ఉత్తరప్రదేశ్: గుడిలో నీళ్లు తాగినందుకు బాలుడిని చితకబాదారు

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA/BBC
- రచయిత, సమీరాత్మజ్ మిశ్ర
- హోదా, బీబీసీ కోసం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో ఉంది డాస్నా ప్రాంతం. అక్కడ ఓ మురికి కాలువకు ఓవైపు శ్మశానం, ఇంకోవైపు ఓ బస్తీ ఉన్నాయి.
ఆ బస్తీలోని మొదటి ఇంట్లోని పైగదుల్లో ఆ సమీప ప్రాంతాల్లో కూలి పని చేసుకునే వాళ్లు అద్దెకు ఉంటున్నారు. వాటిలోని ఓ గదిలోనే హబీబ్ కుటుంబం అద్దెకు ఉంటోంది.
హబీబ్ కొడుకు ఆసిఫ్ ఆ గదిలో ఓ మూలన చిన్న వెదురు స్టూలుపై కూర్చొని ఉన్నాడు. కింద నేలపై హబీబ్, ఆయన భార్య, మరో కొడుకు, కూతురు కూర్చొని ఉన్నారు.
ఆసిఫ్ తలకు కట్టు ఉంది. నాలుగు రోజుల క్రితం తాకిన దెబ్బ వల్ల కలిగిన నొప్పితో అతడు మూలుగుతున్నాడు. మార్చి 11న డాస్నాలోని దేవీ మందిరంలో ఉన్న కొళాయి నీళ్లు తాగినందుకు ఆసిఫ్‌ను ఆ గుడిలో ఉండే శ్రుంగీనందన్ అనే వ్యక్తి కొట్టారు. అలా కొడుతున్నప్పుడు వీడియో కూడా తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియోను సుమోటోగా తీసుకుని శ్రుంగీనందన్ యాదవ్‌పై, ఆ వీడియో చిత్రీకరించిన శివానంద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఆసిఫ్‌కు వైద్య పరీక్షలు జరిగాయి. ఎక్స్ రే ఇంకా రావాల్సి ఉంది. ఆ ఘటన గురించి ఆసిఫ్ బీబీసీతో మాట్లాడాడు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC
‘‘అక్కడికి నేను చెత్త ఏరుకునేందుకు వెళ్లా. దాహం వేయడంతో గుడిలో ఉన్న కుళాయి నీళ్లు తాగడానికి వెళ్లా. మొదట అక్కడున్న ఓ పూజారి పిలిచి, ఏం చేస్తున్నావని అడిగారు. నీళ్లు తాగడానికి వచ్చానని చెప్పా. ‘సరే వెళ్లు’ అన్నారు. నేను బయటకు వెళ్తుండగా మరో పూజారి వచ్చారు. ‘రా... నీ వీడియో తీద్దాం’ అన్నారు’’ అని ఆసిఫ్ చెప్పాడు.
‘‘నా పేరు, మా నాన్న పేరు అడిగారు. నేను పేర్లు చెప్పగానే, తిడుతూ కొట్టడం మొదలుపెట్టారు. ఒక అన్న వీడియో తీస్తూ ఉన్నాడు. ఇద్దరు చాలా బలంగా ఉన్నారు. నన్ను బాగా కొట్టారు. తల మీద కొట్టారు. చేతులు మెలి పెట్టి తిప్పారు. వీడియో తీస్తున్న అన్న... ‘ఇక విడిచిపెట్టకపోతే చచ్చిపోతాడు’ అని కూడా అన్నాడు’’ అని వివరించాడు ఆసిఫ్.
ఆసిఫ్ ఇంటి నుంచి ఆ గుడి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి ఇదివరకు చాలా సార్లు వెళ్లానని, అందులో నీళ్లు కూడా తాగనని ఆసిఫ్ చెప్పాడు. ఆ రోజే తన పేరు అడిగి ఎందుకు కొట్టారన్నది తనకు అర్థం కాలేదని అన్నాడు.
ఆసిఫ్‌కు ఎనిమిది మంది తోబుట్టువులు. అతడికి ఇద్దరు అక్కలు. వాళ్లిద్దరికీ పెళ్లి జరిగింది. ఆసిఫ్ తండ్రి హబీబ్ కూలి పని చేస్తుంటారు. ఆ కుటుంబమంతా ఒకే గదిలో నివసిస్తోంది.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC
సోషల్ మీడియాలో ఆగ్రహం
ఆసిఫ్‌ను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వకపోతే, అతడికి జరిగింది ఎవరికీ తెలిసేది కాదు. నిజానికి, ఈ వీడియోను నిందితులే సోషల్ మీడియాలో పెట్టారు.
శనివారం ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ట్విటర్‌లో #SorryAsif అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. చాలా మంది ఈ వీడియోను షేర్ చేస్తూ, నిందితుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు.
మీడియాలోనూ ఈ విషయం చర్చనీయమైంది.
‘‘వైరల్ వీడియోను సుమోటోగా తీసుకుని పోలీసులే స్వయంగా కేసు నమోదు చేశారు. తర్వాత బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదును కూడా దీనికి కలిపారు. బాలుడిని కొట్టిన శ్రుంగీనందన్ యాదవ్‌ను అదే రోజు అరెస్టు చేశారు’’ అని గాజియాబాద్ ఎస్పీ (రూరల్) ఇరాజ్ రాజా చెప్పారు.
