ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''

ఉత్తరాఖండ్ జల ప్రళయం

ఫొటో సోర్స్, Reuters

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఉత్తరాఖండ్‌లోని ఒక సొరంగంలో ఆదివారం ఏడు గంటలపాటు బసంత్ బహాదుర్‌తో పాటు 12 మంది చిక్కుకుపోయారు. సొరంగానికి పైన ఉండే ఇనుప చువ్వలకు వేళాడుతూ కొంతమంది, జేసీబీపై కూర్చొని మరికొందరు సాయం కోసం ఎదురు చూశారు.

నందాదేవి గ్లేసియర్‌లో మంచు చరియలు విరిగిపడటంతో జల ప్రళయం సంభవించిన సంగతి సొరంగంలో ఉన్న వీరికి తెలియదు. అయితే, వీరున్న సొరంగంలోకి ఒక్కసారిగా బురద, శిథిలాలు, వరద నీరు దూసుకొచ్చాయి.

దీంతో తపోవన్ విష్ణుగాడ్ జలవిద్యుత్ కేంద్రంతో అనుసంధానమై ఉండే రెండు సొరంగాలూ మూసుకుపోయాయి. బసంత్‌, ఆయనతోపాటు ఉన్న అందరినీ చిన్న సొరంగం నుంచి సహాయ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.

పూర్తి అంధకారంలో గంటలపాటు చిక్కుకున్న వారు అక్కడ ఏం జరిగిందో బీబీసీకి వివరించారు.

బసంత్ బహాదుర్
ఫొటో క్యాప్షన్, బసంత్ బహాదుర్

''ఇంత భయానక పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు''

వరద నీటితో 3.8 కిలో మీటర్ల పొడవైన ఈ చిన్న సొరంగం మూసుకుపోయినప్పుడు.. బహాదుర్‌తోపాటు 12 మంది 300 మీటర్ల లోపల ఉండిపోయారు.

గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో భారీ విస్ఫోటం సంభవించి, సొరంగం మూసుకుపోయిందని తొలుత వీరు భావించారు. ఒకవేళ సొరంగం నుంచి బయటకు వస్తే, విద్యుత్ షాక్‌తో చనిపోతామని భయపడ్డారు. సొరంగం బయట నుంచి భారీగా వస్తున్న శబ్దాలతో వీరి చెవులు చాలాసేపు పనిచేయలేదు.

''అంధకారం అలముకున్న సొరంగంలోకి ఒక్కసారిగా భారీగా నీటి ప్రవాహం దూసుకువచ్చింది. దీంతో అందరం చాలా భయపడ్డాం'' అని బహాదుర్ బీబీసీతో చెప్పారు.

''ఒక్కసారిగా మేం జేసీబీ వైపు పరుగెత్తాం. దానిపైకి ఎక్కి, అలానే ఉండిపోయాం. కిందంతా చల్లని నీరు పారుతూ ఉంది. నా జీవితంలో ఇలాంటి దుర్భరమైన ఏడు గంటలను నేను ముందెన్నడూ చూడలేదు. కానీ మేం బయటపడతామనే ఆశలు కోల్పోలేదు. మాకు మేమే ధైర్యం చెప్పుకున్నాం''

నీరు ముంచెత్తిన సమయంలో, అదృష్టవశాత్తు బహాదుర్ దగ్గర ఫోన్ ఉంది.

అయితే, సొరంగంలో మొబైల్ సిగ్నల్స్ సరిగా లేవు. చివరకు, ఎలాగోలా వారు సహాయక బృందాలకు సమాచారం అందించారు. దీంతో తాళ్ల సాయంతో అందరినీ సురక్షితంగా కాపాడగలిగారు.

శ్రీనివాస్ రెడ్డి
ఫొటో క్యాప్షన్, శ్రీనివాస్ రెడ్డి

''చాలా వేగంతో నీరు వచ్చేసింది''

ప్రాణాలతో బయటపడిన వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. సొరంగంలో 350 మీటర్ల దూరంలో ఆయన పనిచేస్తున్నారు.

అయితే, ఒక్కసారిగా పక్కనున్న నదిలో నీరు ఉప్పొంగుతోందని, అందరూ బయటకు వచ్చేయాలని ఓ కార్మికుడు గట్టిగా అరిచాడు. కానీ బయటకు వచ్చేందుకు శ్రీనివాస్, ఇతర సిబ్బందికి సమయం దొరకలేదు.

''నీరు వేగంగా సొరంగంలోకి మాపైపుగా దూసుకొచ్చింది. వెంటనే సొరంగం పైకప్పుకు అమర్చిన ఇనుప రాడ్లను పట్టుకుని వేళాడాం. నీటి ప్రవాహం తగ్గేంత వరకు మేం రాడ్లను పట్టుకొని అలానే ఉన్నాం''అని శ్రీనివాస్ తెలిపారు.

