నియోమి ఒసాకా: 'మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే మీడియాతో మాట్లాడలేదు'

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోని అగ్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారుల్లో రెండవ స్థానంలో ఉన్న నియోమి ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగారు. ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నమెంట్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడటానికి తిరస్కరించడం క్రీడా ప్రపంచాన్ని కదిలించింది.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే ఆమె మీడియాతో మాట్లాడకూడదనే నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయం గురించి ట్వీట్ చేస్తూ ఆమె 2018లో మొదటి సారి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నప్పటి నుంచీ చాలా కాలం పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయినట్లు చెబుతూ, కొంత సమయం ఆటకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు.
ఆమెను గతంలో ఆట నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తూ ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ జరిమానా కూడా విధించింది. పత్రికా సమావేశాలకు హాజరు కాకూడదని ఆమె తీసుకున్న నిర్ణయానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి.
కొన్ని మీడియా సంస్థలు, టెన్నిస్ క్రీడాకారుల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి.
ఈ జపాన్ హైతీకి చెందిన క్రీడాకారిణిని స్పోర్టింగ్ అధికారులు మానసికంగా కుంగిపోయేలా చేశారని యూకేలో ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీలో స్పోర్ట్ అండ్ ఎక్సర్సైజ్ సైకాలజీలో సీనియర్ లెక్చరర్ డాక్టర్ ఫ్రాన్సెస్కా కవాలెరియో అన్నారు.
ఒసాకా నిర్ణయం పట్ల వచ్చిన ప్రతికూల స్పందనల వల్ల క్రీడాకారులు తమ మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా చెప్పగలిగే ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందని ఫ్రాన్సెస్కా బీబీసీతో అన్నారు.
"ఒసాకా తీసుకున్న నిర్ణయం కంటే కూడా ఆమె నిర్ణయానికి వచ్చిన స్పందనలను చూసి నేను ఎక్కువ ఆశ్చర్యానికి గురయ్యాను. ఆమె కేవలం తన గురించి జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇదే నిర్ణయాన్ని ఒక పేరున్న అథ్లెట్ తీసుకుని ఉండకపోతే, మనం దానిని ఆమోదించి ఉండేవాళ్ళం" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని సంవత్సరాలుగా మానసిక ఆరోగ్యం చుట్టూ ఉన్న రుగ్మతలను తొలగించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మానసిక ఒత్తిడి, అసంబంద్ధమైన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడటంలో క్రీడాకారులు ఎప్పుడూ ముందుంటారని చెప్పిన ఫ్రాన్సెస్కా, "అలాంటి వాటిని మనం ప్రోత్సహిస్తాం. తిరిగి, మన ఆసక్తులకు వ్యతిరేకంగా వెళితే వారినే మనం విమర్శిస్తాం" అని అన్నారు.
"ఒక విభాగంలో అత్యధిక ప్రతిభను కనబరిచే క్రీడాకారులు ప్రజలు చేసే బహిరంగ పరిశీలనను కూడా తట్టుకోగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటారని సాధారణంగా అనుకుంటూ ఉంటాం" అని ఆమె అన్నారు.
"మీడియా నుంచి వచ్చే ఒత్తిడులకు అందరు క్రీడాకారులు ఒకేలా స్పందిస్తారని అనుకోవడం అన్యాయం. ఎవరైనా తమకు నచ్చిన క్రీడలో రాణించాలని అనుకుంటే, దాని గురించి భావోద్వేగాలను పంచుకోవడానికి కూడా అంతే ఉత్సాహంగా ఉంటారని అర్ధం కాదు" అని అన్నారు.
ఆడుతున్నప్పుడు కలిగే ఆందోళన
టెన్నిస్ కోర్టు - ప్రెస్ రూమ్: క్రీడాకారులకు ఈ రెండు ప్రదేశాలు విభిన్నమైనవి అని మానసిక నిపుణులు చెబుతున్నారు.
సెరేనా విల్లియమ్స్ తో ఆడుతున్నప్పుడు కనబరిచే ప్రతిభనే విలేఖరుల ముందు కూడా ఒసాకా ఎందుకు ప్రదర్శించాలి అని డాక్టర్ కవాలెరియో ప్రశ్నించారు.
