సూపర్ యాప్ అంటే ఏంటి? అవి చైనాలోనే ఎందుకు ఉన్నాయి?

స్మార్ట్ ఫోన్
    • రచయిత, కరిష్మా వాస్వానీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

మీ ఫోన్‌లో ఎన్ని యాప్‌లున్నాయి ? చాలామందిలాగే మీ దగ్గరా అనేక రకాల అప్లికేషన్లు ఉండే ఉంటాయి. కానీ ఒకే ఒక్క యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి పిజ్జా ఆర్డర్‌ దగ్గర్నుంచి టాక్సీ వరకు, ఫ్రెండ్స్‌తో చాటింగ్‌ నుంచి హెయిర్‌కట్ అపాయింట్‌మెంట్‌ వరకు అన్నీ చేసేయగలిగితే ఎలా ఉంటుంది?

ఇలా అనేక సేవలకు ప్లాట్‌ఫామ్‌గా నిలవగలిగితే దాన్నే సూపర్‌ యాప్‌ అంటారు. అలాంటి యాప్‌లు ఇప్పటికే రెండు అందుబాటులో ఉన్నాయి. వంద కోట్లమంది యూజర్లతో అత్యంత ప్రజాదరణ పొందిన వీచాట్‌ ఆ రెండింటిలో ఒకటి.

2011లో చైనాకు చెందిన టెక్‌ దిగ్గజ సంస్థ ‘టెన్సెంట్‌’ వీచాట్‌ను తయారు చేసింది. మొదట ఇది మెసేజింగ్‌ యాప్‌గా పుట్టింది. కానీ, ఇప్పుడది తనలోని మినీ ప్రోగ్రామ్‌ల ద్వారా దాదాపు 10 లక్షల సర్వీసులను ఇస్తోంది.

అనేక థర్డ్‌ పార్టీ కంపెనీలు వీచాట్‌ ద్వారా యూజర్లకు యాక్సెస్‌ ఇస్తున్నాయి. అయితే ఇందులో చాలా సర్వీసులు కేవలం చైనాలోనే అందుబాటులో ఉన్నాయి.

వీచాట్‌ తరహాలోనే సూపర్‌ యాప్‌ సర్వీసులు అందిస్తోంది. దానిపేరే ‘అలీ పే’. చైనాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ ఈ యాప్‌ను తయారు చేసింది. దీనికి కూడా వంద కోట్లమందికి పైగా యూజర్లు, లక్షా 20వేలకు పైగా థర్డ్‌ పార్టీ సర్వీసులను అందిస్తోంది.

స్మార్ట్ ఫోన్, మొబైల్ యాప్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

వీచాట్‌తో బిజినెస్‌కు బూమ్‌

వీచాట్‌కున్న సబ్‌స్క్రైబర్ల సంఖ్యను ఉపయోగించుకుని వ్యాపారంలో లాభపడొచ్చని సింగపూర్‌ కేంద్రంగా పని చేసే చైనీస్‌ వ్యాపారవేత్తలు ఎంజెలిన్‌, ఆంగీటెంగ్‌ అంటున్నారు.

“వీచాట్‌ మా జీవితంలో అంతర్భాగమైంది. అది లేకుండా ఉండలేని పరిస్థితి” అని ఎంజెలిన్‌ వ్యాఖ్యానించారు.

ఆమె రోజుకు రెండు మూడు గంటలు వీచాట్‌ను ఉపయోగిస్తారు.

“ఈ యాప్‌లోని అనేక సౌకర్యాలు నిత్య జీవితంలో అనేక పనులకు ఉపయోగపడతాయి” అన్నారామె.

మూడేళ్ల కిందట ఎంజెలిన్‌, ఆంగీటెంగ్‌లు సింగపూర్‌లోని చైనా కస్టమర్లకు ఖరీదైన మాంసాన్ని అమ్మే వ్యాపారం మొదలు పెట్టారు.

“ఈ యాప్‌లో మనం వస్తువులను కొనచ్చు. మన ఉత్పత్తులను అమ్మొచ్చు. చెల్లింపులతోపాటు అన్ని పనులూ వీచాట్‌ ద్వారా చేసుకోవచ్చు” అని అన్నారు ఎంజెలిన్‌.

తమ వ్యాపారం కోసం వీరు సంప్రదాయ అడ్వర్టైజింగ్‌ ఛానళ్లలోగానీ, సోషల్‌ మీడియాలోగాని ప్రచారం చేయలేదు. కానీ, వీచాట్ ద్వారా ప్రతి నెలా వారికి వేలాది డాలర్ల వ్యాపారం మాత్రం జరిగిపోతూనే ఉంది.

స్మార్ట్ ఫోన్, మొబైల్ యాప్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

చైనాయే ఎందుకు సూపర్‌ యాప్‌లను తయారు చేస్తోంది?

ఇంటర్నెట్‌ విప్లవాన్ని చైనా చక్కగా వినియోగించుకుంది. ప్రజలు టెలీఫోన్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు ఇక్కడ త్వరగా మారిపోయారు. ఇంటర్నెట్‌ సాయంతో పాశ్చాత్య వ్యాపారాలకు దీటుగా విలక్షణమైన మార్గాల్లో బిజినెస్‌ చేయడం చైనాలో ప్రారంభమైంది.

డేటా చట్టాలు భిన్నంగా ఉండటం కూడా చైనాలో ఇంటర్నెట్‌ ద్వారా వ్యాపార సేవలకు మరింత అవకాశం కలిగిందని బిజినెస్‌ టాక్‌షో నిర్వాహకురాలు రుయి-మా వ్యాఖ్యానించారు. ఆమె టెక్‌బజ్‌ అనే పోడ్‌కాస్ట్‌ను నిర్వహిస్తుంటారు.

