ఫ్రెంచ్ ఓపెన్ 2021: తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకున్న బార్బోరా క్రెచికోవా

బార్బోరా క్రెచికోవా

ఫొటో సోర్స్, Clive Brunskill/Getty Images

ఫొటో క్యాప్షన్, బార్బోరా క్రెచికోవా

ఫ్రెంచ్ ఓపెన్ 2021 మహిళల టెన్నిస్ ఛాంపియన్‌గా బార్బోరా క్రెచికోవా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకుంది.

ఫైనల్లో అనస్తాసియా పావ్లుచెంకోవాను 6-1, 2-6, 6-4 తేడాతో ఓడించింది.

గ్రాండ్‌స్లామ్ టోర్నమెంటుల్లో క్రెచికోవా ఐదుసార్లు డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. 2018లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకోగా, 2019 లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ గెలుచుకుంది.

ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్‌లో కూడా క్యాటరీనా సినియాకోవాతో కలిసి ఫైనల్స్‌కు చేరుకుంది.

ఫ్రెంచ్ ఓపెన్‌లో అన్‌సీడెడ్ మహిళా క్రీడాకారిణి టైటిల్ గెలుచుకోవడం వరుసగా ఇది రెండోసారి. కిందటి ఏడాది ఇగా స్వైటెక్ ఈ ఘనత సాధించింది. అంతే కాకుండా, గ్రాండ్‌స్లామ్‌ గెలుచుకున్న తొలి పోలిష్ మహిళగా ఆమె రికార్డ్ సృష్టించింది.

బార్బోరా క్రెచికోవా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బార్బోరా

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల టెన్నిస్‌లో కొత్త క్రీడాకారిణి టైటిల్ గెలుచుకోవడం వరుసగా ఇది ఆరోసారి.

2016లో గార్బిన్ ముగురూజా (స్పెయిన్‌), 2017లో యెలెనా ఒస్టాపెంకో (లాట్వియా), 2018లో సిమోనా హాలెప్ (రొమేనియా), 2019లో ఆష్లీగ్ బార్టీ (ఆస్ట్రేలియా), 2020లో ఇగా స్వైటెక్ (పోలాండ్‌), 2021లో క్రెచికోవా (చెక్ రిపబ్లిక్) ఛాంపియన్లుగా నిలిచారు.

1981 తరువాత ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ గెలుచుకున్న మొదటి చెక్ మహిళగా క్రెచికోవా నిలిచింది. 1981లో హన్నా మండికోవా (చెక్ రిపబ్లిక్) ఈ టైటిల్ సొంతం చేసుకుంది.

మరోవైపు, 50 కన్నా ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌లలో ఆడిన అనస్తాసియా పావ్లుచెంకోవా గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి.

గతంలో పావ్లుచెంకోవా జూనియర్ వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచింది. అలాగే, రెండుసార్లు జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకుంది.

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో క్రెచికోవా సులువుగా 6-1 తేడాతో మొదటి సెట్ గెలిచింది. కానీ, రెండో సెట్‌లో పావ్లుచెంకోవా 6-2తో గెలిచి సవాలు విసిరింది. చివరి సెట్‌లో క్రెచికోవా గట్టి పోటీని ఎదుర్కొంటూ 6-4 తేడాతో గెలిచింది.

नडाल, जोकोविच

ఫొటో సోర్స్, Getty Images

పురుషుల ఫ్రెంచ్ ఓపెన్ 2021

శుక్రవారం జరిగిన పురుషుల రెండో సెమీస్‌లో స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్‌ను ఓడించి సెర్బియా ఆటగాడు నోవాక్ జొకోవిచ్ ఫైనల్‌కు చేరుకున్నాడు.

ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను క్లే కోర్టులో జరిగిన ఉత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిపుణులు ప్రశంసిస్తున్నారు.

ఆదివారం జొకోవిచ్, గ్రీస్‌కు చెందిన స్టెఫానోస్ సిట్సిపాస్‌తో ఫైనల్స్‌లో తలపడనున్నాడు. సిట్సిపాస్ గ్రీస్ నుంచి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న తొలి టెన్నిస్ ఆటగాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)