మైనారిటీలకు రక్షణ కల్పించడంలో పాకిస్తాన్ విఫలం అవుతోందా?

హిందూ ప్రార్థనా స్థలం విధ్వంసం

ఫొటో సోర్స్, Waseem Khatak

    • రచయిత, ఎం ఇలియాస్ ఖాన్
    • హోదా, బీబీసీ న్యూస్, ఇస్లామాబాద్

పాకిస్తాన్‌లో వందేళ్లనాటి హిందూ మతగురువు సమాధిని ముస్లిం మూక ధ్వంసం చేసింది. ఇది డిసెంబరులో హిందూ ప్రార్థనా స్థలాలపై పాక్‌లో జరిగిన రెండో దాడి.

వాయువ్య పాకిస్తాన్‌లో కరక్ జిల్లాలోని శ్రీ పరమహంస మహారాజ్‌కు చెందిన ఈ సమాధిని పునర్నిర్మించాలని అధికారులకు పాక్ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే, అల్లరి మూక చేసిన దాడితో ఇక్కడి హిందువుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. మరోవైపు మైనారిటీల ప్రార్థనా స్థలాలను పరిరక్షించడంలో పాక్ ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

పాకిస్తాన్‌లో ముస్లింలదే ఆధిక్యత. ఇక్కడ హిందూ జనాభా 2 శాతం కంటే తక్కువే ఉంటుంది. హిందువులు ఇక్కడ వివక్షను ఎదుర్కొంటున్నారని ఎప్పటికప్పుడే వార్తలు వస్తుంటాయి.

1997లో పరమహంస సమాధిపై ఒకసారి ముస్లిం మూక దాడి చేసింది. దీన్ని పునర్నిర్మించాలని 2015లో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి పూర్తికాకముందే తాజాగా మరో దాడి జరిగింది.

ఇక్కడకు వచ్చే హిందూ యాత్రికులు విశ్రాంతి తీసుకొనేందుకు పరిసరాల్లోని ఓ ఇంటిని కొనుగోలు చేసి మార్పులు చేస్తున్నారు. అయితే, సమాధిని విస్తరిస్తున్నారని ఆరోపిస్తూ ముస్లిం అల్లరి మూక దాడి చేసింది.

హిందూ ప్రార్థనా స్థలం విధ్వంసం

ఫొటో సోర్స్, Waseem Khatak

దాడి ఎలా జరిగింది?

జమియాతే ఉలేమా ఇస్లాం పార్టీ నాయకుడు, ముస్లిం మతగురువు మౌల్వి మొహమ్మద్ షరీఫ్ నేతృత్వంలో డిసెంబరు 30న ఓ ర్యాలీ జరిగింది. 1997లోనూ ఈయన ఆధ్వర్యంలోనే పరమహంస సమాధిపై దాడి జరిగింది.

జనాలను షరీఫే సమీకరించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాధి గోడలు కూలగొట్టాలని, అన్నింటికి నిప్పు పెట్టాలని ఆయన రెచ్చగొట్టినట్లు వివరిస్తున్నారు.

ఈ ఘటనపై ప్రభుత్వానికి పాకిస్తాన్ మైనారిటీ హక్కుల కమిషన్ ఓ నివేదిక సమర్పించింది. అమూల్యమైన ఆభరణాలను అల్లరి మూక ధ్వంసం చేసిందని దీనిలో పేర్కొన్నారు. చెక్కతో చేసిన తలుపులు, తెల్లని మార్బుల్ పలకలు... ఇలా అన్నింటినీ ధ్వంసం చేశారని తెలిపారు.

‘‘మొత్తంగా చెప్పాలంటే సమాధిని పూర్తిగా ధ్వంసం చేశారు’’అని నివేదికలో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ర్యాలీ సమయంలో సమాధి పరిసరాల్లో పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు. కానీ వారు విధ్వంసాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. వారు తమకు పట్టనట్లుగా వ్యవహరించారని పాక్ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలతో అంతర్జాతీయంగా పాక్ ప్రతిష్ఠ మసకబారుతుందని ఆయన అన్నారు.

ఈ దాడికి సంబంధించి 109 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మౌల్వి షరీఫ్‌ కూడా ఉన్నారు. ఆ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సీ, డీఎస్పీ సహా 92 మంది పోలీసు అధికారుల్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.

‘‘ఆ సమయంలో ఘటన స్థలంలో 92 మంది పోలీసు అధికారులు ఉన్నారు. వారు చాలా నిర్లక్ష్యంగా, పిరికి పందల్లా వ్యవహరించారు’’అని స్థానిక పోలీసు ఐజీ సనావుల్లా అబ్బాసీ వ్యాఖ్యానించారు.

దాడి జరిగే సమయంలో అక్కడ హిందువులు ఎవరూ లేరు. ఈ పరిసర ప్రాంతాల్లో హిందువులు ఎవరూ నివసించరు. వారు కేవలం యాత్రకు మాత్రమే వస్తారు. దాడిలో ఎవరూ గాయపడలేదు. ఎలాంటి మరణాలు సంభవించలేదు.

పాకిస్తాన్‌

వివాదం ఎందుకు?

