భారత్ - చైనా: గల్వాన్ లోయలో ఘర్షణలు ఎలా మొదలయ్యాయి.. ఆ తర్వాత ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2017లో సిక్కిం సరిహద్దుల్లో ''డోక్లాం ప్రతిష్టంభన'' అనంతరం భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్లు కనిపించింది.
రెండు దేశాల సైన్యాలు నెలలపాటు ఢీ అంటే ఢీ అంటూ ఎదురెదురుపడిన అనంతరం, విభేదాలను తొలగించేందుకు ''అనధికార సమావేశాలు'' కూడా నిర్వహించాయి.
రెండు దేశాల మధ్య సంస్కృతి, సంబంధాలను చాటిచెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒక సమావేశం అనంతరం చేతిలో చేయి కలిపి నడుచుకుంటూ వస్తూ మీడియాలో కనిపించారు.
రెండు దేశాల మధ్య చాలా అంశాల్లో వైరుద్ధ్యాలు ఉన్నప్పటికీ అంతా సవ్యంగానే జరిగింది.
తర్వాత ఒక్కసారిగా ఈ పరిస్థితులు అదుపుతప్పాయి.
ఏడాది క్రితం లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో రెండు దేశాల సైన్యాల మధ్య విధ్వంసకర ఘర్షణలు జరిగాయి. గత నాలుగు దశాబ్దాల్లో రెండు దేశాల మధ్య ఇలాంటి ఘర్షణలు ఎప్పుడూ చోటుచేసుకోలేదు.

ఫొటో సోర్స్, Getty Images
మే 10, 2020
ఇదే రోజున రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు జరిగినట్లు సంకేతాలు వచ్చాయి.
అపరిష్కృతంగా ఉన్న సరిహద్దుల్లో ఒకచోట రెండు దేశాల సైన్యాలు ఘర్షణలకు దిగినట్లు వార్తలు వచ్చాయి.
''రెండు దేశాల బలగాలు భౌతికంగా దాడులకు దిగాయి. తూర్పు లద్దాఖ్‌లో ఈ ఘర్షణలు జరిగాయి'' అని ద ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది.
మరోవైపు ఉత్తర సిక్కింలో కూడా భారత్, చైనా బలగాలు ఎదురెదురు పడినట్లు హిందుస్తాన్ టైమ్స్ తెలిపింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయని పేర్కొంది.
అయితే లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సో సరస్సు దగ్గర జరిగిన ఘర్షణల విషయంలో భారత సైనిక అధికార ప్రతినిధులు భిన్నంగా స్పందించారు.
ఈ అంశాన్ని అనవసరంగా పెద్దది చేసిచూపొద్దని జర్నలిస్టులకు భారత సైన్యం సూచించింది.
మే 14, 2020
ఈ రోజున భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణె అధికారికంగా స్పందించారు.
''ఈ రెండు ఘటనలకు ఒకదానితో మరొకదానికి సంబంధం లేదు. అలాగే అంతర్జాతీయ లేదా స్థానిక పరిణామాలతోనూ వీటికి సంబంధం లేదు. ఉత్తర సరిహద్దుల్లో అభివృద్ధి కార్యక్రమాలు సవ్యంగానే జరుగుతున్నాయని చెప్పగలను'' అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మే 21, 2020
అయితే భారత సైన్యం సరిహద్దులు దాటుతోందని గతేడాది మే 21న చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
అనంతరం భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ కూడా దీనిపై స్పందించారు.
''రోజువారీగా భారత్ చేపట్టే గస్తీ విధులకు చైనా సైన్యమే అడ్డు తగిలింది''అని అనురాగ్ చెప్పారు.
జూన్ 6, 2020
లద్దాఖ్‌లో భారత్, చైనా దౌత్యవేత్తలు, సైనిక కమాండర్లు చర్చలు జరిపారు. ఆ తర్వాత పలు దఫాలుగా సంప్రదింపులు కొనసాగాయి.
భారత్ విడుదల చేసిన ప్రకటనల్లో ఈ పరిణామాలను భారత్ ఎలా చూస్తుందో కనిపించింది.
''రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 70 ఏళ్లు. ఈ విబేధాలను త్వరగా పరిష్కరించుకుంటే, రెండు దేశాల మధ్య బంధాలు మరింత బలపడతాయని రెండు వైపులా అంగీకరించారు'' అని భారత్ చేసిన ప్రకటనలో ఉంది.
చైనా ప్రకటన ఇలా ఉంది...
''ఈ అంశాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు రెండు దేశాలు సంసిద్ధత వ్యక్తంచేశాయి'' అని చైనా పేర్కొంది.
