బాలీవుడ్‌కు తెల్ల చర్మం అంటే వ్యామోహమా... ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పరిశోధన ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
బాలీవుడ్‌గా పేరు పడిన హిందీ చిత్ర పరిశ్రమ కాలంతో పాటు అభ్యుదయ మార్గం పట్టిందా? ఈ ప్రశ్నకు 'అవును - కాదు' అనే రెండు సమాధానాలు వచ్చాయి.
గత 70 సంవత్సరాల నుంచి తీసిన కొన్ని వందల చిత్రాల నుంచి సేకరించిన డైలాగ్‌లను తర్జుమా చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి చేసిన అధ్యయనంలో ఈ ఫలితాలు వచ్చాయి.
2.1 బిలియన్ డాలర్ల విలువ ఉన్న బాలీవుడ్ పరిశ్రమ ప్రతీ ఏడాది కొన్ని వందల సినిమాలను నిర్మిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల్లో బాలీవుడ్ సినిమాలకు విపరీతమైన ఆదరణ ఉంది. సినీ అభిమానులు తారలను ఆరాధిస్తారు, వారి క్షేమం కోసం ప్రార్ధనలు చేస్తారు, కొందరైతే, వారి కోసం దేవాలయాలు కూడా నిర్మిస్తారు. ఇంకొంత మంది వారి పేరుతో రక్త దానాలు కూడా చేస్తారు.
కానీ, బాలీవుడ్ సినిమాలు తిరోగమన భావాలను, స్త్రీల పట్ల ద్వేషాన్ని, వర్ణాలు, లింగ వివక్షను ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సినిమాలు చూపించే పక్షపాత ధోరణుల గురించి విస్తృత అధ్యయనం ఏమీ జరగలేదు.
ఆ లోటును భర్తీ చేయడానికి అమెరికాలోని కార్నెజి మెలాన్ యూనివర్సిటీకి చెందిన కునాల్ ఖద్లీకార్, ఆషీఖుర్ ఖుదాబక్ష్ అనే అధ్యయనకారులు 1950-2020 మధ్యలో తీసిన సినిమాల నుంచి 100 సినిమాలను ఎంపిక చేసుకుని అధ్యయనం చేశారు.
వీరిద్దరూ "బాలీవుడ్ సినిమాలకు వీరాభిమానులు" అని చెప్పుకున్నారు. సినిమాలలో సంభాషణలను తర్జుమా చేసి బాలీవుడ్ సినిమాల్లో చూపించే పక్షపాత ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందేమోనని పరిశీలించారు.
"సమాజంలో నెలకొన్న పక్షపాత ధోరణులకు సినిమాలు అద్దం పడతాయి. అవి ప్రజల జీవితాల పై తీవ్రంగా ప్రభావం కూడా చూపిస్తాయి. గత ఏడు దశాబ్దాల్లో సినిమాలో పక్షపాత ధోరణులు రూపాంతరం చెందిన విధానాన్ని వినోద రంగపు కోణంలోంచి చూసేందుకు ఈ అధ్యయనం దోహద పడింది" అని ఖుదాబక్ష్ బీబీసీకి చెప్పారు.
ప్రపంచంలో ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు అధ్యయనకారులు హాలీవుడ్ నుంచి కూడా 700 సినిమాలను, ఆస్కార్‌లో విదేశీ చిత్రాల విభాగంలో నామినేట్ అయిన 200 చిత్రాలను కూడా ఎంపిక చేసుకున్నారు.
