హువావే: ఈ చైనా కంపెనీపై ప్రపంచమంతా ఎందుకు కోపంగా ఉంది?

హువావే ఫోన్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టిమ్ బౌలర్, బిజినెస్ ప్రతినిధి
    • హోదా, బీబీసీ న్యూస్

చైనా ఫోన్ తయారీ కంపెనీ హువావేను తమ 5జీ నెట్‌‌వర్క్ నుంచి తొలగిస్తున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది.

దీని ప్రకారం, బ్రిటన్‌లో మొబైల్ సేవలు అందించే కంపెనీలు ఈ ఏడాది తర్వాత హువావే కొత్త 5జీ ఉపకరణాలు కొనుగోలు చేయడంపై నిషేధం ఉంటుంది. అంతే కాదు అవి 2027లోపు తమ నెట్‌వర్క్ నుంచి ఆ కంపెనీ 5జీ కిట్‌లన్నీ తొలగించాల్సి ఉంటుంది.

తమ 5జీ నెట్‌వర్క్ లో చైనా కంపెనీ హువావే పరిమిత పాత్ర పోషిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం మొదట్లో ప్రకటించింది. కానీ చైనా నుంచి భద్రతకు ముప్పు ఉందనే ఆందోళనలు పెరుగుతుండడంతో ఇప్పుడు తన మనసు మార్చుకుంది.

హువావే

ఫొటో సోర్స్, Barcroft Media

హువావే ఏంటి?

దక్షిణ చైనా షెంజన్‌లో రెన్ జంగ్‌ఫెయి అనే ఒక మాజీ సైనికాధికారి 1987లో హువావేను ప్రారంభించారు.

ఆయన మొదట మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ కోసం కమ్యూనికేషన్ పరికరాల తయారీ ప్రారంభించారు. ఆ తర్వాత అది ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగింది. అందులో లక్షా 80 వేల మంది పనిచేస్తున్నారు.

స్మార్ట్ ఫోన్లు సరఫరా చేసే కంపెనీల్లో శాంసంగ్ తర్వాత హువావే ప్రపంచంలో రెండో అతిపెద్ద కంపెనీ. ఇది 18 శాతం మార్కెట్‌ను ఆక్రమించింది. అంటే యాపిల్, మిగతా కంపెనీల కంటే ముందుంది.

హువావే ఫోన్లు

ఫొటో సోర్స్, SOPA Images

ఏ దేశాలకు ఆందోళన ఉంది?

ప్రస్తుతం చర్చంతా, పశ్చిమ దేశాలకు హువావేపై నమ్మకం ఉందా, లేదా?...మన మొబైల్ ఫోన్లు కూడా ఆ కంపెనీ గుప్పిట్లో ఉన్నాయా? అనే దానిపైనే నడుస్తోంది.

గూఢచర్యం కోసం చైనా హువావే కంపెనీ 5జీ పరికరాలను ఉపయోగించవచ్చని అమెరికా చెబుతోంది. కంపెనీ యజమాని రెన్ సైనిక నేపథ్యాన్ని కూడా అది ప్రస్తావించింది.

చైనా సైన్యం ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’లో రెన్ 9 ఏళ్లపాటు, 1983 వరకూ సభ్యుడుగా ఉన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో కూడా ఆయన సభ్యుడు.

అయితే హువావే మాత్రం “మా కంపెనీకి దానికీ ఏ సంబంధం లేదు. రెంగ్ జెంగ్‌ఫెయి యువకుడుగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలో ఏదో ఒక పదవీ బాధ్యత తీసుకోవడం తప్పనిసరి అయ్యింది" అని చెప్పింది.

అమెరికా తమ కంపెనీలు హువావేతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. దాని సహచర కంపెనీలను కూడా 5జీ నెట్‌వర్క్ నుంచి తొలగించాలని చెప్పింది. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ కూడా అమెరికా బాటలోనే నడిచాయి.

అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల కోసం బ్రిటన్‌కు హువావేను నిషేధించడం తప్పనిసరి అయ్యింది. ఎందుకంటే, అలాంటి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో భద్రతా సహకారానికే ముప్పు రావచ్చని అమెరికా హెచ్చరించింది.

కానీ ఇప్పుడు బ్రిటన్ తన 5జీ నెట్‌వర్కులో హువావే పరికరాలను నిషేధించడం వల్ల చైనా ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం కూడా పెరిగింది. వాటిలో సైబర్ దాడులు జరిపే అవకాశం కూడా ఉంది.

రేన్ జాంగ్‌పేయీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రేన్ జాంగ్‌పేయీ 1987లో ఈ కంపెనీ స్థాపించారు

5జీ: ఏంటి సమస్యలు

ప్రపంచంలో చాలా దేశాలు తమ ప్రజలకు 4జీ కంటే అత్యున్నతమైన 5జీ మొబైల్ నెట్‌వర్క్ అందించే సన్నాహాలలో ఉన్నాయి. ఈ సేవల వల్ల ప్రస్తుతం ఉన్న డౌన్‌లోడ్ స్పీడ్, 10 రెట్లు అవుతుంది. దానివల్ల మన పనుల్లో, మాట్లాడుకోవడంలో, వీడియో చూడడంలో గణనీయమైన మార్పులు వస్తాయి.

సైద్ధాంతికంగా చెప్పాలంటే, ఈ నెట్‌వర్క్ సెంట్రల్ టెక్నాలజీ నియంత్రణను ఇచ్చేయడం వల్ల భవిష్యత్తులో ఏవైనా వివాదం తలెత్తినపుడు, హువావే చేతికి గూఢచర్యం, లేదా కమ్యూనికేషన్ అడ్డుకోగలిగే పవర్ అందించినట్టు అవుతుంది.

ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే భవిష్యత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల నుంచి ఫ్రిజ్, బేబీ మానిటర్, ఫైర్ అలారంలు అన్నీ ఇంటర్‌నెట్‌తో అనుసంధానించడం జరుగుతుంది.

ప్రభుత్వ మద్దతు ఉన్న హాకర్లు ఈ పరికరాలను ఉపయోగించి ప్రతిష్టాత్మక నెట్‌వర్కులోకి దొడ్డిదారిన చొరబడవచ్చనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఉదాహరణకు హాకర్లు వీటి ద్వారా ప్రత్యర్థుల పవర్ స్టేషన్లను కూడా పనిచేయకుండా అడ్డుకోవచ్చు.

హువావే పరికరాలను నెట్‌వర్కులో ఉపయోగించడాన్ని నిషేధించడంతో బ్రిటన్ క్షేత్రస్థాయిలో 5జీ టెక్నాలజీని ఏర్పాటు చేయడంపై గణనీయమైన ప్రభావం పడనుంది.

“ఈ నిర్ణయం వల్ల 5జీ మరో రెండు మూడేళ్లు ఆలస్యం అవుతుంది, అదనంగా 2 బిలియన్ పౌండ్ల భారం పడుతుంది” అని మంత్రి ఆలివర్ డౌడెన్ చెప్పారు.

చైనా 2017 ‘నేషనల్ ఇంటెలిజెన్స్ లా’ గురించి కూడా అమెరికా చెబుతోంది. దీని ప్రకారం “నిఘా కార్యకలాపాల్లో ఏదైనా ఒక సంస్థకు దేశం మద్దతు, సహకారం తప్పనిసరి” అని చైనా చెబుతుంది. అంటే ఆ దేశం హువావేను ఎలాంటి పనులకైనా ఆదేశించవచ్చు.

హువావే

ఫొటో సోర్స్, Reuters

అటు, హువావే మాత్రం గూఢచర్యం చేయాలని తమకు ఎప్పుడూ చెప్పలేదని, తాము అలా చేయమని స్పష్టంగా చెబుతామని అంటోంది.

