ఆంధ్రప్రదేశ్: 73 మునిసిపాలిటీల్లో వైసీపీ, ఒక చోట టీడీపీ విజయం.. కార్పొరేషన్లన్నీ అధికార పార్టీకే

- రచయిత, శంకర్. వి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికలలో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. 75 మునిసిపల్ స్థానాలకు గానూ ఏకగ్రీవాలతో కలిపి వైసీపీ 73 చోట్ల విజయం సాదించింది.
చిలకలూరిపేట మునిసిపాలిటీ కౌంటింగ్ పూర్తయినప్పటికీ ఫలితాలను మాత్రం ప్రకటించలేదు. కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
టీడీపీకి కేవలం అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రమే ఆధిక్యం దక్కించుకుంది. అక్కడ మిత్రపక్షాలతో కలిసి స్వల్ప ఆధిక్యం సాధించిన నేపథ్యంలో చైర్‌పర్సన్ సీటు నిలబెట్టుకోవడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.

కార్పొరేషన్లలో..
పన్నెండు మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించగా ఏలూరులో కౌంటింగ్ జరగలేదు. ఓటర్ల జాబితా విషయంపై వచ్చిన అభ్యంతరాల మూలంగా కోర్టు ఉత్తర్వుల మేరకు కౌంటింగ్ నిలిచిపోయింది.
మిగిలిన 11 మునిసిపల్ కార్పొరేషన్లలో కీలకమైన జీవీఎంసీ సహా అన్నింటా వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. విజయనగరం, గ్రేటర్ విశాఖ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, తిరుపతి మేయర్ పీఠాలు అధికార పార్టీకి దక్కాయి.

జీవీఎంసీ, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల పరిధిలో జనసేన-బీజేపీల కూటమి కొన్ని డివిజన్లను గెలుచుకోగలిగాయి.
కాంగ్రెస్ ఒక్క చోట కూడా ప్రభావం చూపలేకపోగా సీపీఎం, సీపీఐ అభ్యర్థులు జీవీఎంసీలో చెరో డివిజన్ లో విజయం సాధించారు.

మరో 8 కార్పొరేషన్లలో కూడా వైసీపీకి మెజారిటీ డివిజన్లు దక్కాయి. కీలకమైన గ్రేటర్ విశాఖ, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు సాగుతోంది. ఇప్పటి వరకూ ప్రకటించిన స్థానాల్లో అధిక డివిజన్లు వైసీపీకే దక్కగా, టీడీపీ రెండో స్థానంలో నిలిచింది.

ఏ నగరంలో ఎవరి నగారా మోగునో
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న జరిగింది.
బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభించారు.
ఈ నెల 18న ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మేయర్, చైర్ పర్సన్ల ఎంపిక నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 4 మునిసిపాలిటీల పరిధిలో వార్డులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు పరిధిలో వార్డులన్నింటినీ అధికార పార్టీ కైవసం చేసుకుంది. దాంతో అక్కడ పోలింగ్ అవసరం లేకుండానే ఎన్నికలు ముగిశాయి.
ఇక మిగిలిన 12 మునిసిపల్ కార్పొరేషన్లు 71 మునిసిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే వాటిలో ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట మునిసిపాలిటీకి సంబంధించిన ఫలితాలను ప్రకటించరాదని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 11 మునిసిపల్ కార్పొరేషన్లు, 70 మునిసిపాలిటీల విజేతలను ఆదివారం ప్రకటిస్తారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 20,419 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. ఇందులో 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు, 1,345 మంది ఎస్‌ఐలు, 17,292 మంది కానిస్టేబుళ్లు, ఇతరులు 1,134 మంది ఉన్నారు.
కౌంటింగ్ కోసం కార్పొరేషన్లలో 2,204 టేబుళ్లు, మున్సిపాలిటీలలో 1,822 టేబుళ్లు మొత్తం 4,026 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్‌లలో 2,376 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 7,412 మంది కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. మున్సిపాలిటీలలో ఓట్ల లెక్కింపు కోసం 1,941 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 5,195 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు.
రాజకీయంగా కీలకమైన విజయవాడ ఫలితాల మీద, కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో జీవీఎంసీ ఫలితాల పైనా సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. కర్నూలు, తిరుపతి, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో కొన్ని డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. దాంతో ఆయా కార్పొరేషన్లపై వైసీపీ విశ్వాసంతో కనిపిస్తోంది. మిగిలిన చోట్ల గట్టి పోటీ జరగడంతో ఓటర్లు ఎవరిని ఆదరించారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- No Smoking Day: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా... ‘నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే’
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే
- హాథ్రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు
- కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
- ఇథియోపియా టిగ్రే సంక్షోభం: బీబీసీ విలేకరిని నిర్బంధించిన సైన్యం
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయంయాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








