ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత కూడా బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస - మూడు రోజుల్లో 12మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటించి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.
ఈ నిరసనల సందర్భంగా గత మూడు రోజుల్లో అక్కడ 12మంది మృతి చెందారు.
ఆదివారం ఇద్దరు మరణించినట్లు బ్రహ్మన్‌బరియాలోని స్థానిక ఆసుపత్రి అధికారులు తెలిపారు.
నిరసనల సమయంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే వారు అప్పటికే మృతి చెందారని బ్రహ్మన్‌బరియా సదర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ షౌకత్ హుస్సేన్ బీబీసీకి తెలిపారు.
ఇంతకుమించిన సమాచారం ఆయన ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, MASUK HRIDOY
'హిఫాజత్-ఇ-ఇస్లాం' సంస్థ ఆందోళనలు
బంగ్లాదేశ్‌లో రాడికల్ ఇస్లామిక్ సంస్థ 'హిఫాజత్-ఇ-ఇస్లాం' మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయని స్థానిక జర్నలిస్టులు వెల్లడించారు.
ఈ ఘర్షణల్లో చాలా మంది గాయపడ్డారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వ్యతిరేకంగా 'హిఫాజత్-ఇ-ఇస్లాం' నిరసనలకు పిలుపునిచ్చింది.
ఆందోళనకారులు వివిధ ప్రభుత్వ సంస్థలపై దాడులు చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని స్థానిక జర్నలిస్ట్ మసుక్ హృదయ్ బీబీసీకి చెప్పారు.
దాడుల్లో పాల్గొన్న వ్యక్తులు పలు ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలకు నిప్పంటించారు.

ఫొటో సోర్స్, MUNIR UZ ZAMAN / GETTY
ప్యాసింజర్ రైలుపై దాడి
నిరసనకారులు ప్యాసింజర్ రైలుపై కూడా దాడి చేశారని, ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారని స్థానిక జర్నలిస్ట్ మసుక్ హృదయ్ వెల్లడించారు.
తూర్పు బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలతోపాటు ఒక రైలుపైనా దాడి చేశారని, ఆదివారం నాడు 'హిఫాజత్-ఇ-ఇస్లాం' మద్దతుదారులైన వందల మంది ఈ దాడుల్లో పాల్గొన్నారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఈ సంఘటన తర్వాత బ్రహ్మన్‌బరియాకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు.
బంగ్లాదేశ్‌లో బ్రహ్మన్‌బరియా, చిట్టగాంగ్‌లోని హతాజారి ప్రాంతాలలోనే ఎక్కువగా హింస జరిగింది.
శనివారం బ్రహ్మన్‌బరియాలో పోలీసులు, భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో కనీసం ఐదుగురు నిరసనకారులు మరణించారు. ఆదివారం నాడు ఆరో వ్యక్తి మరణించారని స్థానిక జర్నలిస్టులు తెలపగా, బీబీసీ దానిని స్వతంత్రంగా నిర్ధరించలేకపోయింది.
బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఢాకా వెళ్లారు. ఆయన పర్యటనను కొన్ని ఇస్లామిక్ సంస్థలు వ్యతిరేకించాయి.
ఇవి కూడా చదవండి:
- సూయజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుపోవడంతో రోజుకు దాదాపు 70వేల కోట్ల నష్టం.. దాన్ని ఎలా బయటకు తీస్తారు
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- ఇందిరా గాంధీని ఫిరోజ్ మోసం చేశారా... వారి మధ్య గొడవలకు కారణాలేంటి?
- పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- కశ్మీర్: ఎల్వోసీ వద్ద ‘ఆజాది మార్చ్’ను అడ్డుకున్న పాకిస్తాన్ సైన్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








