పశ్చిమ బెంగాల్: ‘జై శ్రీరాం’ అంటే తృణమూల్ కాంగ్రెస్‌కు కోపం ఎందుకు?

జై శ్రీరాం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇప్పుడు ‘జైశ్రీరాం’ ఇప్పుడు నినాదం మాత్రమే కాదు... రాజకీయాంశం కూడా.

మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రోజూ బీజేపీ ప్రచార సభల్లో ‘జై శ్రీరాం’ నినాదాలు మార్మోగుతున్నాయి.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు.

అక్కడ ఓ ప్రచార సభలో మాట్లాడుతూ... ‘‘బెంగాల్‌లో ఇప్పుడు ‘జై శ్రీరాం’ అనడమే నేరమనే వాతావరణం వచ్చింది. మమతా దీదీ... జై శ్రీరాం అని బెంగాల్‌లో అనకుండా, పాకిస్తాన్‌లో అనమంటారా?’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

జై శ్రీరాం అని నినాదాలు చేస్తూ, సభలో ఉన్నవారితోనూ అనిపించారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు ‘జై శ్రీరాం’ నినాదాన్ని ఉపయోగించుకోవడం బీజేపీకి ఇదే మొదటిసారి కాదు.

మహువా మోయిత్రా
ఫొటో క్యాప్షన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా

తృణమూల్ కాంగ్రెస్‌కు ఎందుకు అభ్యంతరం?

బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది.

‘జై శ్రీరాం’ నినాదం వల్ల తృణమూల్ పార్టీకి వచ్చిన ఇబ్బందేమిటని ఆమెను ప్రశ్నించింది.

‘‘మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, మతం అనేది వ్యక్తిగత విషయమని మేం అంటున్నాం. ‘జై శ్రీరాం’, ‘జై మా కాలీ’, ‘జై మా దుర్గా’ అనడంలో మాకు ఎలాంటి సమస్యా లేదు. మేం దుర్గా మాత పూజలు చేస్తాం. హిందూ ధర్మాన్ని పాటించమని ఎలా అంటారు. జై శ్రీరాం అనేవాళ్లను అననివ్వండి. కానీ, మీరు ‘జై శ్రీరాం’ అని ఎందుకు అంటున్నారు? మిమ్మల్ని మీరు హిందువులు అని చూపించుకోవాలనా? మైనార్టీ వర్గాలను భయపెట్టాలనా? అలా అయితే, మాకు సమస్యే’’ అని మహువా మోయిత్రా సమాధానం ఇచ్చారు.

పార్లమెంటులో మహువా ఇచ్చే ప్రసంగాలు చాలా సార్లు చర్చనీయమయ్యాయి.

మమత బెనర్జీ

ఫొటో సోర్స్, Sanjay Das/BBC

‘‘సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ‘జై హింద్’ నినాదాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మత నినాదంగా మార్చింది’’ అని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా మహువా మోయిత్రా వ్యాఖ్యానించారు.

సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నినాదాలు చేయడంతో ఆగ్రహంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రసంగమే ఇవ్వలేదు.

మమత ఇలా చేయడం సరైనదేనా అన్న ప్రశ్నకు... ‘‘ఆమె సరిగ్గా వ్యవహరించారు. మమతా పశ్చిమ బెంగాల్ సీఎం. అది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించాలనుకుంటే, సవరించనివ్వండి. వాళ్ల దగ్గర మెజార్టీ ఉంది. రాజ్యాంగంలో నుంచి ‘లౌకిక’ అన్న పదం తీసేసి, దీన్ని హిందూ దేశంగా మార్చండి. అప్పుడు ఏ సమస్యా ఉండదు. మన రాజ్యాంగంలో ‘లౌకిక’ అన్న పదం ఉన్నంతవరకూ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో మతపరమైన నినాదాలు చేయకూడదు’’ అని మహువా మోయిత్రా అన్నారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, NURPHOTO

పశ్చిమ బెంగాల్‌లో శ్రీరాముడి చుట్టూ చాలా కాలాంగా రాజకీయాలు జరుగుతున్నాయి.