“సైబర్ సెక్యూరిటీ, వినియోగదారుల గోప్యత విషయానికి వస్తే, మేం దానికి ఎప్పటికీ రాజీపడడం ఉండదు. ఏ దేశానికి, సంస్థకు, వ్యక్తులకు ఎప్పుడూ ఎలాంటి నష్టం జరగనివ్వం” అని హువావే చెబుతోంది.

ఈ కంపెనీపై పర్యవేక్షణ కోసం బ్రిటన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్(ఎన్‌సీఎస్‌సీ) కింద ఒక హువావే సైబర్ సెక్యూరిటీ ఎవాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది.

చైనా ప్రభుత్వం హానికరమైన చర్యలకు పాల్పడినట్లు దానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే, 2019 మార్చిలో హువావే సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యంలో తీవ్ర లోపాలను అది గుర్తించింది.

జులై 14న నిషేధం ప్రకటించిన డౌడన్ "ఎన్‌సీఎస్‌సీ బ్రిటన్ 5జీ నెట్‌వర్కులో హువావే ఉనికిపై తన భద్రతా అంచనాలను చాలా మార్చేసింది. ఆ కంపెనీపై అమెరికా కఠిన చర్యలు తీసుకున్న తర్వాత మేం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం" అన్నారు. కానీ ఆయన దాని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

అమెరికా కొనుగోలుదారులు కచ్చితంగా అమెరికా కంపెనీల నుంచే కిట్ కొనుగోలు చేయాలనుకుంటారు. వీటిలో సిస్కో, జూనిపర్ నెట్‌వర్క్స్, క్వెల్‌కామ్ లాంటి కంపెనీలు ఉన్నాయి.

యూరప్‌లో స్వీడన్‌కు చెందిన ఎరిక్‌సన్, ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా కూడా 5జీ కిట్‌లు తయారు చేస్తున్నాయి.

బ్రిటన్ నెట్‌వర్కులో ఉన్న హువావే పరికరాలను పూర్తి వేగంతో భర్తీ చేయగల సామర్థ్యం, నైపుణ్యం తమకు ఉందని నోకియా కూడా చెబుతోంది.

అయితే, ఈ అంశంలో చాలా కంపెనీలను పరిశీలిస్తున్నామని, ఒక టెలీకాం సెక్యూరిటీ బిల్ కూడా తీసుకువస్తామని బ్రిటన్ ప్రభుత్వం చెప్పింది.

హువావే ఫోన్లు

ఫొటో సోర్స్, Getty Images

హువావే మొబైల్ ఫోన్ ఏమవుతుంది

ఈ చర్యల వల్ల హువావే స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై ఎలాంటి ప్రభావం ఉండదు..

మీరు ఒకవేళ హువావే ఫోన్ ఉపయోగిస్తుంటే, ఆ కంపెనీ మీ డేటాను దొంగిలించి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశాలు తక్కువ, కానీ అది సాధ్యమే. ఇలాంటి టెక్నాలజీ ద్వారా గూగుల్ పిక్సిల్ ఫోన్ కూడా డేటాను అమెరికా ప్రభుత్వానికి ఇవ్వవచ్చు.

గత ఏడాది మార్చిలో హువావేకు ఆండ్రాయిడ్ ఇవ్వడాన్ని గూగుల్ నిలిపివేసింది. యాపిల్ ఐఫోన్ మినహా ప్రపంచంవ్యాప్తంగా ఎక్కువ స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఆపరేషన్ సిస్టం మీదే పనిచేస్తున్నాయి.

మీ హువావే ఫోన్ ఈ నిషేధం కంటే ముందుదైతే, ఆ ఫోన్‌కు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. కానీ మీ ఫోన్ కొత్తది అయితే మాత్రం, అప్‌డేట్స్ రావు. అయితే హువావే ఇప్పుడు దానిమీదే పనిచేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)