అమితాబ్ బచ్చన్: పాత సినిమాల రీళ్లను సంరక్షించేందుకు తపిస్తున్న సూపర్ స్టార్

ఫొటో సోర్స్, FILM HERITAGE FOUNDATION
పశ్చిమ ముంబయిలోని తన ఇంట్లో ప్రత్యేకంగా ఓ ఎయిర్ కండీషన్డ్ గదిని ఏర్పాటు చేసిన సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, తాను నటించిన 60 సినిమాల రీళ్లను అందులో భద్రపరిచారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు.
ఐదేళ్ల కిందట అమితాబ్ బచ్చన్ ఆ సినిమాలన్నింటినీ ముంబయిలోని ఓ ఫిల్మ్ ఆర్కైవ్ కంపెనీకి అప్పగించారు. శివేంద్ర సింగ్ దుంగార్పుర్ ఆధ్వర్యంలోని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ పాత సినిమాలను భద్రపరిచే కార్యక్రమానికి పూనుకుంది.
శివేంద్ర సింగ్ దుంగార్పుర్ సినిమాల నిర్మాణంతోపాటు, సినిమాలను భద్రపరిచే కార్యక్రమంలో చురుకుగా పని చేస్తుంటారు. ఆయన ఏర్పాటు చేసిన ఆర్కైవ్ టెంపరేచర్ కంట్రోల్‌లాంటి ఆధునిక సదుపాయాలతో పని చేస్తుంటుంది.
"ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ అంతర్జాతీయ ప్రమాణాలున్న సంస్థ" అని దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ మెచ్చుకున్నారు. అమితాబ్ బచ్చన్ దీనికి బ్రాండ్ అంబాసిడార్.
పాత సినిమా ప్రింట్లను రక్షించడానికి అమితాబ్ బచ్చన్ ఏళ్ల తరబడి కృషి చేస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది 'ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్' అవార్డు ఆయనకు దక్కింది.
దర్శకులు క్రిస్టొఫర్ నోలన్, మార్టిన్ స్కోర్సెసె చేతుల మీదుగా అమితాబ్ ఈ అవార్డును అందుకుంటారు. క్రిస్టొఫర్, మార్టిన్‌లతోపాటు ఇంగ్మర్ బెర్గ్‌మన్, ఏగ్నెస్ వార్దా, జీన్ లుక్ గొడార్ట్‌లాంటి సినీ ప్రముఖులు గతంలో ఈ అవార్డును అందుకున్నారు.

ఫొటో సోర్స్, FILM HERITAGE FOUNDATION
పాత సినిమాలు-అమితాబ్
"పాత సినిమాలను భద్రపరిచే విషయంలో అమితాబ్ ఎంతో శ్రమించారు" అన్నారు దుంగార్పూర్. సినిమా ప్రింట్‌లు పాడైపోవడంతో దిలీప్ కుమార్‌లాంటి పాత తరం నటుల సినిమాలలో కొన్నింటి తాను చూడలేకపోయానని అమితాబ్ బాధపడుతుంటారు" అని దుంగార్పూర్ వెల్లడించారు.
భారతదేశంలో బాలీవుడ్ సహా పది సినిమా పరిశ్రమలున్నాయి. 36 భాషలలో ఏటా దాదాపు 2000 సినిమాలు నిర్మిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా ఇండస్ట్రీగా భారతీయ చిత్ర పరిశ్రమ నిలిచింది.
అయితే ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉన్నా, కేవలం రెండంటే రెండే సినిమా ఆర్కైవ్ సంస్థలు పని చేస్తున్నాయి. ఇందులో పుణెలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫిల్మ్ ఆర్కైవ్ సంస్థ ఒకటికాగా, దుంగార్పూర్ నేతృత్వంలో పని చేస్తున్న సంస్థ రెండోది.
"మనకున్న పరిశ్రమతో పోల్చినప్పుడు ఇవి ఏ మాత్రం సరిపోవు" అన్నారు దుంగార్పుర్.

ఫొటో సోర్స్, FILM HERITAGE FOUNDATION
పాత సినిమాలు ఏమైపోతున్నాయి?
దేశంలో తయారైన అనేక సినిమాలు దొరక్కుండా పోవడడానికి, పాడైపోవడానికి సరైన సంరక్షణ పద్ధతులు లేకపోవడమే కారణం. భారతదేశపు మొదటి టాకీ సినిమా 'ఆలంఆరా'(1931), తొలి దేశీయ కలర్ సినిమా 'కిసాన్ కన్య' (1937) ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదు.
కొత్త సినిమాల పరిస్థితి కూడా అంత మెరుగ్గా ఏమీ లేదు. స్వాతంత్ర పోరాట యోధురాలు లక్ష్మీ సెహగల్‌పై సాయి పరంజిపే 1977లో నిర్మించిన డాక్యుమెంటరీ, శ్యామ్ బెనగల్ నిర్మించిన భారత్ ఏక్ ఖోజ్ (1988) ఇప్పుడు అందుబాటులో లేవు.
2009లో నిర్మించిన మగధీర సినిమా నెగెటివ్ ఆరేళ్లలోనే కనిపించకుండా పోయిందని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెలిపారు.
భారతదేశంలో తయారైన 1,138 మూకీ చిత్రాలలో కేవలం 29 మాత్రమే అందుబాటులో ఉన్నాయని దుంగార్పుర్ వెల్లడించారు. 1931-1950 మధ్య అప్పటి బాంబేలో తయారైన 2000 సినిమాలలో దాదాపు 80% చిత్రాల ప్రింట్లు ఇప్పుడు దొరకడం లేదు.
గత ఏడాది ముంబయిలోని ఓ గోడౌన్‌లో బస్తాలలో కట్టి మూలన పడేసి ఉన్న 200 సినిమాలను దుంగార్పుర్ బృందం గుర్తించి సేకరించింది.
"అందులో కొన్ని సినిమా ప్రింట్లు, కొన్ని నెగెటివ్‌లు ఉన్నాయి. ఎవరో సింపుల్‌గా వాటిని అక్కడ పడేశారు" అన్నారు దుంగార్పుర్.
ఇవి మాత్రమే కాదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫిల్మ్ ఆర్కైవ్స్‌లో సుమారు 31,000 రీళ్లు పాడైపోవడమో, కనిపించకుండా పోవడమో జరిగిందని అధికారులే చెబుతున్నారు.

