మియన్మార్: ప్రాణభయంతో సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్న ప్రజలు

భారత్‌లో ప్రవేశిస్తున్న మియన్మార్ శరణార్థులు
ఫొటో క్యాప్షన్, భారత్‌లో ప్రవేశిస్తున్న మియన్మార్ శరణార్థులు
    • రచయిత, రాఘవేంద్ర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"వాళ్లు రాత్రిపూట ఇళ్లలోకి చొరబడి అత్యాచారం చేసి చంపేస్తుంటారు. ఇప్పటికైతే తప్పించుకుని బయటకు రాగలిగాను. కానీ, ఇలాంటి అవకాశం నాకు మళ్లీ రాకపోవచ్చు" అని 42 ఏళ్ల మఖాయి చెప్పారు.

ఆమె ప్రమాదకరమైన వర్తమానం నుంచి దిక్కు తోచని భవిష్యత్తు వైపు చూస్తున్నారు.

మియన్మార్‌లోని టాము జిల్లా నుంచి ఆమె తన అక్కచెల్లెళ్లు, కుమార్తెతో కలిసి భారతదేశ సరిహద్దుల్లోకి తల దాచుకునేందుకు పారిపోయి వచ్చారు.

ఆమెకి ప్రాణ భయం ఉంది. తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి భారత సరిహద్దుల్లోకి రావడమే ఆమె దగ్గర ఉన్న ఏకైక మార్గం

"ఈ హింస మొదలైనప్పటి నుంచి మాకు ఇంట్లో ఉండాలంటే భయం వేసేది.. ఎన్నో రాత్రుళ్లు అడవిలో తలదాచుకున్నాం’’ అన్నారామె.

మియన్మార్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత పెరుగుతున్న హింస మఖాయి లింగ్ లాంటి వారిని భారత్ వంటి పొరుగు దేశాలకు పారిపోయేలా చేస్తోంది.

భారత సరిహద్దులకు దగ్గరగా నివసిస్తున్న వారికి ఇక్కడకు రావడమే సురక్షితంగా అనిపించింది.

సింబాలిక్

ఈ మహిళలు భారతదేశం రావడానికి నిర్ణయించుకున్నప్పటికీ వారి కుటుంబాలు, పురుషులు మాత్రం అక్కడే ఉండిపోయారు.

"అవసరమైతే వారు పోరాడగలరు. సైన్యం అకస్మాత్తుగా వచ్చి మా తలుపులు తడితే మమ్మల్ని మేము రక్షించుకోలేం" అని వినీ (పేరు మార్చాం) అనే మరో మహిళ చెప్పారు. ఆమె కూడా తన టీనేజ్ కూతురితో కలిసి టాము జిల్లా నుంచి మోరెకి వలస వచ్చారు.

భారతదేశంలో ఆశ్రయం పొందేందుకు ఇది మఖాయి చేసిన మూడో ప్రయత్నం. గతంలో రెండు సార్లు భద్రతా దళాలు ఆమెను వెనక్కి పంపేశాయి.

"ఇక్కడ ఉండటం చాలా కష్టం అని నాకు తెలుసు. ఎవరైనా భారత ప్రభుత్వాధికారులు మమ్మల్ని పట్టుకుని వెనక్కి పంపిస్తారేమోననే భయం ఉంది. కానీ, నేను ధైర్యంగా ఉండాలి" అని మఖాయి అన్నారు.

మియన్మార్ నుంచి వలసలను భారతదేశం స్వాగతించడం లేదు.

ఇప్పటికే అక్రమ వలసల విషయం ఒక రాజకీయ విషయంగా మారిపోయిన పరిస్థితుల్లో మియన్మార్ జాతీయులను దేశంలోకి అనుమతించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు.

అవసరమయితే వారికి రేషన్ , వైద్య సహాయం అందిస్తాం కానీ, ఆశ్రయం కల్పించేది లేదని భారతదేశం స్పష్టంగా చెప్పింది.

నిజానికి మణిపుర్ రాష్ట్ర ప్రభుత్వం మియన్మార్ శరణార్థులకు రేషన్, వైద్య సహాయం కూడా చేయాల్సిన అవసరం లేదని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వారి కోసం శిబిరాలను కూడా ఏర్పాటు చేయనవసరం లేదని చెప్పింది.