''ఇదివరకు ఇలాంటి అంశాలను శాంతియుతంగానే పరిష్కరించుకున్నారు. అందుకే ఈ పరిణామాలను పెద్దవిగా చేసి చూపొద్దని మొదట్లో చెప్పారు'' అని ఉత్తర కమాండ్‌కు అధిపతిగా పనిచేసిన విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, MEA
జూన్ 16, 2020
ఈ రోజంతా ఊహాగానాలతో కూడిన వార్తలు కనిపించాయి. సరిహద్దుల వెంబడి వేర్వేరు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయని వార్తలు వచ్చాయి. ఈ ఊహాగానాలు క్రమంగా మరింత పెరిగాయి.
ఈ అంశాలపై మధ్యాహ్నం ఒంటిగంటకు భారత సైన్యం స్పందించింది.
''గల్వాన్ లోయలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, నిన్న విధ్వంసకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రెండు వైపులా మరణాలు సంభవించాయి. భారత్ వైపు ఒక అధికారి, ఇద్దరు సైనికులు మరణించారు'' అని భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే రాత్రి 10 గంటలకు తమ ప్రకటనలో భారత సైన్యం మార్పులు చేసింది.
''ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన 17 మంది సైనికులు అత్యధిక ఎత్తుల్లో మైనస్ ఉష్ణోగ్రతల మధ్య ఉండటంతో మరణించారు. దీంతో మొత్తంగా మరణించిన వారి సంఖ్య 20కి పెరిగింది'' అని భారత సైన్యం పేర్కొంది.
ఆ మరుసటిరోజు జూన్ 17న చైనా విదేశాంగ శాఖ కూడా స్పందించింది.
''అక్రమ కార్యకలాపాలు చేపట్టేందుకు జూన్ 15న వాస్తవాధీన రేఖను దాటుకుంటూ భారత బలగాలు వచ్చాయి. చైనా సిబ్బందిని రెచ్చగొట్టాయి. దీంతో రెండు వైపులా భౌతిక దాడులకు దిగారు. దీంతో మరణాలు సంభవించాయి'' అని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.
అయితే, తమవైపు ఎంత మంది మరణించారో చైనా వెల్లడించలేదు.
''చైనా వైపు 45 మందికిపైగా మరణించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. భారత జవాన్లు ఎవరూ మిస్ కాలేదు'' అని భారత ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి న్యూస్ సర్వీస్ తెలిపింది.
''చైనా వైపు జరుగుతున్న పరిణామాలను మనం గుర్తించలేకపోయాం. సైన్యం మాత్రమే కాదు.. రాజకీయ నాయకులూ గుర్తించలేకపోయారు. గల్వాన్ ఘర్షణలు వెలుగులోకి వచ్చిన తర్వాత పరిస్థితులు అందరికీ అర్థమయ్యాయి. అయితే వెంటనే బలగాలను అక్కడకు తరలించడాన్ని మనం మెచ్చుకోవాలి'' అని జనరల్ హూడా అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అసలు గల్వాన్ ఘర్షణలు ఎలా సంభవించాయి?
సిమ్ టాక్ అంతర్జాతీయ పరిణామాల విశ్లేషకుడిగా పనిచేస్తున్నారు. ఈ అంశంపై ఆయన నాతో మాట్లాడారు.
''మేం భిన్న ఉపగ్రహాల ద్వారా తీసిన చిత్రాలను పరిశీలించాం. గల్వాన్ లోయలో ఘర్షణలకు ముందు ఎలాంటి పరిణామాలు సంభవించాయో విశ్లేషించాం. చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి వచ్చి, తాత్కాలిక శిబిరాలను ఏర్పాటుచేశాయి. గస్తీ పాయింట్ 14 వరకు ఈ శిబిరాలు కనిపించాయి. అప్పుడే ఘర్షణలు చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ గస్తీ పాయింట్ దగ్గర శిబిరాలను వదిలేసి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది''
''అయితే గల్వాన్‌లో వెనక్కి వెళ్లినప్పటికీ అక్సాయ్ చిన్ ప్రాంతంలో కొత్త శిబిరాలను వారు ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది'' అని సిమ్ టాక్ చెప్పారు.
జూన్ 19, 2020
ఘర్షణలపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు.
''ఎవరినీ మన భూభాగంలోకి అడుగు పెట్టనివ్వలేదు. మన శిబిరాలు కూడా వేరేవాళ్ల నియంత్రణలోకి వెళ్లలేదు'' అని మోదీ చెప్పారు.
ఇదే సమయంలో చైనా కూడా స్పందించింది. ఏప్రిల్ 2020 నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి, భారత సేనలే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాయని ఆరోపించింది.
