శ్రీదేవి: బోనీ కపూర్ ఆమె బంగళా చుట్టూ 10 రోజులు చక్కర్లు కొట్టారు... వారి ప్రేమ అలా మొదలైంది

ఫొటో సోర్స్, Twitter @SrideviBKapoor
- రచయిత, వందన
- హోదా, బీబీసీ ప్రతినిధి
తన 51 ఏళ్ల సుదీర్ఘ సినీ కేరీర్‌లో శ్రీదేవి ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు.
అయితే ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఒక దశలో తీవ్రమైన చిక్కు సమస్యలు ఎదుర్కొన్నారు.
శ్రీదేవి తన కెరీర్‌లో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటున్న సమయంలోనే, తెర వెనుక ఆమె వ్యక్తిగత జీవితంలో ఓ ప్రేమ కథ పురుడు పోసుకుంది.
90వ దశకంలో ఆమె బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే బోనీ వివాహితుడు.
వీరివురి ప్రేమకు 1980వ దశకంలోనే పునాది పడింది. ఆ సమయంలో బోనీ కపూర్ నిర్మాతగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Twitter @SrideviBKapoor
'మిస్టర్ ఇండియా' కథ ఇదీ!
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సమీక్షకుడు జయప్రకాశ్ చౌక్సే బీబీసీ ప్రతినిధి సుప్రియా సోగ్లేతో మాట్లాడుతూ, "మిస్టర్ ఇండియా సినిమా తీయాలని నిర్ణయించుకున్న తర్వాత రచయిత జావేద్ అఖ్తర్, బోనీ కపూర్ ఇద్దరూ శ్రీదేవికి ఈ సినిమా ఆఫర్ ఇవ్వడం కోసం చెన్నైకి వెళ్లారు" అని చెప్పారు.
"శ్రీదేవి తల్లి ఫోన్ చేసి వారిద్దరూ కొద్దిరోజులు వేచి ఉండాలని కోరారు. ఆ సమయంలో శ్రీదేవి చాలా బిజీగా ఉండేవారు. దాదాపు 3-4 రోజుల వరకు ఆమె నుంచి ఫోన్ ఏదీ రాలేదు."
"పని ముందుకు సాగేలా కనిపించకపోవడంతో జావేద్ విచారంలో పడిపోయారు. బోనీ కపూర్ కూడా విచారంలో పడ్డారు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు."
"బోనీ కపూర్ రోజూ శ్రీదేవి బంగ్లా చుట్టూ చక్కర్లు కొట్టసాగారు. 10 రోజుల తర్వాత శ్రీదేవి ఆయనకు కలిసేందుకు సమయం ఇచ్చారు. బోనీ చెప్పిన కథ ఆమెకు నచ్చింది. సినిమాలో పని చేసేందుకు ఆమె సిద్ధపడ్డారు."

ఫొటో సోర్స్, Twitter @SrideviBKapoor
తెరపై తొలిచూపులోనే ప్రేమ:బోనీ
దాదాపు ఐదేళ్ల క్రితం 'ఇండియా టుడే' నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బోనీ కపూర్ తన ప్రేమ కథ గురించి ఇలా చెప్పారు - "నేను శ్రీదేవిని మొట్టమొదటిసారి తెరపై చూసినపుడే ఆమెపై ప్రేమ మొదలైంది."
"70వ దశకంలో నేను ఆమెను ఓ తమిళ సినిమాలో చూశాను. వెంటనే ఆమెతో నా ఫిల్మ్‌లో సైన్ చేయించుకోవడం కోసం చెన్నైకు వెళ్లాను."
"అయితే ఆమె ఆ సమయంలో చెన్నైలో లేరు. ఆ తర్వాత ఆమెను 'సోల్‌వా సావన్'లో చూశాను. నా మనసులోంచి ఆమె రూపు అప్పటికీ చెదిరిపోలేదు. చివరకు ఎలాగోలా ఆమెతో 'మిస్టర్ ఇండియా' సినిమా కోసం సైన్ చేయించగలిగాను."
"అప్పుడు శ్రీదేవి తల్లిగారే ఆమె తరఫున నిర్ణయాలు తీసుకునే వారు. నేను శ్రీదేవితో సైన్ చేయించడం కోసం ముందుగా వాళ్ల అమ్మగారిని కలిశాను. ఆ రోజుల్లో శ్రీదేవి చాలా ఖరీదైన నటి."
"వాళ్లమ్మ గారు బహుశా నన్ను బెదరగొట్టడానికి 10 లక్షల ఫీజు ఇవ్వాలని అన్నారు. నేను 11 లక్షలిస్తానని అన్నాను."
"వాళ్లమ్మ గారితో నాకు దోస్తీ కుదిరింది. సెట్‌పై శ్రీదేవి కోసం నేను అన్ని ఏర్పాట్లు చేసి పెట్టేవాడిని. మంచి మేకప్ రూమ్, మంచి బట్టలు వగైరా. నిజానికి నేను అప్పటికే ఆమెతో ప్రేమలో పడ్డాను."
"ఆ రోజుల్లో ఆమె 'చాంద్‌నీ' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నేను ఏదో ఒక సాకుతో ఆమెను కలిసేందుకు స్విట్జర్లాండ్‌కు వెళుతుండేవాడిని. ఆ క్రమం అలా కొనసాగింది."
"నేను ఆమె ప్రతి అడుగులో తోడుగా ఉంటానని చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నించాను. క్రమంగా శ్రీదేవికి కూడా విషయం అర్థమైంది. నేను ఆమెను ప్రేమిస్తున్నానని."