ఇనుప రాడ్లను పట్టుకొని వేళాడుతూ వీరు ప్రాణాలను నిలబెట్టుకున్నారు. కొంతసేపటి తర్వాత నీటి ప్రవాహం ఉద్ధృతి తగ్గడాన్ని వీరు గమనించారు. దీంతో సొరంగం ద్వారం వైపుగా నడిచారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అయితే, అక్కడ అంతా అంధకారంగా ఉంది. ఎందుకంటే నీటి ప్రవాహంతో సొరంగ మార్గంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు లోపల చిక్కుకున్న కొందరికి శ్వాస కూడా సరిగా ఆడలేదు.

ఉత్తరాఖండ్ జల ప్రళయం

ఫొటో సోర్స్, Reuters

''మేం గడ్డకట్టే నీటిలో చిక్కుకుపోయాం. మా పాదాలు గడ్డకట్టేస్తున్నట్లు అనిపించింది. మా బూట్లన్నీ బురద, మట్టితో నిండిపోయాయి. కాళ్లు కూడా వాచిపోయాయి''అని శ్రీనివాస్ బీబీసీకి తెలిపారు.

ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు, చీకట్లో తాము పాటలు పాడుకునే వాళ్లమని శ్రీనివాస్ వివరించారు.

''నేను పాటలు పాడేవాణ్ని. అందరూ ధైర్యంగా ఉండేందుకు కవితలు కూడా చెప్పేవాణ్ని. కొంతసేపు చిన్నచిన్న కసరత్తులు కూడా చేశాం. ఎందుకంటే అందరూ అప్రమత్తంగా ఉండాలని మేం అనుకున్నాం. అప్పుడే సొరంగం నుంచి బయట పడగలమని భావించాం''అని శ్రీనివాస్ తెలిపారు.

వీరంతా సహాయక చర్యలు చేపడుతున్న వారికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, మొబైల్ సిగ్నల్ సరిగా దొరికేది కాదు. ఎట్టకేలకు ఫోన్ కలవడంతో, అందరూ సురక్షితంగా సొరంగం నుంచి బయటపడగలిగారు.

వీరేంద్ర కుమార్ గౌతమ్

''నీరు బలంగా కొట్టింది''

సహాయక సిబ్బంది చివరగా కాపాడినవారిలో వీరేంద్ర కుమార్ గౌతమ్ ఒకరు.

సొరంగం నుంచి ఆయన్ను సహాయక సిబ్బంది బయటకు తీసుకొచ్చిన తర్వాత, సంతోషంతో ఆయన చేతులు ఊపుతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

నీరు ఉప్పొంగినప్పుడు ఆయన లోపలే ఉన్నారు. ''నీరు వేగంగా మావైపు దూసుకువచ్చిన వెంటనే, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మాకు పెద్దపెద్ద శబ్దాలు వినిపించాయి''.

చీకటి ఒకవైపు, పెరుగుతున్న నీటి మట్టం మరోవైపు.. మొత్తంగా ఆ సొరంగం చాలా భయానకంగా అనిపించిందని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, ఉత్తరాఖండ్: ‘‘క్షణాల్లో వరద నీరు టన్నెల్‌ను ముంచెత్తింది. వెంటనే అంతా చీకటైపోయింది’’

కుంభవృష్టి వర్షం కారణంగా నీరు ఉప్పొంగుతోందని గౌతమ్ భావించారు. 15 నిమిషాలపాటు నీటి ప్రవాహం పెరుగుతూనే ఉందని, ఆ తర్వాత క్రమంగా తగ్గిందని ఆయన వివరించారు.

''నీటి ప్రవాహం తగ్గడం గమనించినప్పుడే, భయపడాల్సిన పనిలేదని అనుకున్నాం. అందరూ ప్రశాంతంగా ఉండాలని, తప్పకుండా సొరంగం నుంచి బయటపడతామని తోటివారికి చెప్పాను''అని ఆయన బీబీసీతో చెప్పారు.

సొరంగం పైనున్న ఇనుప రాడ్లకు వేళాడిన వీరు.. నీటి ప్రవాహం తగ్గడంతో సొరంగం ప్రవేశం వైపుగా వచ్చారు. వీరు కూడా సహాయక సిబ్బందికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వీరికి కూడా సిగ్నల్ సరిగా అందలేదు.

అయినా, వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వారి శ్రమ ఫలించి, ఫోన్ కలిసింది. వీరంతా ప్రాణాలతో బయటపడ్డారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)