మాంసం ‘హలాల్’: ఒక మతం నిబంధనలను ఇతర మతాలపై రుద్దుతున్నారా?

జంతు మాంసం

ఫొటో సోర్స్, PA Media

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జంతు మాంసం ఎగుమతులకు సంబంధించిన నియమావళి నుంచి ‘హలాల్’ నిబంధనను అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ట్ ఫుడ్ ఎక్స్‌పోర్ట్ డెవెలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) తొలగించింది. హలాల్‌ నిబంధనకు బదులుగా, దిగుమతి చేసుకుంటున్న ఆయా దేశాల నిబంధనలకు అనుగుణమైన పద్ధతిలో జంతువులను కోయాలని సూచించింది.

ఏపీఈడీఏ భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ కింద పనిచేస్తుంది.

మాంసం హలాల్ చేసినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో ప్రభుత్వ విభాగాల పాత్ర ఏమీ ఉండదని ఏపీఈడీఏ స్పష్టం చేసింది.

కొత్తగా చేసిన ఈ మార్పు సోమవారం అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకూ మాంసం ఎగుమతులకు హలాల్ ప్రక్రియ కీలకంగా ఉండేది.

‘‘ఇస్లామిక్ షరియత్ నిబంధనల ప్రకారం హలాల్ పద్ధతిలో జంతువులను కోయాలి. జమాత్ ఉల్ ఉలేమా ఎ హింద్ పర్యవేక్షణలో దీన్ని చేయాలి. ఆ సంస్థే దీనికి ధ్రువీకరణ పత్రం ఇస్తుంది’’ అని ఇదివరకు నియమావళిలో ఉండేది.

‘‘కబేళాలు నిర్వహించాలంటే హలాల్ పద్ధతి పాటించాలని ఏపీఈడీఏ నిబంధనలు ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు ఈ హలాల్ ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నాయి’’ అని హలాల్‌ ప్రక్రియను నియంత్రించాలని ఉద్యమిస్తున్న హలాల్ నియంత్రణ్ మంచ్ సంస్థ అంటోంది.

జంతు మాంసం

ఫొటో సోర్స్, Getty Images

గుత్తాధిపత్యంలో మార్కెట్

‘‘11 వేల కోట్ల రూపాయల ఈ జంతు మాంసం ఎగుమతుల మార్కెట్ కొందరి గుత్తాధిపత్యంలోనే ఉంది. కబేళాలను ప్రైవేటు సంస్థలే తనిఖీలు చేస్తున్నాయి. ఒక మతానికి చెందిన పెద్దలు ఆమోదిస్తే, వాటికి ఏపీఈడీఏ గుర్తింపును ఇస్తోంది’’ అని హలాల్ నియంత్రణ్ మంచ్‌కు చెందిన హరిందర్ సిక్కా అన్నారు.

హలాల్‌ను ఆపాలంటూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కూడా ఆందోళన చేస్తోంది.

‘‘జంతు మాంసం అధికంగా ఎగుమతి అవుతోంది చైనాకే. ఆ దేశం మాంసం హలాల్ చేసిందా? ఝట్కా చేసిందా అన్నది పట్టించుకోదు’’ అని వీహెచ్‌పీ అంటోంది.

హలాల్ మంసాన్ని తినడంపై సిక్కు మతంలో నిషేధం ఉందని, ఝట్కా పద్ధతిలో కోసిన మాంసాన్ని వాళ్లు తింటారని వీహెచ్‌పీకి చెందిన వినోద్ బన్సల్ అన్నారు.

జంతు మాంసం

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఒక మతం నిబంధనలను ఇతర మతాలపై రుద్దుతున్నారు. హలాల్ మాంసం తినేవారి హక్కును మేం ప్రశ్నించడం లేదు. హలాల్ మాంసం తినని వారిపై కూడా దాన్నే ఎందుకు రుద్దుతున్నారని అడుగుతున్నాం? భారత్ లౌకిక దేశం. ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు అందరికీ సమాన అవకాశాలు ఉండాలి’’ అని బన్సల్ అన్నారు.

‘‘హలాల్‌ను అందరిపై రుద్దుతున్నారు. ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి, దారి పక్కన ఉండే తోపుడు బళ్ల వరకు... రైళ్ల నుంచి మన భద్రత దళాల వరకూ అంతటా హలాల్ మాంసాన్నే పెడుతున్నారు’’ అని హరిందర్ సిక్కా అన్నారు.

