'అతిలోక సుందరి' నుంచి నేనెంతో నేర్చుకున్నా: చిరంజీవి

ఫొటో సోర్స్, SHALIMAR
నా పుట్టినరోజున చివరిసారి కలిశా : చిరంజీవి
మా అతిలోక సుందరి ఇక లేదు. ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. అందం, అద్భుతమైన అభినయం కలగలసిన నటి శ్రీదేవి.
అలాంటి నటిని నేనుప్పుడూ చూడలేదు.తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో.. దేవకన్య పాత్రలో శ్రీదేవి అలవోకగా నటించడం చూసి ఆశ్చర్యపోయాను. తను మా కుటుంబానికి చాలా సన్నిహితురాలు.
చివరిసారిగా నా 60వ పుట్టినరోజున తనను కలిశాను. ఆమె లేదంటే నమ్మలేకపోతున్నాను. ఆమె కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకొంది.
మా హృదయాల్లో ఇంకా జీవించి ఉంది. సినిమా పరిశ్రమ ఉన్నంత వరకూ తను జీవించే ఉంటుంది. ఇది దేశానికి, సినిమా పరిశ్రమకు ఇది తీరని లోటు.

ఫొటో సోర్స్, VENKATESH DAGGUBATI/FACEBOOK
ఇది నాకు షాక్..! : వెంకటేష్
ఇది నాకు షాక్..! ఇది ఓ దురదృష్టమైన రోజు. గొప్ప నటిని కోల్పోయాం.
క్షణ క్షణం సినిమాలో ఆమె పలికించిన హావభావాలు మన మనసుల్లో చెదిరిపోని ముద్ర వేశాయి. చాలా చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, చాలా వినమ్రతగా ఉండేది.
సినిమాల్లోకి రావాలనుకునే వారికి శ్రీదేవి ఓ ఉదాహరణ. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.

ఫొటో సోర్స్, Ttwitter
ఇల్లాలు సినిమాలో మా పాత్రలు మార్చుకున్నాం : జయసుధ
నేను ఒక స్నేహితురాలిని కోల్పోయా. దేశం ఒక గొప్ప నటిని కోల్పోయింది. నటన విషయంలో ఎవ్వరూ శ్రీదేవికి సాటి రారు. శ్రీదేవి లేదంటే.. నమ్మలేకపోతున్నాను.
తను ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుంది. శ్రీదేవిని మొదటిసారి కలిసినపుడు నాకు పదేళ్లు, తనకు ఐదేళ్లు.
అప్పుడు విజయనిర్మల గారితో కలిసి శ్రీదేవి నటిస్తుండేది. తర్వాతి కాలంలో క్రిష్ణ గారితో కూడా నటించింది.
ప్రేమాభిషేకం, ఇల్లాలు సినిమాల్లో ఇద్దరం కలిసి నటించాం. నాకు ఓ విషయం గుర్తుకు వస్తోంది..
‘ఇల్లాలు’ సినిమాలో నాది కాస్త సీరియస్‌గా ఉండే పాత్ర. శ్రీదేవిది గ్లామరస్ రోల్.
కానీ శ్రీదేవికి అది ఇష్టం లేదు. నా పాత్రను చేస్తానని అడిగింది. ‘ఎప్పుడూ గ్లామరస్ పాత్రలు చేస్తున్నా. ఇప్పుడు నీ పాత్రలో నటిస్తాను’ అని అడిగింది.
అప్పుడు మా పాత్రలను మార్చుకున్నాం. నటన అంటే ఆమెకు అంత ఇష్టం. శ్రీదేవి డైరెక్టర్స్ యాక్టర్.
తెలుగు, హిందీ సినిమాల నటనలో చాలా వైరుధ్యం కనిపిస్తుంది. తనను తాను అంత బాగా మలుచుకోగలదు. సూపర్ స్టార్ అనే గర్వం ఆమెకు ఉండదు. చాలా వినయంగా ఉంటుంది.
కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. తన క్యాస్టూమ్స్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటుంది. శ్రీదేవి ఒక పర్ఫెక్షనిస్ట్!
ఈమధ్య శ్రీదేవితో మాట్లాడినపుడు.. నాకు జుట్టుకు రంగు వేసుకుంటే అలర్జీ వస్తోందని, రంగు వేయడం మానేస్తానని అంటే..
‘మనం సెలబ్రిటీలం. చూడతగ్గట్టుగా ఉండాలి. జుట్టు తెల్లగా ఉన్నా ఫర్వాలేదు. నువ్వు నీలాగే ఉండు. కానీ ప్రజాజీవితంలో ఉన్నామని మాత్రం గుర్తుపెట్టుకో!’ అంది.
చివరిసారిగా పెద్దమ్మాయి జాహ్నవి గురించి మాట్లాడుకున్నాం. జాహ్నవి సినిమా విడుదలవబోతోంది.
''సూపర్ స్టార్ కూతురు సినిమా అంటే జాహ్నవి పట్ల అంచనాలు భారీగానే ఉంటాయి. కానీ.. నేను సూపర్ స్టార్‌గా కాదు.. జాహ్నవి తల్లిగానే ఆలోచిస్తున్నా'' అంది.
శ్రీదేవి లేదన్న వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా.

ఫొటో సోర్స్, facebook
మా ఇంట్లో ఆడుకునేది : క్రిష్ణ
శ్రీదేవి చిన్నతనంలో మా పక్కింట్లోనే ఉండేవాళ్లు. తను మా ఇంట్లోనే ఎక్కువ సేపు ఉండేది. శ్రీదేవితో కలిసి 34 సినిమాలు చేశాను.
కానీ.. చిన్న వయసులోనే ఇలా జరగడం బాధగా ఉంది.
నేను కుంగి పోయాను: కోట శ్రీనివాస రావు
నేను మాట్లాడలేకపోతున్నాను. శ్రీదేవి మరణ వార్తతో కుంగిపోయి ఉన్నా. ఇంత చిన్న వయసులో తనకెందుకిలా జరిగిందో అర్థం కావడం లేదు.
ఆమెకు శాంతి చేకూర్చాలని, ఆ నటరాజ స్వామిని ప్రార్థిస్తున్నా.
ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నా.

ఫొటో సోర్స్, facebook
‘మహానటి’ సినిమా శ్రీదేవికి అంకితం ఇస్తున్నాం : అశ్వినీదత్
ఇది నా జీవితంలోనే అత్యంత విషాదకరమైన రోజు.
ఈ రోజును ఎప్పటికీ మరువలేను. మాకు, వైజయంతీ మూవీస్ కుటుంబానికి ఎంతో డబ్బు, పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెట్టింది.
నా భార్యకు, నా పిల్లలకు శ్రీదేవి మంచి ఫ్రెండ్. మా బ్యానర్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, గోవిందా గోవిందా, ఆఖరి పోరాటంతో పాటు..మొత్తం 6 సినిమాలలో శ్రీదేవి పని చేసింది.
మా బ్యానర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది.
సినిమాల్లోకి రాక ముందు సావిత్రి గురించి వినేవాడిని. కానీ సినిమాల్లోకి వచ్చాక మళ్లీ ఓ మహానటిని శ్రీదేవి రూపంలో చూశా. శ్రీదేవి లేని వైజయంతీ మూవీస్‌ను ఊహించుకోలేక పోతున్నా.
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తీస్తున్న 'మహానటి' సినిమాను శ్రీదేవికి అంకితమిస్తున్నాను.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








