అర్చన కామత్: భారత టెబుల్ టెన్నిస్‌లో అరుదైన క్రీడాకారిణి - BBC ISWOTY

అర్చన కామత్
ఫొటో క్యాప్షన్, అర్చన కామత్
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

భారత టేబుల్ టెన్నిస్ స్టార్ అర్చన గిరీశ్ కామత్ ప్ర‌స్తుతం ప్రపంచ విమెన్ డబుల్స్ టేబుల్ టెన్నిస్‌లో 24వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆమెది 36వ ర్యాంక్. 9 ఏళ్లకే టేబుల్ టెన్నిస్‌ ఆడటం మొదలుపెట్టిన అర్చన నిరంతర శ్రమతో ఈ స్థాయికి వచ్చారు. బెంగళూరులో కంటి వైద్య నిపుణులుగా పని చేస్తున్న తల్లిదండ్రులే ఆమెకు తొలి గురువులు.

నేను ఏడవ కూడదని మా అమ్మానాన్న నా చేతిలో కావాలనే ఓడిపోయేవారని కామత్‌ తెలిపారు. అలా చిన్నతనం నుంచి ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చిన తల్లిదండ్రులు ప్రపంచస్థాయికి క్రీడాకారిణిగా ఎదిగినా ఇంకా ఆమెకు వెన్నుదన్నుగా నిలిచే ఉన్నారు.

ప్రాక్టీస్‌తోపాటు, టోర్నమెంట్ల సమయంలో కూతురుకి సాయంగా ఉండేందుకు అర్చన తల్లి తన వృత్తిని కూడా వదులుకున్నారు.

తల్లిదండ్రులు ఆమె ఆటను ప్రోత్సహించినప్పటికీ, ఆమెలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించిన వ్యక్తి మాత్రం అర్చన పెద్ద‌న్న‌య్యే.

టేబుల్ టెన్నిస్‌లో ఆమె మరిన్ని టెక్నిక్‌లు నేర్చుకునేలా, ఆటను సీరియస్ కెరీర్‌గా మార్చుకునేలా అర్చ‌న అన్న ప్రోత్సహించారు. మొదట్లో సరదాగా నేర్చుకున్న క్రీడలోనే అర్చన అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.

అర్చన కామత్
ఫొటో క్యాప్షన్, అర్చన కామత్

టాకింగ్ లో దిట్ట

మొదటి నుంచి ఎటాకింగ్ మీద దృష్టిపెట్టిన అర్చన అదే ప్రాక్టీస్‌ చేస్తూ వచ్చారు. ఇది ఆమెకు ప్ర‌త్యేక‌ గుర్తింపును తెచ్చింది. తన దూకుడైన ఆటతో ఆమె రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నమెంట్లలో దూసుకు పోయారు.

2013లో జరిగిన సబ్‌ జూనియర్‌ నేషనల్‌ టోర్నమెంట్‌ ద్వారా ఆమె తన సత్తా చాటుకున్నారు. ఈ టోర్నమెంటులో గెలవడం తనలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని అంటారు అర్చన.

ఆ తర్వాత జరిగిన అనేక టోర్నమెంట్లలో ఆమె తనకన్నా సీనియర్లు, పేరున్న ఆటగాళ్లతో తలప‌డి గెలిచారు. 2018 కామన్‌వెల్త్‌ క్రీడల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన మణికా బాత్రాను కూడా అర్చన ఓడించారు.

ఇండియా టేబుల్ టెన్నిస్ ర్యాంకింగుల్లో మణికా రెండుసార్లు నెంబర్ వ‌న్‌‌ స్థానాన్ని సాధించారు. 2019లో జరిగిన సీనియర్‌ నేషనల్ గేమ్స్‌లో బాత్రాను ఓడించారు అర్చన. 18 ఏళ్ల వయసులో ఆమె నేషనల్‌ ఛాంపియన్‌ అయ్యారు.

కృషితోనే విజయాలు

2014 నుంచి అర్చన కామత్ అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్ల‌లో ఆడటం మొదలుపెట్టారు. 2016లో మొరాకోలో జరిగిన జూనియర్ అండ్ క్యాడెట్ ఓపెన్ టోర్నమెంట్‌లో ఆమె జూనియర్ గర్ల్స్ సింగిల్స్‌లో విజయం సాధించారు.

అదే సంవత్సరం స్పానిష్ జూనియర్ క్యాడెట్ ఓపెన్ టోర్నమెంట్‌లో ఆమె సెమీఫైనల్‌ వరకు వెళ్లారు. 2018లో బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన యూత్‌ ఒలింపిక్స్‌లో తాను ప్రదర్శించిన ఆటతీరు త‌న‌కు ఎంతో సంతృప్తినిచ్చిందని చెబుతారు అర్చన.

ఈ టోర్నమెంటులో ఆమె నాలుగో స్థానంలో నిలిచినా, ఇక్కడ ఆడిన అనుభవం ఎన్నో పాఠాలు నేర్పిందని అన్నారామె. 2019లో కటక్‌లో జరిగిన కామన్‌వెల్త్‌‌ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అర్చ‌న సత్తా చాటారు. జ్జానశేఖరన్ స‌త్యన్‌తో జోడీ కట్టిన ఆమె, గోల్డ్ మెడల్ సాధించారు.

ఎన్నో లక్ష్యాలు

ప్రత్యర్ధి ఆటగాళ్లకు తన దూకుడుతో ఆటలోని పదునును చూపించిన అర్చన, అనేకసార్లు గాయాలపాలయ్యారు. ఈ ఆట‌లో దూకుడుగా ఉండ‌టం ఎంత ముఖ్యమో, గాయాలు కాకుండా జాగ్రత్తపడటం కూడా అంతే ముఖ్యమంటారు అర్చ‌న‌.

ప్రస్తుతం వరల్డ్ సింగిల్స్ లో 135వ ర్యాంకులో ఉన్న అర్చన, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తీసుకురావడమే తన లక్ష్యమంటున్నారు.

2014లో కర్నాటక ప్రభుత్వం ఇచ్చే అత్యుత్తమ క్రీడా అవార్డు ఏకలవ్య అర్చనను వరించింది. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు, అవార్డులను గెలుస్తానన్న ధీమాలో ఉన్నారు అర్చన కామత్.

( అర్చనా కామత్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)