ఈ అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన ఫలితాలు వెలుగు చూసాయి. బాలీవుడ్‌లో పక్షపాతం ఉంది. హాలీవుడ్‌లో కూడా పక్షపాతం ఉన్నప్పటికీ అది బాలీవుడ్ కంటే కాస్త తక్కువగానే ఉంది. రెండు పరిశ్రమల్లోనూ, సామాజిక పక్షపాత ధోరణులు గత ఏడు దశాబ్దాల్లో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
"ఈ 70 ఏళ్లలో మనం చాలా దూరం ప్రయాణించాం. కానీ, మనం ప్రయాణం చేయాల్సింది ఇంకా చాలా ఉంది" అని ఖద్లీకార్ బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో కుమారులకు ఇచ్చే ప్రాముఖ్యత గురించి, ఇక్కడ నెలకొన్న సామాజిక దురాచారం వరకట్నానికి సంబంధించిన అభిప్రాయాల్లో మార్పులేమైనా వచ్చాయేమోననే ప్రశ్నలను ఈ అధ్యయనంలో చేర్చారు. వీటి విషయంలో చాలా మార్పులు వచ్చినట్లు ఫలితాలు తెలిపాయి.
1950-60 లలో సినిమా కథల్లో పుట్టిన పిల్లల్లో 74 శాతం మంది మగపిల్లలే ఉండగా, 2000 సంవత్సరంలో అది 54 శాతానికి పడిపోయింది. ఇది చాలా పెద్ద మార్పు. కానీ, లింగ నిష్పత్తిలో ఇంకా తారతమ్యాలు ఉన్నాయి " అని ఖుదాబక్ష్ అన్నారు.
1961లో దేశంలో నిషేధించిన వరకట్నమే కొడుకులు కావాలనుకోవడానికి కారణమని ఆయన ఈ విధానాన్ని నిందించారు. కానీ, పెద్దలు కుదిర్చిన చాలా వివాహాల్లో, అమ్మాయిల తల్లితండ్రులు డబ్బు, నగలు, బహుమతుల రూపంలో కట్నం చెల్లిస్తూ ఉంటారు. వరకట్న వేధింపులకు గురై దేశంలో ప్రతి ఏటా కొన్ని వందల మంది మహిళలు మరణిస్తూ ఉంటారు.
"పాత సినిమాల్లో సమాజంలో ఉన్న పద్ధతులను అనుసరిస్తున్నట్లు చూపేందుకు సంకేతంగా కట్నంతో పాటు డబ్బు, అప్పు, నగలు, జీతం, ఋణం లాంటి పదాలు ఎక్కువగా వాడినట్లు డేటాబేస్ తెలిపింది. కానీ, ఆధునిక చిత్రాల్లో ఇలాంటి వాటిని ధైర్యంగా తిరస్కరించినట్లు చూపిస్తూ వాటిని తిరస్కరించడం వల్ల కలిగిన విడాకులు, కష్టం లాంటి ఫలితాలను చూపించాయి" అని ఖుదా బక్ష్ చెప్పారు.
భారతదేశంలో ఎప్పటి నుంచో తెల్లగా ఉన్న వారి పట్ల పక్షపాత ధోరణి ఉండడం వంటి విషయాల్లో మాత్రం ఎటువంటి మార్పూ లేదు అని అధ్యయనం పేర్కొంది.
ఈ అధ్యయనంలో "అందమైన మహిళకు ... రంగు ఉండాలి అని ఖాళీలకు సమాధానం పూరించమని అడిగినప్పుడు, చాలా సార్లు తెలుపు అనే సమాధానం వచ్చింది. హాలీవుడ్ సబ్ టైటిల్స్ కూడా అలాంటి ఫలితాలనే ఇచ్చాయి కానీ, అక్కడ పక్షపాత ధోరణి కాస్త తక్కువగా కనపడింది".
బాలీవుడ్‌లో ప్రతి సారీ అందం అనే అంశం తెలుపు రంగుకు దగ్గరగా ఉండేది అన్నట్లు ఈ అధ్యయనం చూపించింది.

