తెలంగాణ: ‘టీ తాగి ఆమె చనిపోయింది’ - ప్రెస్ రివ్యూ

తెలంగాణలో టీ తాగి ఒక మహిళ చనిపోయారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఈనాడు దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన దంపతులు అంజమ్మ, దాసారం మల్లయ్య, అంజమ్మ మరిది భిక్షపతి రోజులాగే ఉదయం టీ తాగారు.
అంజమ్మ టీ చేసే సమయంలో టీ పొడి అనుకొని పొరపాటున పాలలో విష గుళికలు వేశారు.
టీ తాగిన 10 నిమిషాలకు ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు.
వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అంజమ్మ చనిపోయారు.
మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
కేసు నమోదు చేసి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
108 చదరపు అడుగుల స్థలానికి రూ.1.2 కోట్లు... కొన్నది తోపుడుబండిపై అరటిపళ్లు అమ్ముకునే వ్యాపారి
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో 108 చదరపు అడుగుల స్థలం వేలంలో రూ.1.20 కోట్లు పలికిందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్త రాసింది.
బుచ్చిరెడ్డిపాళెంలో 108 చదరపు అడుగుల స్థలాన్ని వేలం వేయగా అరటిపండ్లు అమ్ముకునే ఓ వ్యాపారి దాన్ని దక్కించుకున్నారు. ఆయన పేరు ఎస్‌కే జిలాని.
ముంబయి జాతీయ రహదారికి ఆనుకుని, బస్టాండ్ సెంటర్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఒకే చోట 40 ఏళ్లుగా ఆయన తోపుడు బండిపై అరటిపండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారు.
ఇటీవల అక్కడ పాత షాపులు పడగొట్టి, కొత్త వాణిజ్య సముదాయం నిర్మించాలని నిర్వాహకులు నిర్ణయించారు.
ఈ విషయం జిలాని చెవిలో పడింది. కాంప్లెక్స్ కడితే అక్కడి నుంచి తనను పంపించేస్తారని, జీవనాధారం పోతుందని ఆందోళన చెందారు.
అదే కాంప్లెక్స్‌లో ఎంతోకొంత స్థలం కొనాలని నిర్ణయించుకున్నారు. బుధవారం జరిగిన వేలంలో ఆయన కూడా పాల్గొన్నారు.
108 చదరపు అడుగుల స్థలాన్ని రూ.1.20 కోట్లకు సొంతం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కరోనా వేగం పెరిగింది... కానీ’
తెలంగాణలో కరోనా వ్యాప్తి వేగం పెరిగిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అంచనా వేసిందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనం రాసింది.
కరోనా మొదటి దశ కంటే ఇప్పుడు 30% ఎక్కువ వేగంగా వైరస్ విస్తరిస్తున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది.
ర్యాండమ్‌గా ఏదో ఒకచోట గుమిగూడిన 100 మందికి అక్కడికక్కడే పరీక్షలు చేస్తే.. అందులో అటుఇటుగా 15 నుంచి 20 మందికైనా వైరస్ బయటపడే పరిస్థితి ఉందని భావిస్తోంది.
అయితే, కరోనా పాజిటివ్ వచ్చినవారిలో 90% మందికి అసలు లక్షణాలే కనిపించడం లేదని.. ఎవరికి వైరస్ ఉందో, ఎవరికి లేదో తెలియక వారి ద్వారా ఇతరులకు వైరస్ సోకుతోందని స్పష్టం చేసింది.
వచ్చే 2 నెలల్లో భారీగానే కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటోంది.
అయితే ఇప్పుడు వస్తున్న కేసుల్లో ఆరోగ్య పరిస్థితి సీరియస్ అవుతున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశమని వైద్యాధికారులు చెబుతున్నారు.

‘రిజిస్ట్రేషన్ల ఆదాయం నెలలోనే రూ.990 కోట్లు’
కరోనా సంక్షోభం అనంతరం తెలంగాణలో రియల్‌ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో ఆస్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ వార్త రాసింది.
రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల రాబడి చివరి నాలుగు నెలల్లో భారీగా పుంజుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా మార్చి నెలాఖరు వరకు వచ్చిన ఆదాయం రూ.5,350 కోట్లు దాటినట్టు సమాచారం.
ఒక్క మార్చి నెలలోనే దాదాపు రూ.990కోట్లు వచ్చినట్టు తెలిసింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ. 276 కోట్ల రాబడి వచ్చింది. ధరణి పోర్టల్ కోసం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 14వరకు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 29 నుంచి ధరణి పోర్టల్‌లో ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 14 తరువాత రిజిస్ట్రేషన్ల జోరు పెరిగింది. మార్చిలో సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తెరిచి ఉంచారు.
మొత్తంగా ఈ ఏడాది 12 లక్షల వరకు దస్తావేజులు రిజిస్టర్ అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కరోనా సంక్షోభం వల్ల మొదటి ఆరునెలల వరకు సగానికి సగం తగ్గిన సొంత పన్నుల రాబడి ఆ తర్వాత దేశంలోనే అత్యంత వేగంతో పుంజుకుంది.
ఇవి కూడా చదవండి:
- దావూద్ ఇబ్రహీం వెంట బాలీవుడ్ ఎందుకు పరుగులు పెడుతోంది
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








