బాలీవుడ్ డాన్స్ మాస్టర్ 'ఏక్ దో తీన్..' ఫేమ్ సరోజ్ ఖాన్ మృతి...

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి చెందారు.
శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆమెను జూన్ 17వ తేదీన ముంబయి, బాంద్రా ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారని, శుక్రవారం తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్‌తో ఆమె చనిపోయారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
72 ఏళ్ల సరోజ్ ఖాన్ అసలు పేరు నిర్మలా కిషన్ సింగ్ సాధూసింగ్ నాగ్‌పాల్. ఆమెకు భర్త సోహన్ లాల్, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు బాలీవుడ్‌లో ఆమె 2 వేలకు పైగా పాటలకు డాన్స్ స్టెప్పుల్ని అందించించారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
మూడుసార్లు జాతీయ అవార్డులను అందుకున్న ఆమె మాధురీ దీక్షిత్ సహా పలువురు బాలీవుడ్ హీరోయిన్లకు చిరకాలం గుర్తుండిపోయే నృత్య రీతులను అందించారు.
మూడేళ్లకు బాలీవుడ్ ఎంట్రీ.. పదేళ్లకు గ్రూప్ డాన్సర్
ఒకసారి ఆమె బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్ లివింగ్ లెజెండ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తన జీవిత విశేషాలను ఆమె బీబీసీతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
నేను ముంబయిలో పుట్టాను. నా తల్లిదండ్రులు పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
మూడేళ్ల వయసప్పుడే బాలీవుడ్‌లో నా ప్రస్థానం మొదలైంది. మాది చాలా సంప్రదాయ కుటుంబం. మా కుటుంబంలో పిల్లల్ని డాన్సింగ్, యాక్టింక్ స్కూళ్లకు పంపించేవాళ్లు కాదు.
అయితే, డాన్స్ చేయాలని నాకు చాలా ఇష్టంగా ఉండేది. నా తీరు చూసి మా అమ్మకు అనుమానం వచ్చింది. నాకు ఏదో పట్టుకుందని మా అమ్మ అనుమానించి నన్ను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. అన్నీ వివరంగా చెప్పాక డాక్టర్ ‘ఆమెకు డాన్స్ చేయాలని ఉంటే చేయనివ్వొచ్చు కదా’ అన్నారు. ‘మాకు ఎవ్వరూ తెలియదు’ అన్నారు మా అమ్మ. ‘నాకు చాలామంది నిర్మాతలు తెలుసు. నేను వారికి చెబుతాను’ అన్నారు ఆ డాక్టర్.
ఆయన తన మాట నిలబెట్టుకున్నారు. నాకు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. శ్యామ (ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్)కు చిన్నప్పటి పాత్ర వేయాలని చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/airnewsalerts
‘ఏంటీ.. ఈ పిల్ల దగ్గర నేను డాన్స్ నేర్చుకోవాలా?’
అప్పటి నుంచి నాకు వరుసగా వేషాలు వచ్చాయి. 10 ఏళ్లకు నేను గ్రూప్ డాన్సర్ అయ్యాను. రెండేళ్లకు ప్రముఖ కొరియోగ్రాఫర్లు హీరాలాల్, సోహన్‌లాల్ తమ అసిస్టెంట్‌గా నన్ను నియమించుకున్నారు.
అసిస్టెంట్‌గా నేను పనిచేసిన తొలి చిత్రం కాలేజ్ గర్ల్. షమ్మీకపూర్ హీరో, వైజయంతిమాల హీరోయిన్.
వైజయంతిమాలకు నృత్యరీతుల్ని చెప్పడం, చేయించడం అంటే నాకు వణుకుపుట్టింది.
