అమెరికాతో చర్చలకు ఉత్తర కొరియా సిద్ధం: దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాతో చర్చలకు ఉత్తర కొరియా సిద్ధమేనని దక్షిణ కొరియా ప్రకటించింది.
ప్యోంగ్‍చాంగ్‌లో వింటర్ ఒలింపిక్స్ ముగింపు ఉత్సవానికి ముందు ఉత్తర కొరియా జనరల్ కిమ్ యోంగ్ చోల్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెయి-ఇన్‌ల భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
ముగింపు ఉత్సవంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పాల్గొననున్నారు. అయితే ఉత్తర కొరియా ప్రతినిధి బృందంతో ఆమె భేటీ కావొచ్చన్న వార్తలను అమెరికా అధికారులు తోసిపుచ్చారు.
వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో జరిగిన సమావేశంలో ఉత్తర కొరియా అధికారులు ఎలాంటి చర్చలూ చేయకుండానే వెనక్కి తగ్గారని అమెరికా పేర్కొంది.

ఫొటో సోర్స్, POOL
అయితే, అమెరికాతో చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా 'చాలా ఉత్సుకత'తో ఉందని అధ్యక్షుడు మూన్ కార్యాలయం తెలిపింది.
దక్షిణ కొరియాతో చర్చలు జరిపేందుకు, అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఉత్తర కొరియా అంగీకారం తెలిపినట్టు దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
అయితే, దీనిపై ఉత్తర కొరియా నుంచి ఎలాంటి స్పందనా వెలువడలేదు. తాము అమెరికాతో బేషరతుగా చర్చలు జరిపేందుకు సిద్ధమని ఉత్తర కొరియా అధికారులు గతంలోనే ప్రకటించారు.
శుక్రవారం నాడు ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా కొత్త ఆంక్షలు విధించింది.
కొత్త ఆంక్షలు యుద్ధానికి రెచ్చగొట్టే చర్యల లాంటివని ఉత్తర కొరియా ఇటీవలే దుయ్యబట్టిన నేపథ్యంలో దక్షిణ కొరియా ఈ ప్రకటన చేసింది.
వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా ఉభయ కొరియా దేశాల మధ్య సఖ్యత వెల్లివిరియడం పట్ల ఉత్తర కొరియా విదేశాంగ శాఖ హర్షం వెలిబుచ్చింది.
అయితే క్రీడలు ముగిసే సమయం దగ్గర పడుతుండగా, అమెరికా 'పెద్ద ఎత్తున కొత్త ఆంక్షలు' విధించడం ద్వారా కొరియా ద్వీపకల్పంలో యుద్ధ ప్రమాదాన్ని పెంచుతోందని అది విమర్శించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








