అస్సాం ఎన్నికలు: సీఏఏ, భూముల పంపిణీ, తేయాకు కూలీలు.. ఓటర్లను ప్రభావితం చేస్తున్న అంశాలు ఏమిటి

ఫొటో సోర్స్, Subhendu Ghosh/Hindustan Times via Getty Images
అస్సాంలో ఎన్నికల తంతు మొదలైంది. ఈ అతిపెద్ద ఈశాన్య రాష్ట్రంలో మార్చి 27న 47 నియోజకవర్గాలకు తొలి దశ పోలింగ్ జరిగింది.
ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం మే 31తో ముగుస్తుంది. అప్పటికల్లా ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది.
మొత్తంగా మూడు దశల్లో (మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6) ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి ఫలితాలు మే 2న ప్రకటిస్తారు. మొత్తంగా 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఎనిమిది ఎస్సీ, 16 ఎస్టీ నియోజకవర్గాలున్నాయి.
మొదటి దశ పోలింగ్‌లో భాగంగా అస్సాంలోని 12 జిల్లాల్లో 47 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
సోనిత్‌పుర్, బిశ్వనాథ్, నౌగామ్, గోలాఘాట్, జోర్‌హాట్, మాజులీ, శివ్‌సాగర్, చరాయీదేవ్, లఖీమ్‌పుర్, ధేమాజీ, డిబ్రూగఢ్, తీన్‌సుకియా జిల్లాల్లో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఈ 47 నియోజకవర్గాల్లో 39 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగారు. ఎనిమిది స్థానాల్లో పార్టీ మిత్రపక్షం అస్సాం గణ పరిషత్ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.
అదే సమయంలో 43 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. పార్టీ మిత్రపక్షాలు ఏఐయూడీఎఫ్, ఆర్జేడీ, అంచలిక్ గణ్ మోర్చా, సీపీఐఎంఎల్ ఒక్కోచోట తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి.
మరోవైపు అస్సాం జాతీయ పరిషత్ 41 స్థానాల్లో పోటీ చేసింది. అదే సమయంలో 19 స్థానాల్లో స్వతంత్రులకు రాయ్‌జోర్ దళ్ తమ మద్దతు ప్రకటించింది.

ఫొటో సోర్స్, @sarbanandsonwal
ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయి?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్స్ (యూపీపీఎల్) ఉన్నాయి.
కాంగ్రెస్ కూటమిలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), ఆంచలిక్ గణ్ మోర్చా, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు ఉన్నాయి.
ఇదివరకు బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్.. బీజేపీతో ఉండేది. అయితే మిత్రపక్షాలకు బీజేపీ సముచిత స్థానం ఇవ్వలేదని చెబుతూ ఆ పార్టీ కాంగ్రెస్ గూటికి చేరింది.
రాయ్‌జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషత్ మూడో కూటమిగా బరిలోకి దిగాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీలు కీలకపాత్ర పోషించాయి.
ఓటర్లు ఎంత మంది?
ఎన్నికల కమిషన్ తాజా సమాచారం ప్రకారం.. అస్సాంలో మొత్తంగా 2,31,86,362 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,17,42,661 మంది పురుషులు, 1,14,43,259 మంది మహిళలు ఉన్నారు. థర్డ్ జెండర్ 442 మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు.
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఓటింగ్ సమయాన్ని గంట సేపు పెంచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఫొటో సోర్స్, @INCAssam
ఎన్ని దశల్లో పోలింగ్?
తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27న జరిగాయి.
ఏప్రిల్ 1న రెండో దశ, ఏప్రిల్ 6న మూడో దశ ఎన్నికలు నిర్వహిస్తారు.
దీని కోసం మొత్తంగా 33,530 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేశారు.
2016 ఎన్నికలతో పోలిస్తే 3471 స్టేషన్లు ఎక్కువగా ప్రస్తుతం ఏర్పాటుచేశారు.
మ్యాజిక్ ఫిగర్?
ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అస్సాంలోని 126 నియోజకవర్గాల్లో సగం కంటే ఎక్కువ అంటే 64 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 64.
ఎన్నికల్లో ప్రధాన అంశాలు ఏమిటి?
ఇక్కడి ఎన్నికల్లో పౌర నమోదు పట్టిక-పౌరసత్వ సవరణ చట్టం (ఎన్ఆర్సీ-సీఏఏ) ప్రధాన అంశం.
బీజేపీ ప్రధానంగా హిందూత్వ రాజకీయాలపైనే దృష్టిసారిస్తోంది. అయితే, పార్టీకి చెందిన రెండు మిత్ర పక్షాలూ బహిరంగంగానే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
భూములను లీజుకు ఇవ్వడం రెండో ప్రధాన అంశం. తాము అధికారంలోకి వస్తే, ప్రభుత్వ భూములను పేదలకు లీజుకు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
జనవరిలో ఇక్కడ పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దాదాపు లక్ష మందికి భూమి పట్టాలు పంపిణీ చేశారు.
పేదలకు భూములు ఇవ్వడంపై ఇదివరకటి ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని ఆయన విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక 2.5 లక్షల మందికి భూములు పంపిణీ చేశామని, తాజాగా మరో లక్ష మందికి పట్టాలు ఇచ్చామని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, @sarbanandsonwal
మరోవైపు రోజువారీ కూలీల అంశాలూ ఇక్కడి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడి తేయాకు తోటల్లో పనిచేసే వారు తమకు రోజుకు రూ.167 మాత్రమే చెల్లిస్తున్నారని, మౌలిక వసతులు కూడా కల్పించడంలేదని చెబుతున్నారు. తమ జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మిగతా రాష్ట్రాల్లోని కార్మికులతో పోల్చిచూస్తే, అస్సాంలో రోజు వారీ కూలీ వేతనం చాలా తక్కువగా కనిపిస్తోంది.
తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అదే సమయంలో బడ్జెట్‌లో వీరి కోసం ప్రత్యేకంగా వెయ్యి కోట్లు కూడా ప్రకటించారు.
మరోవైపు తాము అధికారంలోకి వస్తే, రోజువారీ కూలీల దినసరి వేతనాన్ని రూ.365కు పెంచుతామని తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం కూడా ఇక్కడి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

ఫొటో సోర్స్, DILIP SHARMA
గత ఎన్నికల్లో ఏం జరిగింది?
2016లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో బీజేపీకి 60 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 26, యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 13, అస్సాం గణ పరిషత్ 14, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 12 స్థానాలో విజయం సాధించాయి.
ఇవి కూడా చదవండి:
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








