మధ్యప్రదేశ్: ఆదివాసీ బాలిక, యువకుడిని కట్టేసి ఊరేగించారు.. అసలేం జరిగింది

ఫొటో సోర్స్, SHURAI NIYAZI
- రచయిత, శురేహ్ నియాజీ
- హోదా, బీబీసీ కోసం
మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలు ఎక్కువగా ఉండే అలీరాజ్‌పూర్‌లో ఒక ఘటన చోటుచేసుకుంది. ఒక బాలికను, మరో యువకుడితో కలిపి తాడుతో కట్టేసి దారుణంగా కొట్టడంతోపాటూ, వారిద్దరినీ ఊరంతా ఊరేగించారు.
బాలికపై ఆ యువకుడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఈ వ్యవహారంలో బాధితురాలినీ శిక్షించారు. ఆమెను కూడా కొట్టి ఊరంతా తిప్పారు.
ఇదంతా బాధితురాలి కుటుంబ సభ్యులే చేశారని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
దీంతో, పోలీసులు వెంటనే దర్యాప్తు చేశారు. ఇద్దరినీ ఊరేగిస్తున్న సమయంలో కొందరు 'భారత్ మాతాకీ జై' అని నినాదాలు కూడా చేశారు.
ఈ ఘటనకు సంబంధించి నిందితులు అందరినీ అరెస్ట్ చేశామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ భాగ్వానీ బీబీసీతో చెప్పారు.
"ఈ కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారో, అందరినీ అదుపులోకి తీసుకున్నాం. అంటే, మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశాం. ఇదంతా చేసింది బాలిక కుటుంబంలోని వారే. యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేశాం" అని భాగ్వానీ చెప్పారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఘటన అలీరాజ్‌పూర్, జోబట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఛోటీ ఖట్టాలీలో జరిగింది. అక్కడ ఒక 16 ఏళ్ల బాలికను 21 ఏళ్ల యువకుడితో కలిపి తాడుతో కట్టేసి, వారిని ఊరంతా తిప్పారు.
బాలిక, యువకుడు ఇద్దరూ గుజరాత్‌లో పనిచేసేవారు, వారు తర్వాత తిరిగి తమ గ్రామాలకు వచ్చారు. తర్వాత యువకుడు ఆ అమ్మాయిని కలవడానికి వాళ్ల ఊరొచ్చాడు. అదే సమయంలో ఆ యువతి ఇంట్లో వాళ్లు అతడిని పట్టుకున్నారు. బాలికతో కలిపి తాడుతో కట్టేసి ఇద్దరినీ ఊరేగించారు. ఈ మొత్తం ఘటనను మొబైల్లో చిత్రీకరించిన వాళ్లు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మైనర్ అయిన బాధితురాలు ఝీరీ గ్రామానికి చెందిన 21 ఏళ్ల ఒక యువకుడిపై కేసు పెట్టింది. బాధితురాలు, నిందితుడు ఇద్దరినీ తాడుతో కట్టేసి కొట్టి ఊరేగించడంపై మరో కేసు నమోదైంది.
అత్యాచార నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి అప్పటికే పెళ్లైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు.
రెండో ఫిర్యాదులో ఉన్న నిందితులు అందరినీ అరెస్ట్ చేశారు. వీరందరినీ యువతి సమీప బంధువులుగా గుర్తించారు. వారందరిపైనా కొట్టడం, అవమానకరంగా ప్రవర్తించడం, హత్యాయత్నం లాంటి కేసులు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, iStock
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ భాగ్వానీ, మిగతా పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు.
"బాధితురాలికి యువకుడు చాలాకాలంగా తెలుసు. వాళ్లకు గుజరాత్‌లో ఉన్నప్పుడే పరిచయం ఉంది. ఆమెను కలవడానికే యువకుడు గ్రామానికి వచ్చినపుడు ఈ ఘటన జరిగింది" అని ఆయన తెలిపారు.
యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమ్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ రిపోర్ట్ ప్రకారం ఆదివాసీలు ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లా దేశంలోని అత్యంత పేద జిల్లాల్లో ఒకటి.
పేదరికంతోపాటూ అక్షరాస్యతలోనూ ఈ జిల్లా చాలా వెనకబడి ఉంది. ఇక్కడి జనాభా ఎక్కువగా జీవనోపాధి కోసం గుజరాత్‌లోని ఫ్యాక్టరీలు లేదా వ్యవసాయ పనులకు వెళ్తుంటారు.
ఆదివాసీ సమాజం వారు ఇంతకు ముంద కూడా, ఈ ప్రాంతంలోని మహిళలకు ఘోరమైన శిక్షలు విధించినట్లు కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఆదివాసీ సమాజాలు తమ కంటూ ప్రత్యేకంగా స్థానిక కట్టుబాట్లు చేసుకుంటున్నాయి. ఏం జరిగినా వాటి ప్రకారమే శిక్షలు కూడా విధిస్తుంటాయి.
ఇవి కూడా చదవండి:
- సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే... ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
- లాక్డౌన్: జనతా కర్ఫ్యూకి ఏడాది.. దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