ఆమె కూడా చాలా కోపం తెచ్చుకున్నారు. ‘నేను ఈ పిల్ల దగ్గర డాన్స్ నేర్చుకోవాలా?’ అని ఆమె డాన్స్ మాస్టర్‌తో అన్నారు. అందుకు ఆయన బదులిస్తూ.. ‘ఆ పిల్లలాగా నువ్వు డాన్స్ చేయగలిగితే.. ఇక ఆమె వద్ద నేర్చుకోవాల్సిన పనిలేదు అని నేనే చెబుతా’ అన్నారు.
ఒకసారి డాన్స్ మాస్టర్ యూరప్ వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఒప్పుకున్న సంగం సినిమాకు నేను కొరియోగ్రఫీ చేయాల్సి వచ్చింది. ‘డాన్స్ మాస్టర్ అందుబాటులో లేరు కాబట్టి ఆయన అసిస్టెంట్‌గా నువ్వే కొరియోగ్రఫీ చేయాలి’ అని నిర్మాతలు అన్నారు.
నేను ఎలా చేయగలను. నాకప్పుడు 13 ఏళ్లే. ఇంతకుముందెప్పుడూ నా అంతట నేనుగా కొరియోగ్రఫీ చేయలేదు. మా డైరెక్టర్ పీఎల్ సంతోషీ. ఆయన చాలా నమ్మకం ఉంచారు నాపైన. అలా నా మొదటి పాట ‘నిగాహై మిలానేకో..’కు కొరియోగ్రఫీ చేశాను. అందులో నటించాను కూడా. ఈ పాటలో హీరోయిన్ నూతన్, హీరో రాజ్‌కపూర్.
అప్పట్లో మహిళా కొరియోగ్రాఫర్‌ను తీసుకునేందుకు ఎవ్వరూ సిద్ధంగా ఉండేవాళ్లు కాదు. కెమెరా గురించి, లెన్సుల గురించి ఆమెకేం తెలుస్తుంది? అనే భావనలో ఉండేవాళ్లు.
అయితే నేను ‘గీతా మేరా నామ్’ పాట చేసిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. ఆ పాట అంత సక్సెస్ తెచ్చింది.

ఫొటో సోర్స్, facebook/MadhuriDixitNene
‘అలా.. బాలీవుడ్‌లో మళ్లీ పుట్టా’
ఆ తర్వాత హేమ మాలిని (ప్రముఖ హీరోయిన్) నన్ను సిఫార్సు చేయడం మొదలు పెట్టారు. తర్వాత ధర్మేంద్ర కూడా నాకు చాలా చిత్రాల్లో పనిచేసే అవకాశం కల్పించారు.
స్వతంత్రంగా నేను కొరియోగ్రఫీ చేసిన తొలి చిత్రాలు ‘మా, కస్తూరీ, మేరీ అప్నే’. అప్పట్లో హేమమాలినితో నేను చేసిన మరపురాని చిత్రం ‘మృగ్ తృష్ణ’. అందులో ఆమె అప్సర. స్వర్గం నుంచి దిగివస్తూ నృత్యం చేస్తుంది. ఒక పిచ్చిపట్టిన వ్యక్తి ఆమెను చూస్తాడు.
భారతీయ చిత్రాల్లో పాటలు, నృత్యాలు చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఆ మార్గంలోనే పెరిగాం. మనిషి పుట్టినా, చనిపోయినా మనకు పాటలు వినిపిస్తాయి. నృత్యం చేయడం అనేది మన సంప్రదాయంగా మారిపోయింది.
ఇలా నేను చాలాకాలం పాటు కొరియోగ్రాఫర్‌గా పనిచేసినా బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని వ్యక్తినే.
అలాంటి సమయంలో ఉన్నట్టుండి ఒకరోజు సుభాష్‌ఘాయ్ నుంచి ఫోన్ వచ్చింది. విధాత అనే సినిమాలో ఒక పాటకు నృత్యం అందించాలని ఆయన కోరారు. అయితే, ఆయన కోరిన రెండు పాటలకు నేను కొరియోగ్రఫీ చేయలేకపోయాను. మూడో పాటకు మాత్రం చేశాను.