“పాశ్చాత్య దేశాలలో ఇంటర్నెట్‌కు సంబంధించి అనేక నిబంధనలు ఉంటాయి. వాటి కారణంగా కంపెనీలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనాలో అలాంటి సమస్య ఉండదు” అని ఆమె అన్నారు.

అయితే అదొక్కటే కారణం కాదు. “చైనా ఇంటర్నెట్‌ కంపెనీలు ఉత్పత్తుల ఆధారంగా కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా తమ సేవలను అందిస్తాయి’’ అని రుయి-మా అన్నారు.

“యూజర్లందరూ వీలయినంత వరకు ఒకేచోట తమ పనులు చేసుకునే విధంగా వారు సర్వీసులను రూపొందిస్తారు’’ అన్నారామె.

స్మార్ట్ ఫోన్, మొబైల్ యాప్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

డేటా భద్రత మాటేంటి?

ఆన్‌లైన్‌ లైఫ్‌ అంటే అనేక ట్రాన్సాక్షన్లు, డేటా(సమాచారం)తో కూడిన విషయం. చైనా చట్టాల ప్రకారం ఒక్క వీచాట్‌ మాత్రమే కాకుండా అన్ని కంపెనీలు తమ డేటాను అధికార కమ్యూనిస్టు పార్టీకి అప్పజెప్పాల్సి ఉంటుంది.

చైనాలో వీచాట్‌ సర్వీసులపై సెన్సార్‌షిప్‌ ఉంటుందని తాము గుర్తించామని ‘ది ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌’ (ASPI) తెలిపింది. చైనా అవతల ఉండే యూజర్లకు కూడా ఈ సమస్య ఉంటుందని ఏఎస్‌పీఐ తెలిపింది.

“వీచాట్‌లో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అనేది ఉండదు. వీచాట్‌, దాని మాతృసంస్థ టెన్సెంట్‌ ఇందులో ఉన్నవారి ఎలాంటి సమాచారాన్నైనా పొందగలిగే అవకాశం ఉంది’’ అని ఏఎస్‌పీఐకి చెందిన ఆడ్రే ఫ్రిట్జ్‌ అన్నారు.

ఆయన ‘చైనా ఇంటర్నెట్‌ సంస్థలపై కమ్యూనిస్టు పార్టీ ప్రభావం’ అనే అంశం మీద ఇటీవల విడుదలైన ఏఎస్‌పీఐ నివేదిక రూపకల్పనలో పాలు పంచుకున్నారు.

“వీచాట్‌ కావచ్చు, మరో సంస్థ కావచ్చు. సైబర్‌ చట్టాల ప్రకారం వారు (ఇంటర్నెట్‌ కంపెనీలు) కమ్యూనిస్టు పార్టీ కోరితే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది” అని ఆయన వెల్లడించారు.

“ప్రభుత్వ నిబంధనలకు లోబడి మేం పని చేస్తాం. కానీ మేం యూజర్ల డేటా సెక్యూరిటీకీ, వ్యాపార విలువలకు ప్రాధాన్యమిస్తాం’’ అని టెన్సెంట్‌ కంపెనీ ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.

డేటా భద్రతలోని లోపాలవల్లే చైనా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించలేకపోతున్నాయన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే చైనా మార్కెట్ చాలా పెద్దది. ఆయా సంస్థలు బైటికి వెళ్లి వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు.

స్మార్ట్ ఫోన్, మొబైల్ యాప్

ఫొటో సోర్స్, Getty Images

ఆగ్నేయాసియా సూపర్‌ యాప్‌ను తయారు చేస్తుందా?

ప్రపంచానికంతటికీ ఉపయోగపడే సూపర్‌ యాప్‌ను తయారు చేయడంలో ఆగ్నేయాసియా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. 60 కోట్లమంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటికే అర డజన్‌ కంపెనీలు యాప్‌ తయారీలో బిజీగా ఉన్నాయి.

గ్రాబ్‌, గోజెక్‌, సీఈఏ అనే కంపెనీలు ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకుని ఉన్నాయి. చైనాకు చెందిన అలీబాబా, టెన్సెంట్‌, అమెరికాకు చెందిన ఫేస్‌బుక్‌, గూగుల్‌, పేపాల్‌లాంటి సంస్థలు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టాయి.

ఇండోనేషియాకు చెందిన ‘గోజెక్‌’ ఓ మోటార్‌ సైకిల్‌ హైరింగ్‌ కంపెనీతోపాటు కార్‌ రైడ్స్‌, పేమెంట్స్‌, ఫుడ్‌ డెలివరి తదితర సర్వీసులకు యాప్‌లు తయారు చేసింది.

"సూపర్‌ యాప్‌లు తయారు చేయడానికి ఈ ప్రాంతమే అనువైనది’’ అని గోజెక్‌ కంపెనీ అధికారి కెవిన్‌ అలువి అన్నారు.

“సింగిల్‌ యాప్‌తో అన్ని పనులు సాగించడం అనేది ప్రపంచంలో ఎక్కువమందికి నచ్చే విషయం’’ అని అన్నారాయన.

అయితే, సూపర్ యాప్‌ విషయంలో గుత్తాధిపత్యం కోరుకోవడం లేదని కెవిన్‌ అన్నారు.

“చాలా కంపెనీలు తమ యూజర్లు యాప్‌ను ఎక్కువసేపు వాడాలని కోరుకుంటాయి. మేం మాత్రం కస్టమర్లు యాప్‌ను ఓపెన్‌ చేయడం, తమ పని చేసుకోవడం, మళ్లీ క్లోజ్‌ చేసి తమ దైనందిన జీవితంలోకి వెళ్లిపోయేలా యాప్‌ ఉండాలని కోరుకుంటున్నాం’’ అన్నారు కెవిన్‌.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)