ఎమ్మెల్సీ ఎన్నికలు: పట్టభద్రులు, టీచర్ల ఓట్లు కూడా వేల సంఖ్యలో చెల్లకపోవటానికి కారణాలేంటి... అసలు ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు?.

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు వచ్చాయి.
అన్ని వర్గాల వారూ ఓట్లు వేసే సాధారణ ఎన్నికల కంటే.. అందరూ డిగ్రీ పైన చదువుకున్న వారు, పిల్లలకు పాఠాలు చెప్పే వారు ఓట్లు వేసే ఈ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చెల్లని ఓట్లు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఒక్క హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి నియోజకవర్గంలోనే 21 వేలకు పైగా చెల్లని ఓట్లు వచ్చాయి.
మామూలు ఎన్నికల్లో వంద ఓట్లు ఉండి, ఒకరికి 40 రెండో వారికి 35, మూడో వారికి 15, నాలుగో వారికి 10 ఓట్లు వచ్చాయి అనుకుంటే.. అప్పుడు 40 ఓట్లు వచ్చిన మొదటి వ్యక్తి గెలిచినట్టు. కానీ ఇక్కడ ఆ మొదటి వ్యక్తికి వ్యతిరేకంగా 60 ఓట్ల వచ్చాయన్న విషయం మనం మర్చిపోతున్నాం. అంతేకాదు. కనీసం ఓటేసిన వారిలో సగం మంది కూడా ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వలేదని అర్థం.

కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ లోపం జరగదు. ఓటేసిన వారి అభిప్రాయం మరింత పక్కాగా ప్రతిఫలించే విధానంలో జరుగుతాయి ఎమ్మెల్సీ ఎన్నికలు. దాన్నే ప్రాధాన్యత క్రమం ఎన్నిక అంటారు. అంటే ఇక్కడ ఓటు వేసే వారు మొదటి వ్యక్తికి ఓటు వేయవచ్చు. అతని తరువాత సెకండ్ బెస్ట్ అనుకున్న వారికీ ఓటు వేయవచ్చు. ఉదాహరణకు ఎన్నికల్లో పది మంది పోటీ చేస్తే, పది మందికీ ఓటేయవచ్చు. కానీ ఫస్ట్ ప్రయార్టీ, సెకండ్ ప్రయార్టీ ఇలా వెళ్లాలి.
అంటే మీరు ఫలానా వారు ఎమ్మెల్సీ అయితే బావుంటుంది అనుకుంటే, ఆ ఫలానా వ్యక్తికి నంబర్ వన్ ఓటు వేస్తారు. ఒకవేళ వారు కాకపోతే రెండో వారు బెటర్ అనుకుంటే ఆ రెండో వ్యక్తికి నంబర్ టూ వేస్తారు. పోనీ ఈ ఇద్దరూ కాకపోతే ఫలానా వారు వచ్చినా పర్లేదు అనుకుంటే ఆ ఫలానా వ్యక్తికి మూడో ప్రాధాన్యత వేస్తారు.
అసలు ఇదంతా కాదు, నా ఉద్దేశంలో ఒక్కరు మాత్రమే ఆ పదవికి అర్హులు అనుకుంటే, ఆ ఒక్కరికి మాత్రమే ఓటు వేసి, మిగిలిన ఎవరికీ నంబర్ టూ, త్రీ ఇవ్వకుండా వదిలేయవచ్చు. ఇలా సాగుతుంది ఆ ఎన్నిక.

మరి తప్పు ఎక్కడ జరుగుతోంది?
1. ఈ ఓటింగ్ గురించి ఎన్నికల సంఘం సూచనలను ప్రతీ బూత్ బయటా స్పష్టంగా ఏర్పాటు చేసింది. ఇదే అంశంపై ప్రచార వీడియోను వెబ్‌సైట్‌లో పెట్టింది. అందులో ఉన్న సూచనలు, ఓటేసే వారు చేసిన తప్పులూ ఇవే.
2. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అందరు అభ్యర్థలకూ ఓటేయవచ్చు. లేదా ఒకే అభ్యర్థికి ఓటేయవచ్చు. లేదా కొందరికి ఓటేయవచ్చు. కాకపోతే ఎవరికి ఫస్ట్, ఎవరికి సెకండ్, ఎవరికి థర్డ్ అన్నది నిర్ణయించుకుని, వారి పేర్లు ఎదురుగా ఆ నంబర్ వేయాలి.
3. అభ్యర్థులకు ఎదురు గడిలో నంబర్ వేయాలి. అటూ ఇటూ కాకుండా వేస్తే ఓటు చెల్లకుండా పోతుంది.