తర్వాత ఆయన చిత్రం హీరోలో కూడా కొరియోగ్రఫీ చేయాలని కోరారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. నా డాన్స్ మూమెంట్లకు కూడా పేరొచ్చింది. దీంతో నేను బాలీవుడ్‌లో మళ్లీ పుట్టాననిపించింది. ఆ సినిమాలో కొత్తగా వచ్చిన జాకీష్రాఫ్ నటించారు.
‘మాధురీ దీక్షిత్ కంటే గొప్ప డాన్సర్ మీనాక్షి’
అందకు ముందు నా డాన్స్ మూమెంట్లు బాగాలేవని కొందరు చెప్పేవాళ్లు. నేను నిశ్శబ్దంగా ఏడ్చేదానిని. నన్ను నేను నిరూపించుకోవాలి అని సర్ది చెప్పుకునే దానిని.
అలాంటి సమయంలో హీరో సినిమాలో జాకీష్రాఫ్‌కు ఒక డాన్స్ మూమెంట్ కొరియోగ్రఫీ చేశాను. నక్లెస్‌ను తీసే స్టెప్ అది. జాకీష్రాఫ్ చాలాబాగా చేశారు. దీంతో నేను అతన్ని అభినందిస్తూ, దేవానంద్‌తో పోలుస్తూ సుభాష్ ఘాయ్ దగ్గర ఒక మాట అన్నాను. జాకీష్రాఫ్ జీవితాంతం నన్ను ఆ మాట గుర్తు చేస్తూ ఆటపట్టించాడు. నన్ను అమ్మా అని పిలిచేవాడు.
ఆర్టిస్టులకు హృదయం ఉంటుందని నమ్మిన వ్యక్తి జాకీష్రాఫ్. సినిమా షూటింగుల్లో పనిచేసే టెక్నీషియన్లు, ఇతర సిబ్బందితో కూర్చుని బీడీలు కాల్చేవాడు. టీలు, లస్సీలు ఇచ్చేవాడు. ‘వాళ్లు మా కంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు’ అనేవాడు.
నేను పనిచేసిన వాళ్లలో మీనాక్షి గొప్ప డాన్సర్. మాధురీ దీక్షిత్ కన్నా కూడా, ఇంకెవరికన్నా కూడా మీనాక్షియే గొప్ప డాన్సర్. అయితే, మాధురీ దీక్షిత్ తన డాన్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తుంది. అలా గొప్ప హావభావాలు పలికిస్తుంది. కానీ, మీనాక్షి లెక్కల మాస్టారులాగా లెక్కలు వేసుకుని డాన్స్ చేస్తుంది. హావభావాల విషయంలో ఆమెను మార్చలేం.

ఫొటో సోర్స్, facebook/MadhuriDixitNene
‘శ్రీదేవితో పరిచయం, మాధురీ దీక్షిత్ హీరోయిన్‌గా ఎంట్రీ’
శ్రీదేవితో నా అనుబంధం గురించి చెప్పాలి. ఒకరోజు నేను నిద్రపోతున్నాను. ఒక కెమెరామెన్ వచ్చి.. ‘ఏం నిద్రపోతావులే కానీ, ఆ హిమ్మత్ వాలా అమ్మాయిని చూడు. డాన్స్ అదరగొట్టేసింది’ అన్నాడు.
నేను నా కూతుర్ని తీసుకుని సినిమాకు వెళ్లాను. అందులో శ్రీదేవిని చూసి.. ‘ఇలాంటి అమ్మాయితో నేను డాన్స్ చేయించాలి’ అని నా కూతురితో అన్నాను.
ఇంటికి వచ్చాక సుభాష్ ఘాయ్ నుంచి ఫోన్ వచ్చింది.. కర్మ సినిమాలో శ్రీదేవితో డాన్స్ చేయించాలని చెప్పారు. నా చేతిలోని ఫోన్ కిందపడిపోయింది. నేను అప్పుడే కోరుకున్నా, ఇంత త్వరగా నా కోరిక నెరవేరుతుందనుకోలేదు.