టెరీ గ్రామంలో ఈ సమాధి ఉంది. 1919లో దీన్ని నిర్మించారు. అంటే భారత్, పాకిస్తాన్‌లను బ్రిటిష్‌వారు విభజించకముందే దీని నిర్మాణం జరిగింది. దేశ విభజన సమయంలో చాలా మంది హిందువులు భారత్‌కు తరలివెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

టెరీ గ్రామంలోనే పరమహంస సమాధి అయ్యారు. హిందూ మతగురువు అయిన ఆయనకు పాక్‌, భారత్‌తోపాటు చాలా దేశాల్లో అనుచరులు ఉన్నారు.

ఒకప్పుడు ఈ గ్రామంలో చాలా మంది హిందువులు ఉండేవారని, ఇక్కడే వారు వ్యాపారాలు చేసుకునేవారని, ముస్లింలతో వారు కలిసిమెలసి ఉండేవారని పరిశోధకుడు, జర్నలిస్టు వసీమ్ ఖటక్ చెప్పారు.

‘‘పరమహంసకు ఖురాన్‌పై కూడా మంచి పట్టు ఉండేది. తనను అనుసరించే ముస్లింలకు ఆయన ఖురాన్‌ను బోధించేవారు’’అని ఖటక్ వివరించారు.

ఇక్కడి సమాధిని సందర్శించేందుకు చాలా ప్రాంతాల నుంచి హిందువులు వస్తుంటారు. దేశాన్ని బ్రిటిష్‌వారు విభజించిన సమయంలో.. ఈ గ్రామంలోని హిందువులంతా తమ ఆస్తులను ఇక్కడే వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు.

ఇలా హిందువులు వదిలి వెళ్లిపోయిన ఆస్తుల నిర్వహణకు ప్రభుత్వం ఒక ట్రస్టును ఏర్పాటుచేసింది. అయితే ఈ సమాధిని సందర్శించేందుకు అప్పుడప్పుడు హిందూ యాత్రికులు వస్తుంటారు.

ఈ సమాధి మాత్రం ఓ పరమహంస శిష్యుడి ఆధీనంలో ఉండేది. అయితే ఆయన ఆ తర్వాత ఇస్లాంలోకి మతం మారారు. ఆయన మరణానంతరం ఆయన కొడుకులు.. 1960ల్లో ఈ ప్రాంతాన్ని రెండు ముస్లిం కుటుంబాలకు విక్రయించారు. దీంతో ఇక్కడకు హిందువులు రావడం కష్టమయ్యేది.

1990ల్లో హిందువుల్లో కొందరు సమాధిలో భాగమైన ఒక ఇల్లును కొనుగోలు చేశారు. అయితే, వారిని అమెరికా, భారత్ ఏజెంట్లుగా మౌల్వి షరీఫ్ అభివర్ణించారు. స్థానికుల్ని ఆయన రెచ్చగొట్టడంతో ఈ సమాధిపై అప్పట్లో దాడి జరిగింది.

హిందూ ప్రార్థనా స్థలం విధ్వంసం

ఫొటో సోర్స్, Waseem Khatak

ఇప్పుడు ఏం జరుగుతోంది?

దాడి జరిగిన సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.

ఇలా దాడి జరుగుతుందని పోలీసుల దగ్గర ముందే సమాచారం ఉందని సస్పెన్షన్‌కు గురైన పోలీసు అధికారుల్లో ఒకరు బీబీసీతో చెప్పారు.

‘‘మేం చర్యలు తీసుకుంటే మా ఉద్యోగాలకే ముప్పు.. పైనుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు మేం ఎలాంటి చర్యలూ తీసుకోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లోనే స్థానిక మూక చెలరేగిపోయింది’’అని ఆయన అన్నారు.

కేవలం ఈ సమాధిని పునర్నిర్మించిన మాత్రాన.. తమలో పెరిగిన భయాందోళనలు చల్లారవని స్థానిక హిందూ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా మతసామరస్యం పరిఢవిల్లేలా పిల్లల విద్యా విధానాల్లో మార్పులు చేయాలని, తోటి హిందువులను గౌరవించేలా అవగాహన కల్పించాలని వారు అంటున్నారు.

‘‘ఇది పూర్తిగా వ్యవస్థ వైఫల్యం. ఇది ఒక స్థానిక సమస్య. తేలిగ్గా దీన్ని పరిష్కరించొచ్చు. కానీ దీన్ని పట్టించుకోకపోవడంతో ఇది ఒక జాతీయ, అంతర్జాతీయ సమస్యలా మారింది’’అని పెషావర్‌లోని హిందూ నాయకుడు హరూన్ సరాబ్ దియాల్ చెప్పారు.

డిసెంబరులో ఈ సమాధిపై దాడి జరగడానికి ఒక వారం ముందు, పాకిస్తాన్‌లో మైనారిటీల స్థితిగతులు మెరుగు పడాల్సిన అవసరముందని పాక్ మైనారిటీ హక్కుల కమిషన్ ఒక సమావేశంలో పేర్కొంది. దాడిపై సమర్పించిన నివేదికలో కూడా.. ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి చాలా కృషి చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)