2018లో శ్రీరామనవమి సందర్భంగా ఆసన్సోల్, రానీగంజ్, పురులియా, 24 పరగనా జిల్లాల్లో మతపరమైన హింస చెలరేగింది. చాలా మంది ప్రాణాలు పోయాయి.

2019లో ఉత్తర 24 పరగనా జిల్లాలో ఓ ధర్నాలో పాల్గొనేందుకు మమతా వెళ్తున్న సమయంలో ఆమె కాన్వాయ్ వెళ్తున్నప్పుడు కొంతమంది ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ విషయమై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు మిదనాపూర్‌లోనూ ఆమెకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

అయితే, బీజేపీ రాముడి పేరు ఎత్తుకుంటే, తృణమూల్ పోటీగా కృష్ణుడి పేరుతో నినాదం ఎత్తుకుంది. ‘జై శ్రీరాం’కు పోటీగా ‘హరే కృష్ణ హరే హరే... తృణమూల్ ఘోరే ఘోరే’ అని నినాదం చేస్తోంది.

ఇది హిందూ ఓటు బ్యాంకు ప్రసన్నం చేసుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నమా?

ఈ ప్రశ్నకు బదులుగా... ‘‘ఇది కేవలం ఎన్నికల నినాదం. మేం మీ (బీజేపీ) నినాదం చేయం. మా నినాదం చేసుకుంటాం. రాముడు బీజేపీ సొత్తు కాదు. ఆర్ఎస్ఎస్ సొత్తూ కాదు. రాముడిని ఎలా పూజించుకోవాలో ఎవరికి వారు నిర్ణయించుకుంటారు. ఇంట్లో జై కొట్టాలా, రోడ్డు మీద జై కొట్టాలా, ఎప్పుడు జై కొట్టాలి... ఎవరి ఇష్టం వారిది. మమ్మల్ని ఎవరూ బలవంతపెట్టకూడదు’’ అని మహువా మోయిత్రా అన్నారు.

జై శ్రీరాం

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల బుజ్జగింపు చర్యలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.

ఈ ఆరోపణలపై కూడా మహువా మోయిత్రా స్పందించారు.

‘‘పశ్చిమ బెంగాల్‌లో ముస్లింలకు మాత్రమే వర్తించే పథకం ఒక్కటి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలతో పోల్చితే బెంగాల్‌లో మైనార్టీలకు కేటాయిస్తున్న బడ్జెట్ కూడా తక్కువే. రాష్ట్రంలో 28 శాతం ముస్లింలు ఉన్నారు. మేం ఎవరినీ బుజ్జగించడం లేదు. కరీంపూర్ ప్రాంతంలో ముస్లింలు మెజార్టీ. అక్కడ ఇళ్లు మంజూరు చేస్తే, ముస్లింలకు ఎక్కువగా రావొచ్చు. దాన్ని చూపించి, మీరు మేం ముస్లింలకు ఇళ్లు ఇస్తున్నామని అనలేరు. మాకు రామ్... రహీమ్‌తో సంబంధం లేదు. ఇల్లు లేని వ్యక్తికి ఇల్లు ఇస్తాం. పది ఇళ్లలో ఆరు ముస్లింలకు మంజూరైనంత మాత్రాన అది బుజ్జగింపు కాదు. అందరి సంక్షేమం చూడటమే అవుతుంది’’ అని ఆమె అన్నారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా తృణమూల్, బీజేపీల మధ్యే ఉండబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వామపక్షాలు, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించాయి.

వామపక్షాలు, కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో భవిష్యత్తే కనిపించడం లేదని మహువా మోయిత్రా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నెం.2గా అవతరించిన మాట వాస్తవమేనని అంగీకరించారు.

ఇక వ్యవసాయ చట్టాల ప్రభావం పశ్చిమ బెంగాల్‌లోనూ కనిపిస్తుందని, రాష్ట్రంలో బీజేపీ నష్టపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని రైతులు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని ఆమె అన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)