లిబర్టీ స్టీల్‌: కడప ఉక్కు జాయింట్ వెంచర్ సంస్థకు బ్రిటన్ ప్రభుత్వం ఆర్థిక సాయం ఎందుకు తిరస్కరించింది

లిబర్టీ స్టీల్‌

ఫొటో సోర్స్, LIBERTY STEEL

ఫొటో క్యాప్షన్, ఆర్ధికంగా దెబ్బతిన్న లిబర్టీ స్టీల్‌ సాయం కోసం యూకే ప్రభుత్వాన్ని అర్ధించింది.

ఆర్థికంగా దివాలా తీసిన తమ కంపెనీనిని 170 మిలియన్‌ పౌండ్ల సాయంతో ఆదుకోవాలంటూ లిబర్టీ స్టీల్‌ కంపెనీ చేసిన అభ్యర్థనను బ్రిటన్ ప్రభుత్వం తిరస్కరించింది.

రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులేదని, ఇటీవలి నష్టాలను భరించే శక్తి తమకు లేదని, ఆర్థిక సాయం చేయాలని లిబర్టీ స్టీల్‌ వ్యవస్థాపకుడు సంజీవ్‌ గుప్తా గతవారం యూకే ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరారు.

లిబర్టీ మాతృసంస్థ 'గుప్తా ఫ్యామిలీ గ్రూప్‌'(జిఎఫ్‌జి)కు యూకేలోని 12 ప్లాంట్లలో సుమారు 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

కడపలోని వైఎస్‌ఆర్‌ స్టీల్‌ కంపెనీ లిబర్టీ స్టీల్ ఇండియాను జాయింట్‌ వెంచర్‌ పార్టనర్‌గా ఎంచుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి(2021)లో ఏపీ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం వెల్లడించారు.

దివాలా పిటిషన్

గుప్తా ఫ్యామిలీ గ్రూప్‌కు ప్రధాన ఆర్ధిక వనరుగా వ్యవహరిస్తున్న గ్రీన్‌సిల్‌ క్యాపిటల్‌ అనే సంస్థ ఈ నెల ఆరంభంలోనే దివాలా పిటిషన్‌(ఐపీ) వేసింది.

ఆ కంపెనీ నిర్వహించే వ్యాపారాలో పారదర్శకత మీద తమకు కొన్ని సందేహాలున్నాయని ప్రభుత్వ వర్గాలు బీబీసీకి తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా గుప్తా కంపెనీలో 35,000మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

అధికారిక నిబంధనలను అనుసరించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రీన్‌సిల్‌ నుంచి పెద్ద మొత్తంలో ఆర్ధిక సహకారం పొందుతున్న సంస్థల్లో జీఎఫ్‌జీ ముందు వరుసలో ఉంది.

"గ్రీన్‌సిల్‌తో ఆ సంస్థకున్న సంబంధాలను బట్టి చూస్తే ఇది చాలా క్లిష్టమైన వ్యవహారం. అయితే ఇలా జరుగుతుందని ఊహించడం పెద్ద కష్టం కాదు. ఆ సంస్థ ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, దేశీయ స్టీల్‌ ఉత్పత్తిలో ఆ సంస్థ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయం కోసం ఆలోచించేందుకు ప్రభుత్వం రెండు మూడు వారాల సమయం తీసుకుంటుంది" అని బ్రిటన్‌ మంత్రి లూసీ పావెల్‌ బీబీసీకి వెల్లడించారు.

గ్రాఫిక్

బ్రిటన్‌లోని రోథర్‌హామ్‌లోని స్టీల్‌ కంపెనీ ఉద్యోగులకు ఈ పరిస్థితి గురించి ముందుగానే అవగాహన ఉంది. ఒకరకంగా ఇది యూకే ఉక్కు పరిశ్రమకు గడ్డుకాలం.

ఇప్పటికే అనేక ప్రముఖ పరిశ్రమలు మూతపడే దశలో చేతులు మారాయి. నాలుగేళ్ల కిందటే సంజీవ్‌ గుప్తా రోథర్‌హామ్‌లో లిబర్టీ స్టీల్‌ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు

ఇప్పుడాయన యూకేలో ఉన్న తన అన్ని కంపెనీలకు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు యూకే ప్రభుత్వం ఆయన ప్రతిపాదనను తిరస్కరించినంత మాత్రాన ఆయనకు దారులు మూసుకుపోయినట్లు కాదు. ఆ సంస్థలో ఐదు వేలమంది పని చేస్తున్నారు. అది కూడా చూడాలి.

కొంతమంది విశ్లేషకులు బ్రిటీష్‌ స్టీల్‌ కంపెనీ వ్యవహారాన్ని ఉదహరిస్తున్నారు. ఈ కంపెనీ దివాలా తీయడంతో, చైనాకు చెందిన మరో కంపెనీ 2020 మార్చిలో దానిని కొనుగోలు చేసే వరకు బ్రిటిష్‌ ప్రభుత్వమే ఆ సంస్థను ఆదుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)