ఈ అంశంపై రచయిత, చైనా వాణిజ్య శాఖలో పనిచేసిన సన్ షీ.. బీబీసీతో మాట్లాడారు.
''మా సైనికులు భారత భూభాగంలోకి అడుగుపెట్టలేదని మోదీనే చెప్పారు. అయితే, ఘర్షణల వల్ల భారత బలగాలు పశ్చిమంగా మరింత ముందుకు వచ్చేశాయి. మరణాల సంఖ్యను చైనా ప్రభుత్వం ఎందుకు చెప్పలేదంటే.. ఈ విషయాన్ని మరింత పెద్దది చేయాలని చైనా భావించలేదు'' అని ఆయన అన్నారు.

జులై 3, 2020
సైనికుల్ని కలిసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్ వచ్చారు. విస్తరణ కాంక్షతో వచ్చేవారిపై మీరు పోరాడుతున్నారని మోదీ వారిని కొనియాడారు. ఆయన నేరుగా చైనా పేరును ప్రస్తావించలేదు.
ఆగస్టు 31, 2020
చైనా బలగాలను విజయవంతంగా వెనక్కి పంపించగలిగామని భారత్ ప్రకటించింది. తమ స్థానాలను పటిష్టం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిసింది.
''పక్కా ప్రణాళిక ప్రకారం ఎవరికీ తెలియకుండా చైనా ఆ ఆపరేషన్‌ను గల్వాన్ లోయలో చేపట్టాలని అనుకుంది'' అని భారత్ వైపు సైన్యాధికారులు చెప్పారు.
ఆ మరుసటి రోజు చైనా ప్రభుత్వం స్పందించింది.
''ప్యాంగ్యాంగ్ సో సరస్సుకు దక్షిణాన భారత బలగాలు మళ్లీ సరిహద్దులను ఉల్లంఘించాయి. భారత్, చైనా సరిహద్దులకు పశ్చిమాన ఉన్న రెకిన్ పర్వత ప్రాంతంలో ఈ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి'' అని ఓ ప్రకటన విడుదల చేసింది.

ఫొటో సోర్స్, ANBARASAN/BBC
సెప్టెంబరు 5, 2020
గతేడాది సెప్టెంబర్ ఐదున దృష్టంతా రష్యా వైపు మళ్లింది. మాస్కోలో రెండు దేశాల (భారత్, చైనా) రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు భేటీ అయ్యారు.
అ తర్వాత, రెండు దేశాలు ఒకరిపై మరొకరు కాల్పులు జరిపారంటూ ఆరోపణలు చేసుకున్నారు.
''పరిస్థితులు దిగజారుతున్నారు. భారత్, చైనాలకు సాయం అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం'' అని అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
సెప్టెంబరు 22, 2020
పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకుంటామని భారత్, చైనా సైన్యాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.

ఫొటో సోర్స్, ANBARASAN/BBC
జనవరి 15, 2021
సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యాధిపతి జనరల్ నరవణె మాట్లాడారు.
''మనం మన సదుపాయాలు, సామర్థ్యాల్లో కొత్తగా మార్పులు చేయాల్సిన అవసరముందని స్పష్టంగా తెలుస్తోంది'' అని ఆయన అన్నారు.
అంతేకాదు, లద్దాఖ్‌తోపాటు తూర్పు, సెంట్రల్ సెక్టార్లలోనూ కొన్నిచోట్ల ఘర్షణలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన వెల్లడించారు.
ఫిబ్రవరి 10, 2021
ఘర్షణలు జరిగిన పది నెలల తర్వాత.. ప్యాంగ్యాంగ్ సో సరస్సు దగ్గర రెండు వైపులా యుద్ధ ట్యాంకులు, బలగాలు వెనక్కి వెళ్తున్నట్లు కనిపించాయి.
ఈ ఘర్షణల్లో చైనా సైనికులు 45 మంది మరణించారని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టీఏఎస్ఎస్ ఆ రోజు ఓ కథనం ప్రచురించింది.
ఆరోజున మరణాలపై చైనా పెదవి విప్పాల్సి వచ్చింది.
తమవైపు నలుగురే చనిపోయారని చైనా ఆ రోజు వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏప్రిల్ 29, 2021
గత ఏడాది భారత్‌తో వాణిజ్య సంబంధాలు చాలా దృఢమయ్యాయని చైనా వాణిజ్య శాఖ ప్రకటించింది.
అయితే, ఇదే సమయంలో చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. భారత్‌లోకి వచ్చే చైనా సరకులపైనా ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చింది.
అయినప్పటికీ వాణిజ్యం ఎలా పెరిగింది?
