ఉత్తర్‌ప్రదేశ్: ‘వేధింపులు భరించలేకపోతున్నాం, ఈ ఇల్లు అమ్మేస్తాం’ అని ఒక కులం వాళ్లు ఎందుకు పోస్టర్లు అంటించారు?

ఫొటో సోర్స్, SHRAVAN SHARMA
- రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
- హోదా, బీబీసీ కోసం....
ఉత్తర్ ప్రదేశ్‌లోని గోగ్వాన్ జలాల్పూర్ గ్రామంలో ఓ కులానికి చెందిన వారిపై గ్రామ సర్పంచ్, వారి బంధువులు వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
షామ్లీ జిల్లాలోని ఆ గ్రామంలోని పలువురి ఇళ్ల ముందు 'ఈ ఇల్లు అమ్మబడును' అని పోస్టర్లు వెలిశాయి.
ఊరి సర్పంచ్‌కు ఓటేయలేదని, బంధువులు తమను బెదిరిస్తున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు, అధికారులు తమ గోడు పట్టించుకోకపోగా, తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని గ్రామంలోని బ్రాహ్మణులు ఆరోపించారు.
అధికారుల వైఖరికి నిరసనగా ''గ్రామ సర్పంచ్ వేధింపులు భరించలేక పారిపోతున్నాం, ఈ ఇల్లు అమ్మబడును'' అంటూ కొందరు బాధితులు వారి ఇళ్ల మీద పోస్టర్లు అంటించారు.
బాధితులు శుక్రవారం నాడు ర్యాలీ నిర్వహించి, జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం ఇచ్చారు.
గ్రామ సర్పంచ్ భర్త జై ప్రకాష్ రాణా, ఆయన కుమారుడు వినయ్ రాణా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ కులస్తులు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.
అయితే, సర్పంచ్ భర్త జైప్రకాశ్ రాణా మాత్రం మరో వెర్షన్ చెప్పారు. గ్రామానికి చెందిన భూమిని కొందరు ఆక్రమించారని, దానిని ఖాళీ చేయడానికి అధికారుల నుంచి నోటీసులు పంపించామని వెల్లడించారు.
కానీ, స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఆక్రమించినట్లు చెబుతున్న ఆ స్థలంలో బాధితులు చాలా ఏళ్లుగా నివసిస్తున్నారు. భూమిని స్వాధీనం చేసుకున్నారని, అక్కడి నుంచి ఖాళీ చేయాలని వారికి ఇటీవలే నోటీసులు వచ్చాయి.

ఫొటో సోర్స్, SHRAVAN SHARMA
ఖండిస్తున్న అధికారులు
గ్రామస్తుల ఆరోపణలను అధికారులు తోసిపుచ్చారు. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెబుతున్నారు.
''గ్రామస్తులు కొందరు ఊరు వదిలి వెళ్లిపోయిన మాట అవాస్తవం. వాళ్లు అంటించిన పోస్టర్లు తొలగించాం. భూకబ్జా ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ విచారణ కమిటీ ఏర్పాటు చేశారు'' అని షామ్లీ పోలీసు సూపరింటెండెంట్ సుకృతి మాధవ్ చెప్పారు.
బ్రాహ్మణ కులస్తుల ఇళ్ల బయటున్న కుళాయిలు, వీధి లైట్లు తొలగించారని, ట్యాంకు ద్వారా వచ్చే నీటిని కూడా ఆపేశారని, తమను మానసిక వేదనకు గురి చేస్తున్నారని గోగ్వాన్ జలాల్పూర్ నివాసి మేఘనాథ్ శర్మ అన్నారు.
''మే 9న కొందరు మా కులానికి చెందిన ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. మేం రోజూ వేధింపులకు గురవుతున్నాం. మాకు ఓటు వేయలేదు కాబట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులు, అధికారులు కూడా మాకు సహకరించడం లేదు. మా ఫిర్యాదును ఎవరూ పట్టించుకోవడం లేదు'' అని మేఘనాథ్ శర్మ అన్నారు.