కానీ,‘ శ్రీదేవి నా దగ్గర డాన్స్ నేర్చుకుంటుందా? ఆమె మద్రాస్ మాస్టర్ల దగ్గర నేర్చుకుంటుంది కదా’ అని సుభాష్ ఘాయ్‌ను అడిగాను. ‘నీకేం తక్కువ. నువ్వు ముక్త ఆర్ట్స్ కదా. నువ్వు రెడీ అవ్వు’ అన్నారు.
అందులో ఒక పాటలో.. ముందు ఒక అమ్మాయి నలుగురి ముందూ డాన్స్ చేస్తుంటుంది. శ్రీదేవి, జాకీష్రాఫ్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయిని చూసి తర్వాత ఊహల్లోకి వెళ్లి పాటపాడుతూ డాన్స్ చేస్తారు. ఇదీ నా ఆలోచన.
ఆ అమ్మాయిగా ఎవరిని పెట్టాలి అని అడిగితే ‘ఎవరో ఒకర్ని పెట్టేయ్’ అని సుభాష్ ఘాయ్ అన్నారు.
అలా ‘ఆవారా బాప్’ చిత్రంలో రాజేశ్ ఖన్నా కొడుకు గర్ల్ ఫ్రెండ్‌గా నటిస్తున్న మాధురీ దీక్షిత్‌ను చూసి నేను ఆమెను ఈ పాటలో పెట్టాను.
ఆమెకు శిక్షణ ఇచ్చి, కశ్మీరు తీసుకెళ్లి పాటలో నటింపచేశాను.
అప్పుడు సుభాష్ ఘాయ్ ఆమెను చూసి నాతో ఇలా అన్నారు. ‘ఆ అమ్మాయి వాళ్ల అమ్మకు చెప్పు.. ఆరు నెలల పాటు ఆమెను ఏ సినిమాలోనూ నటించకుండా చూడమని. నేను ఆమెకు బ్రేక్ ఇస్తా’. నేను సరే అన్నాను.
నా జీవితంలోకి శ్రీదేవి, మాధురీ దీక్షిత్ ఇద్దరూ 1985 సంవత్సరంలో కర్మ సినిమా ద్వారా అడుగుపెట్టారు.
సుభాష్ ఘాయ్ చెప్పినట్లు నేను మాధురీ దీక్షిత్ తల్లికి చెప్పాను. ఆయన అన్నట్లుగానే ఉత్తర్ దక్షిణ్ సినిమాతో మాధురీకి బ్రేక్ ఇచ్చారు. అందులో హీరో జాకీష్రాఫ్.
కర్మ సినిమాలో మాధురీ దీక్షిత్ నటించిన పాట సన్నివేశాలను సుభాష్ ఘాయ్ తొలగించేశారు. ఆమెను ఎవరికీ అలా చూపించకూడదనే ఉద్దేశంతో.
శ్రీదేవితో చాలా పాటలు చేశాను. అయితే, కామెడీలో ఆమె దిట్ట. అలా చాల్‌బాజ్ సినిమాలో ‘నాజానే కహాసే ఆయీ హై’ కామెడీ పాటకు ఆమెతో డాన్స్ చేయించాను. అదే నా ఫేవరెట్.
ఆ తర్వాత నగీనా సినిమాలో ‘మే తేరీ దుష్మన్’ పాటకు ఆమె అద్భుతంగా నృత్యం చేసింది.
యష్ చోప్రా చాలా ఫ్లాపులతో, దిగాలుగా ఉన్న సమయంలో నేను ఆయనతో చాందిని సినిమా కోసం పనిచేశాను. అందులో శ్రీదేవి నటించిన ‘చాందినీ మేరే చాందినీ’ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అన్ని పెళ్లిళ్లలోనూ ఆ పాట పాడేవాళ్లు.
ఆ తర్వాత యష్ చోప్రాతో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, వీర్ జారా వంటి చాలా సినిమాలకు పనిచేశాను.

