ఆంధ్రప్రదేశ్: కోవిడ్ రోజుల్లో పోలీసులు ఎంత సేవ చేసినా చెడ్డ పేరు ఎందుకు వస్తోంది?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
కోవిడ్ సమయంలోనూ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారా? మరి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వారు చేస్తున్న సేవల మాటేంటి? ఆంధ్రప్రదేశ్ పోలీసుల విషయంలో ఇప్పుడీ చర్చ విస్తృతంగా జరుగుతోంది.
కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న వేళ పోలీసులు తమ రెగ్యులర్ విధులతో పాటు కోవిడ్ బాధితులకు, ఈ సమస్యతో మరణించిన వారికి స్వచ్ఛంధంగా సేవలు చేశారు. ఈ కారణంగా వారి సర్వీసుకు మంచి గుర్తింపు కూడా లభించింది.
అయితే కొన్ని సంఘటనలు మాత్రం వారు చేసిన సేవనంతా మర్చిపోయి, పోలీసులంటే కఠినమైన మనుషులే అనే విధంగా ఆ శాఖకు చెడ్డ పేరు తీసుకొచ్చాయి. ఇటీవల విశాఖ పోలీసులు, అపోలో మహిళా ఉద్యోగి వివాదం తీవ్రమైన చర్చకు దారి తీసింది.
పోలీసులకు తమ రోజువారీ కార్యక్రమాలకు కోవిడ్ విధులు కూడా జత అయ్యాయి. పని రెట్టింపు అయ్యింది. అయినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తమ సిబ్బంది ఎన్నో సేవలు చేశారని ఆ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని కూడా వారు గుర్తు చేశారు.
ఒక్కోసారి పోలీసు సిబ్బంది మెకానిక్‌లుగా, డ్రైవర్లుగా కూడా సేవలు అందించాల్సి వచ్చిందని, బాధితులకు నిత్యవసరాల నుంచి మందుల పంపిణీ వంటి సేవలతో పాటు, రోగులు మరణిస్తే వారి అంత్యక్రియలు కూడా చేశారని అధికారులు చెబుతున్నారు.

విశాఖ ఘటనలో ఏం జరిగింది?
కోవిడ్ సమయంలో ఎన్ని సర్వీసులు చేసినా, కొన్ని ఘటనల కారణంగా వివాదాలు చెలరేగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అధికార ప్రతినిధి, డీఐజీ జి. పాలరాజు బీబీసీతో అన్నారు.
కోవిడ్ ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్‌లో పోలీసులు చేసిన సేవలు ఎందరికో బాసటగా నిలిచాయని...అయితే చిన్నచిన్న తప్పుల వల్ల, చేసిన సేవ కంటే ఆ సంఘటనలే ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయని పాలరాజు అన్నారు. పోలీసుల ప్రవర్తనలో కోవిడ్ చాలా మార్పు తెచ్చిందంటారాయన.
విశాఖపట్నంలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ ఉద్యోగినిపై పోలీసులు జులుం ప్రదర్శించారని ఆరోపణలు వచ్చాయి. మహిళా అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారని బాధితురాలు మీడియాకు చెప్పారు.
అయితే, కోవిడ్ సమయంలో ఉండాల్సిన అనుమతి పత్రాలను అడిగినందుకు ఆమె రాద్ధాంతం చేశారని పోలీసులు చెప్పారు. ఆ ఉద్యోగినిని పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లడానికి చేసిన ప్రయత్నం విమర్శలకు దారి తీసింది.
''విశాఖ వంటి సంఘటనలు అనుకోకుండా జరుగుతుంటాయి. దీనికి సంబంధించిన వీడియోలు చూస్తుంటే తప్పంతా పోలీసులదే అన్నట్లుగా ఉంది. అలాగని తప్పు లేదని అనడం లేదు. అక్కడ సామరస్యంగా మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సింది. నిబంధనలను అమలు చేసే క్రమంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి'' అని డీఐజీ పాలరాజు చెప్పారు.
పోలీసులంటే ప్రజల్లో ఉండే భయాన్నిఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా క్రమంగా తగ్గిస్తున్నామని పాలరాజు చెప్పారు. పోలీసులంటే మన సేవకులే అన్న భావన ప్రజల్లో పెరిగింది. వారు సాప్ట్‌స్కిల్స్ నేర్చుకుని ప్రజలతో సామరస్యంగా ఉంటున్నారని ఆయన అన్నారు.