ఈ అంశంపై అలీగఢ్ యూనివర్సిటీలో స్ట్రాటజీ అండ్ సెక్యూరిటీ విభాగం అధిపతి, ప్రొఫెసర్ స్వస్తి రావు మాట్లాడారు.
''2019లో అమెరికా మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కానీ 2020-21లో పరిస్థితులు మారాయి. ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ, మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా అవతరించింది''
దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.
''ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలను వేరుచేయడం సాధ్యంకాదు. అప్పుడు మన సొంత సైనికులకు హాని జరిగింది. అందుకే మనం చర్యలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయి. చైనా వస్తువులను నిషేధించాలనే నినాదాలు ఇప్పుడు మనకు వినిపించడం లేదు'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
మే 14, 2021
భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అత్యవసర సామగ్రి కోసం భారత్.. చైనాను కూడా ఆశ్రయించింది.
ఒక్క ఏప్రిల్‌లోనే 26,000 వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కు చైనా సరఫరా చేసింది. 15,000 పేషెంట్ మానిటర్లు, 3800 టన్నుల మెడికల్ సామగ్రిని చైనా పంపించింది.
మరోవైపు 70,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 30 టన్నుల వ్యాక్సీన్ ముడి పదార్థాలకు ఆర్డర్లు భారత్ నుంచి వెళ్లాయి.
ఈ అంశంపై విలేఖరుల అడిగిన ప్రశ్నలకు భారత విదేశాంగ శాఖ స్పందించింది.
''చైనా నుంచి అవసరమైన వైద్య సామగ్రిని భారత్‌కు చెందిన సంస్థలు దిగుమతి చేసుకుంటున్నాయి. కోవిడ్ వ్యాప్తి నడుమ అంతర్జాతీయ స్థాయిలో సహకారం తప్పనిసరి'' అని విదేశాంగ శాఖ వివరించింది.
జూన్ 2, 2021
''రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్లడం అనేది ఇప్పటికీ పూర్తిగా జరగలేదు'' అని విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి ఆరిందమ్ బాగ్చి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి?
''వాస్తవాధీన రేఖ సరిహద్దుల వెంబడి లక్షల మంది సైనికుల్ని మోహరించడం చాలా కష్టం. ఇప్పుడు వేసవి వచ్చింది. అంటే రెండు వైపులా గస్తీ పెరుగుతుంది. మౌలిక వసతుల నిర్మాణాల పనులు మొదలవుతాయి. దీంతో మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తారు. రెండు వైపులా అనుమానాలు ఉంటాయి. కాబట్టి పరిస్థితులు మళ్లీ అదుపు తప్పే ముప్పుంది'' అని ఉత్తర కమాండ్‌కు అధిపతిగా పనిచేసిన విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా అన్నారు.
''మే 2020కి ముందులేని ప్రాంతాల్లో ప్రస్తుతం చైనా సేనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చైనా బలగాలు ఏం చేస్తున్నాయి. మనవైపునున్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి'' అని ఆయన చెప్పారు.
ఈ ఏడాది కాలంలో అమెరికాతో భారత్ సంబంధాలు బలపడ్డాయి.
అదే సమయంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్ కూటమికి భారత్ దగ్గరైంది.
చైనాకు కళ్లెం వేసేందుకు ఇతర అగ్రదేశాలతో కలిసి భారత్ పనిచేస్తుందా?
''పశ్చిమ దేశాలతో భారత్ బంధాలు మెరుగుపడుతున్నాయని చాలా మంది అంటున్నారు. కానీ అందులో నిజంలేదు. భారత్ అన్ని ద్వారాలను తెరచిపెడుతోంది. ఎన్ని ఎక్కువ ద్వారాలను తెరిస్తే, అన్ని ఎక్కువ దేశాలతో భారత్ బంధాలు మెరుగవుతాయి. అప్పుడు ఏదైనా వివాదం వస్తే, చైనాతో చర్చలు జరిపేందుకు భారత్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. గత సంవత్సరం కూడా భారత్ ఇలానే వ్యవహరించింది'' అని తైవాన్‌కు చెందిన నేషనల్ చెంగ్చి యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పింగ్ కుయీ చెన్ అన్నారు.
(ఈ వార్త కోసం హాంకాంగ్‌లోని బీబీసీ రిపోర్టర్ మార్టిన్ చెంగ్‌షె యిప్ సాయం అందించారు)
ఇవి కూడా చదవండి:
- నకిలీ వ్యాక్సీన్లు: కరోనా టీకాలకూ తప్పని నకిలీల బెడద.. సోషల్ మీడియాలో అమ్మకం..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- కోవిడ్-19: 'మమ్మల్ని తీసుకువెళ్లి యుద్ధభూమిలో పడేశారు' - జూనియర్ డాక్టర్లు
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








