడు ప్రధానమంత్రిని, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పౌరులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే హక్కు ఈ అథారిటీకి ఉంటుంది.
అయితే, చారిత్రకంగా పాలస్తీనియన్ల రాజధానిగా పరిగణిస్తున్న తూర్పు జెరూసలెంను ఈ ఒప్పందంలో చేర్చలేదు.
జెరూసలెంకు సంబంధించి ఇప్పటికీ రెండు పక్షాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య వివాదంలో ప్రధాన అంశాలు ఏమిటి?
ఇజ్రాయెల్‌తో పాటూ పాలస్తీనా రాజ్యం కూడా ఏర్పడాలా, వద్దా? వెస్ట్ బ్యాంక్‌లో యూదుల నివాసాలను ఉంచాలా లేక తొలగించాలా? పాలస్తీనా చుట్టూ పహారా కాస్తున్న ఇజ్రాయెల్.. ఇవే అక్కడి శాంతికి భంగం కలిగిస్తున్న అంశాలు.
హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం పాలస్తీనా చుట్టూ ఇజ్రాయెల్ బిగించిన రక్షణ వలయాన్ని విమర్శించింది.
2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా, పైన చెప్పిన అంశాలు మాత్రమే కాకుండా, ఇరు పక్షాల మధ్య రాజీ కుదరని అంశాలు ఇంకా ఉన్నాయనే విషయం స్పష్టమైంది.
ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ బరాక్, పాలస్తీనా అధ్యక్షుడు యాసర్ అరాఫత్ మధ్య రాజీ కుదర్చడంలో బిల్ క్లింటన్ విఫలమయ్యారు.
పాలస్తీనియా శరణార్థుల భవిష్యత్తు ఏమిటి? జెరూసలెంను రెండు వర్గాలు పంచుకోవాలా, వద్దా? వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు మొదలైన విషయాల్లో రెండు పక్షాల మధ్య అంగీకారం కుదరలేదు.
జెరూసలెంను తమ రాజధానిగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంది.
కాగా, పాలస్తీనియన్లు తూర్పు జెరూసలెంను భవిష్యత్తు పాలస్తీనా రాజ్యానికి రాజధానిగా పేర్కొన్నారు.
గత 50 ఏళ్లల్లో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాల్లో అనేక నివాసాలను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ 6,00,000 మందికి పైగా యూదులు నివసిస్తున్నారు.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం అవన్నీ అక్రమ నివాసాలని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను అంగీకరించదు.
పాలస్తీనా శరాణార్థుల సంఖ్య ఒక కోటి కన్నా ఎక్కువగా ఉంటుందని పీఎల్ఓ చెబుతోంది. ఇందులో సగం మంది ఐక్యరాజ్యసమితిలో తమ పేరును నమోదు చేసుకున్నారు.
ఈ శరణార్థులందరికీ తమ మాతృభూమికి తిరిగి వచ్చే హక్కు ఉందని పాలస్తీనా అంటోంది. వీరు మాతృభూమిగా చెబుతున్నది ప్రస్తుత ఇజ్రాయెల్.
వీరంతా స్వదేశానికి చేరుకుంటే అక్కడ వీరి సంఖ్య పెరిగిపోయి, యూదు రాజ్యంగా ఉన్న తమ దేశ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
పాలస్తీనాకు ఒక దేశంగా గుర్తింపు ఉందా?
ఐక్యరాజ్యసమితి పాలస్తీనాను 'సభ్యత్వం లేని అబ్జర్వర్ స్టేట్' గా గుర్తిస్తుంది.
అయితే, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనే హక్కు, చర్చల ద్వారా ఐక్యరాజ్యసమితి సంస్థల్లో సభ్యత్వం పొందే అవకాశం పాలస్తీనాకు ఉంది.
2011లో పాలస్తీనా ఐక్యరాజ్యసమితిలో పూర్తి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది కానీ, అది సాకారం కాలేదు.
ఐక్యరాజ్యసమితి సభ్యత్వ దేశాల్లో 70 శాతం కన్నా ఎక్కువ దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఇజ్రాయెల్‌కు ఎందుకు మద్దతిస్తుంది? పాలస్తీనాకు ఎవరి మద్దతు ఉంది?
అమెరికాలో ఇజ్రాయెల్ అనుకూల లాబీలు ఉన్నాయి. అమెరికా ప్రజలు కూడా ఇజ్రాయెల్‌కు మద్దతిస్తారు. అందువల్ల ఏ అమెరికా అధ్యక్షుడైనా వాస్తవంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఉపసంహరించడం అసాధ్యం.