"ఆందోళన కలిగించే వివిధ రకాల పరిస్థితులను పరిశీలిస్తున్నాం. ఒసాకా 2018 లో యూఎస్ ఓపెన్ విక్టరీలో అత్యున్నత స్థానానికి చేరినప్పుడే ఆమెకున్న మానసిక ఒత్తిడితో ఆమె పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడారు. ఆమెకు నలుగురిలో కలవాలంటే ఆందోళన ఉందని కూడా చెప్పారు. అది తగ్గడం కోసం ఆమె కోర్టులో ఉన్నప్పుడు కూడా హెడ్ ఫోన్‌లను పెట్టుకుంటారు.
టెన్నిస్ టోర్నమెంట్లు పూర్తయిన 30 నిమిషాలకు తప్పనిసరిగా విలేఖరుల సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఇవి ఆమె సమస్యలను మరింత పెంచాయి.
ఆ విలేఖరుల సమావేశాల్లో పాల్గొనకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల అయితే జరిమానాలు విధించడమో, లేదా టోర్నమెంట్ల నుంచి తప్పించడం లాంటివో చేయాలి కానీ విమర్శించకూడదని డాక్టర్ కవాలెరియో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అభిమానులకు నేరుగా సందేశాలు
మిగిలిన క్రీడాకారులు కూడా తమ సందేశాలు చేరవేయడానికి సోషల్ మీడియాకు ప్రాధాన్యం ఇచ్చి ఒసాకాను అనుసరించాలని చూస్తే, క్రీడా నిర్వాహకులకు, క్రీడా వ్యాపారానికి పెద్ద సమస్యలు తలెత్తుతాయని నిపుణులు భావిస్తున్నారు.
ఒసాకా ఆమె ప్రకటనను ట్విటర్‌లో ట్వీట్ చేశారు. సంప్రదాయ మీడియాతో మాట్లాడేందుకు ఆమె ఒత్తిడికి గురవుతానని ఆ ట్వీట్‌లో వెల్లడించారు.
"టెన్నిస్ ఆటను కవర్ చేసే మీడియా నాతో ఎప్పుడూ మర్యాదగానే ప్రవర్తించినప్పటికీ, నేను సహజంగా మాట్లాడే పబ్లిక్ స్పీకర్‌ను కాదు. నాకు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడే ముందు తీవ్రమైన ఒత్తిడి ముంచెత్తుతుంది. నేను ఎవరైనా విలేఖరులను బాధపెట్టి ఉంటే క్షమించమని అడుగుతున్నాను" అని ఒసాకా ట్వీట్ చేశారు.
"ఈ పరిస్థితి క్రీడాకారులకు ఇంత ఒత్తిడితో కూడుకున్నదెందుకు అవ్వాలి? వారందరికీ సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. వారేమనుకుంటున్నారో ఒక వీడియో రికార్డు చేసి వారికి కావల్సిన వారు చూసేందుకు ఎందుకు పోస్టు చేయకూడదు?" అని డాక్టర్ కవాలెరియో ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
"కొంత మంది తమ అదుపులో ఉండరేమోననే భయంతో ఒసాకా నిర్ణయం పట్ల ప్రతికూలంగా స్పందన ఇచ్చారా అనే అనుమానం వస్తోంది. మీడియాకు కూడా కేవలం గాసిప్, భావాలు, స్పందనల కోసం చూడకుండా క్రీడాకారులు చెప్పింది అర్ధం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది" అని ఆమె అన్నారు.
"తన తరానికి చెందిన అత్యున్నత స్థాయి క్రీడాకారిణులు భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలో ఎన్నుకునే మార్గాన్ని ఒసాకా చూపిస్తున్నారు" అని కవాలెరియో అన్నారు.
ఒసాకాకు ప్రజల నుంచి తోటి క్రీడాకారిణులు నుంచి మద్దతు లభించింది.
"ఏ విషయం మీదైనా మొదటిసారి గొంతు విప్పడానికి ఒక వ్యక్తికి సమయం పడుతుంది. ఆ తర్వాత ఇతరులు వాళ్ళని అనుసరిస్తారు. సానుకూల మార్పులు తేవడానికి అదొక అవకాశంగా చూడాలి. కానీ, టెన్నిస్ నిర్వాహకులు ఈ పరిస్థితిని సక్రమంగా అర్ధం చేసుకునే రీతిలో వ్యవహరించినట్లు లేరు" అని అన్నారు.
అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఒసాకా ఒక అవకాశం ఇస్తున్నారు. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం వల్ల ఇతరుల జీవితాల్లో మార్పు వచ్చే క్షణం వరకూ అందరూ ఈ అంశం మీద ప్రసంగాలు చేస్తూనే ఉంటారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








