కేరళ: అత్యధిక సంఖ్యలో ఆరెస్సెస్‌ కార్యకర్తలున్నా బీజేపీ ఎందుకు అధికారం సాధించలేకపోతోంది?

కేరళ, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్

ఫొటో సోర్స్, Twitter@BJP4Keralam

    • రచయిత, జుబైర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

4,500 శాఖలతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు అత్యధిక శాఖలున్న రాష్ట్రంగా కేరళ అగ్రస్థానంలో నిలిచింది. మూడున్నర కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో 80 సంవత్సరాలుగా ఆరెస్సెస్‌ యాక్టివ్‌గా ఉంది.

ఇక్కడ ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ఆరెస్సెస్‌ కార్యకర్తలుంటారు. వారి సభ్యత్వం ఏటేటా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

కానీ ఇంత జరిగినా, బీజేపీకి ఈ అంశం ఎన్నికల్లో కలిసి రావడం లేదు. ఇంత బలమైన క్యాడర్‌ ఉన్నా అక్కడ భారతీయ జనతా పార్టీ ఎందుకు నిలదొక్కుకోలేకపోతోంది? ఇదే విషయాన్ని నేను బీజేపీ, ఆరెస్సెస్‌, మేథావులతోపాటు ఆరెస్సెస్‌ వ్యతిరేకులను కూడా అడిగి చూశాను.

కొచ్చిన్‌లో ఉన్న ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లి దీనికి సమాధానం కనుగొనే ప్రయత్నం చేశారు. అయితే బీజేపీ విజయంలో ఆరెస్సెస్‌ పాత్ర గురించి అన్వేషించాల్సిన అవసరం ఏంటని మీరు అడగవచ్చు.

వాస్తవానికి ప్రతి ఎన్నికకు కొన్ని వారాల ముందు ఆరెస్సెస్‌ కార్యకర్తలు పట్టణాలు, గ్రామాలకు వెళ్లి బీజేపీకి అనుకూలంగా పని చేయడం మొదలు పెడతారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్ధులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుంటారు.

కేరళ, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్

ఫొటో సోర్స్, Twitter@BJP4Keralam

ఆరెస్సెస్‌ పాత్ర

పాలక్కాడ్‌ సీటు నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌కు న్యాయవాది పప్పన్‌ సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆరెస్సెస్‌ సభ్యుడు

"నేను బీజేపీ కార్యకర్తను కాదు. ఆరెస్సెస్‌ ఫుల్‌ టైమర్‌ను. వృత్తిరీత్యా న్యాయవాదిని. ఎన్నికల విధుల్లో నన్ను శ్రీధరన్‌కు సహాయంగా ఉండమన్నారు." అని పప్పన్‌ అన్నారు.

మీడియా మేనేజ్‌మెంట్‌తోపాటు హౌసింగ్‌ సొసైటీల్లోకి వెళ్లి వ్యక్తులను కలవడం, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులను శ్రీధరన్‌కు పరిచయం చేయడం ఆయన బాధ్యతలు.

అంతేకాదు తన 88 ఏళ్ల బాస్‌కు వేదికలు ఎక్కే దగ్గర, దిగే దగ్గర ఆయన సాయం చేస్తుంటారు.

బిహార్, హరియాణా, గుజరాత్, ఉత్తర్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో గత ఆరేళ్లలో బీజేపీ ఘన విజయాలను సాధించడంలో ఆరెస్సెస్‌ పాత్ర కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.

కేరళ, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్

ఫొటో సోర్స్, Twitter@BJP4Keralam

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఏం చేస్తారు?

సంఘ్‌ కార్యకర్తలు బీజేపీ కోసం పూర్తి నిబద్ధతతో గ్రౌండ్‌లో పని చేస్తారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు తిరిగి రారు.

అయితే కొంతమంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు కూడా రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో సంఘ్‌ విఫలమైందని అంగీకరిస్తారు.

కేరళ శాసన సభ చరిత్రలో కేవలం 2016లో మాత్రమే బీజేపీ ఒక సీటును సాధించింది. నేమం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి గెలుపొందారు.

ఇప్పుడు కేరళ అసెంబ్లీకి ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆరెస్సెస్‌ కృషి ఈసారి బీజేపీకి ఏదైనా లాభం కలిగిస్తుందా? నేమం నుంచి బీజేపీ అభ్యర్ధిగా గెలుపొందిన ఎమ్మెల్యే రాజగోపాల్‌ను ఇదే ప్రశ్న అడిగాను. ఆయన సమాధానం నిజాయితీగానూ, ఒకింత ఆశ్చర్యకరంగానూ ఉంది.

ఓ. రాజగోపాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓ. రాజగోపాల్

వాస్తవం ఏంటి?

