దావూద్ ఇబ్రహీం వెంట బాలీవుడ్ ఎందుకు పరుగులు పెడుతోంది

ఫొటో సోర్స్, RGV
- రచయిత, మధుపాల్
- హోదా, బీబీసీ కోసం
హిందీ సినిమా తెరపై అండర్ వరల్డ్ డాన్‌లు తరచూ కనిపిస్తుంటారు. ఈ ధోరణి 90ల నుంచి ఎక్కువగా ఉంది. మాఫియా ముఠాలు, డాన్‌ల కథలతో బాలీవుడ్‌లో అనేక సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి.
డాన్‌ల నేపథ్యాలు కావచ్చు, వారి హింసా చరిత్ర కావచ్చు. బయటి ప్రపంచానికి వారు కనిపించకపోయినా, వారి కథలు మాత్రం బాలీవుడ్ స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి.
అండర్ వరల్డ్‌తో సంబంధం ఉన్న అనేకమంది డాన్‌ల కథలను ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూశారు. దావూద్ ఇబ్రహీం నుంచి చోటా రాజన్, మాయ డోలాస్, మాన్య సుర్వే...ఇలా అనేకమంది కథలు తెర మీద కనిపించాయి.
ఇందులో దావూద్ ఇబ్రహీం పాత్ర మిగతా అందరు డాన్‌లకన్నా ఎక్కువమందిని ఆకర్షించింది.
1980, 90ల తర్వాత ముంబయి, దాని సమీప ప్రాంతాలలో అండర్ వరల్డ్ డాన్‌ల ప్రభావం ఉందని చెబుతారు. 1993 సీరియల్ బాంబు పేలుళ్ల తరువాత ముంబయిలో అండర్ వరల్డ్ పేరు ఎక్కువగా వినిపించింది.
బాలీవుడ్ సినిమాల్లో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నుంచి అనురాగ్ కశ్యప్ వరకు, చాలామంది దర్శకులు తమ సినిమాలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డాన్‌లను, వారి నేర చరిత్రలు చూపించడానికి ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, RGV
దావూద్ పాత్రతో అనేక సినిమాలు
అనురాగ్ కశ్యప్ 'బ్లాక్ ఫ్రైడే', రామ్‌గోపాల్ వర్మ 'కంపెనీ', నిఖిల్ అద్వానీ 'డి డే' సినిమాలు దావూద్ పాత్ర చుట్టూ తిరుగుతాయి.
మిలన్ లుథ్రియా 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి' సినిమా దావూద్ ఇబ్రహీం డాన్‌గా ఎదిగిన తీరును చూపిస్తుంది.
దావూద్ సోదరిపై 'హసీనా పార్కర్' అనే సినిమాతోపాటు 'ఏక్ థి బేగం' అనే వెబ్ సిరీస్ కూడా విడుదలైంది.
2002లో దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా 'కంపెనీ' సినిమా విడుదలైంది. రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ దావూద్ ఇబ్రహీం పాత్ర పోషించారు. వివేక్ ఒబెరాయ్‌కు ఇది తొలి చిత్రం.
మళ్లీ ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ 'డి కంపెనీ' అనే సినిమాను సిద్ధం చేశారు.

ఫొటో సోర్స్, RGV
దావూద్ తొలినాళ్ల కథే 'డి కంపెనీ'
"నేను మరోసారి 'డి కంపెనీ' సినిమాతో ముంబయికి వస్తున్నాను. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం జీవితాన్ని ఇందులో చూపించబోతున్నాను" అని ఓ సందర్భంలో వర్మ అన్నారు.
"దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్‌ల మధ్య యుద్ధం ఆధారంగా 2002లో 'కంపెనీ' సినిమాను రూపొందించాను. ఈసారి కేవలం దావూద్ గురించే చూపిస్తాను. ఇది దావూద్ డాన్‌గా జీవితాన్ని ప్రారంభించడానికి సంబంధించిన కథ." అని వర్మ అన్నారు.
దావూద్ జీవితాన్ని బిగ్ స్క్రీన్ మీద చూపించడానికి బాలీవుడ్‌కు ఎందుకంత ఆసక్తి? అన్న ప్రశ్నకు "క్రైమ్ అనేది ప్రేక్షకులను ఆకర్షించే అంశం. పత్రికలు, టీవీలలో నేరగాళ్లకు సంబంధించిన విషయాలపట్ల ప్రేక్షకులు, పాఠకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు" అన్నారు వర్మ.
"ఈ రోజుల్లో 'గాడ్ ఫాదర్' కంటే ఎక్కువ జనాదరణ పొందిన చిత్రం ఉండదు. బోరింగ్ కథలు ప్రజలకు నచ్చవు. వాళ్లకు అండర్ వరల్డ్ లేదా ఫాంటసీతో కూడిన సినిమాలు ఇష్టం" అన్నారు వర్మ.