ఫొటో సోర్స్, Getty Images
ఏక్ దో తీన్ పాట వెనుక కథ ఇదీ..
ఒక పాట నా జీవితాన్ని మార్చేసింది. ఆ పాటతోనే నేను ప్రజల్లో పాపులర్ అయ్యాను.
అప్పటి వరకూ ఫిల్మ్‌ఫేర్ అవార్డును మాకు (కొరియోగ్రాఫర్లకు) ఇచ్చేవాళ్లు కాదు.
మూడు గంటల సినిమాలో కొరియోగ్రాఫర్ల పాత్ర 15 నిమిషాలు మాత్రమే. మహా అయితే ఆరు పాటలకు నృత్యాలు సమకూరుస్తారు. ఒక పాట, డాన్స్ వల్ల సినిమా హిట్ కాదు అనేది అప్పటి వాదన.
మేం అప్పట్లో ధర్నా చేశాం కానీ మా ధర్నా భగ్నమైంది.
తేజాబ్ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ దానికి సంగీత దర్శకులు. జావేద్ ఇంకా పాట ఇవ్వకపోవడంతో లక్ష్మీకాంత్ తన ట్యూన్ హమ్ చేస్తూ కూర్చున్నారు. సడెన్‌గా ‘ఏక్ దో తీన్’ అంటూ హమ్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఎన్ చంద్ర కల్పించుకుని ‘నాకు లిరిక్ వద్దు నంబర్లే కావాలి’ అన్నారు.
నంబర్లతో ఎలా పాట పాడాలి? అంటే నాకు నంబర్లే కావాలని అని నెలరోజులకు పైగా పట్టుపట్టారు. దీంతో జావేద్ అలాగే పాట రాశారు.
‘ఏక్ దో తీన్’ పాటను అప్పట్లో జాతీయ గీతం పాడినట్లు దేశంలోని జనమంతా పాడారు.
ఆ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ చేసింది నేనే. ఇక అప్పట్నుంచి నేను కూడా వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఆ పాటకు మాధురీ దీక్షిత్ 17 రోజులు ప్రాక్టీస్ చేసింది.
ఒక పాట వల్ల సినిమా ఆడదన్న వాళ్లంతా తమ అభిప్రాయాలు మార్చుకునేలా చేసిన పాట అది. అదే నాకు 1988లో మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చింది. చాల్‌బాజ్ సినిమాలో ‘నాజానే కహాసే ఆయీ హై’ పాటకు కూడా 1989లో నాకు మరొక ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. 1990లో కూడా కూలీ సినిమాలో మాధురీ నటించిన పాట ‘ఆజ్ ముఖ్‌కో హై ఇంతజార్’కు కూడా ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. ఇలా వరుసగా మూడు ఏళ్లు బాలీవుడ్‌లో ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న కొరియోగ్రాఫర్‌గా నా పేరు రికార్డులకెక్కింది.
చోళీకే పీచే క్యాహై వెనుక కథ ఇదీ..
ఆ తర్వాత సుభాష్ ఘాయ్ చోళీకే పీచే క్యాహై లిరిక్‌తో వచ్చారు. ఈ పాటపై చాలా వివాదాలు వచ్చాయి.
ఆయన నన్ను ఆఫీసుకు పిలిపించారు. ‘నా దగ్గర ఒక పాట ఉంది. అది నన్ను తొక్కేయొచ్చు, పైకి లేపొచ్చు’ అన్నారు.
ఆ పాట విన్నాక నేను.. ‘సుభాష్ జీ మీరు ఇలా ఎలా చేయగలరు?’ అన్నాను.
ఇదేమీ వల్గర్ సాంగ్ కాదని, ఇదొక రాజస్థానీ జానపథ పాట అని ఆయన చెప్పారు.
‘ఈ పాట గురించి ప్రజలు సానుకూలంగా ఆలోచించేలా చెయ్యి’ అని ఆయన నాకు సూచించారు.
