పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి కాకుండా బీజేపీ అడ్డుకోగలదా?

నందిగ్రామ్ అబ్యర్థులు

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, మమతా బెనర్జీ, శుభేందు అధికారి

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిటికంటే ఎక్కువగా పశ్చిమ బెంగాల్ గురించే చర్చ జరుగుతోంది.

ఈ రాష్ట్ర ఎన్నికలపై అందరి దృష్టి ఉండడానికి.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, పదేళ్ల నుంచీ రాష్ట్రాన్ని పాలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉండడమే ప్రధాన కారణం.

బీజేపీ ఎన్నికల కోసం తన మొత్తం బలమంతా ఉపయోగిస్తోంది, ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా ఎంతోమంది కేంద్ర మంత్రులు బెంగాల్ చేరుకుంటున్నారు.

అటు, తృణమూల్ నుంచి మమతా బెనర్జీ మూడోసారి అధికారం దక్కించుకోవాలని పోటీ పడుతుంటే, 34 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వామపక్షాలు కూడా కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన కొన్ని విషయాలు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఎప్పుడు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 27 నుంచి ప్రారంభమవుతుంది. ఇవి 8 దశల్లో ఏప్రిల్ 29 వరకూ జరుగుతాయి. తర్వాత మేలో ఫలితాలు ప్రకటిస్తారు.

ఈసారి పోలింగ్ 8 దశల్లో నిర్వహించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నలు లేవనెత్తారు. ఇలా నిర్వహించి బీజేపీకి లబ్ధి చేకూర్చాలని ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఎన్నికల సంఘం మాత్రం పండుగలు, కోవిడ్-19 ప్రొటోకాల్ దృష్టిలో పెట్టుకునే పోలింగ్ 8 దశల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పింది.

అయితే, బీజేపీ మాత్రం ఎన్నికల సంఘం ప్రకటనను స్వాగతించింది. 8 దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించవచ్చని చెప్పింది.

ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Ani

ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఒక పార్టీ లేదా కూటమి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, సగం అంటే 148 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది.

పశ్చిమ బెంగాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు

పశ్చిమ బెంగాల్లో మొత్తం 7,32,94,980 మంది నమోదైన ఓటర్లు ఉన్నారు.

ఏ దశలో ఎన్ని స్థానాలకు ఎన్నికలు

  • మార్చి 27న మొదటి దశలో 30 స్థానాలకు పోలింగ్
  • ఏప్రిల్ 1న రెండో దశలో 30 స్థానాలకు పోలింగ్
  • ఏప్రిల్ 6న మూడో దశలో 31 స్థానాలకు పోలింగ్
  • ఏప్రిల్ 10న నాలుగో దశలో 44 స్థానాలకు పోలింగ్
  • ఏప్రిల్ 17న ఐదో దశలో 45 స్థానాలకు పోలింగ్
  • ఏప్రిల్ 22న ఆరో దశలో 43 స్థానాలకు పోలింగ్
  • ఏప్రిల్ 26న ఏడో దశలో 36 స్థానాలకు పోలింగ్
  • ఏప్రిల్ 29న 8వ దశలో 35 స్థానాలకు పోలింగ్
మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, SANJAY DAS

ప్రధాన అభ్యర్థులు ఎవరు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ప్రముఖులు పోటీలో నిలిచారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకూ ఐదుగురు ఎంపీలను అభ్యర్థులుగా నిలిపింది.

కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో టాలీగంజ్ స్థానం నుంచి, ఎంపీ లాకెట్ చటర్జీ చుంచురా స్థానం నుంచి, ఎంపీ నిసిత్ ప్రమాణిక్ దిన్‌హాటా స్థానం నుంచి, రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్‌గుప్తా తారకేశ్వర్ స్థానం నుంచి, ఎంపీ జగన్నాథ్ సర్కార్‌ శాంతిపూర్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు.

వీరితోపాటూ బీజేపీకి చెందిన ముకుల్ రాయ్, ఆయన కొడుకు శుభ్రాంశు రాయ్, రాహుల్ సిన్హాకు కూడా టికెట్ ఇచ్చారు. బీజేపీ నటి పార్నో మిత్రాను కూడా ఎన్నికల బరిలో దించింది.

వీరితోపాటూ పలువురు కళాకారులు, క్రీడాకారులు, సినీ నటులు, వివిధ రంగాల ప్రముఖులు కూడా బీజేపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు.

పశ్చిమ బెంగాల్ అభ్యర్థులు

ఫొటో సోర్స్, NURPHOTO

తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన శుభేందు అధికారి నందిగ్రామ్ స్థానం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పోటీపడుతున్నారు.

ఇక, తృణమూల్ కాంగ్రెస్ విషయానికి వస్తే, సీఎం మమతా బెనర్జీ ప్రతిసారీ భవానీపూర్ నుంచి పోటీచేస్తారు. కానీ, ఈసారి ఆమె సుపరిచితమైన నందిగ్రామ్ నియోజగవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

టీఎంసీ కూడా ఈసారీ చాలా మంది నటులు, గాయకులు, క్రికెటర్లు, సినీ డైరెక్టర్లను ఎన్నికల బరిలోకి దించింది.

క్రికెటర్ మనోజ్ తివారీకి శిబపూర్ టికెట్ లభిస్తే, నటుల్లో సయానీ ఘోష్‌కు అసన్‌సోల్ దక్షిణం, జూన్ మలైయాకు మెదినీపూర్, సాయంతికా బనర్జీకి బాంకురా, నటుడు కంచన్ మలిని ఉత్తర్ పాడా స్థానాల్లో టీఎంసీ తన అభ్యర్థులుగా నిలిపింది.