4. అలాగే ఎంత మందికైనా ఓటేయవచ్చు కానీ... 1, 2, 3.. ఇలా వరుసగా వేయాలి. వరుసగా అంటే బాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లున్న వరుసలో కాదు. మనకు నచ్చిన ప్రాధాన్యతలో వేయాలి. అంతే కానీ మధ్యలో నంబర్లు మిస్ చేయకూడదు. అంటే 1 వేసి 2 లేకుండా 3 వేయకూడదు. లేదా 1 వేయకుండా 2, 3 వేయకూడదు. అలా చేసినా ఆ ఓటు చెల్లదు.
5. హిందూ అరబిక్ అంకెలు లేదా (1,2,3), రోమన్ అంకెలు (I,II,III,IV), లేదా భారతీయ భాషల అంకెలు (తెలుగు అంకెల్లో - ౧,౨,౩,౪) వేయాలి. వన్ టూ త్రీ, ఒకటి రెండు మూడు అని రాయకూడదు. అప్పుడూ ఓటు చెల్లదు. అయితే ఏదో ఒక రకం అంకెలే వాడాలి కానీ ఒక్కోటీ ఒక్కో రకం కలిపి (1,౧, IV - ఇలా) వాడకూడదు.
6. ఒకే వ్యక్తిపై రెండు ఓట్లు (1,1 లేదా 1, 2) వేసినా చెల్లదు. ఒకే నంబర్ ఇద్దరికి వేసినా చెల్లదు. టిక్ మార్కులు, వేలి ముద్రలు, సంతకాలు, ఇతర రాతలు చెల్లవు.
7. ఎన్నికల సంఘం ఇచ్చిన స్కెచ్ పెన్ మాత్రమే వాడాలి. వేరే పెన్, పెన్సిల్ తో ఓటు వేస్తే చెల్లదు.
ఇప్పుడు చెల్లని ఓట్లన్నీ వీటిల్లో ఏదో ఒక తప్పు చేసిన వారేనన్నమాట..

విజేత ఎన్నికయ్యేది ఇలా...
ఎక్కువ మంది ఓటు వేసిన, అంటే, కనీసం 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఏ అభ్యర్థికీ నంబర్ వన్ ఓట్లు సగం కంటే ఎక్కువ రాకపోతే అప్పుడు, వారికి వచ్చిన నంబర్ టూ ఓట్లు చూస్తారు. తరువాత నంబర్ 3 ఓట్లు పరిశీలిస్తారు. అలాగే తక్కువ ఓట్లు వచ్చిన వారిని పోటీ నుంచి తప్పిస్తూ వెళతారు. మొత్తానికి సగం కంటే ఎక్కువ మంది ఆమోదం ఏదో రూపంలో ఉన్న వారికి మాత్రమే ఇక్కడ విజయం దక్కుతుంది.
1. మొత్తం పోల్ అయిన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వస్తే గెలిచినట్టు లెక్క. అంటే వంద ఓట్లు ఉంటే 51 ఓట్లు వచ్చిన వారే గెలుస్తారు. మొదటి ఉదాహరణలో చెప్పినట్టు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినా గెలవరు. కచ్చితంగా సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి.
2. ప్రతీ ప్రాధాన్యతకూ సమాన విలువ ఉంటుంది. అంటే, మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ మెజారిటీ రాకపోతే, అప్పుడు అతి తక్కువ ఓట్లు వచ్చిన ఒక్కో అభ్యర్థినీ తొలగిస్తూ వెళతారు. అలా తొలగించిన వారి బాలెట్ పేపర్లో ఉన్న రెండో ప్రాధాన్యత ఓట్లు తీసి ఆపైన ఉన్న అభ్యర్థుల్లో ఎవరికి ఎన్ని వస్తే వారికి అన్ని కలుపుతారు.
3. అలా సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరో ఒకరికి వచ్చే వరకూ తక్కువ ఓట్లు వచ్చిన ఒక్కొక్కరినీ తీసివేస్తూ, వారి బాలెట్లలో వారికి కాకుండా మిగిలిన వారికి వచ్చిన ప్రాధాన్యతా ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కులుపుతూ వెళతారు. అలా 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చే వరకూ చేస్తారు.