ఫొటో సోర్స్, BALAJI MOTION PICTURES
'గ్యాంగ్‌స్టర్‌ను హీరో అనుకోనవసరం లేదు'
క్రైమ్ వరల్డ్, వారితో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ల జీవితాలను అంత గొప్పగా ఎందుకు చూపిస్తున్నారు? అన్న ప్రశ్నకు రామ్‌గోపాల్ వర్మ సమాధానమిచ్చారు.
"వైన్ గ్లాస్ పట్టుకుంటే, హీరోతో తలపడితే దాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది జస్ట్ సినిమా. కేవలం వినోదమే" అని వర్మ అన్నారు.
"నిజమైన సినిమాను చూపించాలనుకుంటే అందులో పాత్రల నెగెటివ్ కోణాన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. 'సత్య' కావచ్చు, 'డి కంపెనీ' కావచ్చు, నా సినిమాల్లోని పాత్రలన్నీ నెగెటివ్‌లో ఉంటాయి." అన్నారు రామ్‌గోపాల్ వర్మ.
గ్యాంగ్‌స్టర్‌ను హీరోలా చూపించడం తన లక్ష్యం కాదంటారు రామ్ గోపాల్ వర్మ. "ఇది కేవలం గ్యాంగ్‌స్టర్‌ల నిజరూపాన్ని చూపించడమే. నా సినిమాలన్నీ అలాగే ఉంటాయి. 'డి కంపెనీ' కూడా అలాగే ఉంటుంది" అన్నారాయన.

ఫొటో సోర్స్, DAAR MOTION PICTURES
దావూద్‌ను తెరపై చూడాలని ప్రేక్షకులు ఎందుకు అనుకుంటున్నారు?
"దావూద్ ఒక రహస్యం. అతని వీడియోను, ఫొటోను ఎక్కువమంది చూడలేదు. చాలా కాలం కిందట షార్జా స్టేడియంలో కనిపించిన ఫొటో ఒకటి. అది కాక ఇంకా ఒకటి రెండు ఫొటోలు మాత్రమే సర్క్యులేట్ అవుతున్నాయి. దావూద్ నిజంగా ఎలా ఉంటాడో చాలా మందికి తెలియదు." అన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అజయ్ బ్రహ్మాత్మజ్.
"దావూద్ నేర చరిత్ర కారణంగా అతని గురించి తెలుసుకోవాలని ప్రజల్లో ఆసక్తి ఉంది. తెరపై అతని కథలు పదే పదే రావడానికి అదే కారణం" అన్నారాయన.
రామ్‌గోపాల్ వర్మ నేర ప్రపంచాన్ని, కార్పొరేట్ ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేస్తారని, అందుకే అతని సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందని అజయ్ బ్రహ్మాత్మజ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, RGV
'గ్యాంగ్‌స్టర్- గ్లామర్ ఫార్ములా పాతబడింది'
సినిమా బిజినెస్‌ను దగ్గరగా పరిశీలిస్తున్న కొందరు మాత్రం బాక్సాఫీస్ దగ్గర గ్యాంగ్‌స్టర్ సినిమాలు అద్భుతాలు చేయలేకపోతున్నాయని అంటున్నారు.
"ఇలాంటి సినిమాల్లో కొత్తదనం లేదు. దావూద్, ఇతర గ్యాంగ్‌స్టర్‌ల గురించి కొత్తగా చెప్పడానికి ఏమీలేదు. మన దగ్గర కథా రచయితల కొరత ఉంది. ఇంతకన్నా మంచి ఐడియాలు రావాల్సి ఉంది" అని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ అమోద్ మెహ్రా అన్నారు.
"మొదట్లో అండర్ వరల్డ్ కథలు బాగానే నడిచాయి. కానీ ఇప్పుడు ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొంతమంది దర్శకులు ఒక సినిమా హిట్టయితే అలాంటి సినిమాలే తీస్తున్నారు." అన్నారు మెహ్రా.
అయితే ఫలితాలు ఎలా ఉన్నా పెద్ద పెద్ద స్టార్లు కూడా సినిమాల్లో గ్యాంగ్‌స్టర్‌లు, క్రిమినల్స్ పాత్రలు పోషించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే కేవలం గ్యాంగ్‌స్టర్ పాత్రలుంటే సరిపోదని, వాటికి గ్లామర్ కూడా అద్దాల్సి ఉందని మెహ్రా అభిప్రాయపడ్డారు.
అయితే ఈ గ్యాంగ్‌స్టర్, గ్లామర్ కాక్టెయిల్ కూడా ఎక్కువకాలం ప్రేక్షకులను ఆకర్షించదని మెహ్రా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు... అమరావతి భూముల సేకరణపై విచారణకు రావాలని ఆదేశం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








