బాలీవుడ్ చిత్రాలపై రష్యన్లకు ఆసక్తి తగ్గుతోంది. ఎందుకంటే..

ఫొటో సోర్స్, Getty Images
భారత్ -రష్యా సంబంధాల గురించి మాట్లాడితే బాలీవుడ్‌ను ప్రస్తావించకుండా ఉండలేం. ఇరు దేశాల సంబంధాలపై బాలీవుడ్ ప్రభావం అలాంటిది. భారత చలన చిత్ర సూపర్ స్టార్లు రాజ్ కపూర్, నర్గీస్, మిథున్ చక్రవర్తి వంటి వారు రష్యాలో కూడా సూపర్ స్టార్లే. అయితే, బాలీవుడ్ మీద రష్యాలో ఒకప్పుడున్న క్రేజ్ ఇపుడూ అలాగే ఉందా? రష్యా నుంచి బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అందిస్తున్న ప్రత్యేక కథనం.
రష్యా లోని తివేర్ నగరంలో భారతదేశానికి చెందిన పాటలు, సంప్రదాయిక నృత్యాల సాధన ప్రతి రోజూ జరుగుతుంది. బాలీవుడ్ నటి హేమమాలిని నుంచి స్ఫూర్తి పొంది భారతదేశంలో నాట్యం నేర్చుకున్న నృత్యకారిణి లీనా గోయల్ రెండు దశాబ్దాల నుంచి ఇక్కడ ఈ బృందాన్ని నడుపుతున్నారు.
‘బాలీవుడ్ కంటే హాలీవుడ్ పట్ల మోజెక్కువ’
‘‘నాకు బాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. షోలే, కభీ కభీ, దో అంజానే, రాజా రాణి లాంటి బాలీవుడ్ చిత్రాలు సోవియట్‌లో చాలా పాపులర్. ఎందుకంటే, వాటిలో ఎన్నో భావోద్వేగాలున్నాయి. భారతీయ చిత్రాలలోని కథాకథనాలు భారతీయులకే కాదు రష్యా వాసుల మనసులకూ దగ్గరగా ఉంటాయి. అవన్నీ చాలా వరకు కుటుంబ కథా చిత్రాలు. అనుబంధాలతో సాగే ప్రేమ కథా చిత్రాలు’’ అని లీనా గోయల్ అన్నారు.
సోవియట్ యూనియన్, భారత్ సంబంధాలలో హిందీ చిత్రాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఎన్నో సినిమాల చిత్రీకరణ రెండు భాషలలో ఒకేసారి జరిగింది. ఒకేసారి విడుదలయిన చిత్రాలూ చాలానే ఉన్నాయి.
"భారత్‌లో నేను సినిమాలు చూస్తూ పెరుగుతున్నప్పుడు రష్యా లో మన చిత్రాలు చాలా ప్రసిద్ధి అని వినేదాన్ని. ఇక్కడకు వచ్చిన తరువాత అది నిజమేనని తెలుసుకున్నాను. ఈనాటికీ పాత చిత్రాల నటీనటులకు క్రేజ్ తగ్గలేదు. అయితే, ఇక్కడి నవ యువతరానికి బాలీవుడ్ కంటే హాలీవుడ్ పట్ల మోజెక్కువ అన్నది వాస్తవం" అని లీనా గోయల్ వివరించారు.

ఫొటో సోర్స్, BBC
భారతీయ నృత్యాలకు తగ్గని ఆదరణ
మాస్కోలో నివసించే షబ్నమ్‌కు బాలీవుడ్ అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే, ఆమె ఎన్నో ఏళ్ళుగా ఒక భారతీయ రెస్టారెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం, రష్యాలో ఎక్కడా భారతీయ చిత్రాల ప్రదర్శన జరగడం లేదని, మార్కెట్‌లో కూడా లభించడం లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు.
"నిజానికి, ఇప్పటి నటీనటులలో నాకు తెలిసిన వారు చాలా తక్కువ. పాత పద్దతులను ఇప్పుడు అందరూ వదిలేశారు. గతంలో భారతీయ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద థియేటర్లలో ప్రదర్శించే వారు. నాకు బాజీరావు-మస్తానీ చిత్రమంటే చాలా ఇష్టం. ఆ సినిమా విడుదలైనప్పుడు సగం చూశాను. అయితే, ఇంటర్నెట్‌లో ఆ చిత్రం ఎక్కడా కనిపించలేదని నాకు చాలా బాధేసింది. అపుడు నా స్నేహితులు ఆ సీడీ నాకు పంపించారు. దాదాపు ఎనిమిది నెలలు ఎదురుచూసిన తరువాత ఆ చిత్రం పూర్తిగా చూడగలిగాను" అని షబ్నమ్ చెప్పారు.
30 ఏళ్ల కిందట సోవియట్ యూనియన్‌కు వచ్చి, ఇక్కడే స్థిరపడిన జర్నలిస్టు రామేశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘సంగీతం, సినిమాలు, కళలను ఇచ్చిపుచ్చుకోవటాన్ని బట్టే ఆయా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను లెక్కిస్తారు. వ్యాపారమైనా, మరేదైనా వాటి తర్వాతే. ప్రస్తుత హయాంలో ఇలాంటి విషయాలపై ఆసక్తి కొంత తగ్గిందన్న మాట వాస్తవం’’ అని తెలిపారు.
రష్యాలో బాలీవుడ్ సినిమాలకు క్రేజ్ తగ్గింది. కానీ భారతీయ నృత్యాలకు ఇప్పటికీ ఆదరణ ఉంది.
భారతీయ చలన చిత్రాలకు రష్యాలో పూర్వ వైభవం వస్తుందని ఇప్పటికీ చాలా మంది ఆశిస్తున్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఇవి కూడా చదవండి:
- రష్యా విప్లవ చరిత్రను కళ్లకు గట్టే పోస్టర్లు
- ట్రంప్-పుతిన్ సమర్పించు రాజకీయ డ్రామా!
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
- ‘స్టాలిన్ మృతి’: బ్రిటిష్ కామెడీ సినిమాపై మండిపడుతున్న రష్యా
- రష్యా విప్లవానికి వందేళ్లు: తెలుగు కుటుంబాల్లో రష్యా పేర్లు
- రష్యా వర్సెస్ పశ్చిమ దేశాలు.. ‘ఇది నూతన ప్రచ్ఛన్న యుద్ధం’
- రష్యా: మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- పుతిన్‌ను రక్షకుడిగా ఎందుకు చూపిస్తున్నారు?
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు నేలపై అక్టోబర్ విప్లవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