"చారిత్రక కారణాల వల్ల మేం సక్సెస్‌ కాలేదు. చాలా కాలంగా ఇక్కడ కమ్యూనిస్టుల ఆధిపత్యం ఉంది. ఇక్కడి ప్రజలు విద్యావంతులు. చదువురాని ప్రాంతాలలో మాదిరిగా మనకు గుడ్డిగా ఓటు వేసేవారు కాదు" అన్నారు.

"ఇక్కడ ప్రజలు ప్రతిరోజూ నాలుగైదు వార్తాపత్రికలు చదువుతారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి తెలుసు. కాబట్టి, వారు వివేకంతో ఆలోచిస్తారు." అని రాజగోపాల్‌ వ్యాఖ్యానించారు.

వాస్తవానికి ఇది మిగిలిన బీజేపీ నాయకులకు నచ్చని ప్రకటన. ఎన్నికల్లో గెలిపించలేకపోయినా, రాష్ట్రంలో ఆరెస్సెస్‌ ప్రభావం ఉంది. అది ప్రవచించే హిందుత్వ భావజాలం వ్యాప్తి చెందుతోంది.

గత దశాబ్ద కాలంగా రాష్ట్రంలో బీజేపీ ఓట్ల వాటా శాతం క్రమంగా పెరగుతుండటంతో ఆరెస్సెస్‌ స్థానిక నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ వామపక్ష భావజాలం చాలా పాతది. కేరళలో హిందుత్వ భావజాలం క్రమంగా వృద్ధి చెందుతోంది. పైగా కేంద్రంలో అధికారంలో కూడా ఉంది.

అందుకే ఈసారి ఎన్నికల్లో పార్టీకి మరిన్ని సీట్లు సాధించాలని బీజేపీ కోరుకుంటోంది. కింగ్‌మేకర్‌గా మారి ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించాలన్నది ఆరెస్సెస్‌ ఆశయంగా కనిపిస్తోంది.

కేరళ, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్

ఫొటో సోర్స్, Twitter@BJP4Keralam

'ఆరెస్సెస్‌ ఒక సామాజిక సంస్థ'

ఆరెస్సెస్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈసారి బీజేపీకి ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం దక్కదని ఆసియా న్యూస్‌ నెట్‌వర్క్‌ ఎడిటర్‌ ఎం.జి.రాధాకృష్ణన్‌ అన్నారు.

ఆరెస్సెస్‌ ఎన్నికల వైఫల్యాలను అర్ధం చేసుకోవడానికి రాష్ట్ర జనాభాను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కేరళలో 45% మంది మైనార్టీలు ఉండగా, హిందువులు 55% మంది ఉన్నారు. వీరంతా మళ్లీ అనేక భావజాలాల ఆధారంగా విడిపోయి ఉన్నారు. ఎక్కువమంది కమ్యూనిస్టులకు మద్దతు దారులు.

"వారు సామాజిక-రాజకీయ సమీకరణాలను విచ్ఛిన్నం చేయలేనంత కాలం వారికి ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు వారు అందులో కొంత వరకే విజయం సాధించారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ఫ్రంట్‌ ఓటర్లను ఆకర్షించగలుగుతున్నారు. కానీ ఆ సంఖ్య చాలా తక్కువ. అందుకే ఆరెస్సెస్‌ ఉనికి బీజేపి పెద్దగా ప్రయోజనం కలిగించదని చెప్పగలను." అన్నారు రాధాకృష్ణన్‌.

"అసలు ఆరెస్సెస్‌ను రాజకీయ శక్తిగా చూడటం సరికాదు. అది పెద్ద సంఖ్యలో శాఖలు నిర్వహిస్తున్నప్పటికీ, రోజువారీ రాజకీయాల్లో అది పాలు పంచుకోదు. కేరళ ప్రజల దృష్టిలో అది కేవలం ఓ సామాజిక సంస్థ మాత్రమే" అన్నారు రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌. జె. ప్రభాష్‌.

ఆరెస్సెస్‌కు అనుబంధంగా పని చేసే ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో విద్యాభారతి పేరుతో అనేక పాఠశాలలను నడుపుతున్న మాట వాస్తవం. వెనుకబడిన కులాలు, గిరిజనుల కోసం ఈ పాఠశాలలు అనేకం పని చేస్తున్నాయి.

కొచ్చిన్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయానికి సమీపంలోఏ విద్యా భారతి పాఠశాల ఉంది. ఇది నేటి ఏ ఆధునిక పాఠశాలకు తీసిపోని విధంగా ఉంది.

ఆధునిక విద్యతోపాటు, విద్యార్ధులను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యమిస్తామని ఆ పాఠశాలకు చెందిన ఓ సీనియర్‌ అధికారి చెప్పారు.