ఫొటో సోర్స్, Twitter @SrideviBKapoor
శ్రీదేవి తల్లి అనారోగ్యం
శ్రీదేవి తల్లి జబ్బు పడ్డ సమయంలో, ఆ తర్వాత ఆమె మృతి చెందినప్పుడు వారిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని చెబుతారు.
"శ్రీదేవి తల్లిగారు అనారోగ్యం పాలయ్యారు. ఆమెకి బ్రెయిన్ సర్జరీ చేయించాల్సి ఉండింది. బోనీ కపూర్‌కు ఈ విషయం తెలియడంతో ఆయన చెన్నైకి వెళ్లారు" అని జయప్రకాశ్ చౌక్సే చెప్పారు.
"డాక్టర్ సలహాపై సర్జరీ కోసం ఆమెను అమెరికా తీసుకెళ్లారు. ఆ ట్రిప్‌లో బోనీ కపూర్ వెంటే ఉన్నారు. అయితే డాక్టర్లు శ్రీదేవి తల్లికి తప్పుడు సర్జరీ చేశారు."
"ఆసుపత్రి యాజమాన్యంపై శ్రీదేవి కేసు పెట్టారు. వారితో ఆఖరుకు సెటిల్‌మెంట్ జరగడంతో నష్టపరిహారం కింద రూ. 16 కోట్లు ఇచ్చారు."
"ఈ కష్ట సమయంలో బోనీ కపూర్ తన వెంట ఉంటూ తన తల్లికి సేవలు అందించడం.. ఇవన్నీ శ్రీదేవి గమనించారు."
"శ్రీదేవి తండ్రి ముందే మరణించారు. తల్లి మరణం తర్వాత ఆమెకు సానుభూతి తెలపడానికి బోనీ కపూర్ ఒక్కరే ఆమెకు తోడుగా ఉన్నారు. అలా సానుభూతితో మొదలైన వారి బంధం ప్రేమ బంధంగా మారిపోయింది."

ఫొటో సోర్స్, Twitter @SrideviBKapoor
దక్షిణాది నుంచి ఉత్తరం వైపు...
బోనీతో శ్రీదేవి 'మిస్టర్ ఇండియా', 'రూప్ కీ రాణీ చోరోం కా రాజా', 'మామ్' వంటి సినిమాలు చేశారు.
అయితే వీరిద్దరి బంధం అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఎందుకంటే అప్పటికే బోనీకి పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లల తండ్రి.
చివరకు 1990వ దశకంలో శ్రీదేవి, బోనీల వివాహం జరిగింది.
ఇద్దరి కుటుంబ నేపథ్యాలు పూర్తిగా భిన్నమైనవి. శ్రీదేవిది దక్షిణాదికి చెందిన కుటుంబం కాగా, బోనీ కపూర్‌ది పంజాబీ కుటుంబం.

ఫొటో సోర్స్, Twitter @SrideviBKapoor
"పెళ్లి తర్వాత శ్రీదేవి పంజాబీ ఆచారవ్యవహారాలను బాగా నేర్చుకున్నారు. ఆమె తనను తాను పంజాబీ కుటుంబానికి అనుగుణంగా మల్చుకునే ప్రయత్నం చేశారు" అని జయప్రకాశ్ చౌక్సే తెలిపారు.
"బోనీ కపూర్ కుటుంబం అంటే ఆయన సోదరులు, వాళ్ల పిల్లలతో కూడిన విశాల కుటుంబానికి శ్రీదేవి అంకితమైపోయారు."
"తన మామగారైన సురిందర్ కపూర్ 75వ జయంతి సందర్భంగా చెన్నైలో ఆమె ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. చెన్నైలోని తన బంగ్లాలో పూజలు నిర్వహించారు. పార్టీ ఇచ్చారు."
"ఆ పార్టీకి కమల్ హాసన్, రజినీకాంత్‌లు అతిథులుగా వచ్చారు. వారికి శ్రీదేవి స్వయంగా స్నాక్స్ సర్వ్ చేశారు. వారికి శ్రీదేవి అంటే ఎంతో అభిమానం."
"శ్రీదేవి తన ఆరోగ్యం పట్ల బాగా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ బోనీ కపూర్ మాత్రం తన ఆరోగ్యం పట్ల ఆశ్రద్ధగా ఉంటుంటారు. ఈ విషయంపై ఆమె తరచుగా ఆయనతో వాదులాడేవారు."
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