పోలీసులకు ప్రవర్తన ముఖ్యం
ప్రజలతో మనం ఎలా వ్యవహరిస్తున్నాం అన్నది పోలీసులు తెలుసుకోవాలని ఉన్నతాధికారులు అంటున్నారు. ప్రజలతో ఎంత ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే అంత ఎక్కువ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయవచ్చని వారు చెబుతున్నారు.
''పోలీసు అంటే మనకు తెలిసిన మనిషే, మన మనిషే అనిపించుకోవాలి. అందుకే డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఎన్నో సమావేశాలు పెట్టి ఈ విషయాలను పదే పదే చెప్తుంటారు. కానీ ఇంకా కొందరు ఒత్తిడి కారణంగానో, తమకున్న అధికారం సూపర్ పవర్ అనుకునో తప్పులు చేస్తుంటారు. ఇది మొత్తం పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తోంది'' అన్నారు పాలరాజు.

కోవిడ్ పోలీసుల్లో మార్పు తెచ్చిందా?
కరోనా మహమ్మారి సమయంలో పోలీసులు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని ఆ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. కోవిడ్ రెండు దశల్లో కూడా పోలీసులు అనేక సేవ కార్యక్రమాలలో పాల్గొన్నారని, పోలీసు అంటే ఫోర్స్ కాదు సర్వీసు అనే భావన వారిలో పెరిగిందని అధికారులు భావిస్తున్నారు.
అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడం, దిక్కులేని వారికి ఆశ్రయం కల్పించడం, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను దగ్గరకు చేర్చుకోవడం వంటివి పోలీసుల ఆలోచన ధోరణిలో మార్పుకు నిదర్శనమని వారు చెబుతున్నారు.
''స్టేషన్‌కు ప్రజలు వచ్చి ఫిర్యాదులు చేస్తే తీసుకునే పోలీసులు, ఇప్పుడు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారిలో ఒకరిగా కలిసి పోతున్నారు. ఈ తరహా సేవలు వారి ప్రవర్తనలో మార్పు తెచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.'' అన్నారు పాలరాజు.

25వేల మంది పోలీసులకు కోవిడ్
గత ఏడాది నుంచి ఇప్పటి వరకు పోలీసు శాఖలోని 76 వేల మంది సిబ్బంది సర్వీసులో ఉన్నారు. వీరంతా కోవిడ్ కారణంగా రెట్టింపు సమయం విధులు నిర్వహించాల్సి వస్తోంది.
ఫస్ట్‌వేవ్‌లో దాదాపు 18 వేల మంది, సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు 7 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. మొదటి, రెండో వేవ్‌లలో 190 మంది పోలీసులను కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు గర్బిణులు కూడా ఉన్నారు.
ప్రాణాలు కోల్పోయిన వారిలో కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ ర్యాంకు వరకు ఉన్నారు. పోలీసులు కోవిడే కాదు, బ్లాక్ ఫంగస్ బారిన కూడా పడ్డారు. ఇంకా ఇప్పటీకీ చాలా మంది కరోనాతో పోరాడుతున్నారని ఉన్నతాధికారులు చెప్పారు.

పోలీసులే మెకానిక్‌లు, డ్రైవర్లు
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నప్పుడు పోలీసులు తమ విధులే కాకుండా కోవిడ్ బాధితుల కోసం అనేక ఇతర సేవలను కూడా అందించారు.
మే 23న తాడేపల్లిగూడెం కొండ్రుప్రోలు జాతీయ రహదారిపై ఆక్సిజన్ ట్యాంకర్ ఒకటి సాంకేతిక లోపంతో ఆగిపోయింది. ఈ ట్యాంకర్ విశాఖ నుంచి నెల్లూరు వెళ్తోంది.
విషయం తెలిసిన స్థానిక పోలీసులు... కొందరు మెకానిక్‌లతో కలిసి మరమ్మతు చేసి గ్రీన్ ఛానల్ ద్వారా సమయానికి ఆ ట్యాంకరును నెల్లూరు పంపించారు.
మే 6న విజయవాడకి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ రాలేదు. ఆ సమయానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఒడిశాలో బయలు దేరిన ట్యాంకర్ ట్రాకింగ్ వ్యవస్థ కూడా కట్ అయ్యింది.
ఆ ట్యాంకర్ డ్రైవర్ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సమీపంలోని ఓ దాబా వద్ద విశ్రాంతి కోసం బండిని నిలిపేశారు. ట్యాంకర్ ఆచూకీని కనుగొన్న పోలీసులు ఏ మాత్రం అలస్యం చేయకుండా...స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ విజయవాడ తీసుకొచ్చారు.
ట్యాంకర్ విజయవాడ ఆసుపత్రికి వచ్చే సమయానికి ఆక్సిజన్ కోసం ఆరు వందలమందికి పైగా బాధితులు ఎదురు చూస్తున్నారు. ''ఇటువంటి సేవలే కోవిడ్ సమయంలో పోలీసులకు మంచి పేరు తెచ్చాయి'' అని డీఐజీ పాలరాజు అన్నారు.