అలా ఈ పాటను వ్యతిరేకంగా చూడకుండా, పాట గురించి పట్టించుకోకుండా.. కేవలం నృత్యాన్ని మాత్రమే చూసేలా నేను కొరియోగ్రఫీ చేశాను.
ఈ పాటలో చాలా స్టోరీ ఉన్నప్పటికీ, మెలొడీ ఉన్నప్పటికీ నా నృత్యానికి పేరొచ్చింది. అవార్డు కూడా వచ్చింది.

ఫొటో సోర్స్, DEVDAS @EROS PICTURE
మాధురీతో నేను చాలా పాటలకు పనిచేశాను. తను నాకు కూతురులాంటిది. నేను తనపైనే దృష్టి పెట్టలేదు. కానీ, ఆమెతో పనిచేసిన పాటలన్నీ హిట్ అయ్యాయి.
దేవదాస్ సినిమాలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్‌లకు ఒకే పాటలో నృత్యం కంపోజ్ చేయడానికి నేను భయపడ్డాను. వాళ్లు ఇద్దరిలో ఏ ఒక్కరికి తక్కువగా అనిపించినా నన్ను నిందిస్తారని. కానీ, వాళ్లు చాలాబాగా అర్థం చేసుకున్నారు. ఐశ్వర్యారాయ్‌కు మాధురీ దీక్షిత్ సలహాలు ఇచ్చేది.
ఆ పాట ‘డోలారే డోలా’. దీనికి జాతీయ అవార్డుతో సహా మొత్తం 17 అవార్డులు వచ్చాయి.
నేను పనిచేసిన గొప్ప డాన్సర్ అయిన హీరోయిన్ గురించి ఇంతకు ముందే చెప్పాను. ఇక హీరోల గురించి చెప్పాలంటే.. అతడు గోవిందా. డాన్స్ మూమెంట్ల విషయంలోనే కాదు హావభావాల విషయంలోనూ అతడు బాగా చేస్తాడు.
ప్రజలు ముఖాన్నే చూస్తాను. కాబట్టి చక్కటి హావభావాలు పలికిస్తే సగం విజయం సాధించినట్లే.
హృతిక్ రోషన్ గొప్ప డాన్సర్ అన్న విషయాన్ని నేను కాదనట్లేదు, కానీ హావభావాల విషయంలో మాత్రం అతను గోవిందా కంటే వెనుకబడే ఉన్నాడు. హృతిక్‌తో నేను అగ్నిపథ్ సినిమాలో గుణ్‌గుణా పాటకు పనిచేశాను. చిన్న స్టెప్ అయినా కూడా బాగా చేశాడు.
నా ఆల్ టైమ్ ఫేవరెట్ డాన్స్ మూమెంట్ ఉన్న పాట ‘ఇడ్లీదో ఇడ్లీదో’. నా కూతురు కూడా నాతో పనిచేసింది. మాధురీకి కొన్ని మూమెంట్లు చెప్పింది.
నేను చనిపోయిన తర్వాత దేవుడు నన్ను ‘మళ్లీ ఏం చేయాలనుకుంటున్నావు? ఎక్కడికి వెళతావు’ అంటే కనుక మళ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీకే వెళతాను అని చెబుతా.
ఇవి కూడా చదవండి:
- 'శ్రీదేవి.. ఓ సమ్మోహన శక్తి'
- కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? అదెంత ప్రమాదకరమైంది? హార్ట్ అటాక్‌కూ, దీనికి తేడా ఏంటి?
- ఫేస్‌బుక్ కథ ముగిసినట్లేనా? మైక్రోసాఫ్ట్, కోకాకోలా సహా పలు ఎంఎన్సీల బాయ్‌కాట్, ప్రకటనల నిలిపివేత
- చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- మీకు ఏడాది మొత్తానికి వచ్చే జీతాన్ని మీ సీఈఓ ఒక పూటలో సంపాదిస్తాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