మాంసమే కాకుండా ఇతర ఉత్పత్తులపైనా ఈ హలాల్ ప్రమాణాలు రద్దుతున్నారని హలాల్ నియంత్రణ్ మంచ్ అంటోంది.

జంతు మాంసం

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

‘‘మాంసం మాత్రమే కాదు. సిమెంటు, సౌందర్యోత్పత్తులు, మిక్చర్ పొట్లాలు, తిండి పదార్థాలు... ఇలా అన్నింటికీ హలాల్ ముద్ర వేయడం ఫ్యాషన్ అయిపోయింది. పప్పు, గోధుమ పిండి, శెనగ పిండిని కూడా హలాల్ చేస్తున్నారు. ఇస్లామిక్ దేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులను హలాల్ చేసి పంపుకోండి. వాటిని విడిగా ప్యాకేజీ చేసి పంపించుకోవచ్చు. మాకే అభ్యంతరమూ లేదు. హలాల్ ముద్ర వేసి భారత్‌లో ఎందుకు అమ్మడం?’’ అని హలాల్ నియంత్రణ్ మంచ్‌కు చెందిన పవన్ కుమార్ బీబీసీతో అన్నారు.

హలాల్‌కు వ్యతిరేకంగా ‘ఝట్కా మాంసం వ్యాపారుల సంఘం’ కూడా ఆందోళన చేస్తోంది. మాంసం వ్యాపారంలో ఝట్కా మాంస వ్యాపారులకు అవకాశమే ఉండటం లేదని ఆ సంస్థ అంటోంది.

‘‘మొత్తం వ్యాపారం హలాల్ వ్యాపారుల చేతుల్లోనే ఉంది. కానీ, సిక్కులు, దళితులు, గిరిజన తెగల్లో చాలా మంది ఝట్కా మాంసమే తినాలని అనుకుంటారు. హలాల్‌తోపాటు ఝట్కా మాంసానికి కూడా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినప్పుడే మార్కెట్‌లో అందరికీ న్యాయం జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించింది.

మాంసం దుకాణాలు, హోటళ్లు, ఢాబాలు తాము అమ్మే మాంసం ఏ రకమైనదో వినియోగదారులకు తెలిసేలా స్పష్టంగా బోర్డులపై తప్పనిసరిగా రాయాలని దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధన పెట్టింది.

ఇది మంచి పద్ధతి అని, దీన్ని పాటిస్తే జనాలు తమ ఇష్టానికి అనుగుణంగా దుకాణాలకు, హోటళ్లకు వెళ్లగలుగుతారని హరిందర్ సిక్కా అన్నారు.

జంతు మాంసం

2019-20 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 23 వేల కోట్ల రూపాయల మేర గొడ్డు మాంసం భారత్ నుంచి ఎగుమతైందని, ఇందులో ఎక్కువ భాగం వియత్నాంకు వెళ్లిందని గణాంకాలు సూచిస్తున్నాయి.

మలేసియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, హాంకాంగ్, మయన్మార్, యూఏఈలకు కూడా ఈ మాంసం ఎగుమతి అవుతోంది.

‘‘వియత్నాంకు 7,600 కోట్ల రూపాయల విలువైన మాంసం ఎగుమతి అవుతోంది. హాంకాంగ్‌కూ పెద్ద మొత్తంలో వెళ్తుంది. వీటికి హలాల్ మాంసం పంపించాల్సిన అవసరం ఏంటి?’’ అని వీహెచ్‌పీ ప్రశ్నిస్తోంది.

వియత్నాం, హాంకాంగ్‌లకు ఝట్కా మాంసం కూడా పంపించవచ్చని, దీంతో ఝట్కా మాంస వ్యాపారులకు కూడా అవకాశం కల్పించినట్లవుతుందని హరిందర్ సిక్కా అన్నారు.

ఈ సౌలభ్యం లేకపోవడంతో, ఝట్కా వ్యాపారులు ఏళ్లుగా అన్యాయంగా ఎంతో నష్టపోవాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

హలాల్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న మొత్తం వ్యవస్థపై విచారణ జరపాల్సి ఉందని వీహెచ్‌పీ అంటోంది.

హలాల్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని... దేశ భద్రతకు ముప్పును పెంచే శక్తులకు, సంస్థలకు దీని ద్వారా లబ్ధి జరుగుతోందని ఆ సంస్థ ఆరోపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)