అయితే, దీనిపై స్థానికంగా ప్రజల నుంచి వ్యతిరేకత కనిపించడచంతో ఈ ఆదేశాలను రద్దు చేశారు.

కానీ, "మా దేశంలో చోటు లేదు" అనే సందేశాన్నైతే భారతదేశం స్పష్టంగా తెలియజేస్తోంది.

భారత్, మియన్మార్ సరిహద్దు

మియన్మార్‌లో పరిస్థితులు మెరుగుపడితే వెనక్కి వెళ్లేందుకు ఆలోచిస్తామని మఖాయితో పాటు వచ్చిన మిగిలిన ఇద్దరు మహిళలు చెప్పారు. అప్పటి వరకు వారు భారతదేశంపై, ఇక్కడున్న వారి బంధువులపై ఆధారపడుతున్నారు.

మోరెకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంఫాల్‌లో ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు మియన్మార్ జాతీయులు తమకు తగిలిన బుల్లెట్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. వారు మార్చి 25న నిరసనకారులకు మియన్మార్ సైనికులకు మధ్య జరిగిన గొడవల్లో గాయాల పాలయ్యారు.

"టాములో ఉన్న ఒక నగల దుకాణాన్ని మియన్మార్ సైన్యం దోపిడీ చేయాలని చూసింది. స్థానికులు వెళ్లి వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు సైన్యం కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో నేను గాయపడ్డాను" అని ఒక వ్యక్తి చెప్పారు.

"నిరసనలను అదుపు చేయడానికి గతంలో కూడా పోలీసులు వచ్చేవారు కానీ, ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదు. సైన్యం ప్రజల మీద కాల్పులు జరపడం మొదలుపెట్టడంతో పరిస్థితి క్షీణించింది" అని కాల్పుల్లో గాయపడిన మరొక వ్యక్తి చెప్పారు.

మియన్మార్ సైన్యం కాల్పులు జరిపిన తర్వాత ఈ ఇద్దరితో పాటు మరొకరు కలిసి మొత్తం ముగ్గురు టాము నుంచి మోరెకి పారిపోయారు.

" మోరెలో ఉన్న వైద్య కేంద్రంలో ఈ గాయాలకు చికిత్స చేయడానికి తగిన సదుపాయాలు లేకపోవడంతో వారు ఇంఫాల్ వచ్చారు" అని కుకి విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు జంగోవులెన్ ఖోన్గ్సాయి చెప్పారు.

"వారు ఇక్కడకు వచ్చేటప్పటికి కదలలేని స్థితిలో ఉన్నారు. వారి శరీరమంతా బుల్లెట్లు ఉన్నాయి. వారు ఆకలితో, దాహంతో ఉన్నప్పటికీ మంచినీళ్లు కూడా తాగలేని స్థితిలో ఉన్నారు" అని ఆయన చెప్పారు.

అయితే,వీరిని చూసుకోవడానికి ఈ విద్యార్థి సంఘాల సభ్యులు 24 గంటలు శ్రమిస్తున్నారు. వారికి భోజనం కూడా ఏర్పాటుచేస్తున్నారు.

ఫిలిప్

భారతదేశపు సరిహద్దుకు కుడి వైపున ఉన్న మోరె నుంచి ఉన్న అన్ని అధికారిక మార్గాలను రెండు దేశాల్లోనూ మూసేశారు.

కొన్ని సంవత్సరాల వరకు భారతదేశానికి, మియన్మార్‌కి మధ్య ‘స్వేచ్ఛా రాకపోకల విధానం’ అమలులో ఉండేది.

దీంతో భారత్, మియన్మార్ సరిహద్దుల సమీపంలో నివసించే ప్రజలు అవతలి దేశంలో 16 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి, 14 రోజుల వరకు ఉండడానికి అవకాశం ఉండేది.

కానీ, కోవిడ్ వ్యాప్తితో మార్చి 2020 నుంచి ఈ పద్దతికి ఆటంకం కలిగింది.