‘‘అనంతరం వీడియో తీసిన శివానంద్‌ను కూడా అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్లు 504, 505, 353 కింద ఇద్దరు నిందితులపై కేసు నమోదైంది. బాలుడి వైద్య పరీక్షల ఫలితాలు వచ్చాక, పరిస్థితిని బట్టి మరిన్ని సెక్షన్లు కూడా జత చేయొచ్చు. ఈ విషయంలో పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటారు’’ అని ఆయన అన్నారు.
వైరల్ అయిన ఆ వీడియోలో ఆసిఫ్‌ను ఓ వ్యక్తి... ‘పేరు, తండ్రి పేరు, గుడికి ఎందుకు వచ్చావు? ’ అని వివరాలు అడుగుతుండటం వినిపించింది. ఆసిఫ్ సమాధానం చెప్పగానే, అతడిని కొట్టడం కనిపించింది.
వీడియో తీస్తున్న వ్యక్తి కూడా కొట్టే వ్యక్తికి కొన్ని సూచనలు చేయడం ఆ వీడియోలో వినిపించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రుంగీనందన్ యాదవ్ మూడు నెలలుగా ఆ గుడిలోనే ఉంటున్నారు. ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేశారు. బిహార్‌లోని సాసారామ్ ఆయన స్వస్థలం.
‘ముస్లింలకు ప్రవేశం నిషిద్ధం’
డాస్నాలోని దేవీ మందిర పరిసరాల్లో ఇదివరకు కూడా వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ గుడి కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది చాలా ప్రాచీనమైందని ఇక్కడివారు చెబుతుంటారు.
మందిర పరిసరాల్లో ఓ పెద్ద చెరువు, గోశాల కూడా ఉన్నాయి. మందిరం బయటి ముఖద్వారం వద్ద ఉన్న పెద్ద గేటుపై... ‘‘ముస్లింలకు ప్రవేశం నిషిద్ధం’’ అని పెద్ద అక్షరాల్లో స్పష్టంగా రాసి ఉంది.
ఈ ఆలయ పెద్ద యతి నరసింహానంద్ సరస్వతి ఆదేశాల ప్రకారం ఈ బోర్డు పెట్టారు. మందిరం లోపల ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లతోపాటు ఆయుధాలతో ఉన్న ప్రైవేటు భద్రత సిబ్బంది కూడా యతి నరసింహానంద్ చుట్టూ ఉన్నారు.
తాజా వివాదం గురించి నరసింహానంద్ బీబీసీతో మాట్లాడారు.
ఆలయ పరిసరాల్లో మంచి నీరు తాగినందుకు 14 ఏళ్ల ముస్లిం బాలుడిని కొట్టిన విషయమై ఎలాంటి విచారమూ లేదని నరసింహానంద్ అన్నారు. ఆసిఫ్‌ను ‘పిల్లాడు’ అనడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘‘అతడిని మీరు పిల్లాడు అంటున్నారా? వాళ్లంతా నేరస్థులు. హత్యలు, దొంగతనాలు, ఇంకా ఎన్నో నేరాలు చేస్తుంటారు. అందుకే ముస్లింలు లోపలికి రాకూడదని మందిరం బయట బోర్డు పెట్టాం. మా మఠంలో చాలా మంది పెద్దలు హత్యకు గురయ్యారు. ఆలయ భూములు కూడా కబ్జాకు గురయ్యాయి.’’ అని నరసింహానంద్ అన్నారు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC
‘పూర్తి బాధ్యత మాదే’
‘‘మొదట్లో మఠంలోని పెద్దలు హిందూ-ముస్లిం భాయీభాయీ అనే నమ్మేవారు. కానీ, వీళ్లు దాన్ని అదనుగా తీసుకున్నారు. నేను వాళ్ల విషయంలో కఠినంగా ఉంటాను. అందుకే క్షేమంగా ఉన్నా. నా భద్రతను నేనే చేసుకుంటా. మందిరంలో జరిగిందానికి పూర్తి బాధ్యత మేమే వహిస్తాం. శ్రుంగీనందన్‌కు న్యాయపరమైన సాయం చేస్తాం. బెయిల్ ఇప్పిస్తాం’’ అని ఆయన చెప్పారు.
నరసింహానంద్ మాటలతో విభేదించేవారు కూడా లేకపోలేదు.
గుడికి కొద్ది దూరంలో నివిస్తున్న దినేశ్ చంద్ర... నరసింహానంద్ చెప్పినట్లుగా భయంకరమైన వాతావరణం ఏదీ అక్కడ లేదని అన్నారు.
ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతమైనప్పటికీ డాస్నాలో హిందువులు, ముస్లింల మధ్య సామరస్యత ఉందని స్థానిక కౌన్సిలర్ మతీవుర్ రెహమాన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ: భజరంగ్ దళ్ సభ్యుడు రింకూ శర్మ హత్యకు రామమందిర విరాళాల సేకరణే కారణమా?
- లవ్ జిహాద్: ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అమాయక ముస్లిం యువకుడి జీవితంతో ఆటలు ఆడుకుంటున్నారా?
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు... అమరావతి భూముల సేకరణపై విచారణకు రావాలని ఆదేశం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