రెండు రోజుల కిందట కొందరు తనను మోటార్ సైకిల్ మీద ఎక్కించడానికి బలవంతం చేశారని, కొందరు అటుగా రావడంతో వదిలి వెళ్లిపోయారని మోహిత్ శర్మ అనే యువకుడు ఆరోపించారు.
గ్రామంలోని చాలా మంది ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. ఈ సంఘటనలన్నింటి గురించి చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, SHRAVAN SHARMA
వైరల్ ఆడియో
గ్రామ సర్పంచ్ మేనల్లుడు ఎన్నికలకు ముందు మాట్లాడిన ఓ ఫోన్ కాల్ రికార్డు బయటపడిందని, అందులో యోగేశ్ అనే వ్యక్తిని ఆయన అసభ్య పదజాలంతో తిట్టారని, చంపుతామని బెదిరించారని స్థానిక జర్నలిస్టు శ్రావణ్ శర్మ అన్నారు.
అయితే, ఈ వైరల్ ఆడియోపై విచారణ జరపగా, గ్రామంలో రెండు కులాల మధ్య వివాదానికీ, ఈ ఆడియోకు ఎలాంటి సంబంధం లేదని, అందులో మాట్లాడుతున్న ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారని షామ్లీ పోలీస్ సూపరింటెండెంట్ సుకృతి మాధవ్ బీబీసీకి తెలిపారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
గ్రామ సర్పంచ్, వారి బంధువుల భయంతో ఇళ్లు వదిలి పారిపోతున్నామని పోస్టర్లు వేసిన వ్యక్తులకు పోలీసులు, అధికారులు నుంచి కూడా బెదిరింపులు వస్తున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు గ్రామస్తులు వెల్లడించారు.
''మమ్మల్ని బహిరంగంగానే బెదిరిస్తున్నారు. కాల్చి చంపుతామని అంటున్నారు. అధికారుల దృష్టి అంతా భూ ఆక్రమణ వ్యవహారం పైనే ఉంది. మా ఫిర్యాదును ఇంత వరకు తీసుకోలేదు" అని ఓ యువకుడు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, SHRAVAN SHARMA
బెదిరింపుల కేసులో అసలు కథేంటి?
గ్రామ సర్పంచ్ భర్త జై ప్రకాశ్ రాష్ట్ర మంత్రుల్లో ఒకరికి చాలా సన్నిహితుడని చెబుతున్నారు. ఆయన ఒత్తిడి వల్లే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు నమోదు కాలేదని, సర్పంచ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
''మేం వాళ్లతో పోరాడలేము. పోలీసులు, అధికారులు కూడా మాకు సహకరించడం లేదు. మాకు మిగిలింది ఇల్లు అమ్ముకుని ఊరొదిలి వెళ్లిపోవడమే'' అని నక్కీసింగ్ అనే వృద్ధుడు అన్నారు.
సుమారు నాలుగు వేల జనాభా ఉన్న గోగ్వాన్ జలాల్పూర్ గ్రామంలో దాదాపు 500 మంది బ్రాహ్మణులు ఉండగా, రాజ్‌పుత్ కులానికి చెందిన వారు దాదాపు 1300 మంది ఉంటారు. మిగిలిన వారు ఇతర కులాలకు చెందినవారు.
జై ప్రకాష్ రాణా, ఆయన కుటుంబ సభ్యులు గత మూడు దఫాలుగా గ్రామ సర్పంచ్‌గా ఎన్నికవుతున్నారు. జై ప్రకాశ్ రాణా రెండుసార్లు సర్పంచ్‌గా గెలవగా, ఈసారి మహిళల కోటాలో ఆయన భార్య సుష్మా గ్రామ సర్పంచ్ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా: గాల్వాన్ లోయలో ఘర్షణలు ఎలా మొదలయ్యాయి.. ఆ తర్వాత ఏం జరిగింది?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- టోక్యో ఒలింపిక్స్ వచ్చే నెలలో మొదలవుతాయా... ఈ క్రీడా వేడుకకు కోవిడ్ ఎమర్జెన్సీ అడ్డంకి అవుతుందా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- ఫ్రెంచ్ ఓపెన్ 2021: తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకున్న బార్బోరా క్రెచికోవా
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