ఈ ఏడాది సరిహద్దులు తెరుచుకుంటాయని రెండు దేశాల ప్రజలూ ఎదురుచూశారు కానీ, ఫిబ్రవరిలో మియన్మార్‌లో చోటు చేసుకున్న సైనిక తిరుగుబాటు వారి ఆశలను కూల్చేసింది.

కానీ, ఇదేమి తమ ప్రాణాలను రక్షించుకోవడానికి భారత భూభాగంలో అడుగు పెడుతున్న మియన్మార్ జాతీయులను ఆపలేదు.

"మాకు భారతదేశంలోకి రావడం కష్టంగా ఉంది. చాలా సార్లు మమ్మల్ని భద్రతా దళాలు ఆపేస్తారు. కానీ, ఎలాగో ఒకలా మేం ఇక్కడకు వచ్చేస్తాం. నేను బర్మాలో ఉంటాను. కానీ, ఇక్కడకు పాలు అమ్మడానికి వస్తాను. మియన్మార్‌లో కాల్పులు జరుగుతున్నాయి. బాంబులు పేలుతున్నాయి. అక్కడ అన్నీ మూసేశారు" అని ఆవు పాలు సరఫరా చేయడానికి మోరేకి ప్రతి రోజూ వచ్చే ఒక పాల వ్యాపారి చెప్పారు. అయన ఇక్కడ 20 ఇళ్లకు పాలు పోస్తారు.

మియన్మార్‌లో సైనిక తిరుగుబాటు అనంతరం ఆ దేశం తమ బలగాలలో చాలావరకు సరిహద్దుల నుంచి ఇతర ప్రాంతాలకు పంపించింది.

దాంతో, సరిహద్దులు దాటాలనుకునేవారికి పని సులభం అవుతోంది. భారతీయ సైనికులు కూడా సరిహద్దుల దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉండకపోవడంతో మియన్మార్ ప్రజలు భారత్ రావడానికి మార్గం సులభమవుతోంది.

నో మాన్స్ ల్యాండ్ దిగువ నుంచి ప్రవహించే ఒక కాలువలోంచి మియన్మార్ ప్రజలు భారత్‌లోకి వస్తున్నారు.

మణిపూర్ ఆసుపత్రిలో మియన్మార్‌ శరణార్థులు కొందరు చికిత్స పొందుతున్నారు
ఫొటో క్యాప్షన్, మణిపూర్ ఆసుపత్రిలో మియన్మార్‌ శరణార్థులు కొందరు చికిత్స పొందుతున్నారు

ఈ సరిహద్దులను అధికారికంగా మూసివేసి ఉండవచ్చు. కానీ, మోరెలో ప్రజలకు మాత్రం మియన్మార్ నుంచి వలస వచ్చే వారిపై సానుభూతి తప్ప మరేమి లేదు.

"మేం వారికి మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పిస్తాం. మేము వారికి సేవ చేస్తాం. ప్రభుత్వం మమ్మల్ని సహాయం చేయొద్దు అని చెప్పొచ్చు. కానీ, ప్రభుత్వం పనిని ప్రభుత్వం చేస్తుంది. మా పనిని మేం చేస్తాం" అని మోరె యూత్ క్లబ్ కి చెందిన ఫిలిప్ ఖోన్గ్సాయి చెప్పారు.

ఈ క్లబ్ సభ్యులు ఇప్పటికే ఇలా వలస వచ్చి సరిహద్దుల దగ్గర చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం సరఫరా చేశారు. వారిని తిరిగి వారి దేశానికి పంపించేశారు.

రానున్న రోజుల్లో మియన్మార్ నుంచి వచ్చే శరణార్ధుల సంఖ్య పెరిగే సూచనలున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశం వారికి సహాయం చేయవలసిన అవసరం ఉందని ఇక్కడ చాలా మంది భావిస్తున్నారు.

మియన్మార్ నుంచి భారతదేశానికి వచ్చే వారికి వారిని ఏ క్షణంలోనైనా తిరిగి పంపిస్తారని తెలిసినా, ఇక్కడ ఉండే ఒక్క రోజు అయినా బతుకుదాం అనే ఆశతో వారంతా ఇటు వస్తున్నారు’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)