ఇక సినీ డైరెక్టర్లు రాజ్ చక్రవర్తి బారక్‌పూర్, జానపద గాయకుడు అదితి మున్షీ ఉత్తర 24 పరగణాలోని రాజరహాట్ గోపాల్‌పూర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

సుజాతా మండల్ ఖాన్

ఫొటో సోర్స్, BAPI BANERJEE

ఫొటో క్యాప్షన్, టీఎంసీ అభ్యర్థి సుజాతా మండల్ ఖాన్

టీఎంసీ జాబితాలో రెండు ఆసక్తికరమైన పేర్లున్నాయి. వారే రత్నా చటర్జీ, సుజాతా మండల్ ఖాన్. వీరిద్దరూ బీజేపీలో చేరిన తమ భర్తలపై పోటీ చేస్తున్నారు.

వీరిలో సుజాతా మండల్ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య కాగా, రత్నా చటర్జీ బీజేపీ నేత శోభిత్ చటర్జీ భార్య. వీరిద్దరూ తమ భర్తలతో విడిపోయారు.

ఇక వామపక్షాలు, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ కూటమిలో కూడా చాలా మంది ప్రముఖులు పోటీ చేస్తున్నారు.

వీరిలో పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ నేత నేపాల్ మహతో బాఘ్‌ముండీ నుంచి, ఐఎస్ఎఫ్ అధ్యక్షుడు సిముల్ సోరెన్ హుగ్లీ జిల్లా హరిపాల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

సీపీఎం ఈసారీ చాలా మంది యువతకు సీట్లు ఇచ్చింది. వారిలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు 25 ఏళ్ల ఆయుషీ ఘోష్ జమురియా స్థానం నుంచి, డీవీఎఫ్ఐ అధ్యక్షురాలు మీనాక్షీ ముఖర్జీ నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత శువేందు అధికారితో పోటీపడనున్నారు.

అమిత్ షాతో శుభేందు అధికారి

ఫొటో సోర్స్, NURPHOTO

అందరినీ ఆకర్షిస్తున్న స్థానాలు

పశ్చిమ బెంగాల్లో అందరినీ ఆకర్షిస్తున్న స్థానాల్లో ముఖ్యమైనది నందిగ్రామ్. ఇక్కడ మమతా, శుభేందు మధ్య గట్టి పోటీ ఉండచ్చని భావిస్తున్నారు.

ఐదుగురు బీజేపీ ఎంపీలూ పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా అందరి కళ్లూ ఉన్నాయి.

ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశాలు

ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, దానికి గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ రెండూ ప్రధానంగా అభివృద్ధి అంశంతోనే ప్రచారం చేశాయి.

బీజేపీ అగ్ర నేతలు తమ ప్రచారంలో బెంగాల్ కోసం 'ప్రగతిశీల బంగ్లా', 'షోనార్ బాంగ్లా' లాంటి మాటలు ఉపయోగిస్తున్నారు.

అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ర్యాలీల్లో 'ఆసోల్ పొరిబార్తోన్'(అసలు మార్పు) మాట చెబుతున్నారు. తమను గెలిపిస్తే పేదలు కూడా మరింత ముందుకెళ్లేలా అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు.

విపక్షాలు మమత పాలనలో అవినీతి అంశాన్ని కూడా ప్రధానంగా లేవనెత్తుతోంది. ఆమె పాలనలో అంఫాన్ రిలీఫ్ ఫండ్ అవకతవకలు లాంటి ఆరోపణలు చేస్తున్నారు. వాటితోపాటూ అత్తా-అల్లుళ్ల జంటను కూడా టార్గెట్‌గా చేసుకున్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షా సహా బీజేపీ మిగతా నేతలందరూ తమ ప్రసంగాల్లో వరసగా బెనర్జీని తోలాబాజ్ భాయిపో(బెంగాలీలో దోచుకునే అల్లుడు) మాటను ఉపయోగిస్తున్నారు. ఆయన అక్రమంగా డబ్బులు వెనకేశారని రోపిస్తున్నారు.

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, Reuters

మమతా బెనర్జీ ఆమె మేనల్లుడు, హార్బర్ సీట్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ దేశంలో ధరల పెరుగుదల అంశాన్ని ప్రచారాంశంగా మార్చుకుంది. మోదీ పాలనలో గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గురించి ప్రచారం చేస్తోంది.

కానీ, ఈ ఎన్నికల్లో అందరి దృష్టీ మతువా సమాజంపై ఉంది. ఉత్తర బెంగాల్‌లో దాదాపు 70 అసెంబ్లీ స్థానాల గెలుపు ఓటములపై ఈ సమాజం ప్రబావం ఉంటుంది. వీరికి పౌరసత్వం ఒక పెద్ద అంశంగా ఉంది.

ఇక్కడ అంతా అనుకున్నట్టు ఎన్ఆర్సీ-సీఏఏ లాంటివి ప్రచారాంశాలు కాలేదు. బీజేపీ కూడా ఇక్కడ ఆ అంశాన్ని ప్రచారం చేయలేదు.

ఫలితాల ప్రకటన ఎప్పుడు

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు 2021 మే 2న ప్రకటిస్తారు.

పశ్చిమ బెంగాల్ గత ఎన్నికల్లో ఏం జరిగింది

2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ 211 స్థానాలు గెలుచుకుని మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. అటు బీజేపీకి కేవలం 3 స్థానాలే దక్కాయి.

రాజకీయ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయిన లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి అప్పుడు 77 స్థానాలే గెలుచుకుంది. కాంగ్రెస్ 44 స్థానాలతో వామపక్షాల కంటే మెరుగైన ప్రదర్శన చూపించింది.

2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో దాదాపు సగం అంటే 18 స్థానాలు గెలుచుకుంది. టీఎంసీ 22 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో వామపక్షాలు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)