నేను ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నప్పుడు అది ఖాళీగా ఉంది. దీనికి కారణం ఏంటని అడిగినప్పుడు చాలామంది కార్యకర్తలు, అధికారులు నియోజకవర్గాలకు వెళ్లి బీజేపీ అభ్యర్ధులకు ప్రచారంలో సహాయం చేస్తున్నారని ఆరెస్సెస్‌ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.

"ఎన్ని సీట్లు గెలిచామన్న కోణంలో ఆరెస్సెస్‌ పని తీరును అంచనా వేయడం సరికాదు" అన్నారు శ్రీధరన్‌కు ఎన్నికల్లో సహాయకుడిగా పని చేస్తున్న న్యాయవాది పప్పన్‌.

"మా ప్రభావం పెరుగుతోంది. మా భావజాలానికి మద్దతు పెరుగుతోంది. విద్యారంగంలో చాలా పనులు జరుగుతున్నాయి. నేను కూడా ఒక ఆరెస్సెస్‌ పాఠశాల నుండి వచ్చాను" అన్నారు పప్పన్.

కేరళ, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్

ఫొటో సోర్స్, Twitter@BJP4Keralam

ఈ ఎన్నికలకు వ్యూహం ఏమిటి?

హిందూ సమాజంలో మెజారిటీ ప్రజలు ఇటువైపు వచ్చినప్పుడే కేరళలో బీజేపీ విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకుడు జి.కె. ప్రమోద్‌ కుమార్‌ అన్నారు. హిందూ ఓట్లను పోలరైజ్‌ చేయడం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

"కేరళలో హిందూ ఓట్లను ఏకం చేయడంలో బీజేపీ విఫలైంది. ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఆప్షన్‌ మైనారిటీ ముస్లింలు, క్రైస్తవుల ఓట్లను పొందడానికి ప్రయత్నించడమే. ముస్లిం ఓట్లను కొంత వరకు పొందగలుగుతోంది. కొందరు ముస్లింలు బీజేపీలో చేరారు కూడా. ఇక్కడి క్రైస్తవులలో ఎక్కువమంది ఉన్నత కులానికి చెందిన సిరియన్ క్రైస్తవులు ఉన్నారు. అయితే వర్గాలుగా విడిపోయిన వీరిలో ఐక్యత తక్కువగా ఉంది. ఇక జాకోబిస్ట్‌ విభాగం బీజేపీకి చేరువైంది. కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు" అన్నారు ప్రమోద్‌ కుమార్‌?

సంప్రదాయికంగా కేరళలోని ముస్లిం, క్రైస్తవ వర్గాలు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ఓటు బ్యాంకుగా ఉన్నారు. అయితే ముస్లింలీగ్‌ యూడీఎఫ్‌లో ఆధిపత్యం చెలాయిస్తోందని భావిస్తున్న క్రైస్తువులు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే కాకుండా ఇటీవల ఆరెస్సెస్‌ నాయకులు చర్చి పెద్దలను కలిసి, బీజేపీని గెలిపించాలని కోరారు.

క్రైస్తవుల ఓట్లు బీజేపీ వైపు మళ్లితే అది గెలవడం సాధ్యమేనని ప్రమోద్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. అయితే వివిధ పార్టీలలో ఉన్న హిందువులు బీజేపీవైపు రావాలని ఆరెస్సెస్‌ కార్యకర్త కేతన్‌ మీనన్‌ అన్నారు.

"కేరళలో చాలామంది హిందువులు ఎల్డీఎఫ్‌కు ఓటు వేస్తారు. ఆ ఓటు బీజేపీకి రావాలి." అని ఆయన అన్నారు.

కేరళ, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్

ఫొటో సోర్స్, Twitter@BJP4Keralam

కేరళ హిందువుల్లో ఎక్కువమంది లెఫ్ట్‌ఫ్రంట్‌ను ఎందుకు ఎంచుకుంటారు?

"కేరళలో సామాజిక సంస్కరణ ఉద్యమం ఎక్కువగా వామపక్షాల వల్లనే జరిగింది. కేరళలోని హిందువులకు ఈ ఉద్యమం నుంచే వచ్చారు. కాబట్టి వారు దానికి సంప్రదాయక ఓటు బ్యాంకుగా మిగిలారు" అన్నారు డాక్టర్‌ ప్రభాష్‌.

రాష్ట్రంలో ఆరెస్సెస్‌ ప్రభావం పెరిగిందని ఎడిటర్‌ రాధాకృష్ణన్‌ అంగీకరించారు. "15 సంవత్సరాల కిందటితో పోలిస్తే బీజేపీ మూడో ఫ్రంట్‌గా అవతరించింది." అన్నారాయన.

1980లో బీజేపీకి దేశవ్యాప్తంగా ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని, ఇప్పుడది అతి పెద్ద పార్టీగా ఎదిగిందని ఆరెస్సెస్‌ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఈసారి కేరళలో బీజేపీ సత్తా చాటుతుందని వారు దీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)