ఫొటో సోర్స్, FILM HERITAGE FOUNDATION
అగ్నికి ఆహుతి
2003లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రభుత్వ ఆర్కైవ్‌లో ఉన్న సుమారు 600 సినిమాలు దెబ్బతిన్నాయి. 1913నాటి తొలి భారతీయ మూకీ చిత్రం 'రాజా హరిశ్చంద్ర'కు సంబంధించి అప్పటి వరకు అందుబాటులో ఉన్న కొన్ని ఒరిజినల్ రీళ్లు కూడా ఈ దెబ్బతిన్న వాటిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
"మనం గతాన్ని గౌరవించాలి. అలా చేయాలంటే అలనాటి సినిమాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి" అన్నారు దర్శకుడు గౌతమ్ ఘోష్.
డిజిటల్ యుగం రాక ముందు సినిమా నెగెటివ్‌లను భద్రపరిచేవాళ్లు. ఆ నెగెటివ్‌ల డూప్లికేట్లతో తీసిన ప్రింట్లను ప్రదర్శనకు ఇచ్చేవారు.
అయితే 2014 నుంచి చాలా సినిమాలను రీళ్ల మీద చిత్రించడం మానేశారు. తమ లేబరేటరీలన్నీ డిజిటైజ్ అయ్యాక, చాలామంది నిర్వాహకులు తమ దగ్గరున్న పాత నెగెటివ్‌లను ఎందుకూ పనికి రానివిగా భావించి పారేశారని దుంగార్పుర్ అన్నారు. "కెమెరాతో తీసిన ఒరిజినల్ నెగెటివ్‌లు ఇప్పుడు వస్తున్న డిజిటల్ ఫిల్మ్‌కన్నా ఎక్కువ రిజల్యూషన్‌తో ఉంటాయి. కానీ అది వారికి తెలియదు" అన్నారు దుంగార్పుర్.
ప్రస్తుతం ఎక్కువమంది సినిమా ప్రిజర్వేటర్లు(సంరక్షకులు) ప్రధానంగా సినిమా ప్రింట్లను సంరక్షించడంపైనే దృష్టి పెట్టారు.
"చాలా నష్టం జరిగిపోయింది. సినిమా, దాని చరిత్ర మీద అవగాహన కలిగించడానికి మేం చాలా ప్రయత్నించాం" అన్నారు దుంగార్పుర్.

సంరక్షణపై ప్రత్యేక దృష్టి
గత ఆరేళ్లుగా దుంగార్పుర్ పాత సినిమాలను సంరక్షించడం,పునరుద్ధరించడంపై భారతదేశ వ్యాప్తంగా 300మందికి శిక్షణ ఇచ్చారు. అనేక వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఆయన బృందంలో ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్,మ్యూజియమ్‌ల సంరక్షణలో పనిచేసిన నిపుణులు ఉన్నారు.
ముంబయిలోని ఆ సంస్థ కార్యాలయంలో భారతదేశ వ్యాప్తంగా తయారైన సినిమాలలో టాప్-500 సినిమాలను ఇక్కడ భద్రపరిచారు.
ఇందులో ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే, ఇటాలియన్-అమెరికన్ డైరక్టర్ ఫ్రాంక్ కాప్రా నిర్మించిన అరుదైన రెండు 16ఎంఎం సినిమాలు కూడా ఉన్నాయి. ఇవికాక అనేక సినిమా ఫొటోలు, ఫొటో నెగెటివ్‌లు, పోస్టర్లను కూడా దుంగార్పుర్ భద్రపరిచారు.
సినిమాలను భద్రపరచాల్సిన అవసరాన్ని అమితాబ్ బచ్చన్ తరచూ ప్రస్తావిస్తుంటారు. "భారతీయ సినిమాకు మా తరానికి చెందిన మహామహులు ఎంతో సేవ చేశారు. కానీ వారి చాలా చిత్రాలు కాలిపోవడమో, పాడైపోవడమో, చెత్తకుప్పల్లోకి వెళ్లడమో దురదృష్టకరం." అని రెండేళ్ల కిందట కోల్‌కతాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అమితాబ్ వ్యాఖ్యానించారు.
"భారతీయ సినీ వారసత్వం మనకు చాలా కొద్దిగానే మిగిలింది. ఉన్నదాన్ని కూడా జాగ్రత్తపడి కాపాడుకోకపోతే, మన ముందు తరాలు చిత్రించిన మన జీవితాలు మరో వందేళ్ల తర్వాత కనిపించకుండా పోతాయి"అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు... అమరావతి భూముల సేకరణపై విచారణకు రావాలని ఆదేశం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