అంతే కాకుండా, ఈ రెండు దేశాలు మిలటరీపరంగా మిత్రదేశాలు.
ఇజ్రాయెల్ అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు, డబ్బు రూపంలో అత్యధిక సహాయం పొందింది.
అయితే, 2016లో భద్రతా మండలి, ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల గురించి ఓటింగ్ నిర్వహించినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తమ వీటో అధికారాన్ని ఉపయోగించలేదు.
డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఈ రెండు దేశాల మధ్య స్నేహం కొత్త ఊపిరి పోసుకుంది.
అమెరికా తన రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలెంకు తరలించింది. దీంతో, జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించిన తొలి దేశం అమెరికా అయింది .
ట్రంప్ తన పదవీకాలం చివర్లో ధనిక అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలను మెరుగుపరచడంలో సఫలమయ్యారు.
జో బైడెన్ అధికారం చేపట్టిన తరువాత ఇజ్రాయెల్, పాలస్తీనాతో ఘర్షణలకు దూరంగా జరిగే వ్యూహాన్ని అవలంబించింది.
బైడెన్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి భారీ రాజకీయ మూలధనం అవసరమని విశ్వసిస్తోందని, అంత ప్రయత్నం చేసిన తరువాత కూడా కచ్చితంగా పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం లేదని భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు కొనసాగిస్తోందిగానీ బైడెన్ ప్రభుత్వం ఈ విషయంలో ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తోంది.
ఏది ఏమైనా, తాజా ఘర్షణల నేపథ్యంలో బైడెన్ తన ప్రభుత్వంలోని వామపక్ష వాదుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. వీరంతా ఇజ్రాయెల్‌ను తీవ్రంగా విమర్శిస్తారు.
మరోవైపు, ఈజిప్ట్, సిరియా, ఇరాన్ సహా పలు అరబ్ దేశాలు పాలస్తీనాకు మద్దతు ఇస్తాయి. అరబ్ దేశాల్లో పాలస్తీనియన్ల పట్ల సానుభూతి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
శాంతికి మార్గమేమిటి? దీనికోసం ఏం చేయాలి?
ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొనాలంటే ఇజ్రాయెల్, హమాస్ సహా పాలస్తీనియన్ల సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని నిపుణులు భావిస్తున్నారు.
గాజా నిర్బంధానికి ముగింపు పలకాలి. వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంలో ఆంక్షలు ఎత్తివేయాలి.
శాశ్వత శాంతి కోసం పాలస్తీనియన్లు హింసను విడిచిపెట్టాలి. ఇజ్రాయెల్‌ను అంగీకరించాలి.
సరిహద్దులు, యూదుల సెటిల్మెంట్లు, పాలస్తీనా శరణార్థులు స్వదేశానికి తిరిగి రావడం మొదలైన అంశాలపై రెండు పక్షాలూ ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి.
ఇవి కూడా చదవండి:
- జెరూసలెం.. ఎందుకంత పవిత్రం? ఎందుకంత వివాదాస్పదం?
- గాజా: అక్కడ బతుకు నిత్య నరకం
- 'రాత్రంతా కంటి మీద కునుకు లేదు.. పిల్లలకు ఏం చెప్పాలి'.. ఇజ్రాయెల్, గాజా ఘర్షణలకు తల్లడిల్లుతున్న తల్లులు
- జెరూసలెంలో భారత సంతతి సంగతేంటి?
- ఇజ్రాయెల్, పాలస్తీనా: కొత్త హింసను ప్రేరేపిస్తున్న పాత గాయాలు
- అజర్బైజాన్, అర్మేనియాల మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది? చరిత్రలో అసలేం జరిగింది?
- సూయజ్ కాలువ: ఆరు రోజుల యుద్ధం వల్ల ఎనిమిదేళ్లు ఎలా మూతపడింది... మళ్లీ ఎలా తెరుచుకుంది?
- ఇరాన్ అణు శాస్త్రవేత్తలు వరుసగా ఎందుకు హత్యకు గురవుతున్నారు? ఇది ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఆపరేషనా?
- ఇజ్రాయెల్ నుంచి యూఏఈకి 'శాంతి విమానం'.. పాలస్తీనియన్ల అసంతృప్తి
- సౌదీ అరేబియాను పాకిస్తాన్ నుంచి భారత్ తనవైపు లాగేసుకుందా?
- ఫఖ్రిజాదేను హత్య చేసింది ఇజ్రాయెలే.. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్ అధ్యక్షుడు
- ఇజ్రాయెల్-గాజా: హమాస్ మిలిటెంట్ల మృతి, రాకెట్లతో దద్దరిల్లిన ఇజ్రాయెల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