అనాథ శవాలకు అంత్యక్రియలు...
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కోవిడ్ బారిన మృతి చెందిన వారికి పోలీసులే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారని అధికారులు చెబుతున్నారు.
కరోనాతో చనిపోవడంతో సొంత కుటుంబ సభ్యులే భయంతో శవాలను అనాధలుగా వదిలేసే వారు. కొందరికి కుటుంబం ఉన్నా కోవిడ్ సమయంలో ఎవరు ఎక్కడున్నారో వారి వివరాలు ఏంటో కూడా తెలిసేవి కాదు. అటువంటి వారు మరణిస్తే అనాధ శవాలుగానే మిగిలి పోయేవారు. ఇటువంటి వారికి పోలీసులే స్వయంగా అంత్యక్రియలు చేశారు.
కొన్ని గ్రామాల్లో కోవిడ్‌తో మరణించిన శవాన్ని గ్రామంలోకి అనుమతించే వారు కాదు. వీరికి కూడా పోలీసులే పెద్ద మనుషులుగా వ్యవహరించి సర్ది చెప్పి ఆ గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించేలా చేసిన సందర్భాలున్నాయని పోలీసు ఉన్నతాధికారులు గుర్తు చేస్తున్నారు.

పోలీసుల కరోనా సేవలు గొప్పవే, కానీ...
కరోనా సమయంలోనే కాదు సాధారణ రోజుల్లో కూడా పోలీసుల సేవలను తక్కువ చేసే పరిస్థితి ఉండదు. ఇటీవల కాలంలో పోలీసుల ప్రవర్తనలో కూడా మార్పు కనిపిస్తోంది.
అయితే, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ జరుగుతున్న ప్రచారమంత ఫ్రెండ్లీనెస్ రియల్టీలో కనిపించడం లేదని ఏయూ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ సి. రామకృష్ణ బీబీసీతో అన్నారు. పోలీసు శాఖలో కొంత శాతం కాదు...శాఖ మొత్తం మారితేనే ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారాయన.
''చాలామంది పోలీసులకు కర్ఫూ, లాక్‌డౌన్ నిబంధనలు, నియమాలు తెలియడం లేదు. అన్నింటికి ఒకటే మంత్రం అన్నట్లు లాఠీలు ఝుళిపించడం, ఫైన్లు విధించడం లాంటివి చేస్తున్నారు. విశాఖ అపోలో ఉద్యోగినితో వివాదంలో పోలీసుల తప్పు స్పష్టంగా కనిపిస్తోంది. కోవిడ్ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఆమె ప్రవర్తించారని పోలీసులు చెబుతున్నారు. కానీ, కోవిడ్ సమయంలో అంతమంది ఒకేచోట గుమిగూడే విధంగా పోలీసులు అక్కడ ప్రవర్తించిన తీరును ఎందుకు తప్పు పట్టకూడదు?'' అన్నారు ప్రొఫెసర్ రామకృష్ణ
పోలీసులు చేసిన సేవకంటే ఇటువంటి సంఘటనలు వారి పట్ల ఉన్న అపోహలు నిజమే అన్న అభిప్రాయం ప్రజల్లో కలిగిస్తాయని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే సాఫ్ట్‌స్కిల్స్, బీహేవియర్ ద్వారా ప్రజలతో కలిసిపోవడం పోలీసులు నేర్చుకోవాలని ప్రొఫెసర్ రామకృష్ణ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అపర కుబేరులు.. సంపాదనలోనే కాదు ట్యాక్సులు ఎగ్గొట్టడంలోనూ ముందున్నారట
- సాంబారు పుట్టినిల్లు తమిళనాడా.. మహారాష్ట్రా
- సీనియర్ లీడర్‌ను పేగులు బయటకు వచ్చేలా పొడిచి చంపేశారు.. ఆగని మియన్మార్ సైన్యం అరాచకాలు
- కోవిడ్: మూడో వేవ్ నుంచి పిల్లలను కాపాడుకోవడం ఎలా
- ఆంధ్రప్రదేశ్: పంట చేతికొచ్చినా కొనేవారు లేరు, బస్తా ధాన్యానికి మూడేళ్ల నాటి రేటు కూడా లేదు
- ప్రతి నిమిషానికి 4 చెట్ల నరికివేత...గత అయిదేళ్లుగా భారత్‌లో జరిగిన పర్యావరణ ఘోరమిది.
- సెంట్రల్ విస్టా ప్రాజెక్టు: ప్రధానమంత్రి కొత్త ఇంటిపై వివాదం ఏమిటి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- వూహాన్ ల్యాబ్ లీక్ థియరీ: ‘కోవిడ్-19 సహజంగా పుట్టిందంటే నమ్మను..చైనాలో ఏం జరిగిందో దర్యాప్తు చేయాలి’
- ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాకిస్తాన్ నటికి లైంగిక వేధింపులు...అసలేం జరిగింది?
- భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








