సంచయిత, అశోక్‌ గజపతి రాజు: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి విషయంలో ఇన్ని వివాదాలు ఎందుకు?

మాన్సాస్ ట్రస్ట్

ఫొటో సోర్స్, MANSASEDU.ORG

    • రచయిత, శ్రీనివాస్ లక్కోజు
    • హోదా, బీబీసీ కోసం

మాన్సాస్, సింహాచలం ట్రస్టు ఛైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం. 72ను కొట్టివేస్తూ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.

గతంలో చైర్మన్‌గా పని చేసిన అశోక్‌ గజపతి రాజునే ఈ పదవిలో కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గత ఏడాది జీవో నెం.72 సంచలనంగా మారింది.

తాజా హైకోర్టు తీర్పును తెలుగుదేశం పార్టీ ఆహ్వానించగా, అప్పీలుకు వెళతామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

అసలేంటి వివాదం?

2020 మార్చిలో మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం పాలక మండలి ఛైర్‌పర్సన్‌గా ఆనంద గజపతిరాజు రెండవ కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశమిచ్చినట్టు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

మాన్సాస్‌, సింహాచ‌లం ట్రస్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను స‌వాలు చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టును ఆశ్రయించారు.

వంశ‌పార‌ంప‌ర్యంగా వ‌స్తున్న ట్రస్టు కావడంతో వ‌య‌సులో పెద్ద వారే ట్రస్టీగా ఉండాల‌ని ఆయన వాదించారు.

నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం ట్రస్టు ఛైర్మన్‌ను నియమించిందని అశోక్ గజపతిరాజు న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధ‌న‌ల ప్రకార‌మే నియామ‌కం చేశామ‌ని వాద‌న‌లు వినిపించింది.

ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టి వేసింది.

మాన్సాస్ ట్రస్ట్

ట్రస్ట్‌ ఏం చేస్తుంది?

పూసపాటి వంశీయులైన దివంగత పీవీజీ రాజు 1958లో మహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ (MANSAS)ట్రస్టును స్థాపించారు.

2016లో ఆనంద గజపతి రాజు మరణం తరువాత మాన్సాస్ ఛైర్మన్ పదవిని పీవీజీ రాజు రెండో కుమారుడు అశోక్ గజపతి రాజు చేపట్టారు.

2020 మార్చిలో ప్రభుత్వం..అశోక్ గజపతిరాజును తొలగించి.. ఆయన స్థానంలో ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతి రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో కలపి దాదాపు 55 వేల కోట్ల రూపాయలకు (ప్రస్తుత మార్కెట్ ధరను బట్టి) పైగా విలువైన 14వేల ఎకరాల ఎకరాల భూమి ఉంది.

అలాగే ఈ ట్రస్టు పరిధిలోనే సింహాచలంతోపాటు 108 ఆలయాలు ఉన్నాయి. తమిళనాడులో కూడా మాన్సాస్ ట్రస్ట్‌కు భూములున్నాయి.

అశోక గజపతి రాజు
ఫొటో క్యాప్షన్, అశోక్ గజపతి రాజు

'ఏడాదిలో ఎన్ని అవకతవకలు జరిగాయో'

మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు తీర్పును అశోక్ గజపతిరాజు స్వాగతించారు.

''నాపై ఇప్పటి ప్రభుత్వం చేసిన ఆరోపణలకు కోర్టు ఇచ్చిన తీర్పుతో సమాధానం దొరికి ఉంటుంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం ఇప్పటికైనా చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు.

''నాపై ఆరోపణలు చేశారు. సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్‌ ఉద్యోగులు, సిబ్బందిని ఇబ్బంది పెట్టారు. నా మీద కోపంతో మాన్సాస్‌ కార్యాలయాన్ని విజయనగరం నుంచి పద్మనాభం తరలించారు. నన్ను పదవి నుంచి తొలగించి ఏడాది దాటిపోయింది. ఈ కాలంలో ఎక్కడెక్కడ, ఏఏ అవకతవకలు జరిగాయో చూడాల్సిన అవసరం ఉంది'' అని అన్నారాయన.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.OFFICIAL

'భూములు కొల్లగొట్టే ప్రయత్నానికి అడ్డుకట్ట'

కోర్టు తీర్పు వేల మంది ఉద్యోగులకు అండగా నిలిచిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. న్యాయ పోరాటం ద్వారా ట్రస్టును కాపాడుకున్నారంటూ అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలిపారు.

''న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి స్పష్టమైంది. మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలోని దేవాలయ ఆస్తులు, వేల ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలన్న సీఎం ప్రయత్నాలకు న్యాయం, చట్టం అడ్డుకట్ట వేశాయి'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

'అప్పీలుకు వెళతాం'

మాన్సాస్ ట్రస్టు అంశంలో హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో అన్నారు. హైకోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్తామన్నారు. అప్పీల్లో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.

మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. కోర్టుల్లో తీర్పులు ఒక్కోసారి అనుకూలంగా, ఒక్కోసారి వ్యతిరేకంగా వస్తాయన్నారు.

''మాన్సాస్ ట్రస్ట్‌లో జరిగిన అవకతవకలను గుర్తించి, చట్ట ప్రకారం వెళ్తున్నాం. ఛైర్‌పర్సన్ నియామకంలోగానీ, ట్రస్ట్ వ్యవహారాల్లోగానీ ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదు'' అన్నారు మంత్రి వెల్లంపల్లి.

సంచయిత గజపతి రాజు

ఫొటో సోర్స్, FB/SANCHAITA GAJAPATI RAJU

ఫొటో క్యాప్షన్, సంచయిత గజపతి రాజు

'నాకు అన్ని హక్కులున్నాయి'

సంచయిత గజపతిరాజు నియమాకం చెల్లదంటూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించిన సమయంలోనే...తన నియమాకం నిబంధనల ప్రకారమే జరిగిందంటూ హైకోర్టులో సంచయిత పిటిషన్ దాఖలు చేశారు.

తీర్పు అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా వచ్చింది.

తనకు వంశపరంగా, న్యాయపరంగా ఛైర్‌పర్సన్‌ పదవిని చేపట్టేందుకు అన్ని హక్కులు ఉన్నాయని మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఛైర్‌పర్సన్ హోదాలో సంచయిత గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

తాజా హైకోర్టు తీర్పుపై సంచయిత గజపతిరాజును సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)