ఫొటో సోర్స్, NurPhoto
సమాజంలో అంతర్లీనంగా ఉన్న కుల వివక్షను కూడా ఈ అధ్యయనం చూపించింది. సినిమాల్లో డాక్టర్లకు పెట్టిన ఇంటి పేర్లను విశ్లేషించినప్పుడు హిందూ అగ్ర వర్ణాల వైపు పక్షపాతం చూపించినట్లు స్పష్టంగా వెల్లడయింది. ఇటీవల కాలంలో ఇతర మతాల వారి ప్రాతినిధ్యం పెరిగింది కానీ, భారతదేశంలో మైనారిటీలుగా ఉన్న ముస్లింలకు మాత్రం సినిమాల్లో తగినంత ప్రాతినిధ్యం లభించలేదు.
"సినిమాలు తీసేవారు కూడా అగ్రవర్ణాలు, ఉన్నత వర్గాలు, ప్రధాన మతానికి చెందిన వారే కావడంతో ఆ వర్గాల వారి కోసమే సినిమాలను తీస్తున్నారు" అని సినీ విశ్లేషకురాలు శుభ్రా గుప్తా అన్నారు.
సమాజంలో తిరోగమన దిశగా పయనింపచేసే అంశాలు, స్త్రీల పట్ల ద్వేషంతో ఉండే పితృస్వామ్య సినిమాల గురించి ఆమె రాసే వ్యాసాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. "బాలీవుడ్‌లో హీరోకి చాలా సార్లు హిందూ పేర్లే ఉంటాయి. ముస్లింలను చూపించడం చాలా తక్కువగా ఉంటుంది" అని ఆమె అన్నారు.
భారతదేశంలో ప్రజలు సినిమాలను వినోదానికి, పాటలు, డాన్స్ చూసేందుకు చూస్తారు. దాంతో, సినిమాలు తీసేవారు కూడా మూస ధోరణికే కట్టుబడిపోయి ఉంటారు.
"అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు మాత్రం వినూత్నంగా ఉండి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కానీ, మరో 10 మంది మాత్రం పాత ధోరణికే కట్టుబడి ఉంటారు" అని ఆమె అన్నారు.
ఈ పరిశ్రమలో ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండరు. ప్రేక్షకులకు కావల్సిందే మేమిస్తున్నాం అని సినిమా నిర్మాతలు అంటారు. ఒకవేళ వినూత్నంగా సినిమా తీస్తే, అభిమానులు వ్యతిరేకిస్తారేమోననే భయం కూడా ఉంటుంది.
కానీ, మహమ్మారి సమయంలో ఓటిటి వేదికల పై విడుదల అవుతున్న సినిమాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుంటే, నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
"ప్రజలు మూస ధోరణిని దాటి సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారని ఒక మహమ్మారి వస్తే గాని అర్ధం కాలేదు. ప్రేక్షకులకు నిర్ణయించే శక్తి ఉందని, వారు నిర్మాతల నుంచి ఎక్కువగా డిమాండు చేస్తారని చెప్పినప్పుడు, నిర్మాతలు కూడా ఉత్తమ చిత్రాలను తీయాలి" అది జరగాలంటే బాలీవుడ్‌లో మార్పు రావాలి"
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నాం': కె.నారాయణ
- హోం థియేటర్ ఏర్పాటు చేసుకోవడానికి ఇవి ఉంటే చాలు...
- స్టార్ హీరోలు, హీరోయిన్ల మహిళా బాడీగార్డులు... ‘‘పరిస్థితి ఇలాగే ఉంటే ఆకలితో చనిపోతాం’’
- కరోనావైరస్: సినీ కార్మికులు, సాధారణ ప్రజలకు టాలీవుడ్ హీరోలు, నిర్మాతల సహాయం
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఆ రోజు అసలు ఏం జరిగిందంటే.. దాడిలో గాయపడిన CRPF జవాన్ చెప్పిన వివరాలు...
- రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి 25 ఏళ్లు ఎందుకు పట్టింది?
- అభిషేక్ బచ్చన్: కబడ్డీతో బాలీవుడ్ హీరో లవ్ అఫైర్.. ఈ గ్రామీణ క్రీడ పాపులర్ క్రీడగా ఎలా మారిందంటే...
- మియన్మార్: ప్రాణభయంతో సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్న ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








